విద్య అనేది మనిషికి చాలా అవసరం. అది స్త్రీ అయినా పురుషుడైనా సరే. కానీ ఒకప్పుడు విద్య కేవలం పురుషులకి మాత్రమే ఉండేది స్త్రీలకు ఉండేది కాదు. కొంతమంది సంఘసంస్కర్తలు స్త్రీలకు చదువు అవసరమని గుర్తించారు. అలా గుర్తించిన వారిలో ప్రథములు కందుకూరి వీరేశలింగం పంతులు.స్త్రీకి స్వతంత్రం ఉంటేనే దేశస్వాతంత్ర్యానికి ప్రయోజనమని భావించిన కందుకూరి స్త్రీ విద్యకు పునాదులు వేశారు.స్త్రీని ఆదర్శవంతమైన గృహిణిగా చూడాలనుకున్న వ్యక్తి. దానికి విద్య తోడ్పడుతుందని గ్రహించారు. స్త్రీలకి అర్థమయ్యే రీతిలో చిన్న చిన్న కథలు రాసేవారు. అవి స్త్రీలకు చదువు పట్ల ఆసక్తి కలిగే విధంగా ఉండేవి. మరి కొంతమంది రచయితలు స్త్రీ చైతన్య సాధనకోసం సాహిత్య కృషి చేశారు. గురజాడ, చిలకమర్తి, శ్రీపాద, చలం వంటి సామాజిక సంస్కరణవాదుల వైవిధ్యపూరితమైన కృషి ఫలితంగా స్త్రీల పరిస్థితిలోనూ, ఆలోచనల్లోనూ వచ్చిన మార్పులు స్త్రీల ప్రగతికి దోహదం చేశాయి. మరోవైపురాజకీయ స్వాతంత్ర్యానికై దేశమంతా పోరాటం చేస్తుంటే తమ వ్యక్తి స్వాతంత్ర్యానికై స్త్రీలు పోరాడారు.తమఅస్వతంత్ర జీవనానికి అవిద్యకు ఉన్న లంకెను గుర్తించి తమ హక్కులసాధనకోసం విద్యావంతులు కావాల్సిన అవసరాన్ని గుర్తించారు.
స్త్రీ అభ్యుదయానికి పునాదియైన విద్యను నాడు స్త్రీలు అభ్యసించే అవకాశం లేకపోవడమేప్రధాన సమస్య.పురుషులు నేర్చుకునే విద్యనుకాకుండా పతివ్రతాధర్మాలు బోధించే విద్యను మాత్రమే నేర్చుకోవాలి. ఇంటిపట్టునే ఉండి పురాణాలు, ఇతర భక్తిరచనలు చదవాలనేనియమాలుండేవి. కుటుంబంలో సోదరులు చదువుకునేటప్పుడుకొందరు విని నేర్చుకున్నారు. అదికూడా విద్యావంతుల కుటుంబాల్లో మాత్రమే. అలా చదువుకున్న వాళ్లు మెల్లమెల్లగా రచనలు చేయడం మొదలుపెట్టారు. చదువు లేని స్త్రీల స్థితి గురించి రాసేవారు. వారిలో చైతన్యాన్ని కలిగించే విధంగా రచనలు ఉండేవి. చదువుకోకపోవడం వల్ల కలిగే ఇబ్బందులను గూర్చి కథల రూపంలో పత్రికలలో రాసేవారు.ఆపత్రికలకు స్త్రీలే సంపాదకత్వం వహించేవారు. తరువాత బడికి వెళ్లి చదువుకునే అవకాశాలు పెరుగుతూ వచ్చాయి. అయితే పురుషునితో సమానంగా ఇంగ్లీషు చదవకూడదు. ప్రభుత్వ ఉద్యోగాలకోసం పోటీపడకూడదు. భర్త అవసరాలు, పిల్లల చదువు చూసుకుంటూ పిల్లలకు పొదుపు, పరిశుభ్రత, క్రమశిక్షణలాంటి విలువలు నేర్పడమే జీవిత పరమార్ధం అయింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత దేశ పునరుద్ధరణ కార్యక్రమాల్లో భాగంగా స్త్రీ విద్య మరో ఊపు అందుకుంది. ఈ విషయంలో పత్రికలు ప్రముఖ పాత్ర వహించాయి.
అనాదిగా స్త్రీలకు పురుషులతో సమానంగా విద్యావకాశాలు లేకుండా చేసినందువల్ల ఆర్థికంగా సామాజికంగా స్త్రీలు పురుషులపై ఆధారపడేటట్లు చేయడం వల్ల స్త్రీలకు రచనలు చేసే అవకాశాలు అరుదుగా ఉండేవి. అయినప్పటికీ తెలుగు సాహిత్య చరిత్రలో 15వ శతాబ్దంలోని తాళ్లపాక తిమ్మక్క మొదలుకొని 20వ శతాబ్దంలోని భండారు అచ్చమాంబ వరకు సృజనాత్మక రచనలు చేసిన స్త్రీలు లేకపోలేదు.
1896లోనే వేమూరి శారదాంబ తన మాధవశతకంలో మహిళా అక్షరాస్యతకు నిరోధకంగా ఉన్న సామాజిక, కుటుంబ అసమాన సంస్కృతిని ప్రశ్నకు పెట్టి స్త్రీవిద్యపట్ల ఆలోచనలను రేకెత్తింప చేసింది. ప్రజాస్వామిక రాజ్యాంగ సమానహక్కులకు లింగవివక్షలేని విద్యాహక్కుకు దీనితోనే పునాదులు పడ్డాయని చెప్పుకోవచ్చు.
నూరేళ్ళముందుచూపు స్త్రీవిద్య.తన సమకాలీన సమాజ మార్పుకోసం స్త్రీ జనోద్ధరణ కోసం కలం పట్టిన రచయిత్రి భండారు అచ్చమాంబ. పురుషులకే సరైనవిద్య అందనికాలంలో స్త్రీవిద్యకోసం అచ్చమాంబపడిన తాపత్రయం చూస్తే ముచ్చటేస్తుంది.ఈమె రాసిన 12 కథల్లో రెండు కథలు స్త్రీవిద్య ఆవశ్యకతను గురించి రాసినవే. అందులో ఒకటి జానకమ్మ, రెండవది స్త్రీ విద్య. చదువుకు స్వేచ్ఛకు అవకాశం కలగచేస్తే స్త్రీలు చెడిపోతారు, హద్దుమీరుతారనే అపోహను తొలగించిన వ్యక్తి. వాస్తవ చారిత్రక స్త్రీ జీవితాలను ఇతివృత్తాలుగా చెప్పడం ద్వారా స్త్రీ చైతన్యానికి పూనుకొన్నారు.స్త్రీలు అజ్ఞానాంధకారంలో ఉంటే మూఢత్వంలో ఉండిపోతారని అంటారు. చదువు నేర్చుకోవడం వలన బుద్ధి వికసిస్తుందని, లోకానుభవాన్నిగ్రహిస్తారని, సంసారంలో ఎదురయ్యే ఎన్నో కష్టాలను ఎదుర్కొంటారని, మనసుకుఆనందం, ఆహ్లాదంవంటివెన్నో విద్యవలన కలుగుతాయని ఈ కథలలో పేర్కొంది. స్త్రీలు చదువుకోవడం ఈకాలానికి ఎంత అవసరమో నాడే పేర్కొన్న రచయిత్రి. ఆమె రాసిన మిగిలిన కథల్లోనూ అక్కడక్కడ స్త్రీవిద్య గురించిన పలు అభిప్రాయాలను అచ్చమాంబ వ్యక్తీకరించింది.“అమ్మాయి చదువు అవనికే వెలుగు” అని నమ్మి రాసిన కథారచయిత్రి అచ్చమాంబ. స్త్రీ చదువుకుంటేనే ఎంతో తెలివిగా సంసారాన్ని నడిపిస్తుందని చెప్పడమే ఆమె లక్ష్యం.
మరొక వ్యక్తి మల్లాది సుబ్బమ్మ. ఎనిమిదేళ్లకే బాలికలకు వివాహం చేసే ఆరోజుల్లో 13వ ఏటదాకా చదువుకోగలగడం విశేషం. ఇదంతా తండ్రి అభ్యుదయభావమని ఆత్మకథలో చెప్పుకొన్నారు. పెళ్లయ్యాక చదువుకోవడానికి మొదట తనఅత్తగారు అంగీకరించకపోయినా కొంతకాలం తర్వాత ఆమెనే చదువుకోమంది.
కనుపర్తి వరలక్ష్మమ్మ, కాంచనపల్లి కనకాంబ వంటి తొలితరం రచయిత్రులు భార్యాభర్తల మధ్య అవగాహన, సఖ్యత కల్పించడంలోనూ విద్య ప్రధాన విషయంగా భావించారు. మధ్యతరగతి కుటుంబాల జీవితలోతుల్ని అధ్యయనంచేసి వారు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలను వస్తువుగా చేసుకొని కథా సృజన చేశారు తొలితరం రచయిత్రులు.
గురజాడ, చిలకమర్తి, శ్రీపాద, చలం వంటి సామాజిక సంస్కరణవాదులు స్త్రీవిద్యకై కొంతవరకు సాహిత్య కృషి చేసినట్లు తెలుస్తోంది. బాపూజీ, వివేకానందుడు వంటి వారు కూడా స్త్రీకి గృహపక్షమైన విద్య ఉండాలని ఆశించారు. వీరేకాకుండా ఇంకా మరికొందరు స్త్రీ ఉన్నతవిద్య చైతన్యానికి విశేషమైన కృషి చేసినట్లు తెలుస్తుంది. వారిలో ప్లేటో, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వంటివారు ముఖ్యులు.
విద్యావంతులైన స్త్రీలు విదేశీస్త్రీల జీవితాలు, వారి రాజకీయ హక్కులను తెలుసుకొంటూ తమ కుటుంబంలో తమ అస్తిత్వాలను గురించిన ఆలోచనలను పెంచుకున్నారు. అందుకే భండారు అచ్చమాంబ స్త్రీవిద్య అభివృద్ధి చెందటానికి స్త్రీల సమాజాలను ఏర్పాటు చేశారు.విద్యద్వారా జ్ఞానాన్ని పొందిన స్త్రీలు తమ బానిసత్వాన్ని తొలగించుకునే స్వతంత్ర ఆలోచనలను కొనసాగించినట్లు ఆమె రచనలలో కనబడుతుంది. పత్రికా రంగంలోనూ స్త్రీలు ప్రవేశించారు. విద్య స్త్రీలలో ధైర్యస్థైర్యాలనుపెంచుతుందని, అప్పుడే తమ భావాలను స్వేచ్ఛగా వ్యక్తీకరించగలం అనుకొన్నారు. స్త్రీలకు ఉన్నత విద్యావకాశాలు పెరగాలనీ, వారి సామూహిక స్వేచ్ఛ స్త్రీ స్వాతంత్ర్యానికి ప్రేరకమవుతుందనీ భావించారు. మహిళలు చదువుకోవడానికి వివాహ సంస్కృతి ఆటంకంగా ఉందని గుర్తించి బాల్యవివాహాలను నిరసించారు. స్త్రీ పునర్వివాహ హక్కునూ, గౌరవప్రదమైన జీవన హక్కులను గుర్తించారు.
దేశ స్వాతంత్ర్యంకోసం స్త్రీ పురుషులు ఐక్యంగా పోరాడాల్సిన అవసరాన్ని గుర్తిస్తూనే, తమ స్వతంత్రంకోసం స్త్రీలే ఐకమత్యంతో పోరాటం చేసుకోవాల్సిన కర్తవ్యాన్నీ గుర్తించారు. స్త్రీల సాహిత్యంలో స్త్రీ పురుషుల స్వతంత్ర జీవనంలోని తేడాలను గుర్తించే భావనలకు పెద్దపీఠ వేశారు. ఆవిద్య, ఆస్తిహక్కులేమి స్త్రీ పురుషుల అసమానత్వానికి కారణమనీ, స్త్రీలు అదనంగా సాంఘిక ఆర్థిక స్వాతంత్ర్యాలకోసం పోరాడాలని చర్చలు చేశారు.
ఆ తరువాతకొంతకాలానికిఆరోగ్య భద్రత గురించి ఆలోచించారు. బహు భార్యత్వపు సంస్కృతిని నిరసిస్తూ తండ్రి ఆస్తిలో, అటు భర్తఆస్తిలో హక్కులేదని గుర్తించి వారసత్వపు ఆర్థికహక్కులదిశగా ఆలోచనలు పెంచుకున్నారు.స్త్రీలకు సమాన ఆర్జనావకాశాల ఆవశ్యకతను గుర్తించారు.స్త్రీలు ఎదుర్కొనే కుటుంబహింసను చట్టానికి పట్టించే స్థితికి వారి ఆలోచనలు పెరిగాయి.స్వరాజ్యసాధన స్త్రీల విద్యుక్తధర్మమని భావించారు. ఓటు హక్కు పొందారు. స్త్రీల హక్కును సద్వినియోగం చేసుకోవాలనుకున్నారు. అంతేకాదు తాము ఎదిగి తోటివారికి సహాయపడగల స్థితికి చేరుకోవాలనీ, వ్యాపారపు మెలకువలు గ్రహిస్తూ ఆర్థికశక్తిగా ఎదిగితేనే దేశ స్వాతంత్ర్యానికి పాటుపడగల సమర్థత స్త్రీలకు ఉంటుందని భావించారు. సామాజిక అస్తిత్వాలకు సంబంధించి ఆలోచనలు పెంచుకొని సామాజిక సంస్కృతిని నిరసించే విధంగా స్వతంత్ర నిర్ణయాలు చేసుకోవాలని కుడాభావించారు.
అయితేరాజ్యాంగం 70 ఏండ్లుగా అమలులో ఉన్నా స్త్రీలు పురుషులతో సమానంగా జీవించలేని దశలో ఇప్పటికీఉండటానికి కారణాలు విశ్లేషించుకోవాలి. తమ హక్కుల పరిరక్షణకై మరింతగా కృషిచేసే దిశగా సాగాలి. అందుకు స్వాతంత్రోద్యమంనాటి స్త్రీల సాహిత్యపఠనం అవసరం. వివిధ సాహిత్యప్రక్రియల రూపంలో పాత తెలుగుపత్రికలలో నిక్షిప్తమై విస్మృతంగా ఉన్న నాటిస్త్రీ సాహిత్యచైతన్యం నేటికీ స్ఫూర్తిదాయకం.ఆనాటి స్త్రీల సాహిత్యంలో ప్రతిఫలించిన స్వతంత్ర జీవనచైతన్యం స్వరాజ్య హక్కుల పోరాటం కలిసి వెరసి భారతదేశ ప్రజాస్వామిక రాజ్యాంగ నిర్మాణానికి దారిదీపాలుగా ఉపకరించాయని అర్థం చేసుకోవాలి.
నేడు స్త్రీలు రాజకీయంగా 33% రిజర్వేషన్ పొందటం శుభపరిణామమే. అయితే భవిష్యత్తులో స్త్రీలు రాజకీయంగా కూడా బలంగా నిలదొక్కుకోవడానికి విద్య ఎంతో ఆవశ్యకమైంది. పురుషులతో సమానంగా అన్ని రంగాలలోనూ దూసుకుపోవడానికి మార్గంగా నిలిచేది విద్య. ఆ విద్యను ప్రతి స్త్రీ అందుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. కానీనాటితోపోలిస్తే నేడు స్త్రీ అన్ని రంగాలలోనూ ఉన్నత శిఖరాలను అధిరోహిస్తుందనటంలోఅతిశయోక్తిలేదు.
ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఒకప్పుడు ఆడపిల్ల పుడితే పడే రోజులు పోయి “భవిత నీదే బంగారు తల్లి” అనే రోజులు వచ్చాయి.అదిమనందరికీ సంతోషదాయకం.అయితేభారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఏడు దశాబ్దాలు దాటినా ఇప్పటికీ స్త్రీల అక్షరాస్యతాశాతం తక్కువగా ఉండటం బాధాకరం. కర్మాగారాల్లో, హోటళ్లలో, బస్టాండ్లలో, దుకాణాల్లో, సినిమా టాకీసుల్లో, బార్లలో ఎంతోమంది బాలికలు పని మనుషులుగా మగ్గిపోతున్నారు. సంచార జాతుల్లో అయితే బడి ముఖం కూడా చూడని వాళ్ళు ఉన్నారంటే అది ఆలోచించాల్సిన విషయమే.
స్త్రీవిద్య కోసం ఇంత పోరాటం చేసిన తరువాత కూడా చదువుకోనివారు ఉన్నారంటే ప్రతి స్త్రీ ఆలోచించాలి.
అందరూ చదువుకొనేటట్లు ప్రోత్సహించే దిశగా మనం ఇంకాఅడుగులు వేయాల్సిన అవసరమెంతైనా ఉంది.
***