మన మహిళామణులు

అన్నిటా అందెవేసిన చేయి శ్రీమతి వేలూరి ప్రమీలాశర్మ

వేలూరి ప్రమీలాశర్మ ఆకాశవాణి తోపాటు సాహిత్యం సంగీతం తో బంధం అనుబంధం ఉన్న అతివ.ఆమెను గురించి క్లుప్తంగా విహంగావలోకనం చేస్తాను.

 

ఒక రచయిత్రిగా, న్యూస్ రీడర్ గా పాతిక సంవత్సరాలకు పైగా, విశాఖ వాసులకు సుపరిచితురాలు వేలూరి ప్రమీలాశర్మ. ప్రకృతి ప్రేమికులను ఎంతగానో అలరించే సుందర విశాఖ నగరం ఈమె జన్మస్థలం. ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కామర్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన ఈమె, భర్త ఉద్యోగరీత్యా విశాఖలోనే విధులు కలిగి ఉండడంతో, వివాహానంతరం కూడా విశాఖలోనే ఉండే అవకాశం కలిగింది. 1997లో సిటీ లోకల్ ఛానల్ లో టీవీ న్యూస్ రీడర్ గా అడుగుపెట్టి, 2016లో విజెఎఫ్ లో బెస్ట్ న్యూస్ రీడర్ అవార్డును పొందారు. ప్రస్తుతం డాలస్ కు చెందిన రేడియో సురభిలో లైవ్ న్యూస్ రీడర్గా కొనసాగుతున్నారు.
2000 సంవత్సరంలో వివిధభారతి క్యాజువల్ అనౌన్సర్ గా ఆకాశవాణిలో అడుగుపెట్టి, ఉద్యోగ విధులు నిర్వర్తిస్తూనే సాహిత్యం వైపు దృష్టి సారించి 2004లో తొలిసారి “ఇంద్రధనస్సు వర్ణాలు” అనే అర్థగంట నాటికను వ్రాసి, ప్రసారయోగ్యతకు నోచుకున్నారు. అలా ఆకాశవాణిలో రెండు ధారావాహికలు, 9 అర్థగంట నాటికలు, 14 కథానికలు ఇంతవరకు ప్రసారమయ్యాయి. అలా రచనలు కొనసాగిస్తూనే 2016లో అటు టీవీ చానల్స్ తో పాటు, ఆకాశవాణిలోనూ ప్రాంతీయ వార్తా చదువరిగా కాంట్రాక్ట్ బేసిస్ పై నియామకం పొందారు. కోవిడ్ సమయంలో ఆకాశవాణి విధుల నుండి వైదొలగి, కేవలం ఆన్లైన్ వర్కులకు మాత్రమే పరిమితమయ్యారు. సాహితీ సమూహాల్లో సభ్యురాలిగా ఉంటూ రచనలపై పూర్తిగా దృష్టిపెట్టారు. ఇంతవరకూ 140కి పైగా కథలు, వివిధ పత్రికలలోనూ, ఆకాశవాణిలోనూ ప్రచురణకు మరియు ప్రసారానికి నోచుకున్నాయి. ప్రమీలాశర్మ గారి మొదటి కథల సంపుటి… ” కడలి కెరటాలు” 2022 సం. కి గాను, కీ. శే. అడుసుమిల్లి అనిల్ కుమార్ గారి స్మారక సాహితీ పురస్కారానికై ఎంపిక చేయబడింది. వసంత యామిని, భరణ్యవు అనే రెండు నవలికలు కూడా వ్రాశారు. విశాఖ నగరంతో విడదీయరాని అనుబంధాన్ని కలిగి ఉన్న ఈమె… “సాగర తీర కథలు” పేరుతో మరో కథల సంపుటి ముద్రణలోకి తీసుకొస్తున్నారు.


కేవలం కథలు మాత్రమే కాక వివిధ సాహితీ ప్రక్రియల్లో అడుగుపెట్టి, గజల్ మరియు పద్య రచనలోనూ శిక్షణ తీసుకున్నారు. తాను వ్రాసిన గజల్స్ నుంచి 75 అద్భుతమైన గజల్స్ ను ” గజల్ సౌరభాలు” పేరుతో పుస్తక రూపంగా విడుదల చేశారు. మృదు మధురమైన ఆలాపనతో తన గజల్స్ కు, తన తల్లి గారైన శ్రీమతి వంగల సుబ్బలక్ష్మి ఊపిరి పోసారని, ఎంతో గొప్పగా చెప్పుకుంటారు. “కృష్ణ మాలికలు” పేరుతో సామాజిక శతకం, “శ్రీరామామృతం” పేరుతో వాల్మీకి రామాయణాన్ని అద్భుతమైన కంద పద్యాలతో శతకంగా వ్రాశారు. 108 ఆటవెలదులతో “శ్రీనివాస శతకము” పుస్తక రూపంలో విడుదల చేశారు.
అనుకున్నది సాధించేదాకా నిద్రపోను… అనే ఈమె, తనకు ఆ పట్టుదల తన తల్లినుంచే అలవడిందంటారు. హై స్కూలు చదువులకే పరిమితమైపోయిన తన తల్లి, చిన్నప్పటినుంచీ చక్కని వ్యక్తిత్వం ఉన్న మనిషిగా తనను తీర్చిదిద్దడంలో ఎంతో జాగ్రత్తలు తీసుకునేవారని చెబుతుంటారు. తన రచనలకు మొదటి విమర్శకురాలు తన తల్లేనట. ఆమె గొంతులో ఒదిగిపోయిన తన గజల్స్ కు ఎందరో అభిమానులున్నారని గర్వంగా చెప్పుకుంటారు.
కేవలం రచనలే కాక స్పష్టమైన ఉచ్ఛారణతో ఆడియో కథలు వినిపించటం అంటే ప్రమీలాశర్మకు చాలా ఇష్టం. ఒక హాబీగా ఆడియో కథలు చేస్తూనే… ఆసక్తి ఉన్నవారికి ఆడియో కథలు వినిపించడంలో అవసరమైన మెలకువలు నేర్పిస్తూ శిక్షణనిస్తున్నారు. మరోపక్క న్యూస్ రీడర్ / వాయిస్ ఓవర్ ఆర్టిస్టులకూ శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. అంతేకాక… డ్రెస్ డిజైనింగ్ లో సర్టిఫికెట్ కోర్స్ చేసి, ఆర్థికంగా వెనుకబడిన మహిళలకు ఉచితంగా కుట్టు పనిలో శిక్షణనిచ్చారు. డ్రాయింగ్ మరియు పెయింటింగ్ లలోనూ ప్రవేశం ఉంది. పెన్సిల్ ఆర్ట్ పై మక్కువ ఎక్కువ.
హాస్య కథలు, క్రైమ్ కథలతో పాటు… సామాజిక కథలను ఎక్కువగా వ్రాయడానికి ఆసక్తి కనబరిచే ఈమె, సమాజంలో తన చుట్టూ జరుగుతున్న సంఘటనలను కథగా మలిచి హృదయానికి హత్తుకునేలా వ్రాయడంలో నేర్పరి. ఈ మధ్యనే విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రంలో ప్రసారమైన ఈమె రచించిన “గుండె దరువు” కథానిక తమ గుండెలను బరువెక్కించిందంటూ శ్రోతల నుంచి విలువైన ప్రశంసలనెన్నో పొందింది. 13 సంవత్సరాలకు ముందు ఈమె రచించిన “మధ్యతరగతి గందరగోళం” ఆకాశవాణిలో ప్రసారమైనప్పుడు ప్రశంసలు వెల్లువెత్తాయి. విశాఖపట్నంకు చెందిన కె.శివయ్య చేసిన పీహెచ్ డీ వర్కులో ఈమె రచించిన కథానికలపై పత్ర సమర్పణ చోటు చేసుకోవడం తనకు ఎంతో ఆనందాన్నిచ్చింది అంటారీమె.
టిటిడి అన్నమాచారి సేవా సమితిలో సభ్యత్వం కలిగివున్న ప్రమీలా శర్మ, వివిధ దేవస్థానాలలో అన్నమాచారి సంకీర్తనలను ఆలపిస్తూ, సేవకు హాజరవుతుంటారు. నాకు ఈ స్వర జ్ఞానం మా తల్లిగారి నుండే సంక్రమించింది… అనే ఈమె, తన వారసత్వంగా తన పెద్ద కుమార్తె వేలూరి నిఖిత, 3సం. లు విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రంలో అనౌన్సర్ గా విధులు నిర్వర్తించారని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

దొరసాని

ఆమె – అతడు