ఒకానొకప్పుడు…నేడు

కవిత

             డాక్టర్ బండారు సుజాత శేఖర్

ఒకానొకప్పుడు నేను విరబూసిన సన్నజాజిని ,
కోయిల స్వరాన్ని, లేత ఆకుల సవ్వడిని,
కన్నా ….నేను స్వచ్ఛమైన నీటి బుడగను, తేనె చినుకును
తుమ్మెదల శబ్దాలతో
కందిరీగల ఝుంకారంతో పోటీ పడ్డ లేతవిహంగాన్ని,
సీతాకోకచిలుకలతో రెక్కలను ఎగిరేసిన చిట్టి సికోచిని
విని వీధిలో స్వేచ్ఛను పీల్చే ఖగాన్ని
మట్టిలో మట్టిరేణువుగా మమేకమై
ఆటలాడిన గాజు ముక్కను…
వాగుపక్క పిచ్చుక గూడును
తాగుడు మూతల ఆటలో దాచుకున్న లేత ప్రాయాన్ని
ఉప్పు బెర్ర ,గిల్లిగోన ,నేలబండల్లో హుషారైన విజేతను
ఆట పాటలు ,సంబరాలు …అంతే అదే నా లోకం…
కన్నా ….నేను గుండెతో నవ్వే దాన్ని,
మనసుతో మమతను పంచేదాన్ని..

నీలా నేను ఉన్నప్పుడు అప్పుడు
నేనొక పసిప్రాయపు పల్లవిని…నిండైన సంద్రాన్ని
మురళీ గానాన్ని, ప్రాణమిచ్చే మానవత్వపు సరాగాన్ని…

కన్నా ..నేను మీ అక్కలాఉన్నప్పుడు…
కన్నా .. నేను మీ అందరిలా ఎదుగుతున్నప్పుడు
ఇంకా ..నేను ఏవో రాగాలను ఆస్వాదిస్తూ గీతాన్ని
జెండా జై నాదాన్ని,అశోకుని ధర్మ చక్రాన్ని,
జవాన్ గుండె ధైర్యాన్ని, కిసాన్ హలాన్ని,
ఎవ్వరే రీతిలో ఉన్న వేసే తొలి అడుగు .
వేవేల అడుగుల రూపంగా ముందడుగు వేస్తూ
కదిలిన తొలి అడుగును…

ఇప్పుడు.. కన్నా నేను పెదాలపై ప్లాస్టిక్ నవ్వును
కళ్ళు కనిపించిన చెవులు వినిపించని గుండె కదలని కొత్త రూపాన్ని..
రేపటి కోసం ఎదురుచూడని సంధ్యను..
సింహం తోలు కప్పుకున్న నక్కల మధ్య నలిగిపోతున్న నిజాన్ని…

తోడేళ్ల రాజనీతికి బలి అవుతున్న న్యాయాన్ని
ఆత్మీయతల సున్నిత రెక్కల్ని ముళ్ళతో కమ్మేస్తున్న
అహంకారుల జాడను.. కన్నా..నేను పుట్టిన ఈ లోకం
సమస్తము సంతోషంగా ఉండాలని
రేపటి తరాన్ని పచ్చని పొలాల నడుమ
స్వచ్ఛమైన గాలితో ఆహ్వానించాలన్న తపన …

అది తప్ప ఇక ఏమీ లేని నిర్జీవి ని.

 

అంతర్జాతీయ విశిష్ట మహిళా పురస్కార గ్రహీత
కవయిత్రి ,గాయని… మొబైల్ 9866426640

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అపార్ధం

నిరంతర ప్రవాహి -శ్రీమతి గుడిమెట్ల శారద