అభ్యుదయ పదంలో అణగారి పోతున్న ఓ మహిళా!
అంధకారంలోకి నెట్టి నా, అథఃపాతాళంలోకి తోసినా
చిమ్మ చీకటిని చీల్చుకుంటూ,
వెలుగు దివ్వెలై జ్వలించండి.
ఆకాశం లో , అవనంతా మేమేనంటూ చాటండి.
మహిళ అంటే ఓ శక్తి
మహిళంటే ఓ భక్తి.
మహిళంటే మట్టిలో మాణిక్యం.
మహిళా లోకానికి కే మణిహారం.
స్త్రీకి స్వాతంత్రం ఇచ్చామంటూ,
ఆడపడుచుల్ని అంగడి బొమ్మల్ని చేసి
హత్యలతో వేలాడదీస్తున్నారు.
జీవిత చరమరాత్రులు గడుపుతున్న
ఒంటరితనంతో మోయలేని వృద్ధాప్యంలో ముక్కలైన
జీవన చిత్రాలు చూసుకొని మురిసిపోవడం తప్ప ఏముంది!
సమాజపు టంచులపై సమస్యల వలయంలో చిక్కుకున్న
చేప పిల్లలా విలవిలలాడుతూ-జీవితాన్ని
బందీగా చేసుకొని బ్రతకాల్సిందేనా?
ఎన్నాళ్లు ఈ సజీవ దహనాలు.
విష వ్యవస్థ కోరల్లో చిక్కుకోకుండా స్త్రీ తన పవిత్రతను
కాపాడుకొంటూ ఆదర్శ మార్గం కావాలి!
జీవితాంతం ప్రేమను పంచి పెడుతూ,
సంప్రదాయాల సంస్కారాన్ని గౌరవించాలి.
బాలిక నుండి భార్య వరకు ఈ సృష్టిలో స్వేచ్ఛగా బ్రతికేది అమ్మ కడుపులోనే!
యుగయుగాల నుంచి స్త్రీ మోసగింపబడుతూనే ఉంది.
కాలం, సమాజం, వ్యక్తి అభిప్రాయాలు అన్ని మారుతూనే ఉన్నాయి.
మానవజాతి మనుగడకు ప్రాణం పోసే మహిళ.
మర బొమ్మగా, మట్టి ముద్దగా ఎందుకు ఉండాలి?
అన్ని రంగాలలో అందవేసిన చేయి
ముందు తరాలకు స్ఫూర్తి కావాలి.
స్త్రీ చైతన్యం నిత్య నూతనత్వమై విశ్వవ్యాప్తం కావాలి.