ప్రభుత్వం వారిచ్చిన డబుల్ బెడ్ రూం ఇళ్ళల్లో ఎదురెదురు గా ఉంటున్న లచ్చుమవ్వ, నాగవ్వ ఒకరికొకరు సాయంగా ఉంటారు. నాగవ్వ కొడుకు ఆ ఊళ్ళోనే ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం లో చేరాడు.
“ఓ లచుమవ్వా..నా కొడుక్కి ఉద్దోగం వచ్చింది. నీ కొడుక్కుకూడా సదువైపోయింది గందా! ఉద్దోగంలో జేరమను. నీకు ఏన్నీళ్ళకి సన్నీళ్ళు తోడు అవుద్ది” అన్నది నాగవ్వ… ఆ రాత్రి అన్నాలు తిన్నాక వాకిట్లో గాలి పోసుకుంటూ కూర్చున్న లచ్చుమవ్వతో!
“నేను గదే అంటున్నా ఒదినా.. ఆ అమ్మేమో ఇదేశాలకి పంపిస్తానంటది. మాకెందుకు అయన్నీ..సిన్నోళ్ళం సిన్నగనే ఉండాల అంటే ఆయమ్మి ఇనిపించుకుంటలేదు” అన్నది లచ్చుమవ్వ.
“ఇదేశాలంటే మాటలా..రెక్కాడితే గాని డొక్కాడని ఆళ్ళం మనం! ఆడికెల్లొంచినంక ఆడు నీకు అందుతాడా? ఇప్పటికే ఆయమ్మి ఎక్కువడబ్బు కర్సు పెట్టీ ఈడ్ని సదివించింది. ఆయమ్మ ఏమనుకున్నా..నువ్వైతే ఆ అప్పు తీర్సాలి కదా” అన్నది నాగవ్వ పెద్దరికంతో… అనుభవజ్ఞురాలి లాగా!
“నాకూ అదే బయం. అమ్మగారు ఎంత జెపితె అంతే ఆనికి. ఏమైతదో సూడాలి” అని లచ్చుమవ్వ లోపలికి వెళ్ళిపోయింది.
అప్పుడప్పుడు ఇలా బయట కూర్చుని కష్ట సుఖాలు కలబోసుకుంటూ ఉంటారు వాళ్ళు.
***
లచ్చుమవ్వ భర్త ఎల్లయ్య.
ఇక్కడికి రాక ముందు… వారి కుటుంబం మల్లిక వాళ్ళ ఇంట్లో ఔట్ హౌస్ లో ఉండేవారు. ఎల్లయ్య వాచ్ మన్ లాగాను, లచ్చుమవ్వ ఇంటి పని చేస్తూను ఉండే వాళ్ళు.
ఎల్లయ్య కల్తీ సారా తాగి చచ్చిపోయాడు.
ఎల్లయ్య చనిపోయాక..లచ్చుమవ్వ మల్లిక వాళ్ళ కుటుంబాన్నే అంటిపెట్టుకుని అక్కడే ఔట్ హౌస్ లో ఉన్నది. అన్ని పనులు బాధ్యతగా చేస్తూ మల్లిక ఇంట్లో అందరికి ‘తల్లో నాలుక’ లాగా ఉండేది.
* * *
మల్లిక కొడుకు నీరజ్ టెంత్ క్లాస్..కూతురు పింకీ సెవెంత్ క్లాస్ చదువుతున్నారు.
మల్లిక భర్త అవినాష్ ది టూర్ల ఉద్యోగం. ఇంటివిషయాలకి సంబంధించినంత వరకు అతని భరోసా లేదు. అన్ని విషయాలు మల్లిక ఒంటరిగానే చూసుకునేది.
మల్లికకి లచ్చుమవ్వ సహాయం..సహకారం కొండంత అండగా ఉండేది.
ఆ రోజు…పొరుగూరిలో ఉన్న మల్లిక తండ్రి చనిపోయినట్లు వార్తవచ్చింది.
ఆ టైం లో అవినాష్ క్యాంపులో ఉన్నాడు. పిల్లలకి వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్నాయని మల్లిక తండ్రి దిన కర్మలకి ఒక్కత్తే వెళ్ళింది. పదిహేను రోజులు పిల్లలని లచ్చుమవ్వ మీద భరోసాతో వదిలేసి వెళ్ళింది.
అవినాష్..టూర్ నించి నేరుగా మామగారి ఊరికి వెళ్ళాడు.
మల్లిక లేని సమయంలో పింకీ కి హై ఫీవర్ వచ్చింది. రెండు రోజుల్లో అది న్యుమోనియా అని తేలింది.
“అమ్మా పాపకి జ్వరం వచ్చింది. నేనే మన డాక్టరయ్య కి చూపించాను. ఫరవాలేదు..నేను చూసుకుంటాను. మీరేం కంగారు పడకండి. తొందరపడి రావద్దు. మీ పని చూసుకోండి” అని లచ్చుమవ్వ మల్లికకి ఫోన్ చేసి చెప్పింది.
చిన్నప్పటి నించీ పిల్లలకి అలవాటైన డాక్టరే అవటంతో..లచ్చుమవ్వ ఫోన్ చేసి చెప్పేసరికి ఆయన వచ్చి చూసి మందులు ఇచ్చి..న్యుమోనియా కి చేయించవలసిన టెస్టులన్నీ చేయించి..అవసరమైన మందులు తెప్పించి ఇచ్చారు. నెబ్యులైజర్ పెట్టటం..టైం ప్రకారం యాంటి బయొటిక్ ఇవ్వటం… ఇలా రాత్రింబవళ్ళు పింకీ మంచం పక్కనే కూర్చుని కంటికి రెప్పలా కాపలా కాసింది.
పింకీ జ్వరం తగ్గి..పథ్యం తినేవరకు తను నిద్ర పోలేదు.
***
మల్లిక కొడుకు నీరజ్..లచ్చుమవ్వ కొడుకు వెంకటేశ్ కలిసి ఆడుకునేవారు. వెంకటేశ్ కి తెలియని పాఠాలు నీరజ్ చెబుతూ ఉండేవాడు.
నీరజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదువుతుంటే..వెంకటేశ్ ఆ కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు.
వెంకటేశ్ చదువులో బాగా చురుకుగా ఉండేవాడు.
వెంకటేశ్ టెంత్ పాసయ్యాక…ఇంకా పైకి చదువుకోవాలనుకున్నాడు.
“తండ్రి లేని నిన్ను అమ్మ గారు ఇంత దాకా సదివించారు. ఆళ్ళ మంచితనాన్ని మనం ఎక్కవగా వాడుకోరాదు. చేసిన పనికి జీతం ఇస్తున్నారు. ఇంకా ఎక్కువ ఆశించకూడదు. ఆళ్ళంటే పెద్దింటోళ్ళు. ఎంత పై సదువులైనా సదవగలరు. మనకి ఎట్టా సాగుద్ది? ఆ సూపర్ బజార్ సర్ హెల్పర్స్ కావాలని అడిగిండు. అక్కడ్నే జేరు” అని లచ్చుమవ్వ కొడుకుతో పోరు పెట్టింది.
అతని మార్కులు చూసి మల్లికే చొరవ తీసుకుని..”నువ్వుండు లక్ష్మి..వాడిని నేను చదివిస్తాను. ఆరేళ్ళు కష్టపడితే..మీ జీవితాలు బాగు పడతాయి. ఎల్లకాలం ఇలా కష్టపడి చాకిరీ చేసే ఓపిక నీకు ఉండదు” అని చనువుగా కోప్పడి వెంకటేశ్ ని ఇంటర్మీడియెట్ లో చేర్చింది.
మల్లిక నమ్మకాన్ని వమ్ము చెయ్యకుండా..వెంకటేశ్ మంచి మార్కులతో ఇంటర్ పాస్ అయి..ప్రభుత్వ కాలేజిలో చేరి ఇంజనీరింగ్ కూడా పాస్ అయ్యాడు.
నీరజ్ పై చదువులకి అమెరికా వెళుతుంటే..వెంకటేశ్ ని కూడా వెళ్ళమని మల్లికే ప్రోత్సహించింది.
“తండ్రి లేని ఆడ్ని ఇంత దంక ఆదుకున్నవ్..సదివించినవ్. అమ్మా ఇప్పటికే నీకు చాలా బాకీ పడ్డాను. ఇంక సాలు..ఆడ్ని ఉద్దోగంలో సేరమంటన్నానమ్మా. ఎంత సదివినా ఎప్పుడో ఒకప్పుడు ఉద్దోగంలో సేరాల్సిందే కదా. ఇంక ఎన్నేళ్ళు…నా బారం మీరు మోస్తారు? పెద్దవుతుంటే..రోగాలు అయి వస్తే..మీకు ఇంకా బారమవుతాను” అని లచ్చుమవ్వ ఎంత చెప్పినా మల్లిక వెంకటేశ్ ని అమెరికా పంపించింది.
* * *
మల్లిక పిల్లలు పెద్దయ్యేసరికి చుట్టు పక్కల ఉన్న అన్ని ఇండిపెండెంట్ ఇళ్ళు పడగొట్టి అపార్ట్ మెంట్స్ కట్టేస్తున్నారు. అలాగే మల్లిక వాళ్ళు ఉంటున్న బిల్డింగ్ ప్రాంతంలో కూడా అపార్ట్ మెంట్స్ కట్టారు.
అప్పుడే ప్రభుత్వం… పేద వాళ్ళకి డబుల్ బెడ్ రూం ఇళ్ళు అల్లాట్ చేస్తున్నది. లచ్చుమవ్వ చేత మల్లిక ఆ ఇంటి కోసం అప్లై చేయించింది. లాటరీ లో లచ్చుమవ్వకి ఇల్లు అలాట్ అయింది. ఆ ఇంట్లో ఉండకపోతే ఇల్లు తీసేసుకుంటారని..ఇప్పుడు అక్కడే ఉండి..లచ్చుమవ్వ రోజూ ఉదయమే మల్లిక ఇంటికి పనికి వెళ్ళి రాత్రికి తిరిగి వస్తుంది.
* * *
అమ్మగారు ఎంత ప్రేమగా చూసినా.. వెంకటేశ్ కానీ, లచ్చుమవ్వ కానీ తమ హద్దు దాటి ప్రవర్తించలేదు.
అమెరికాలో వెంకటేశ్ కి న్యూ జెర్సీ లో సీట్ వచ్చింది.
అమ్మగారు ఇప్పటివరకు తనని స్వంత కొడుకు లాగా చూసుకున్నా..ఇంకా భారం కాదల్చుకోక..వెంకటేశ్ ఒక చిన్న ఇల్లు అద్దెకి తీసుకుని.. తన లాంటి వారే నలుగురి ఫ్రెండ్స్ తో కలిసి ఉంటున్నాడు. అవకాశం ఉన్నప్పుడల్లా షాపుల్లోను, హోటల్లోను, పెట్రోల్ బంకు లోను పని చేస్తూ తన ఖర్చులు గడుపుకుంటున్నాడు.
థాంక్స్ గివింగ్ సందర్భంలో తక్కువ రేట్ కి దొరుకుతున్నాయని ఫ్రెండ్స్ అందరూ కొనుక్కుంటుంటే..ఎప్పటి నించో తను కొనుక్కోవాలనుకున్న టీ షర్ట్ కొనుక్కున్నాడు.
ఆ రోజు అది వేసుకుని పనికి వెళ్ళాడు. పెట్రోల్ బంక్ డ్యూటీ ముగించుకుని లేట్ నైట్ రూం కి తిరిగొస్తుంటే..వరస తుపాకీ కాల్పులు వినిపించాయి. పరుగుతో నడుస్తుంటే..స్ట్రీట్ లైట్ లో వెంకటేశ్ వేసుకున్న ఖరీదైన టీ షర్ట్ చూసి..తుపాకీ ఉన్న వ్యక్తి..వెంకటేశ్ ని డబ్బు, వాచ్ ఇమ్మని లాక్కున్నాడు. షర్ట్ కూడా తియ్యమని తుపాకీ గురి పెట్టాడు.
ఒక పక్క ఎముకలు కొరికే చలి..అయినా వెంకటేశ్ కి భయంతో కాళ్ళు వణుకుతున్నాయి. నోరు తడారిపోతోంది. పిడచకట్టిన నాలుకతో…నోరు తెరిచి ఏదో చెప్పే లోపే తుపాకీ గుండు తల్లోంచి దూసుకెళ్ళింది. వెంకటేశ్ నేలకొరిగాడు.
పోలీసులొచ్చి వాళ్ళ ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసి..వెంకటేశ్ ప్యాంట్ జేబులో ఉన్న పేపర్ల ఆధారంతో అతని రూమ్మేట్స్ కి మెసేజి ఇచ్చారు.
* * *
వెంకటేశ్ గురించిన కబురు తెలిసిన నీరజ్ …తల్లికి ఫోన్ చేసి చెప్పాడు.
లచ్చుమవ్వ జీవితంలో వచ్చిన అన్ని ఒడుదుడుకులకి పరిష్కారం వెతకగలిగిన మల్లికకి ఇప్పుడు ఏం చెయ్యాలో పాలు పోలేదు.
నీరజ్ దగ్గర నించి ఫోన్ రాగానే..మల్లిక లచ్చుమవ్వ ఇంటికి వెళ్ళింది.
ఆ రోజు లచ్చుమవ్వ కొంచెం నలతగా ఉండి… సాయంత్రం త్వరగా ఇంటికెళ్ళిపోయింది.
అసలు ఆ వార్త ఆమెకి ఎలా చెప్పాలో కూడా పాలుపోలేదు..మల్లికకి.
హఠాత్తుగా తనింటికి వచ్చిన అమ్మగారిని చూసేసరికి లచ్చుమవ్వ మనసు కీడు శంకించింది.
మల్లిక లచ్చుమవ్వని జాగ్రత్తగా పొదివి పట్టుకుని..”లక్ష్మీ కూర్చో. కంగారు పడకు” అని నెమ్మదిగా విషయం చెప్పింది.
అమ్మగారి మాట వినగానే..లచ్చుమవ్వ గుండె పగిలినంత పని అయింది.
రెండు చేతులతో నుదుటి మీద కొట్టుకుంటూ…
“ఓరి దేవుడో నేనేం జేతురా? ఉన్న ఒక్క కొడుకు నన్నిడిసి పాయెనే! తండ్రి జూస్తే..తాగి తాగి అట్ల జచ్చె. కొడుకు జూస్తె ఇట్టాయె. నాకేది దిక్కు. నాయన లేనోణ్ణి ఇంత దంక సాదిన. ఇప్పుడెట్ల బతికేది దేవుడో”..
“ఎల్లి రెండేళ్ళవుతుంది. బిడ్డని చూడక బెంగ అయితదంటే వచ్చే నెలలో వస్తనన్నడు. ఇంక ఆరునెల్లైతే ఆని సదువు అయిపోతుంది. ఉద్దోగంలో చేరతనన్నడు. ఎప్పుడు అడిగినా..కొంచెముండు. నిన్ను తీస్కపోత నంటడు.”
“ఇప్పుడు ఆడే పాయె. ఆడు సంపాదించి.. అమ్మ గారి బాకీ తీరుస్తనన్నడు. ఇప్పుడు అప్పెట్ల తీర్పాలె? నేనెట్ల బతకాలె?” అని లచ్చుమవ్వ తల కొట్టుకుంది.
“మనిషి పోయి ఏడుస్తుంటే..బాకీ అంటావేంటి లక్ష్మీ” అంది మల్లిక.
“వాని సదువుకి నువ్వు కర్సు పెట్టిన సొమ్మంతా..లెక్క రాస్తున్నడమ్మా. ఉద్దోగంలో జేరినంక..నీ అప్పు తీర్సినంకనే పెండ్లి జేసుకుంటనంటడు. ‘నాకు సావు కాలానికి లావు దుక్కమచ్చె! నా కట్టం ఎవరికి రావొద్దు” అని తన ధోరణిలో తను ఏడుస్తూ మాట్లాడుతోంది.
కాసేపు ఏడవనిస్తే.. గుండెల్లో బరువు, కడుపులో బాధ తీరుతుందని..లక్ష్మి వీపు నిమురుతూ కూర్చుంది మల్లిక.
“మా బస్తిలొ ఆళ్ళంతా..ఆడిని ఇక్కడ్నే ఉద్దోగంలో జేరమను అని సెబుతుంటే..నీ మాటతోని ఆడు అమ్రికా పోయిండు. నువ్వైతే మా గురించి మంచిగనె ఆలోచించినావ్. నాకు ఉన్న ఒక్క ఆదారం పాయె! మరి నేనేం జేసి నీ బాకీ తీర్సాలె” అని లచ్చుమవ్వ గుండెలు పగిలేలా.. కంటికి మంటికి ఏక ధారగా ఏడుస్తోంది.
“ఊరుకో లక్ష్మి..నువ్వు నాకేం బాకీ లేవు. కొడుకు పోయిన బాధ కంటే..నా బాకీ ఎలా తీర్చాలని ఆలోచిస్తావేంటి?”
“నిజానికి నేనే నీకు బాకీ పడ్డాను. పిల్లలని నీ మీద వదిలేసి ఎన్ని సార్లు ఊరు పోలేదు? నీ కొడుక్కంటే ఎక్కువగా వాళ్ళని చూసుకున్నావ్. పాపకి జెరమొచ్చినప్పుడు.. నిద్ర పోకుండా ఎంత జాగ్రత్తగా చూసుకున్నావ్? అప్పుడు నువ్వు అలా కాపాడక పోతే..పాప మాకు దక్కేదేనా?”
“నీది నాది పూర్వ జన్మ బంధం అయ్యుంటుంది. నాకు అవసరమైనప్పుడు నువ్వు సాయం జేశావు. నీ ఋణం ఎప్పుడో తీరిపోయింది. మమ్మల్ని పరాయి వాళ్ళని చెయ్యకు. పోయిన వెంకటేశ్ నీకే కాదు..నాకూ కొడుకు లాంటి వాడే! నాకూ బాధ ఉంది” అన్నది మల్లిక.
ఇంతలో.. అక్కడ జరుగుతున్న హడావుడికి ఆ బస్తిలో వాళ్ళంతా గుంపుగా వచ్చారు. నాగవ్వ..జరిగిందంతా విని “అయ్యో లచ్చుమవ్వా..నీకు ఎంత కస్టమొచ్చెనే? కొడుకు గురించి అడిగితే..ఇదిగో అస్తడు..అదిగో అస్తడు అని చెప్ప బడితివి. ఇంతలో ఇట్లాయెనా” అని ఏడుస్తూ లచ్చుమవ్వని కావిలించుకుని పెద్దగా శోకాలు పెట్టటం మొదలు పెట్టింది.
“ఊరుకో అమ్మా. ఆమెని ఓదార్చాలె కానీ..నువ్వు కూడా అట్ల శోకాలు పెడితే..ఆమె కష్టం తీరుతుందా. అక్కడికి ఎంత మంది వెళ్ళట్లేదు? అందరికీ ఇలానే అవదు. మన దురదృష్టం” అన్నది మల్లిక.
“ఇగో ఈ అమ్మనె ఆడ్ని దూరం పంపించింది. ఇక్కడ్నే ఉద్దోగం జేసుకుంటే కంటి ముందే ఉండెటోడు. ఆడికి పోబట్టె సివరి సూపు గూడ దక్కలె! ఉన్న ఒక్క కొడుకూ పాయె. పోయినోన్ని తెచ్చిస్తదా” అని మల్లికని చూస్తూ లచ్చుమవ్వ భుజం మీద చెయ్యేసింది.
“ఇగ ఊకొ నాగవ్వా. ఇంత దంక మాకు అన్నీ ఆ అమ్మనె జూసింది. ఎప్పటి రునమో ఏమో! ఇప్పుడు కొడుకు జచ్చిండని అమ్మని తప్పు మాట అనొద్దు. ఆమేం జేసింది? ఆమె కొడుకు కూడా అక్కడ్నె ఉన్నడు గద. నా గతి ఇట్ట అయింది” అన్నది లచ్చుమవ్వ సంబాళించుకుని.
కాసేపు కూర్చుని బస్తి వాళ్ళంతా ఒక్కొక్కరే వెళ్ళిపోయారు.
లచ్చుమవ్వ లోపలికి వెళ్ళి కొడుకు ఫొటో తెచ్చి దాని వంక చూస్తూ మళ్ళీ ఏడుపు అందుకుంది.
“కాసిని నీళ్ళు తాగు లక్ష్మీ” అని గ్లాసుతో మంచి నీళ్ళిచ్చింది మల్లిక.
“ఊరుకో..పోయిన వాళ్ళతో మనమూ పోము లక్ష్మీ. నీకు, నాకు వాడితో ఎన్నాళ్ళు ఋణమో అది తీరిపోయింది. లే..లే ముఖం కడుక్కో”
“పద మనింటికి బోదాం. ముందే ఈ రోజు జ్వరమని త్వరగా వచ్చావు. పింకీ నీ కోసం ఎదురు చూస్తోంది. తరువాత ఏం చెయ్యాలో చూద్దాం. అక్కడుండే మన వాళ్ళ సాయంతో..నీరజ్ బాబు అక్కడ పనులు చూస్తాడు. లే..లేచి బట్టలు తీసుకో. ఇక నించి అక్కడే మాతో ఉందువు గాని.” అని లచ్చుమవ్వని బయలుదేరదీసింది.
దారిలో పింకీకి ఫోన్ చేసి..”లక్ష్మిని మనింటికి తీసుకొచ్చేస్తున్నాను. ఇక్కడ ఉంటే వచ్చే పోయే వాళ్ళ పరామర్శలతో దాని పరిస్థితి ఇంకా క్షీణిస్తుంది” అన్నది.
కారులో కూర్చున్న మల్లికకి ..అమెరికాలో రోడ్ యాక్సిడెంట్ లో చనిపోయిన తన ఫ్రెండ్ ఏకైక కొడుకు గుర్తొచ్చి కళ్ళల్లో నీరు కదలాడింది.
పిల్లల మరణం ఎవ్వరికైనా మానని గాయమే! కంటి ఎదురుకుండా జరిగితే అదొక రకం.
ఎన్నో ఆశలతో పిల్లలు పై చదువులకి అమెరికా వెళతామంటే..తల్లిదండ్రులు పిల్లల పట్ల తమ ప్రేమని మనసులో అణిచేసుకుని.. తమ శక్తికి మించి అప్పులు చేసి.. అంతంత దూరాలు పంపిస్తారు. విదేశాలకి వెళ్ళి నాలుగైదు సంవత్సరాలకి ఒక సారి మాత్రమే స్వదేశానికి వచ్చి తల్లిదండ్రులని చూసే పిల్లల ఎడబాటు తల్లిదండ్రులకి చాలా బాధాకరం.
* * *
లచ్చుమవ్వ కుటుంబాన్ని తన స్వంత మనుషుల్లాగా చూసుకున్న మల్లికకి…లచ్చుమవ్వ బాకీ పడిందా?
మల్లిక పిల్లలని కంటికి రెప్పలాగా కాపాడిన లచ్చుమవ్వకి…మల్లిక బాకీ పడిందా?
ఇంతకీ ఎవరు ఎవరికి బాకీ?
తప్పెవరిది?
చదువు పేరు చెప్పి తనకున్న ఒక్క కొడుకుని అంత దూరం పంపి..తనకి కాకుండా చేసిన అమ్మగారు తప్పు చేసిందా?
శ్రామిక జీవనం గడుపుతున్న శాపగ్రస్తులని మంచి మనసుతో బాగుచెయ్యాలనుకున్న మల్లిక..తన వల్ల లచ్చుమవ్వకి కలిగిన శాశ్వత నష్టాన్ని తల్చుకోకుండా ఉండగలదా?
కాలమే నిర్ణయించాలి.
ఎన్నో ఆశలతో విదేశాలకి వెళ్ళే పిల్లలు ఇలా శవాలై వస్తే..తల్లిదండ్రులు పడే బాధ వర్ణనాతీతం.
అలాంటి వారికి ఈ కథ అంకితం.