ఇదేనా న్యాయం

కథ

అరుణ ధూళిపాళ

అపాయిమెంట్ లెటర్ అందుకుంది ఆరోజు పవిత్ర. వణుకుతున్న చేతులతో లెటర్ పట్టుకొని నీటికుండలుగా మారిన కళ్ళతో అక్షరాలను కూడబలుక్కుంటూ చదివింది. మరణించిన భర్త ఉద్యోగాన్ని తనకు కేటాయిస్తూ ప్రభుత్వం నుండి వచ్చిన నియామక ఉత్తర్వు.

పొంగుకొస్తున్న ఉద్వేగంతో వెక్కి వెక్కి ఏడ్చింది. నాల్గు రోజుల్లో జాయిన్ అవ్వాలి ఉద్యోగంలో. సంవత్సర కాలంగా అనుభవించిన బాధకు ఇవ్వాళ్ళటికైనా విముక్తి  దొరికిందని తనను తాను సంబాళించుకుంది. బ్రాహ్మణ కుటుంబంలో పుట్టిన ఆమెకు సంప్రదాయాలే తప్ప బయటి వ్యవహారాలు తెలియవు.

వెంటనే హు..అని భారంగా నిట్టూర్చింది. ఇది విముక్తి ఎందుకవుతుంది? తన నుదుటన భగవంతుడు గీసిన కొత్త శాసనం. దీన్ని ఏ విధంగా అమలుచేయ

గలుగుతుందో, ఎంతవరకు న్యాయం చేస్తుందో తనకు తెలియదు. అడుగుపెట్టబోతున్నది కోర్టులో. ఏరోజూ

బయట ప్రపంచంలో చిన్న వస్తువు కూడా కొనడం తెలియదు. కానీ ఈరోజు బయటకు వెళ్లకుండా గడవదు.

పరుగెత్తుకుంటూ తన దగ్గరికి వచ్చిన ఇద్దరు కొడుకులను దగ్గరికి తీసుకుంది. పెద్దవాడికి పన్నెండేళ్ళు, చిన్నవాడికి పదేళ్లు ఉంటాయి అంతే. అప్పటివరకు తల్లిగారింట్లో ఉంటున్న పవిత్ర, తల్లిని తోడుగా తీసుకొని ఇద్దరు పిల్లలతో రెండురోజుల తర్వాత అయోమయంగా బయట అడుగుపెట్టింది. తలపై కొత్తబరువును మోయడానికి రేపటికోసం సిద్ధంగా.

                            *********

పవిత్ర పదవతరగతి చదువుతుండగా తండ్రి చనిపోయాడు. తెలుగు పండితునిగా సర్వీసులో ఉండగా చనిపోయినందుకు ఆమె అన్నకు ఆ కొలువు ఇచ్చారు. పవిత్ర తర్వాత ఒక చెల్లి. ఇద్దరు చెల్లెళ్లను, తల్లిని, భార్యను, చేతిలో ఒక పసివానితో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించాడు పవిత్ర అన్నయ్య.

ఇంటర్ మొదటి సంవత్సరం పూర్తయిన వేసవి సెలవుల్లో మేనమామ ఇంటికి పెళ్లికి వెళ్లారు పవిత్ర వాళ్ళు. అక్కడ ఎవరో తెలిసిన బంధువులు పవిత్రని చూడడం, చేసుకుంటామని చెప్పడం, అదే పందిట్లో వారం రోజుల్లో పెళ్లి, వరుసగా ఆమె ప్రమేయం లేకుండా, ఇష్టాయిష్టాలతో పనిలేకుండా జరిగిపోయాయి.

ఇంకో ఏడాది చదువు ఉండడంతో అది పూర్తయ్యాక, తొమ్మిదిమంది సంతానం ఉన్న ఉమ్మడి కుటుంబంలో పెద్దకోడలుగా పవిత్ర అత్తవారింట  అడుగుపెట్టింది. వీళ్ళే కాక భర్త నాయనమ్మ , కాలం కలిసిరాక వీళ్ళింట్లోనే జీవితాలను వెళ్లదీస్తున్న ఆయన ఇద్దరు మేనత్తలతో ఇల్లంతా జనారణ్యంలాగా ఉంది. ఉదయం నుండీ రాత్రివరకు నడుము వాల్చకుండా పనులు. మడి, ఆచారాలు, చిన్న పిల్లలైన మరుదులు, ఆడపడుచులు, అందరికీ సేవలు చేయడం ఆమెకు సహన పరీక్ష.

పని అంటే ఎలా ఉంటుందో తల్లిగారింట్లో పవిత్రకు తెలియదు. ఆత్మాభిమానం ఎక్కువ. ఎవ్వరు ఏ మాట అన్నా తట్టుకునేది కాదు. అలిగి తిండి తినడం మానేసేది. వాటన్నిటినీ తాళి బంధం ఒక్క వేటుతో

ఖండించింది. పదిహేడు ఏళ్ల అమ్మాయి పెద్దకోడలనే పదవితో బరువును నెత్తిన వేసుకుంది.

                            ***********

అత్తగారింట్లో ఎన్ని ఇబ్బందులనైనా, అవి ఏ మాత్రం నచ్చకపోయినా, ఆత్మాభిమానాన్ని వదులుకొని ఆడవాళ్లు ఎందుకంత సహనంగా వాటిని సర్దుబాటు చేసుకుంటూ బతుకుతారు? వ్యతిరిక్తత వల్ల ఇంకా కష్టాలు ఎక్కువవుతాయనా? పుట్టింటి గౌరవం పోతుందనా? అత్తింటివారిని ఎవరైనా తప్పు పడతారనా? ఈ ప్రశ్నలు ఏ ఆడవాళ్ళని అడిగినా సమాధానం ఒకటే “ఏం చేస్తాను? నా జీవితానికి ఇంతే రాసిపెట్టుందేమో? ఏ జన్మలో ఏ పాపం చేశానో?” అంటూ వైరాగ్యభావనతో కూడిన నిట్టూర్పులు.

పవిత్ర కూడా సగటు ఆడవారిలాగానే ఆలోచించింది. తన ‘కర్మ’ అని సరిపెట్టుకుంది. ఇంటెడు చాకిరీ చేసేది. ఇది తన కుటుంబమనే భావనతో మమకారం పెంచుకుంది. ఇంతమంది ఉన్న ఇంట్లో భర్త మాత్రం వేరొక చోట ఉద్యోగం చేస్తూ వారానికి, పదిహేను రోజులకు ఒకసారి వచ్చి వెళ్తుండేవాడు. “నువ్వున్న చోటికే నేనూ వస్తాన”ని అతనితో పోరాడలేదు ఇంట్లో

వాళ్ళెవ్వరూ భర్త ఉన్న చోట ఆ అమ్మాయి ఉండడం న్యాయమని పంపించలేదు.  ఆయన లేకుండా వీళ్ళందరికీ నేనెందుకు సపర్యలు చేయాలని ఒక్క క్షణం కూడా పవిత్ర తన మనసులో ఆలోచించలేదు.

కాలమెంత విలువైందో, జీవితం ఎందుకిట్లా కొనసాగుతుందో తెలియకుండా ఆరేళ్లు గడిచిపోయి, ఇద్దరు మగపిల్లలకు తల్లి అయింది. కుటుంబంలో కొన్ని కొన్ని బాధ్యతలు తీరాయి. ఇకముందు జీవితం అంతా బాగుంటుందనుకున్న సమయంలో భర్త హఠాత్తుగా మరణించడంతో పిల్లి కూనలా ఇల్లిల్లు తిరిగింది. అత్తింటివారి నిరాదరణకు గురైంది. అమ్మగారింట్లో ఇద్దరు పిల్లలతో కలిపి ముగ్గురి జీవితాలను ఎన్ని రోజులు ఆదరించగలరు?  

ఆస్తులు ఏవీ లేవు. పిల్లలను ఎక్కడ చదివించాలో అర్థం కాలేదు. భర్త తదనంతరం తనకు రావాల్సిన ఉద్యోగం కోసం, పెన్షన్ కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరిగీ తిరిగీ కాళ్ళు అరిగిపోయాయి. ఒక సంవత్సరం తర్వాత ఆ ప్రయత్నం ఫలించి ఉద్యోగం వచ్చింది.

********

మొదటి రోజు ఉద్యోగంలో చేరడానికి దేవునికి దండం పెట్టుకొని బయలుదేరింది పవిత్ర. బిక్కుబిక్కుమంటూ కోర్టు లోపల అడుగుపెట్టింది. భర్త ఎక్కువగా చదువుకోకపోవడం వల్ల ప్రాసెస్ సర్వర్ గా చేసేవాడు. ఆయనది తక్కువ స్థాయి ఉద్యోగం కావడం పవిత్ర కూడా ఇంటర్ వరకే చదవడం వల్ల ఆమెను అటెండర్ గా అపాయింట్ చేశారు.

ఆ స్థాయిలో చేయాల్సిన పనులు ఏవై ఉంటాయా అని ఆలోచిస్తూ నాల్గు రోజులుగా సతమతమవుతున్నది. కోర్టు గేటు లోపల కాలు పెట్టగానే భర్త చేసింది అక్కడే కాబట్టి గుండె చిక్కబట్టుకొని బయటకు వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ లోపలికి వెళ్ళింది.

అక్కడ ఒక సీటులో కనిపించిన వ్యక్తికి విషయం చెప్పింది. అతను ‘ఒక్క నిముషం’ అంటూ మరెవరికో చెప్పాడు. అట్లా ఒక గంట గడిచింది. పిచ్చిదానిలా అటూ ఇటూ చూడసాగింది. ఎవరెవరో వస్తున్నారు, పోతున్నారు. కోర్టు అంతా రకరకాల కేసులతో వచ్చిన వాళ్ళతో క్రిక్కిరిసిగా ఉంది. ఓ మూలన భయంగా నిల్చుంది.

ఇంతలో ఒక వ్యక్తి వచ్చి “సార్ నిన్ను బంగ్లాకి పొమ్మన్నాడు” అని చెప్పాడు. ‘బంగ్లానా?’ షాకై చూసింది. “అవును బంగ్లానే ! కోర్టుకు ఎనకాల ఉంటుంది వెళ్లు” చిరాగ్గా చెప్పాడు.

శరీరంలోని బలం అంతా ఎవరో బలవంతంగా ఈడ్చుకుపోయినట్టయింది. కాళ్ళను స్వాధీనంలోకి తెచ్చుకొని దాదాపు అర కిలోమీటరు దూరంలో ఉన్న బంగ్లాకి చేరుకుంది. సదరు జడ్జి నివాసముండే ఇల్లు అది. లోపలికి వెళ్లి నెమ్మదిగా తలుపు తట్టింది. ‘ఎవరూ’ అంటూ జడ్జిగారి భార్య తలుపు తీసింది. పవిత్ర తన గురించి చెప్పి “ఇక్కడికి వెళ్లమన్నారు” అన్నది.

“సరే లోపలికి రా” అధికారం ఆమె స్వరంలో.

ఆమెతో పాటే పవిత్ర కూడా లోపలికి నడిచింది ఏమీ పాలు పోక.

సరాసరి లోపలికి వంటింట్లోకి తీసుకుపోయి, “ఇదిగో !

ఇక్కడ ఫ్రిజ్ ఉంది. అందులో కూరగాయలు తీసుకో.

కొంచెం పాలకూర పప్పు చేయి. ఆలూ ఫ్రై చేయి. ఆయిల్ ఎక్కువ ఉండొద్దు. సార్ కి నచ్చదు. ఉప్పూ కారాలు కొంచెం తక్కువగా వేయి” అని వరుసగా చెప్తూనే ఉంది. పవిత్ర వైపు చూడకుండా వస్తువులను పరిచయం చేస్తూ.

తను నిలబడ్డ నేల ఇంచు ఇంచులుగా లోపలికి కుంగిపోతున్న భావన కలిగింది పవిత్రకు. తాను ఇక్కడ వంట చేయడం ఏంది? కళ్ళల్లో ఆగని కన్నీళ్లు అధికారపు కళ్ళకు కనిపించకుండా దాచుకోవడానికి ఎంతో ప్రయత్నించింది.

“తొందరగా కానీ, సార్ లంచ్ కి వచ్చేవరకు రెడీగా ఉండాలి” ఆ గొంతు మళ్లీ అధికార స్వరం వినిపించింది.

చిన్నగా తల ఊపి వంట చేయడానికి సిద్ధమైంది. మనస్సులో ఎన్నో ఆలోచనలు. “వంటమనిషి రానట్టుంది. కొత్తగా తాను రాగానే ఆఫీసులో పని చెప్పకుండా ఈ ఒక్కరోజు కోసం ఇటు పంపించినట్టున్నారు” అని మనసుకు సర్ది చెప్పుకుంది. ఆమె చెప్పిన వంట చేసి టేబుల్ మీద సర్ది ఎదురుచూస్తూ నిలబడ్డది. రూములో ఉన్న ఆమెను పిలవాలంటే భయమైంది. ఆమె బయటకు రాకపోగా పవిత్ర ఏం చేస్తున్నదన్న విషయం కూడా పట్టించుకోలేదు. చూసి చూసి విసుగొచ్చి హాలులో కింద కూర్చుని గోడకు ఆనుకుంది.

మధ్యాహ్నం సరిగ్గా రెండు గంటలకు జడ్జి వచ్చాడు. ఆయన భార్య దగ్గరుండి వడ్డించింది. తినడం పూర్తి చేసి వెంటనే వెళ్ళిపోయాడు ఆయన. ఆమె హాల్లోకి వచ్చి “సరిగ్గా సార్ కు తగ్గట్టే చేసినవ్, సార్ మెచ్చుకున్నాడు. రేపు ఆఫీసుకు వెళ్లి సంతకం పెట్టి వెంటనే వచ్చెయ్” అన్నది.

‘రేపు కూడానా?’ అన్నది పవిత్ర అప్రయత్నంగా గుండె బేజారవుతుంటే.

అదేంది అట్లా అడుగుతున్నావ్! నీకెవ్వరు చెప్పలేదా! నీకు ఇక్కణ్ణే బంగ్లా డ్యూటీ” అని, ‘టిఫిన్ తెచ్చుకున్నవా’ అడిగింది. పవిత్ర అవునని తలూపింది. ఇక్కణ్ణే కూర్చొని తిను అని వెళ్ళిపోయింది.

ఆకలి చచ్చిపోయింది పవిత్రకు. కింద కూలబడి

మోకాళ్ళ మధ్య తల పెట్టుకొని ఆగకుండా ఏడ్చింది.

అగ్రవర్ణంలో పుట్టి, మడి, ఆచారాలు, సంప్రదాయాల

నడుమ పెరిగిన ఆమె జీవితాన్ని ఊహించని మార్పు కుదిపేసింది.

సాయంత్రమే రాత్రికి కావాల్సిన రొట్టెలు, కూర కూడా చేయించుకొని పవిత్రను ఇంటికి పంపిందామె.

ఇంటికి వచ్చేసరికి గుమ్మం దగ్గర నిలబడి తన కోసం ఎదురుచూస్తున్న తల్లిని చూడగానే పవిత్ర దుఃఖం తెరలు తెరలుగా బయటకు వచ్చింది. ఏడుస్తూనే జరిగిన విషయం చెప్పింది. తల్లి గుండె అవిసిపోయింది.

భర్త చనిపోయిన ఆడదానిగా కన్నబిడ్డను చూస్తూ శోక సముద్రంలో మునిగిన ఆమెకు ఈ విషయం పిడుగుపాటయింది. పిల్లలిద్దరికి చెబితే అర్థం చేసుకునే వయసు కాదు. ఆ రాత్రి తల్లీ కూతుళ్లకు తిండి, నిద్ర కరువైంది.

                            ********

ఉదయం 10 గంటలకల్లా ఆఫీసుకు వెళ్లాలి. సంతకం చేసి బంగ్లాకు పోవాలి. అక్కడ పొద్దు, మాపు వంట చేయాలి. ఇదీ పవిత్ర దినచర్య . మెల్లమెల్లగా ఆ వాతావరణానికి అలవాటు పడ్డది.

ఒకరోజు చాకలి రాలేదని బట్టలు ఉతికించి, ఆరిపోయిన వాటిని మడత పెట్టించింది న్యాయమూర్తి భార్య. ఇంకొకరోజు పనిమనిషి రాలేదని అంట్లు తోమించింది. మరబొమ్మలా చెప్పిన పనంతా చేస్తూ పోయేది పవిత్ర. తన అభిమానాన్నంతా ఎక్కడ దాచిందో? ఇప్పుడామె జీవచ్ఛవం. కన్న బిడ్డల కోసం ప్రాణాలు మాత్రమే నిలుపుకొని మనసును చంపుకున్న ఒక తల్లి.  అప్పుడప్పుడు కూరగాయలు కొనుక్కొని రావడం, గిర్నీలో పిండి పట్టించడం, సరుకులు తేవడం, జడ్జి భార్యకు తోడుగా ఆమెతో షాపింగుకు వెళ్లడం కూడా అదనంగా చేరి, డ్యూటీలో భాగాలయ్యాయి. ఇంట్లో పని కాబట్టి ఆదివారాలు, పండుగలు కూడా సెలవు ఉండేది కాదు.

ప్రభుత్వ అధికారుల ఇండ్లలో ఏ స్థాయి ఉద్యోగులైనా ఎందుకు పని చేయాలి? ఇది ఏ రాజ్యాంగంలో రాసి ఉన్న హక్కు? ఏ ప్రభుత్వమైనా దీన్ని ఎందుకు ఖండించడం లేదు? ఎవరికే సమస్య వచ్చినా న్యాయం కోసం కోర్టును ఆశ్రయించే ప్రజలకు అక్కడే అన్యాయం జరిగితే వాళ్ళ గోడును పట్టించుకునేదెవరు? ఇట్లాంటి వాటిని చూడొద్దనేనా న్యాయదేవత కండ్లకు గంతలు? మారని మనుషులు, చట్టాలున్నంత కాలం బయటకు తెలియని ఎన్నో ఇట్లాగే

జీవితాలు సమాధి అవుతాయి.

డిపార్టుమెంటల్ పరీక్షలు పవిత్రను బంగ్లా డ్యూటీ నుండి తప్పించి ‘ప్రాసెస్ సర్వర్’ గా మార్చాయి. వ్యక్తులకు, సంస్థలకు ‘సమన్లు’ ఇవ్వడానికి దూర ప్రాంతాలకు కూడా వెళ్లాల్సి వచ్చేది. చాలాచోట్ల మారుమూల ప్రాంతాలకు, ఎటువంటి ప్రయాణ సౌకర్యం లేని చోట్లకు వెళ్లడం కత్తి మీద సాము చేసినట్లుండేది. లోపల ఎంత భయం ఉన్నా  పైకి గంభీరంగా ఉంటూ ప్రతీ పనిని విజయవంతంగా పూర్తి చేసేది.

పవిత్ర మంచితనం, మాటతీరు, ప్రవర్తన, వినయం, కష్టపడి పనిచేసే విధానంతో ఎంతమంది

జడ్జీలు మారినా ఏరోజూ లైంగిక వేధింపులకు గురికాక పోవడం ఆమెకు ఇంత బాధలోనూ ఒక ఊరట. బదిలీ అయి వెళ్లిపోయిన న్యాయమూర్తుల్లో ఇద్దరు, ముగ్గురు ఆమెకు అప్పుడప్పుడు తామే ఫోన్ చేసి క్షేమసమాచారాలు తెలుసుకోవడం ఆమెకు తన ఉద్యోగ జీవితంలో గర్వకారణంగా నిలిచిన విషయాలు.

                             ********

తికూల ఉద్యోగ జీవితం పవిత్రకు రోజుకొక అనుభవాన్ని అందించింది. ఆ సమ్మెటపోట్ల నుండి రాటు దేలింది. పిల్లలకు చదువులు చెప్పించి, పెండ్లిళ్ళు చేసేసరికి కాలవ్యూహంలో చిక్కుకుని ఒంటరి యుద్ధమే చేసింది.

పవిత్రకు ఇంకో ప్రమోషన్ వచ్చి క్యాడర్ మరింత పెరిగింది. ఇంటి పరిస్థితుల్లో సంతోషం, దుఃఖం

సగ భాగాలు పంచుకున్నాయి. క్యాడర్ పెరిగినా అంతకు ముందున్న పోస్టుకు ఎవరినీ ప్రభుత్వం   అపాయింట్ చేయకపోవడంతో రెండూ చేయవలసి వచ్చింది. ఇది పవిత్ర శరీరంపై ప్రభావాన్ని చూపి, అనారోగ్యం ఆమెను పలకరించింది. ఒకే జీతానికి రెండు పోస్టుల బాధ్యతలు నిర్వర్తిస్తున్నా ప్రశ్నించే వాళ్ళు లేరు. పరిష్కరించేవాళ్ళు లేరు. న్యాయవ్యవస్థలో ఆమెకు జరిగిన అన్యాయమది. ఆమె ఉద్యోగ జీవితంలో మూడుపాళ్లు ఇంటికి రాగానే ఏడ్చిన రోజులే ఉండేవి. ఎప్పుడూ ఆమె అనుకునే ఒక మాట. “నేను అన్యాయవ్యవస్థలో పని చేస్తున్నానని”.

                          **********

ఆ రోజు  గురువారం. పవిత్ర మనసు ప్రశాంతంగా ఉంది. ఉదయమే లేచి తలస్నానం చేసి తనకు నచ్చిన చీర కట్టుకుంది. హుషారుగా ఆఫీసుకు బయలుదేరింది. జాబ్ లో చేరినప్పటి నుండి మొదటిసారి ఆమె డ్యూటీకి అంత సంతోషంగా వెళ్తోంది. కారణం ఆరోజే ఆమె ఉద్యోగానికి చివరిరోజు. రిటైర్మెంట్ కాదు. స్వచ్ఛంద పదవీ విరమణ. బాగా ఆలోచించి రెండేండ్ల సర్వీసుకు ముందే ఉద్యోగం మానేయబోతోంది.

తర్వాత జీవితం ఎట్లా ఉంటుందనే ఆలోచన ఆమెకు ఒకింత కూడా లేదు. ఇన్నిరోజులు అనుభవించిన శారీరక, మానసిక బాధకు ఒక ఊరట పొందాలనుకుంటోంది. అది ఎట్లా ఉన్నా ఎన్నింటినో తట్టుకున్న తాను దేన్నైనా తట్టుకోగలదు. ఈ ఉద్యోగం నుండి మాత్రం శాశ్వతంగా ముక్తి లభించబోతోంది. అందుకే ఎంతో ఉత్సాహంగా గడప దాటింది పవిత్ర మరో కొత్త జీవితానికి తెర తీస్తూ..

(ఇది ఒక స్త్రీ యథార్థజీవితం)

Written by Aruna Dhulipala

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ప్రముఖ గైనకాలజిస్ట్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీలత గొర్తి ముఖాముఖి

అవగాహన