దొరసాని

ధారావాహికం – 23 వ భాగం

దాదాపు రెండు నెలలు గడిచాయి బాలసదనం పనులు అవుతున్నాయి… భూపతి గారి స్థలమే కాబట్టి అందులో ముందుగానే ఉన్న చెట్లని అలాగే ఉంచి మధ్యలో భవనం మొదలుపెట్టారు ఇంకా రకరకాల పండ్ల చెట్లు, పూల చెట్లు నాటుతున్నారు.. కావలసిన ఏర్పాట్లు అన్నింటికీ ఒక ప్రణాళిక ఏర్పడింది ..ఐదు ఆరు నెలల్లో పూర్తి కావస్తుందని మేస్త్రీలు చెప్పారు అప్పుడప్పుడు అక్కడికి వెళ్లి రావడం నీలాంబరికి ఒక వ్యాపకంగా మారింది…

వారం రోజుల్లో కూతురు వస్తున్నామని ఫోన్ చేసి చెప్పింది.. నీలాంబరి భూపతి ఆనందానికి అడ్డుకట్టలేదు చాలా చాలా సంతోషంగా ఉన్నారు..

నీలాంబరి పూజారి గారిని పిలిచి సీమంతం కోసం మంచి ముహూర్తం చూడమని చెప్పింది కూతురు అల్లుడు వచ్చిన తర్వాత ఒక 15 రోజుల్లో మంచి ముహూర్తం ఉందని చెప్పారు పూజారి.

ఎంత మందిని పిలవాలి? ఎలా నిర్వహించాలి అలంకరణ ఎలా ఉండాలి వచ్చిన వారికి తాంబూలాలు ఎలా ఇవ్వాలి. ఇవన్నీ ఆలోచిస్తుంది నీలాంబరి ..రాత్రి పడుకున్నా కూడా మనసులో ఇవే ఆలోచనలు ..సీమంతం ఘనంగా చేయాలని ఉత్సాహంగా ఉంది నీలాంబరికి.

అలేఖ్య సుధీర్ ఆరోజు ఉదయం ఎనిమిది గంటలకు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగుతారు… వారినీ రిసీవ్ చేసుకోవడానికి భూపతి నీలాంబరి సిద్ధంగా ఉన్నారు… గోపాలపురం నుండి హైదరాబాదుకి గంటన్నర ప్రయాణం అందుకని ఆరు గంటల వరకు బయలుదేరాలని నిర్ణయించుకున్నారు… రాగానే వారికి కావలసిన భోజన సదుపాయాలు అన్ని చేసి .. అలేఖ్య సుధీర్ ఉండవలసిన గదిని కూడా చక్కగా సర్దించి ఉంచారు…

మంచంకి ఎదురుగా లేవగానే కళ్లబడేలా చిన్ని కృష్ణుని ఫోటోలు… కొన్ని దేవుళ్ళ ఫోటోలు అన్నీ గోడకు వేలాడదీశారు.. గదిలో ధారాళంగా గాలి వెలుతురు వస్తుంది ..పెద్ద పెద్ద కిటికీలు కిటికీల పక్కనే అల్లుకున్న మల్లెపందిళ్లు కిటికీలో నుండి చూస్తే విరగబూసిన మందారాలు గన్నేరు పూలు కనిపిస్తుంటాయి… మంచం పక్కన చిన్న టేబుల్ దానిపైన అలేఖ్య సుధీర్ల పెళ్లి ఫోటో ఏర్పాటు చేశారు గదిమూలలలో చక్కని ఫ్లవర్ వాసులు… ఇలా ఎంత వీలైతే అంత చక్కగా గదిని అలంకరించారు… భాగవతం పుస్తకాలు కొన్ని ఉంచింది నీలాంబరి.. కడుపుతో ఉన్నవాళ్లు ఇలా ఆధ్యాత్మికమైన కథలు చదివితే సుఖ ప్రసవం అవుతుందని పెద్దలు చెప్తూనే ఉంటారు కదా! అందుకే మంచి ప్రవచనాలు మంచి మాటలు వింటుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది….

నీలాంబరి భూపతి ఉదయం ఐదున్నర గంటలకి తయారయ్యి కారు కోసం ఎదురుచూస్తున్నారు డ్రైవర్ రాగానే ఇద్దరు కారు ఎక్కారు ఇంతలో మహేశ్వరి వచ్చింది…

” అమ్మా! నేను మీతోని ఎయిర్పోర్ట్ కి వస్తానమ్మా అలేఖ్యమ్మ గారిని చూస్తాను” అని అడిగింది.

” వచ్చేవరకు ఇంట్లో అన్ని తయారుగా ఉండాలి కదా మహేశ్వరి నువ్వు కూడా వస్తే పనులు ఎలా జరుగుతాయి” అన్నది నీలాంబరి..

“అన్ని తయారు పెట్టుకున్నా అమ్మా! రాగానే 10 నిమిషాల్లో వాళ్లకు వడ్డించేస్తాను కాదన కమ్మ నేను వస్తాను” అని అడిగింది మహేశ్వరి.

” పోనీలే నీలా రానివ్వు” అన్నాడు భూపతి.

” రా కారెక్కు” అని చెప్పింది నీలాంబరి.

వెంటనే సంతోషంగా కారెక్కింది నీలాంబరి.. ఉదయం ప్రశాంతమైన వాతావరణంలో కారు పయనిస్తుంటే కిటికీలో నుండి చల్లటి వాతావరణాన్ని ఆస్వాదిస్తూ కూర్చుంది నీలాంబరి…

గంటన్నర తర్వాత ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు… బయట ఎదురుచూస్తూ నిలబడ్డారు… ఇంతలో అలేఖ్య సుధీర్ వారి లగేజ్ తో బయటకు వచ్చారు.

భూపతి నీలాంబరి వాళ్ళను చూడగానే సంతోషంగా దగ్గరికి వెళ్లారు… ఐదో నెల రావడం వల్ల కొంచెం ఒళ్ళు చేసి నీలాంబరి మెరుస్తున్నట్లు కనిపించింది… తిన్నా తినకున్న కడుపుతో ఉన్న ఆడవాళ్ళ మొహంలో ఆ మెరుపు ఎలా వస్తుందో నిజంగా ఎవరికి అర్థం కాదు అది ఆ దేవుడి లీలనే కావచ్చు ఒక ప్రాణి మరో ప్రాణిని మోయడం అనేది అద్భుతమైన విషయమే కదా అది మహిళలకే సొంతమైన ప్రక్రియ… మాతృత్వం కోసం ఆడవాళ్లు ఎంత కష్టమైనా పడతారు వారి త్యాగనిరతికి అదే నిదర్శనం.

నీలాంబరి భూపతి అలేఖ్యను దగ్గరికి తీసుకున్నారు..” ఎలా ఉన్నారు” అని ఇద్దరినీ అడిగారు..

” బాగున్నాం అమ్మ” అని చెప్పింది అలేఖ్య.

” అలేఖ్యను మీ చేతుల్లో పెడుతున్నాను అత్తయ్య గారు! ఇన్ని రోజులు నేను ఎలా చూసుకున్నానో మీరే చెప్పాలి ఇంకా బాధ్యత అంతా ఇప్పుడు మీదే” అని నవ్వుతూ అన్నాడు సుధీర్…

” మీరు కన్నతల్లిలా చూసుకున్నారని అలేఖ్య చెప్తూనే ఉంది బాబు అయినా అలేఖ్యని చూస్తే నాకు అర్థం అవుతుంది మీరు బాగా చూసుకున్నారని” అన్నది నీలాంబరి.

అందరూ కలిసి కారులో గోపాలపురం బయలుదేరారు… మధ్యలో వారు ఇంతకుముందు టిఫిన్ చేసిన హోటల్కు తీసుకెళ్లారు అలేఖ్యని సుదీర్ ని.

” ఇక్కడ ఆహారం చాలా బాగుంటుందమ్మా వీళ్ళు చాలా తక్కువ ధరలకే ఎంతోమందికి ఆహారం ఇవ్వడంతో పాటు స్వచ్ఛందంగా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అందుకే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాము ఇక్కడ టిఫిన్ చేసి మనం గోపాలపురం వెళదాము” అని చెప్పింది నీలాంబరి…

మళ్లీ ప్రయాణం చేసి గోపాలపురం చేరుకున్నారు గబగబా లోపలికి వెళ్ళిన మహేశ్వరి ఎర్ర నీళ్లు తీసుకొని వచ్చి అలేఖ్యకు సుధీర్ కు దిష్టి తీసింది… అందరూ లోపలికి వెళ్లారు. అలేఖ్య ప్రయాణం అలసటలో ఉన్నా కూడా తాను పుట్టి పెరిగిన ఇల్లంతా ఒక్కసారి కలియ చూసింది…

” అమ్మా! మువ్వను చూస్తానమ్మ ప్రతిసారి ఫోన్ లో చెప్తున్నావ్ కదా వెళ్లి చూస్తాను” అని అన్నది అలేఖ్య.

” ఇప్పుడు వద్దమ్మా దూరం నుండి ప్రయాణం చేసి వచ్చారు అందులో వట్టి మనిషివి కాదు నువ్వు విశ్రాంతి తీసుకున్న తర్వాత సాయంత్రం వెళ్లి చూద్దువు గాని” అని చెప్పింది నీలాంబరి.

సరే అని చెప్పి అలేఖ్య స్నానం చేసి వచ్చి పడుకుంది.

సుధీర్ భూపతితో మాట్లాడుతూ హాల్లో కూర్చున్నాడు..

మహేశ్వరి అలేఖ్యకు సుధీర్ కు ఇష్టమైన వంటకాలన్నీ చేసింది..

నీలాంబరి కూతురు వచ్చిందని ఆనందంలో సర్దిందే సర్దుతుంది… తనకి ఎలా సౌకర్యంగా ఉంటుందో అని ఎక్కువగా తపన పడుతుంది… చిన్న చిన్న వ్యాయామాలు చేసుకోవడానికి వీలు కల్పించింది…

దాదాపు రెండు గంటలు కావస్తుంది అలసటగా నిద్రపోయిన అలేఖ్యని లేపాలనిపించకపోయినా భోజనం సమయం దాటిందని నిద్రలేపింది నీలాంబరి.

” అలేఖ్య అలేఖ్య లే తల్లి భోజనం చేయాలి నీకోసం నాన్న సుదీర్ ఎదురుచూస్తున్నారు” అని నిద్ర లేపింది నీలాంబరి.

ఇంకా ఉంది

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

హోలి జీవన కేళి

పురుష పుంగవులారా….!