అనుబంధాలకు మూలం నువ్వేనంటూ
కాళ్ళకు బంధం వేయక
చిగురించే ఆశల కొమ్మలను
శాఖోపశాఖలుగా ఎదగనివ్వండి
అన్నీ తానై,అన్నిటా తానై
ఎగిరే చక్కని గువ్వను పంజరాన బంధించక
స్వేచ్ఛగా నింగికి ఎగరనివ్వండి
నీ చేతిలో మహిమేదో ఉందంటూ
పొగడ్తల వర్షం కురిపిస్తూ
స్వేదపు సంద్రాన ముంచేయకుండా
ముత్యాల పందిట్లో సేదతీరనివ్వండి
నీ పలుకులు సుధారసాలంటూ
సుతిమెత్తని సంకెళ్ళతో చుట్టేయకుండా
తనను కరువుతీరా మాట్లాడనివ్వండి
తను అడుగేస్తే పాదాలు కందిపోతాయంటూ
తన అడుగులను పాతరేయక
తను పయనించే బాటలో
ఎదురయ్యే రాళ్ళూ, ముళ్ళూ ఏరివేసి
బహుదూరపు బాటసారిగా తోడవ్వండి
మీరంతా అలా చూస్తూ ఉండండి
ఆమెనలా ఎదగనివ్వండి
అందరికోసం అన్నీ చేసే తనకు
తనకేం కావాలో తననే నిర్ణయించుకోనివ్వండి