మసక వేకువకల్లా
ఇళ్ళకు చేరుతుంటారు
ఒకానొక ఆవలి ఉదయానికి బయలుదేరి!
గ్లోబు దానికది ఆకాశంలో
తేలుతూ
చీకటి వెలుగులు మోస్తుంది
కాలం
రాత్రీపగలని అనవసరపు లెక్కల్లో పడుతుందిగానీ
హోల్క్వేర్ల నుండి పరావర్తనమైన ఎక్స్ వైలు
పరిమితులను చీల్చుకుని
జమాఖర్చుల చిట్టాలు విడిచి
పరమాణుపరమాణువుగా
వేటికవే వెలగాలన్న కాంక్షలోకి
ఎప్పుడో విభాజ్యమైపోయాయి!
ఆవాలివైపు గ్రహశకలాలు
ఇటువేపు నక్షత్రాలు కలిసి కాంతినొకటి ప్రసరిస్తుంటాయి
మన గదిలో మనం
నిశాచర కలలు కంటుంటామ్…
వాళ్ళు కాంతివంతమౌతుంటారు!
మనో ఆలయాల చుట్టూ కట్టిన రాతిగోడలను దాటుకుని
మహిళాలోకం అందమైన ప్రపంచంలో
అంతరాలయ కాంతిని విశ్వవ్యాప్తం చేస్తుంది!
ఆకాశానికెగురుతూ
పాతాళంలోకీ దిగుతుంది
సముద్రాలనీదుతూ
సిలికా పూతల వలయాల్లోంచి మరో సృష్టిని చిత్రిస్తూ
మసకబారిన చీకటినొదిలేసి
సునామీయై మరోగ్రహాన్నీ చేరుతుంది
రూపం, భాషా మార్చి
భావోద్వేగాల ఉనికినీ చాటుతుంది
ఊగిపోతూ రాకెట్ లా,అంతరిక్ష క్షిపణిలా, సబ్ మెరైన్ లా దూసుకెళ్ళి
శూన్యంలోనూ మరింత ఊపిరి పీల్చుకుని ధైర్యంగా నడుస్తుంది!
ఇప్పుడు చెప్పు!?
చీకటెవరిదని…రాత్రేమిటనీ?
వజ్రాలిప్పుడు వాటికవే
మట్టినుండి
కాంతి మొక్కలై లేస్తున్నాయ్!
వాటికవే సాన పెట్టుకుని
వాటికవే ఉత్తేజమై ఉద్భవిస్తున్నాయి..ఊపిరులౌతున్నాయి!
చీకటి ఒకందుకు మంచిదే
కొన్ని క్షణిక కాలాల
అణగారిన పొరలను తెంచి
మరింత అధివ్యాప్తమవడానికి
నిటారుగా నిలబడడానికి!!