కాలబింబం

కవిత

విశ్వం గుప్పిట్లో ఒదిగిన
పగలు రాత్రుల తండ్లాటల్లా
చివరి సాలు మొత్తం
అద్దం లో అనంతంగా కనిపించేది
కాలనాళికలు బతుకు కవనబిందువు
నేనన్నది

గాలి తేమని పీల్చిన లవణాలు
తడి పీల్చని ఆమ్లాలు
మట్టి మౌనం తీరులా మనిషి గుణగణాలను ఉపమిస్తున్నాయి

ధమనుల నడక విన్యాసాలు
గుండె లయల గమకాలు
ఒక్కటేమిటి
రాలిన ఎన్ని క్షణాలకు ఉదాహరణ లో
నిగ్గదీసిన ప్రతి సారి
గతంలోకి వెళ్ళిన మనసు
చెదపుట్టల ఆలోచనలు
గడియారపు గుసగుసలు తెలిపి పోతున్నవి
ఎవరెన్ని చెప్పినా
నిన్నకు నేటికీ వెలుగునీడల తాళ్ళను కట్టి
విధివిధానాల తూకాలు మొత్తం
నీ రక్త కణాల బరువుకు విలువ కట్టి
పసిడి ప్రతిమలా మనస్సూ
సుజలాలవుతు కళ్ళూ
ఈ మెటీరియలస్టిక్ ప్రపంచంలో
ఇమ్మెటీరియల్
ఓ జారవిడువని భావనా కథనం
దాటిన సరదాలను
దాటాల్సిన బాధ్యతలను
మోస్తున్న ప్రతిసారి
బతకటానికి తినడం
తినడానికి బతకడం
అవసరాలే భావకామన లైనప్పుడు
మడతమాటల దెప్పుళ్ళూ
సూటిదనపు మెప్పులూ
ఒక్క దారిలో రెండు నడకలు
డిప్లమసీ నేర్చిన చెవులు రిక్కబొడిచి
అంతరంగపు అల్లకల్లోలాలు
అనురాగ స్రవంతులూ
ఒక్క హృదినుండే
జీవిత సూత్రంగా చీల్చిన అనుభూతులన్నీ పక్కకు పెట్టి
నీవు విడిచిన బతుకు ఘడియలు
నీ వెనుకే పయనిస్తాయి
నీలోకి నీవు గ్రహగతులలా ఉన్నప్పుడు
నీవే నింగి నీవే నేల
కాలబింబంలో ఇక మనసు ముక్కలను చూడాలి

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

కామం లేని ప్రేమ కోసం

దొరసాని