తెలుగు సాహితీక్షేత్రంలో విరిసిన సుగంధ కుసుమం

సాహితీ వ్యాసం

‘  హితేన సహితం సాహిత్యం’ అంటే మేలును చేకూర్చేది సాహిత్యం అని అర్థం . ఒక జాతి సంస్కృతికి లిఖితపూర్వక ఆధారం . భాషా పరిణామాన్ని తెలియజెప్పే సాధనం .

వెయ్యేళ్ల చరిత్ర కలిగి   ఆధ్యాత్మికంగాగానీ , సామాజికంగా గానీ , నవరసాలలోగానీ , చైతన్య పరిచే విషయంలోగానీ జాతి గర్వించగలిగే స్థాయిలో విశేషమై వెలుగొందుతోంది తెలుగు సాహిత్యం.

     నాయని కృష్ణకుమారి

‘తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది’అంటూ తెలుగు జాతి వైభవాన్ని, అందులోని మకరందాన్ని  మనకందించిన ఎంతోమంది మహనీయులను  ఉటంకిస్తూ సి. నారాయణరెడ్డి గారు మనకందించిన పాట భా షాప్రియులను ఎంతగా అలరించిందో అందరికీ తెలిసిందే.

తెలుగు భాష మకరందాన్ని గ్రోలి భాషావికాసానికి బాటలు వేసినవారు మరెందరో . అటువంటి ప్రముఖ రచయిత లలో ఒకరైన విదుషీమణి, కథ కవిత నవల విమర్శ వంటి పలు ప్రక్రియలలో తమదైన ముద్ర వేసిన  శ్రీమతి  నాయని కృష్ణ కుమారి గారి గురించి ఈరోజు తెలుసుకుందాం.

1930 మార్చి 14న గుంటూరు జిల్లాలో హనుమాయమ్మ సుబ్బారావు దంపతుల తొలి ఫలంగా జన్మించారు . వీరికి ఒక తమ్ముడు, ముగ్గురు చెల్లెళ్ళు ఉన్నారు.

ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు చక్కని సాహితీపోషకులు , కవి అయిన వీరి తండ్రిగారు తరచుగా నిర్వహించే సాహితీసభలతో వీరి ఇల్లు సాహిత్యానికి పుట్టినిల్లుగా ఉండేది. కృష్ణశాస్త్రి , విశ్వనాథ సత్యనారాయణ, అడవి బాపిరాజు, శివ శంకర శాస్త్రి వంటి పలువురు సాహితీ దిగజాలతో నడిచే ఆ సభలు క్రమం తప్పకుండా వింటూ ఉండడం కృష్ణకుమారిగారిలో సాహితీకాంక్ష మొగ్గ తొడగడమే కాకుండా వేదికలెక్కి అనర్గళంగా ఉపన్యసించే స్థాయికి చేర్చాయి.

నరసరావుపేట, శ్రీకాకుళం లలో ప్రాథమిక విద్యను, గుంటూరులో కాలేజీ విద్యను పూర్తి చేసి, 1948 వ సంవత్సరంలో ఎం.ఏ. తెలుగు చేయడానికి విశాఖపట్నం వెళ్లారు. ఆ సమయంలో పలువురు సాహితీవేత్తల పరిచయం మరియు వారితో జరిపే చర్చలు కృష్ణకుమారి గారిలోని సాహితీ దాహాన్ని తీర్చడానికి తోడ్పడ్డాయి.

‘ పూవు పుట్టగానే పరిమళించింది ‘ అన్నట్టుగా ఏడవ తరగతి చదివే రోజుల్లోనే  “రంగైన ఒక పూవు కంటికేమింపు హంగు మీర మాలలల్లితే సొంపు” అనే పాటను రచించారు.

బి. ఏ. చదివే రోజుల్లో (18 ఏళ్ల వయసులో ఉండగా) తరగతి గదిలో రాసుకున్న నోట్స్ ఆధారంగా ‘ఆంధ్రుల కథ ‘ అనే పుస్తకాన్ని వ్రాశారు. ఈ పుస్తకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠ్యాంశంగా స్వీకరించింది.

1954 వ సంవత్సరంలో సమీప బంధువు, న్యాయవాది అయిన కనకపల్లి మధుసూధన రావు గారిని వివాహమాడి ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు.

సాహితీ సభలు, నాటకాలలో విశేషంగా పాల్గొంటూ తమ సాహితీ కృషికి బలమైన పునాదులు వేసుకున్నారు.   ‘ తిక్కన కవితా వైభవం’ మీద  పి.హెచ్డి. మొదలుపెట్టినప్పటికీ పూర్తి చేయలేకపోయారు.
1951లో మద్రాసులోని మహిళా కళాశాలలో అధ్యాపకురాలిగా ప్రారంభమైన వీరి వృత్తి జీవితం 1952లో ఉస్మానియా విశ్వవిద్యాలయ మహిళా కళాశాలలో అధ్యాపకురాలుగా రీడర్గా మరియు ప్రొఫెసర్ గా, 1983 – 84 అవసరానికి గాను తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయానికి ప్రిన్సిపల్ గా తదుపరి ఉస్మానియా విశ్వవిద్యాలయ తెలుగు శాఖాధిపతిగా సేవలందించారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్ పర్సన్ గా మూడేళ్ల పాటు కొనసాగి 1990లో పదవీ విరమణ చేశారు. 1996 – 1999 మూడు సంవత్సరాల పాటు హైదరాబాదులోని శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపకులపతిగా సేవలందించారు.

భర్త మధుసూదనరావు, మిత్రులు అయిన అంతటి నరసింహం గారల ప్రోత్సాహంతో 1969 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి జానపద సాహిత్యంలో పీహెచ్డీ పట్టా పొందారు. 1977లో  ‘జానపద గేయ గాథలు’ అనే శీర్షికతో తన సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించారు. ఆ తర్వాత వారు తమ  దృష్టినంతా జానపద సాహిత్యంపై కేంద్రీకరించారు.

జానపద సాహిత్యం అనేది పాఠశాలలో గానీ, లలిత కళల అధ్యయనంలోగానీ సాధ్యపడే విషయం కాదనీ మౌఖిక సూచన లేదా ప్రదర్శన ద్వారా ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి, ఒక తరం నుండి మరొక తరానికి విస్తరించబడుతుందని అన్నారు.

జానపద సాహిత్యం గురించి తెలుసుకోవాలంటే ఇంట్లోగానీ , గ్రంథాలయంలోగానీ పుస్తకాలు చదువుతూ ఉంటే సాధ్యమయ్యే విషయం కాదనీ, జానపదుల గుండె లోతుల్లోంచి వచ్చిన  అనుభవసారాన్ని క్షేత్రస్థాయిలో ఆపోసన పడితేనే అది సిసలైన జానపద సాహిత్యం అవుతుందని చెప్పారు.

ఊరూరా తిరుగుతూ జానపదులను కలిసి వారి గాధలు, కథలు సేకరించి ‘నల్లగొండ జిల్లా ఉయ్యాల పాట లు ‘ ను సమీక్షించారు. బిరుదు రాజు రామ రాజు గారితో కలిసి ‘జానపద గేయాలు సాంఘిక చరిత్ర’ రచించారు.

ఒకవైపు జానపద సాహిత్యంపై కృషి చేస్తూనే మరోవైపు సృజనాత్మక రచనను కొనసాగించారు. ప్రముఖ కవయిత్రులైన తురగా జానకీరాణి, వాసిరెడ్డి సుజాత, ఆనందరామం లతో కలిసి ‘అపరాజిత’ అనే నవలను రచించారు. ఆంధ్ర ప్రదేశ్ సాహిత్య అకాడమీ వారి కోసం ‘ జైమినీ భారతం ‘ , ‘శృంగార శాకుంతలం ‘ గ్రంథాలకు సంపాదకత్వం వహించారు.

పాశ్చాత్య విమర్శనా గ్రంథాల్లోని అంతర్లీన తత్వాన్ని గ్రహించి దానికి తెలుగు జానపద శైలిని పరస్పర అనుసంధానం చేయడం , గణిత శాస్త్రం నుండి సరళరేఖ సమీకరణాన్ని జానపద సాహిత్యంలో కథ చెప్పే పద్ధతులకు వర్తింపజేయడం అనే రెండు కొత్త కోణాలను వీరి రచనల్లోని సరికొత్త ఆవిష్కరణలుగా చెప్పవచ్చు.

అగ్నిపుత్రి, ఏం చెప్పను నేస్తం, మనం మన పూర్వీకులు, తెలుగు భాషా చరిత్ర, ఆయత పరిశీలన, పరిశోధన, తెలుగు జానపద విజ్ఞానం, కాశ్మీర దీపకళిక,

కథల కడలి, కథాసరిత్సాగరం,

మెకంజీ కైఫియాట్స్ వంటి అద్భుతమైన రచనలు చేశారు.

విద్యార్థుల బృందంతో కలిసి కాశ్మీర్ పర్యటించినప్పుడు కాశ్మీర్ లోయ అందాలకు పరవశించి రచించిన ‘కాశ్మీర దీప కళిక ‘  రచించారు . ఈ పుస్తకం లోని రచనాశైలి తెలుగు సాహిత్యంలో  ప్రత్యేకమైనదిగా పరిగణించబడుతుంది.

తోరు దత్, ఆంధ్రప్రదేశ్ జానపద సాహిత్యం వంటి వాటిని ఆంగ్లం నుండి తెలుగులోకి అనువదించి అనువాదంలో కూడా తమ ప్రతిభను బహిర్గతం చేశారు.

వీరు పొందిన అవార్డులు:

గృహలక్ష్మి స్వర్ణకంకణం

ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఉత్తమ మహిళా రచయిత్రి

పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుండి ఉత్తమ రచయిత్రి

ఉత్తమ సాహిత్యంలో మహిళా విభాగానికి గాను పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అవార్డు

అసోచామ్ లేడీస్ లీగ్,  హైదరాబాద్ ఉమెన్ ఆఫ్ ద డి కేడ్ అచీవర్స అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ లిటరేచర్

భాషా వికాసానికి ఎనలేని సేవ చేసి , పలు పదవులకు వన్నె తెచ్చి, అందరి మన్ననలు, ఆదరాభిమానాలు చూరగొన్నప్పటికీ ఎటువంటి భేషజాలకూ లోనుకాకుండా నిరాడంబరంగా  , ప్రశాంతంగా జీవితాన్ని గడిపి 29 జనవరి 2016 లో వారి 85 వ ఏట తుది శ్వాస విడిచారు. నాయని కృష్ణకుమారి గారిని స్మరిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను

పద్మశ్రీ చెన్నోజ్వల

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సావిత్రి

అన్నాచాందీ