ఏ ఘడియలో జీవితం
హరివిల్లై బంధాలను చుట్టుకుందో
అప్పటినుండి లేచింది మొదలు
పరుగులతోనే ప్రారంభమవుతుంటే
తనకంటూ మిగలని కాలం
ఎప్పుడైనా తన ముంగిట
వాలుతుందని ఎదురుచూపు
రాజీ పడలేని వంటగదిలోనో
బాధ్యతల చట్రంలో బంధీగానో
తనవారిని తీర్చి దిద్దటంలోనో
భావితరాల భవిష్యత్తుకై
ప్రణాళికలు సిద్ధం చేస్తూనో
అందరి ఆరోగ్యం కోసం
కొంతైనా ఆరాటపడుతూ
స్వయానికై ఏ కొంచమైనా
మిగుల్చుకోని అసహాయత
గాయమెప్పుడూ పాతదే
తన సంతకం లేని
ఏ పనీ పూర్తవక పోతుంటే
తన చీకటిని మరుగున పెట్టి
ఉక్కిరి బిక్కిరి అవుతున్న అలసటతో
వెలుగులు పంచే మిణుగురై
నిదురరాని ఏ జాము రాతిరో
ఏకాకి గీతం ఆలపిస్తుంది
అంతరిక్షాన్ని శ్వాసించినా
మాటల మత్తు జల్లుతుంటే
దేహం ఎంత వడలినా
కాళ్లకు గిరికీలు కట్టుకొని
గడియారంతో పోటీపడుతున్నా
అణిచివేతల పర్వంలో
దిక్కులన్నీ ద్వితీయ అంటుంటే
రాజుకోని ఆశల కుంపటిలో
ముద్రను మౌనంగానే
సహిస్తుంది
అప్పుడప్పుడూ గాలి
దిశను మార్చుకొని స్వాంతన పరుస్తుంటే
విశ్రాంతికై ఉవ్విళ్లూరుతూనే
కనీసం ఒక్కరోజైనా కనికరించి
తన కోసం మిగల్చమని
కాలాన్ని వేడుకుంటుంది మనసు