“బాదమ్ మిల్క్ తీసుకోండి” అంటూ గ్లాస్ టీపాయ్ మీద పెడుతూ, భర్తను మంచంపైనుండి లేచి కూర్చోవడానికి సాయంచేస్తూ గ్లాసు చేతికందించింది యమున.
నెలరోజులుగా తనకు తల్లిలా నిరంతర సేవలందిస్తూవున్న భార్య వదనంలోకి చూడలేకపోతున్నాడు హరీశ్ .
యాక్సిడెంటై, కాలు ఫ్రాక్చరై, సర్జరీ అయి, హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయి ఇంటికొచ్చాక, వందశాతం ఇంటి ఇల్లాలి సేవలే పొందుతూ చాలామటుకు కోలుకుంటున్నాడతను. అయినా భార్య మొహంలోకి ముఖ్యంగా ఆ కళ్లలోకి చూసే సాహసం చేయలేకపోతున్నాడు. తలొంచుకునే భార్యతో మాట్లాడుతూవున్న ప్రతిసారీ అతడి కంటతడినిగానీ వణికే స్వరాన్నిగానీ ఆమె గమనిస్తూనేవుండొచ్చు.. అయినా గంభీరంగానే అన్నిపనులూ చేసుకుపోతున్న ఆమె అంతరంగాన్ని అంచనావేయలేకపోతున్నాడతను. ప్రశాంతంగా వుండలేకపోతున్నాడు. ఆ ఇల్లాలి సేవలన్నీ శూలాలై గుచ్చుకుంటున్నట్టుగా మనసు గాయపడుతూ.. దినం దినం అది బలపడుతూనేవుంది.
అయిదేళ్ల క్రితం గతం ఒకలా, ఈ మూడునెలలక్రితం గతం మరొకలా ఆరడి పెడుతూ తడవ తడవకూ అతడిని తడమసాగింది!
****
అయిదేళ్ల క్రితమే హరీశ్ బిటెక్ ఫైనల్లో వున్నప్పుడు, తండ్రి బలవంతంతో అన్యమనస్కంగానే అతడికి యమునతో పెళ్లయింది. తండ్రి ప్రాణస్నేహితుడు హటాత్తుగా హార్ట్ఎటాక్ తో పోవడంతో, మిత్రధర్మంగా హరీశ్ తండ్రి, మిత్రుని ముగ్గురాడపిల్లల్లో పెద్దదయిన డిగ్రీ చదువుతున్న యమునతో హరీశ్ వివాహం జరిపించాడు. తమ ఆర్థిక పరిస్థితులంతంతమాత్రంగానే వుండడంతో, యమున తెచ్చిన కట్నం డబ్బులతోనే హరీశ్ తను అనుకున్న ఎంటెక్ కూడా పూర్తిచేయడం, మంచి ర్యాంక్ సాధించడం జరిగింది. ఆపైన సిటీలోని ఓ పేరైన సాఫ్ట్ వేర్ కంపెనీలో లక్ష పైగా జీతంతో జాబ్ కూడా సంపాదించుకున్నాడు. అంతేకాదు విలాసవంతమైన గేటేడ్ కమ్యునిటీలో అపార్ట్ మెంట్ కూడా తీసుకొని రెండేళ్లుగా అందులో కాపురముంటున్నాడు.
చురుకైన వాడిగా మంచి మేథస్సు గలవాడిగా అలా అంచెలంచెలుగా ఎదుగుతూ స్థాయి పెరుగుతూ వచ్చెకొద్దీ క్రమ క్రమంగా ఆనందం మాత్రం తరుగుతూ వస్తున్నది హరీశ్ లో! అందుక్కారణం ఎవరోకాదు అతడి దృష్టిలో అతడి భార్య యముననే! నల్లగా పొట్టిగా కనీసం కనుముక్కుతీరైనా తీర్చిదిద్దినట్టుగా లేని ఆమె ఓ అనాకారిలా అగుపిస్తుండగా.. ఆమె పట్ల నిరసన భావం మెల్లమెల్లగా చాపకింద నీరులా చోటుచేసుకోసాగిందతడిలో. ‘మంచి ఛాయతో కూడిన చక్కని పర్సనాలిటీతో అందమైన కనుముక్కుతీరుతో అందరు తననో హీరో అనేవిధంగా ఆకర్షణీయంగా అగుపించే తన పక్కన మరీ కొట్టొచ్చినట్టుగా మ్యాచ్ కానట్టుగా కనిపించే తనకెంతమాత్రం తగదనిపించే అనాకారి భార్య తన అశాంతికి మూలం! తన హోదాకి తగినట్టుగా పార్టీలకు ఫంక్షన్లకు తీసుకెళ్లడానికి పనికిరాని పెళ్లాం!’ అనుకుంటూ ఆ భావాలతోనే రాను రాను ఆమె ఉనికినే భరించలేని స్థితికొచ్చాడు హరీశ్ .
”మరింత స్థాయి పెరిగేదాకా పిల్లలిప్పుడే ఒద్దు.. అన్న మీ నిర్ణయాన్ని ఇకనైనా మార్చుకోండి!” అని భార్య తన మాతృత్వ కాంక్షను వెలిబుచ్చినప్పుడెల్లా ఏదో సాకుచెప్పేవాడు.. కానీ అసలు నిజం, ‘పిల్లలు తనలా గాక తన భార్యలా పుడితేనో’ అనేదే అతడి భయం!
“నీవు పిల్లల్నికూడా ఒద్దనుకునేంత అనాకారి భార్యనెంతకాలం భరిస్తావ్? ఏదో నెపంతో విడాకులిచ్చిమరీ నీ అందానికి పర్సనాలిటీకి తగిన బ్యూటీక్వీన్ ని పెళ్లి చేసుకోవచ్చుగా?” అని ఏడాది క్రితం ఓ పార్టీలో ఒకరిద్దరు మిత్రులిచ్చిన సలహా మెదడులో ముద్రవేసుకుంది. అది మాటిమాటికీ మనసులో మెదలసాగింది.
ఏడాదికాలంగా.. ఎన్నో విధాలుగా చీటికీ మాటికీ విసుక్కుంటూ, అకారణంగా విమర్శిస్తూ భార్యను బాధ పెట్టడం కన్నీళ్లు పెట్టించడం అతడికి పరిపాటిగా మారిపోయింది.
అన్నీ మరిచిపోయి మళ్లీ నవ్వుతూ దగ్గరకొచ్చే ఆమె నవ్వును ఏడుపుగా మారేలా చేసేవాడు “అబ్బబ్బా.. అనాకారి తనానికి తోడు ఆ ఏడుపొకటి.. భరించలేకున్నాను” అంటూ విసురుగా బయటికెళ్లేవాడు! ఒక్కోసారి ఇంట్లోవుండి, ఒక్కోసారి ఇంటికిరాక, కావాలనే.. అనుకున్నట్టుగానే ఆమెను సాధించడం ఆరంభించాడు హరీశ్.
‘విడాకులు’ అనే టాపిక్ తీసుకురావాలనే విస్తరాకుల్ని(అన్నం కంచాల్ని)ఎన్నోసార్లు విసిరికొట్టేవాడు వంట బాలేదనే సాకుతో హరీశ్. ప్రతి పనిలో వేలుపెట్టి వంకలు పెట్టేవాడు. అలా ఎన్ని బాధలు పెట్టినా ఎవరికీ చెప్పుకోలేదు సరికదా కనీసం పుట్టింటికైనా వెళ్లిపోతానని అనని పెళ్లాన్ని చూస్తుంటే అహం దెబ్బతింటున్న హరీశ్ లో ఉక్రోషం ముంచుకొచ్చేది.
‘ఏదో ఆనాడు అలా అస్వతంత్రుడిలా తండ్రి మాట కాదనలేక, ఆర్థిక స్తోమత కూడా లేక చదువాపే పరిస్థితిలో.. చదువనే ఆశయంతో కట్నంపై ఆశతో పెళ్లిచేసుకోవలసి వచ్చింది. కానీ అనుకున్న చదువు పూర్తయి, మంచి ఉద్యోగమొచ్చి అంతస్తూ హోదా పెరిగిపోయిన ఈ స్థితిలో అనాకారి యముననూ ఆమెలా పుడితే గనుక ఆ పిల్లల్నీ భరించలేని దుర్భరస్థితికొచ్చేశాడు తను!’ అనుకుంటున్న అతడిలో అంతకంతకూ అసహనం పెరిగిపోసాగింది.
“విడి ఆకుల్లా బతికే కంటే విడాకులు మేలుకదా! ఒకరంటే ఒకరికి పడని ఏడుపుల కాపురాలు ఎన్నాళ్లు చేయగలం? నీవు సరేనంటే నీ కట్నం డబ్బులకు రెట్టింపు డబ్బులిస్తాను. ఫ్యామిలీ కోర్టుద్వారా మ్యూచువల్ డైవర్స్ తీసుకుందాం!”
అని అతడంటే “అంతమాటనకండి” అంటూ కంటతడి పెట్టుకుంది గానీ విడాకులకొప్పుకోలేదు యమున.
ఓనాడు..
“నామాట కాదంటే.. విడాకులకంగీకరించకుంటే, నేను నీతో వుండను. శాశ్వతంగా నిన్ను విడిచి ఎటో వెళ్లిపోతాను లేదా చచ్చిపోతాను! అది నీకిష్టమేనా?” అన్నాడు
ఉలికిపాటుగా చూసింది తలడ్డంగా ఆడించింది యమున.
“అందుకే మంచిగానే విడిపోదాం” అంటూ ఆఖరి అస్త్రం ప్రయోగిస్తూ భార్యను బ్లాక్ మెయిల్ చేస్తూ ఇరకాటంలో పెట్టాడు.. ఇంటినుండి బయట పడ్డాడు.. కారు రిపేర్ లో వున్నందున బైక్ పై బయల్దేరాడు లౌక్యం గల లంచగొండి లాయర్ దగ్గరకు హరీశ్.
‘మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనేలా.. తనకు తగిన అందమైన భార్య.. ముద్దులొలికే పిల్లలు.. కన్నుల విందైన కాపురం’ అనుకుంటూ ఆనందంతో తేలిపోతూ ఊహాలోకంలో విహరిస్తూ ఉత్సాహంతో వేగంగా రోడ్డుపై బండి నడుపుతున్న హరీశ్ హటాత్తుగా అదుపుతప్పి డివైడర్ ను ఢీకొని అంతెత్తున ఎగిరిపడ్డాడు. ఆ పడీ పడడం, బండికూడా కాలుమీద పడడంతో ఆబాధతో విలవిలలాడుతూ లేవలేని స్థితిలో మెల్లమెల్లగా స్పృహకోల్పోయాడు హరీశ్ .
ఎవరో ఫోన్ చేయగా పోలీసులు, అంబులెన్స్, హాస్పిటల్ ఫార్మాలిటీస్ జరిగిపోయాయి.
తిరిగి హాస్పిటల్ లో కళ్లు తెరిచిన హరీశ్ కు, కళ్లనీళ్లతో తనచెంత తన భార్య యమున కనిపించి ఆమె కళ్లలోకి చూడలేకపోయాడు. ఆమె కన్నీటిని తన కళ్లలోకి ఒంపుకొని భారంగా కళ్లుమూసుకున్నాడు.
విరిగిన కాలుకు సర్జరీ జరిగింది. తల్లిదండ్రుల, బంధుమిత్రుల పరామర్శలెన్నిజరిగినా, శ్రధ్దతో కూడిన భార్యసేవలతోనే తొందరగా కోలుకున్న హరీశ్ , అనుకున్నదానికన్నా ముందుగానే హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు!
****
ఆ జ్ఞాపకాల్లోంచి ప్రస్తుతంలోకొచ్చిన హరీశ్ అంతులేని బాధతో బరువుగా శ్వాసతీసుకున్నాడు..భార్యను గుర్తుచేసుకున్నాడు..
మూడునెలల బెడ్ రెస్టులో.. బెడ్ పాన్ దగ్గర్నుండి డైఫర్లదాకా, వాకర్ నుండి వాకింగ్ స్టిక్ దాకా, మందులనుండీ మంచి ఆహారందాకా వరుసగా ఓ నర్స్ లా, అమ్మలా అన్నపూర్ణలా అన్నిసేవలందిస్తూ, భర్త నడక బరువుకు తన భుజాల చేయుతనిస్తూ పసిపాపలా నడిపిస్తూ, తన దైనందిన అవసరాలన్నీ తీరుస్తూ తిరిగి హరీశ్ నో మనిషిని చేసిన భార్య యమున వైపు చూడలేని నెలల కాలాన్ని అపరాధ భావనతో కూడిన దౌర్భాగ్య స్థితిలోనే గడుపుతూ చివరికి మంచం దిగాడు.. మౌనంగానే మనసు భారంగానే అడుగులు వేశాడు హరీశ్.
పూర్తిగా కోలుకోవడం, మెడికల్ లీవ్ కూడా పూర్తి కావడంతో తిరిగి ఆఫీస్ డ్యూటీ చేయడం ఆరంభించాడు హరీశ్.
అలా.. ఓ వారం గడిచింది.
ఓనాడు..
ఓ కవర్ ను భర్త చేతికందించింది యమున.
అందుకున్న హరీశ్ ఆ కవర్ విప్పి చూశాడు..
“ఏమండీ.. బలవంతపు బ్రతుకెన్నటికీ ఫలవంతం కాదని అర్థంచేసుకున్నాను. ఆనాడే మీరు నన్నొదిలి వెళ్లిపోతాననో లేదా చచ్చిపోతాననో నాపైన ఆఖరి అస్త్రం ప్రయోగించి వెళ్లిన్నాడే, మానసికంగా మనబంధం మాసిపోయింది నా దృష్టిలో! మీ భార్యస్థానం నుండి నేను తొలగిపోయాను. విడాకులకు సిధ్దమై వున్నాను. కానీ అలా జరిగిన గంటలోపే మీ యాక్సిడెంట్ సమాచారం రావడంతో, వెంటనే హాస్పిటల్ కు బయల్దేరాను. పేషెంట్ గా వున్న మీతో విడాకుల మాటెత్తక, మీకు భార్యగా గాక సాటి మనిషిగా బాధ్యతగా అన్ని సేవలూ అందించి తిరిగి మునుపటిలా మీరు కోలుకొని తిరిగి ఆఫీసుకు వెళ్లగలిగేలా చేయగలిగాను! ఇంతటితో నా కర్తవ్యం పూర్తయింది. పదే పదే మీరడిగిన విడాకులకంగీకరించి మరీ మీనుండి శాశ్వతంగా సెలవు తీసుకుంటున్నాను! అందమైన భర్త అని ఎంతో ఆనందించాను గానీ ఆ అందం మీ ఆంతర్యంలో లేదని పూర్తిగా అర్థమయింది. మీ రూపం నాకు దీపం కాదని, మీ అనాకారితత్వం నా బ్రతుక్కి చీకటని తెలిసి ఎలా కలిసి జీవించగలను? గుడ్ బై హరీశ్ !
మీకు ఏమీకాని యమున!”
ఆ (విడాకుల అనుమతి)పత్రం చదివిన హరీశ్ ఆక్రందనగా “యమునా” అంటూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ మరుక్షణం.. ధారాపాతంగా వర్షిస్తున్న కన్నీళ్లతో భార్య హస్తాల్ని పట్టుకొని ఆ కళ్లకద్దుకున్నాడు.
” యమునా.. బంగారం వంటి భార్య గుణం చూడలేని, అధ్బుత వ్యక్తిత్వాన్ని గమనించలేని ఈ అంధుడిని క్షమించు! భ్రమలకు లోనై కేవలం బాహ్య సౌందర్యాన్ని ఆశించిన అపరాధానికి తగిన శిక్ష పడింది నాకు శారీరకంగానూ మానసికంగానూ! ఆత్మ సౌందర్యం లేని నావంటి మనోవికారిని సైతం ‘సాటిమనిషి’ గా భావించి ఆపదలో ఆదుకున్న ఆత్మ సౌందర్య దీప్తివి.. మహోన్నత మణికాంతివి.. నిన్ను ‘సాటిమనీషి’ గా భావించి వందనమొనరిస్తున్నాను యమునా! మన్నించి ఆదరించమని ప్రార్థిస్తున్నాను!”
అంటూ తలొంచి రెండు చేతులతో ఆమె పాదాలను తాకాడు హరీశ్!
పశ్చాత్తాపాగ్నిలో దహించుకు పోతున్న భర్త తలపై మన్నింపుతోకూడిన కన్నీటి బిందువుల్ని చల్లని చిరుజల్లుల్లా చిలకరించింది యమున!
****