నిన్నటి దాకా శిలనైనా…… …

కథ

నీలాకాశం భూమి మీదకి ముత్యాలని వెదజల్లుతున్నదా అన్నట్లు, తెల్లని మంచు జల్లులు ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. ఆ ముత్యాల మధ్యకుండా పైపైకి ఎగురుతున్నది లోహవిహంగం.

“మేడం కెన్ యూ హేవ్ స్నాక్స్” అన్న ఎయిర్ హోస్టెస్ మాటలకి, ఇయర్ ఫోన్స్ పెట్టుకుని, ‘ తెలంగాణ గడ్డమీద సందమామయో సందమామయా,’   పాటను కళ్ళుమూసుకుని ఆస్వాదిస్తన్న అనుపమ నుంచి ఏసమాధానం రాకపోవటంతో, తల్లి వైపు చూసింది శ్వేత.

“మమ్మీ,“ తల్లి భుజంమీద చేయి వేసింది

కళ్ళు తెరిచి చూసిన అనుపమ కళ్ళలో చిన్న కన్నీటి పొర. ఇన్ని సంవత్సరాల తర్వాత తను పుట్టిన గడ్డ మీద అడుగు పెట్టాలనే కోరికతో ఇండియా బయలు దేరిన తన తల్లిలోని ఉద్వేగాన్ని గమనించిన శ్వేత,

“కూల్ డౌన్ మమ్మీ,” అంటూ తల్లి చేయిని తన చేతిలోకి తీసుకుంది.

గతకొన్ని నెలలుగా తల్లి పడుతున్న మానసిక సంఘర్షణ, దాని నేపధ్యం అర్ధంచేసుకుంటూనే ఉంది శ్వేత.

*                 *             **

“చాలా గ్రాండ్ గా ఉంది ఫంక్షన్ హాల్. ఆడంబరంగానే చేస్తున్నాడు బావ రజనీ పెండ్లి.  పొలాలు అమ్మలేదుగా, మరి మనీ ఎలా ఎడ్జస్ట్ అయిందో?” అడిగింది అనుపమ భర్త సందీప్ ని.

“బావలిద్దరూ ఇచ్చారు.  భూమికి మంచి రేటు రాగానే అమ్మి వాళ్ళకిస్తాడంట,” సందీప్ సమాధానం.

“ఎవరో ఒకరు సాయం చేయాలిగా” ఆమె మాట ఆమెకే పేలవంగా అనిపించింది.

అన్న కూతురు, రజనీ పెళ్లి సంబురాన్ని వీడియోకాల్లో చూస్తున్నారు, అమెరికాలో ఉన్న సందీప్, అనుపమ, కూతురు శ్వేత.

“చిన్నోడా, నీవు కూడా పెండ్లికి వస్తే మంచిగుండేది. కనీసం అనుపమని, బిడ్డలిద్దర్నీ అయినా అంపకపోతివి,” వీడియోలో సందీప్ తల్లి బాధ.

“ఏంజేయాల్నే మా ఉద్యోగాలు గట్లనే ఉంటయి. బతుకమ్మల నాటికి వాళ్ళొస్తారులే,” సందీప్ హామీ తల్లికి.

ఇలాంటి హామీలు ఎన్నిసార్లు ఇచ్చాడో తెలిసిన ఆమె మాట్లాడలేదు.

“ఏం బిడ్డా,ఎట్లుండ్రు ఎప్పుడొస్తారు మనదేశం?,” అంటూ పెళ్ళికి వచ్చినవాళ్ళు ఒకరొకరే   వీడియోలో అడుగుతున్నారు.

వీడియో చూస్తూ, పెళ్లికి వచ్చిన వాళ్ళని, ‘వీళ్ళెవరు, వాళ్ళెవరూ,’ అని శ్వేత అడుగుతుంటే,అందులో కొంతమంది  బంధుత్వం గురించి ఎలా చెప్పాలో అనుపమకి అర్ధం కావటం లేదు. కారణం ఆమెకే వాళ్ళెవరో తెలియదు. ముఖ్యంగా ఈతరం పిల్లలు.

ఈసంవత్సరమే ఎం.ఏ. ఆంత్రోపాలజీలో చేరిన శ్వేత మాత్రం వీడియోలోభారతీయ వివాహ క్రతువుని, సాంప్రదాయాలని ఆసక్తిగా చూడసాగింది.

*                 *             **

అనుపమ వాళ్ళ కౌంటీ లోనే ఉండే అనూష ఇంట్లో ఫంక్షన్.  డల్లాస్ లో ఉండే అనూష ఆడబిడ్డ చికాగో వచ్చింది ఒడిబియ్యం ఫంక్షనుకి.  అనుపమని కూడా పిలిచారు. ఆమెకి ఇలాంటివి అసలు ఇష్టం ఉండదు. కానీ వాళ్ళ అమ్మాయి, శ్వేత క్లాస్ మేట్స్.

“మమ్మీ, ఆంటీ వాళ్ళు కౌంటీలో మనల్ని ఒకళ్ళనే పిలిచారు, వెళ్ళకపోతే బాగోదు,” అనటంతో వెళ్ళాల్సి వచ్చింది.

ఇండియా నుంచి అనూష అత్తమ్మ మణెమ్మ వచ్చింది. అనుపమ వెళ్ళగానే అనూష, “అత్తమ్మా, వీళ్ళ ఊరు  మనూరి  దగ్గర  కనగల్లు.   పాతికేళ్ల సందు ఈడనే ఉంటున్నారు,” పరిచయం చేసింది.

“దా బిడ్డ, కూసో,” అంటూ సోఫాలో తన పక్కనే కూర్చోబెట్టుకుంది.

“మీ మామ పేరేంటి,” అడిగింది.

“లింగమయ్య,” చెప్పింది అనుపమ.

“గరిదాసు లింగమయ్య కోడలివా, చెప్పవేం బిడ్డా. మా చిన్నమ్మమ్మ మనుమడేగా లింగమయ్య.  ఎంత మంచోడు, కొడుకుల్ని మంచిగా సదివించాలని ఏంత కష్టపడేటోడో. నీ ఆడబిడ్డలిద్దరికీ మంచి సంబంధాలే చేసాడు. నీ బావ పొలాలు చూసుకుంటున్నా, పైసా పైసా జమజేసి మీఆయన్ని పట్నం అంపి సదివించాడు. పరాయి దేశంలో నౌకరీ అని గొప్పగా చెప్పుకునే టోడు. ఏం లాభం, రెండు సార్లు ఒచ్చిండేమో మొత్తం మీద మీ ఆయన. మీ మామ  పోయినప్పుడు కూడా చివరి సూపుకి రాలేకపోయే,” మణెమ్మ వాక్ప్రహం అలా సాగుతూనే ఉంది.

అక్కడే ఉన్న మణెమ్మ కూతురు

“అమ్మా, యేందేగది, ఎప్పుడు, ఎట్ల మాట్లాడాలో తెల్వదా. గమ్మునుండు,” అని తల్లిని గదమాయించి,

“సారీ ఆండీ, ఆమె పాతకాలపు మనిషి, ఏమీ అనుకోవద్దు. రండి హాల్లో కూర్చుందాం,” అని చేయి పట్టుకుని తెచ్చి హాల్లో కుర్ఛోబెట్టింది.

ఆ క్షణంలోనే అక్కడ నుంచి వెళ్ళిపోవాలి అనుకుంది అనుపమకి. కానీ శ్వేత కోసం తమాయించుకుంది.

ఇల్లంతా సందడిసందడిగా ఉంది. ఫంక్షన్ మొదలయింది. ఒకరితో ఒకరు పరాచికాలు. ఆడపిల్లలు అందరూ సాంప్రదాయ దుస్తుల్లో భారతీయ సంస్కృతికి ప్రతీకలుగా ఉన్నారు. టాప్, లెగ్గిన్స్ లో ఉన్న శ్వేత చేత వాళ్ళ ఫ్రెండ్ బలవంతాన తను ఇండియా నుంచి తెప్పించిన చీరె కట్టించింది.

ముత్తయిదువులు అందరూ కలిసి నవ్వుతూ తుళ్ళుతూ పసుపు బియ్యం కలిపారు. పుడకలు, పళ్ళు అన్నీ తెచ్చారు.

“గదేందే, ఆపుడకలు గట్లనేనా సర్దేది,” మణెమ్మ మాటలకి, ఆమె కూతురు బిడ్డ,

“నేగిట్లనే సరుదుతా, సూడబుద్దయితే సూడు, లేదంటే గమ్మునుండు,” అమ్మమ్మతో పరాచికాలు.

ఒడిబియ్యం కార్యక్రమం పూర్తయింది. తర్వాత లంచ్, డ్రింక్స్ సర్వ్ చేసారు.

“ఏమైనా మనూళ్ళో దావత్ మల్లెయితే ఈడుండదు. ఆడయితే మంచిగ కల్లు నింపుతారు గౌవుల్లోళ్ళు. ఈడేందో ఇస్తరు,” మణెమ్మ గొణుగుడు.

కేవలం కనపడి పోదాం అనుకున్న అనుపమకి సమయం తెలియలేదు.  శ్వేత అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నది. ఫంక్షన్ ఎలా చేస్తున్నారు, ఎందుకు చేయాలి వివరంగా అడిగి తెలుసుకుంటున్నది.

లంచ్ అయిపోయాక అనుపమ అందరికీ బై చెప్పి బయలుదేరుతుంటే

“ఇండియా వెళ్ళే ప్లాన్ ఉందా,” అడిగింది అనూష.

“ఇప్పుడిప్పుడే వీలుకాదు. వెకేషన్ చూసుకోవాలి,” అంటూ మణెమ్మ కాళ్ళకి నమస్కారం చేసింది అనుపమ.

“సల్లంగుండు బిడ్డా, నీ తల్లి లాంటి దాన్ని నీవు ఏమనుకోనంటే ఓముచ్చట చెప్పనా. ఎంత ఎత్తుకు యెదిగినా మన దేశాన్ని, మనూరిని యాదుంచుకోవాల. ఊరంటే కన్నతల్లి లెక్కనే కదా బిడ్డా! చెట్టు ఆకాశం అంతా యెత్తు కెళ్ళినా, దాని వేర్లు యాడ పుట్టాయో ఆడనే ఉంటన్నయిగా! ఏర్లు తెంపుకొని చెట్టు పోతన్నదా?  రేపు నీ బిడ్డలకి పెండ్లిండ్లు అయి, పిల్లలు పుట్టినాక ఆళ్ళకి మన భాష, మన దేశం, మన పండుగలు అంటే ఏం చెపుతావు,” అంది అనుపమని రెండు చేతులతో లేవనెత్తి  దగ్గరికి తీసుకుని.

ఆమె చేతుల్లో తనకి తెలియకుండానే ఒదిగిపోయింది అనుపమ.ఆ స్పర్శ ఆమెకి కన్నతల్లి ని గుర్తు తెచ్చింది. గుండెలోతుల్లోకి దూసుకెళ్ళాయి ఆమె మాటలు.

“మమ్మీ, నాకయితే చాలా మంచిగనిపించింది.  అందరూ నావాళ్ళే అనిపించింది,” కార్లో కూర్చోగానే శ్వేత అన్న మాటలకి ‘ఔను’ అన్నట్లు తలూపింది.

“మమ్మీ, అనూష ఆంటీ వాళ్ళ ఫ్యామిలీ లాగా మనం ఎందుకు ఉండటం లేదు?” మరో ప్రశ్న వేసింది శ్వేత. మౌనంగా డ్రైవ్ చేయసాగింది.  ప్రస్తుతం ఆమె ఆలోచనల‌ సుడిగుండంలో ఉన్నది.

*                 *             **

ఫాల్ సీజన్. చెట్లఆకులన్నీ రంగులు మారుతో, ఎరుపు, పసుపు పచ్చ, ఆకుపచ్చ, మెరూన్ రకరకాల రంగులతో వింతశోభతో బతుకమ్మలని తలపిస్తున్నాయి.

లాంగ్ వీకెండ్ రావటంతో అనూష ఫ్యామిలీ ట్రిప్ కి వెళుతూ, శ్వేతని కూడా తీసికెళ్ళారు. ఏదో ప్రాజెక్ట్ కోసం సందీప్ ఒహాయో వెళ్ళాడు. కొడుకు కార్తీ ఏడాది నుంచీ సియాటిల్ లోనే ఉంటున్నాడు.

టీ కప్పు తీసుకుని కూర్చున్న ఆమెకి  రాత్రి తల్లి అంతులేని ఆవేదనతో ఫోన్ లో మాట్లాడిన మాటలు పదేపదే గుర్తొస్తున్నాయి.

“ఎట్లుండావు బిడ్డా, ఎన్నాళ్ళు గిట్లుంటరు? నీవు, మన్మరాలు ఓతాన, అల్లుడు ఓదేశం, మనవడు ఓతాన. నాకైతే మంచిగ అనిపిస్తలేదు. అదేమంటే ఉజ్జోగం గట్లుంటది అంటావు. ఈపాలన్నా బతుకమ్మ పండక్కి ఈడకొస్తరేమో అనుకుంటి. రాకపోతిరి. ఆముచ్చట తియ్ గానీ, గీడ పొలాలన్నీ అమ్మమని మీబావకి చెప్పిండంటగ అల్లుడు. ఇక ఈ దేశం ముఖం కూడా చూడరా బిడ్డా?”

చాయ్ తాగుతూ, చెట్లనుండి రాలుతున్న  రంగురంగుల ఆకులనే చూస్తున్నది.

అనూష వాళ్ళ ఇంటినుంచి వచ్చినప్పటినుండి మనసులో ఏదో గిల్టీ ఫీలింగ్.  ఆ రోజు శ్వేత బలవంతం మీద వెళ్ళింది, కానీ ఆ తర్వాత అనూష తనని ఒక మంచి స్నేహితురాలు గా భావించి వారానికోసారి ఫోన్ చేస్తూనే ఉంది. ఆమె స్నేహం తనలో ఏదో తెలియని ప్రకంపనలు కలుగచేస్తున్నది.  ఆమెని చూసాకే తన జీవితం చాలా నిస్సారంగా ఉంది అనిపించసాగింది. ముఖ్యంగా ఆ భార్యా భర్తల అనుబంధం, తను ఏం కోల్పోయిందో తెలుపుతున్నది.

మణెమ్మ అన్న ప్రతి మాటా తనలో అలజడి రేపుతోంది.

“మా అనూష బంగారం లెక్కనే‌. కోడలు కాదు అది, బిడ్డనే. అన్ని బాధ్యతలు మీదేసుకుంటది. ఈడ ఇల్లు కొందామనుకుండ్రు. గయితే నా చిన్న కొడుకు కొడుక్కి ఎం.బీ.బీయస్ లో సీటొచ్చినాది. వాడితాన పైసలు తక్కువైతే, ఈ కొడుకే ఐదులచ్చలు ఇచ్చిండు. ఏరే ఎవరయినా అయితే ఊరుకుంటారా! మా అనూష అసుంటి మడిసి కాదు.”

అనూష మీద కోపం వస్తున్నది. ఆమె మంచితనం తనకి అశాంతిని కలుగు చేస్తున్నది.

సడెన్ గా ఒంటరితనం ఆవహించింది.  కావల్సినంత సంపాదన, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఒక్క తృప్తి తప్ప. జీవితం పరుగుపందెం అయింది. ఆనందం అనేది తన జీవితంలో నుంచి ఎప్పుడు వెళ్ళిపోయిందో తెలియనంత బిజీ. అనుపమకు మొదటిసారి తన బాల్యం, తన ఊరు, తన వాళ్ళు గుర్తురాసాగారు.

మేనత్తలు, పినతండ్రులు, పెత్తండ్రి వాళ్ళ పిల్లలతో తను గడిపిన రోజులు గుర్తురాసాగాయి. తమ్ముడితో కలిసి ఆడిన ఆటలు, స్కూలు స్నేహితులతో గడిపిన రోజులు కళ్ళముందు కదలాడసాగాయి.

తన చిన్న తనంలో, బతుకమ్మ ఎట్లాడేవాళ్ళు. అందరికంటే తమ బతుకమ్మే పెద్దగా ఉండాలని, ఆరుగంటలకే లేచి తను , అత్త కూతురు ఇద్దరూ ఊరిమీద పడి, తంగేడు, బంతి, గునుగు పూలు తెచ్చి, తాంబలంలో పేర్చేవాళ్ళు.  చుట్టుపక్కల అందరి బతుకమ్మలు కూడా తెచ్చి తమ ఇంటి ముంగిటనే పెట్టేవాళ్ళు. చుట్టూ తిరుగుతా ఏంపాడేవాళ్ళు! అత్తమ్మకి రాని పాట లేదు.

నడిరేత్రి దాకా ఆడి చెరువులో నిమజ్జనం చేసేవాళ్ళు. ఆ ఆనందం ఇప్పుడు ఏది? ఇక్కడ కూడా ఆడుతున్నారు, కానీ అది ఒక ఫార్మల్ సెలబ్రేషన్ గా వెళ్లి వస్తుంది అంతే. ఎందుకు తను ఇంత శిలలా మారింది?

*                 *             **

అనుపమది దేవరకొండ దగ్గర ఒక పల్లెటూరు. తండ్రి వ్యవసాయం చూసూకునేవాడు.  రెండెకరాల పొలంలో పాలకూర పండించేవాళ్ళు. తల్లి రెండు బర్రెలని సాకుతూ పాలమ్మి తండ్రికి చేదోడుగా ఉండేది.  కష్టమైనా సరే వాళ్ళు, అనుపమని, కొడుకు రాజేశ్ ని మంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో చేర్పించి చదివించారు.

అనుపమ తల్లితండ్రుల  తోబుట్టువులు మిగిలిన వారు అందరూ కాస్త కలిగిన కుటుంబాలే. అందరూ ఉద్యోగస్తులు. అనుపమ కుటుంబమే ఆర్ధికంగా వెనుకబడింది. దాంతో మిగిలిన వాళ్ళు వీళ్ళ చదువులకి, ఇతర అవసరాలకు సహాయం చేస్తుండే వాళ్లు. అదే ఊళ్ళో ఉన్న మేనత్త ఆర్ధికంగా చాల ఉన్నతంగా ఉండేది . మామూలు సహాయంతో పాటు ఆమె, అనుపమకి, ఆమె తమ్ముడికి తన పిల్లలు నెలరోజులు వాడి వద్దనుకున్న ఖరీదైన బట్టలు ఇస్తుండేది. సంవత్సరానికి ఒకసారి కొత్తబట్టలు కొని పెట్టేది.

అనుపమ బీ.టెక్. చేయటానికి కూడా ఆమె చాలా సహాయం చేసింది. ఆమె పిల్లలు కూడా వీరి పట్ల అభిమానంగా ఉండేవాళ్ళు.

అనుపమ చిన్న పిల్లగా ఉన్నప్పుడ ఇవన్నీ బాగానే ఉండేవి. కాస్త ఊహ తెలిసినప్పటి నుంచి అనుపమ, వాళ్ళు తమ మీద జాలి చూపించటం సహించలేక పోయేది. అది అవమానంగా భావించేది. దానికి తోడు ఏదైనా శుభకార్యాలు వచ్చినప్పుడు తన ఈడు పిల్లలు కొత్త బట్టలు, నగలు గురించి మాట్లాడుకుంటుంటే తను అందులో భాగస్వామి కాలేకపోయేది. ఒక ఆత్మ న్యూనతా భావం, స్వాభిమానం కలగలిసి ఉండేవి.

బీ.టెక్. కాగానే క్యాంపస్ సెలక్షన్ లో జాబ్ రావటం ఆమె జీవితంలో ఒక ఆనందకరమైన మలుపు. ఆ తర్వాత సందీప్ తో వివాహం ఆనందకర జీవితానికి మరో మెట్టు అయింది.  వివాహానంతరం సందీప్ తో కలిసి అమెరికా ప్రయాణం.  తనకి కూడా అక్కడే జాబ్, గ్రీన్ కార్డ్ రావటం బతుకు బంగారు బాటైంది.

అయితే , ఇప్పుడే అనుపమ మనసు చిత్రంగా మారింది. ఒక్కసారి అమెరికా వెళ్ళాక, ఆమె, తనని ఆదరించిన వాళ్ళని తలచుకోవటాని కూడా ఇష్టం పడలేదు. పైగా ఒకలాంటి కసితో సంపాదనే ధ్యేయంగా పెట్టుకుంది.

ఒకటే పరిస్థితులు ఇద్దరు మనుష్యులు స్వీకరించిన విధానం వేరుగా ఉంది. అనుపమ, తన  బంధువులు తనకి చేసిన సహాయం అవమానంగా భావిస్తే, ఆమె తమ్ముడు రాజేష్ మాత్రం వాళ్ళ చేసిన సహాయం గుర్తుపెట్టుకుని, తమ ఉన్నతికి కారణమైన వాళ్ళని ఎప్పుడూ కలుస్తూ ఉంటాడు.

రెండు కానుపులకి అమ్మనే పిలిపించుకుంది.  రెండు ఇళ్లు కొన్నారు.

చూస్తూండగానే ఇరవై సంవత్సరాలు గడిచిపోయాయి. అనుపమలో చాలా  మార్పు, భాష, వేషం, తిండి అన్నింటా మార్పే. కాలంతో పాటు బుతువులు మారినంత సహజంగా, తను మారాను అని తనకే తెలియనంత సహజంగా మార్పు. మధ్యలో కేవలం ఐదారు  సార్లు ఇండియా వెళ్ళింది. ఉన్న రెండు నెలల్లో షాపింగులకే సగం సమయం గడిచిపోయేది. అమ్మ వాళ్ళ ఇంట్లో కొన్నిరోజులు అత్తమ్మ దగ్గర కొన్ని రోజులు. అంతేమళ్ళీ అమెరికా ఫ్లైట్ ఎక్కడం.

పెద్ద పిల్ల  శ్వేత, చిన్నాడు కార్తీకి అమ్మమ్మ, నానమ్మ, తాతయ్యలతో అనుబంధం కేవలం ఆ కొన్ని రోజులే.   మొదట్లో వారానికి ఒకసారి ఫోన్ లో మాట్లాడేది. సెల్ ఫోన్లు వచ్చినాక ,అమెరికా నుంచి తను ఇచ్చిన సెల్ ఫోన్ లోనే వారానికొకసారి వాళ్ళు మనుమడు మనుమరాలిని చూసి మాట్లాడుతూ మురిసి పోయేవాళ్ళు.

వీక్ డేస్ వర్క్ బిజీ, వీకెండ్స్ పార్టీలతో అదీ తగ్గిపోయింది. కార్తీ అచ్చంగా అమెరికా సంస్కృతికి వారసుడయ్యాడు. తల్లితండ్రులతోనే‌ మాట్లాడలేనంత బిజీ.

శ్వేత మాత్రం తండ్రి ఆలోచన, మనస్తత్వాన్ని పుణికి పుచ్చుకుంది.  అతని ఆశయాలకి అనుగుణంగా నడచు కుంటూనే తల్లిని కూడా ప్రేమించే మెచ్యూరిటీ ఉన్న యువతి శ్వేత.  ఇప్పుడు ఆంత్రోపాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నది. కార్తీ  యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాలో మెడిసిన్ లో జాయిన్ అయినాడు.

*                 *             **

అనుపమ‌ మనసులో ఆలోచనలు మంచు మేఘాల్లా ముసురుకుంటున్నాయి.

ఏదో కోల్పోయిన భావన. ఏం కోల్పోయాను?  అయిన వారి ప్రేమ ఆప్యాయతలు, తన సంసృతి సంప్రదాయాలు, తన భాష, అసలు తన ఉనికినే కోల్పోయింది. మానవత్వం, సేవాభావం అనేవి ఎప్పుడో మర్చిపోయింది. ఇవన్నీ అటుంచితే భర్త ప్రేమకు కూడా దూరమైంది. తను ప్రవర్తనతో అతనికి తన మీద నిర్లిప్త ధోరణి కలిగేటట్లు ప్రవర్తించింది.  సొంత కూతురిలా చూస్తూ తనకి  మేనత్త చేసిన సాయం ఆమె వేసిన భిక్ష గా భావించిందే కానీ ఆమె ప్రేమను చూడలేక పోయింది.  సందీప్ తో తన పెళ్ళికి ఆమె చేసిన సాయం మరువలేనిది.

*.      *.      *

సందీప్, అనుపమ కొలీగ్స్. సందీప్ ఆమె కంటే రెండేళ్ళు సీనియర్. తను టీం లోకి కొత్తగా వచ్చిన అనుపమ మొదటి చూపులోనే అతనిని ఆకర్షించింది. అందం, వర్క్ పట్ల అంకితభావం సందీప్ ని ఆమెకి దగ్గర చేసాయి. ఆమె తనకి దూరపు బంధువు అని తెలియగానే, పెద్దవాళ్ల ద్వారా పెళ్లి ప్రస్తావన తెచ్చాడు.

అనుపమకు అభ్యంతరం ఏమీ లేదు. అతను ఆర్థికంగా తమకంటే బాగానే ఉన్నాడు.‌ వాళ్ళది పూర్తిగా వ్యవసాయ కుటుంబం. అతనికి ఇద్దరు అక్కలు, అన్నయ్య. అందరికీ వివాహాలు అయినాయి. సందీప్ అన్న  ఇంటర్ తో చదువు ఆపేసి, పొలం పనులు చూసుకుంటున్నాడు. అక్కయ్యలు ఇద్దరూ స్థితిపరులే. కాబట్టి సందీప్ కి ఏ బాదరబందీ లేదు.  ఆమెకి కావాల్సింది అదే.

పైసా కట్నం లేకుండా అనుపమని  చేసుకున్నాడు సందీప్.

పెళ్ళయిన వెంటనే అమెరికా అవకాశం వచ్చింది సందీప్ కి. అనుపమకి కూడా మూడు నెలల తర్వాత అవకాశం వచ్చింది.

ఉద్యోగం లో అంచెలంచెలుగా ఎదుగుతూ ఇద్దరూ ఉన్నత స్థితికి వచ్చారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్యా తెలియని దూరం ఏర్పడసాగింది.  కొన్ని సంఘటనలకి, మార్పులకి ప్రత్యేకమయిన కారణం అంటూ ఉండదు.  కొందరి విషయంలో చిన్న అభిప్రాయభేదాలు , మరికొందరు విషయంలో దారులు వేరు కావటం.

అనుపమకు  అందరూ తనని చూసి ఈర్షపడేంత ఎత్తుకు ఆర్ధికంగా ఎదగాలని కోరిక. దానికోసం ఆమె సందీప్ ని కూడా పట్టించుకోకుండా తన కెరీర్ పైనే దృష్టి పెట్టింది. మనకు ఉన్నదానితో అందరికీ సాయం చేయాలనే గుణం సందీప్ ది. దానికి పూర్తి వ్యతిరేకం అనుపమ. పంటలు సరిగా పండక ఆర్ధికంగా ఇబ్బంది పడుతున్న సందీప్ అన్నకి ఆర్ధిక సాయం చేయటం అనుపమకు ఇష్టం‌ ఉండదు.

తను సంస్కృతి సంప్రదాయాలు, తన బంధువులు గురించి పిల్లలకు చెప్పాలనే తాపత్రయం సందీప్ కి. ఆ మట్టి మనుషుల వాసనే వద్దంటుంది అనుపమ. అరకొర చదువులతో, పల్లెటూరిలో ఉండే వాళ్ళు తమ స్థాయికి తగరు అనే చిన్నచూపు.  ఆచారవ్యవహారాలు మూఢనమ్మకాలు అనే భావన.

ఉద్యోగం పేరుతో తమ ఇరవై సంవత్సరాల వైవాహిక జీవితంలో ఇద్దరూ కలిసి ఒకేచోట ఉన్నది చాలా తక్కువ.  పిల్లలు, అనుపమ ఒకచోట, సందీప్ మరోచోట. ఆ ఎడబాటు మానసికంగా కూడా చాలా దూరం చేసింది.

తండ్రి చనిపోతే తను ఒక్కతే వెళ్లి వచ్చింది. మామగారు పోతే సందీప్ ఒక్కడే వెళ్లి వచ్చాడు. కోడలిగా రావటం నీ బాధ్యత అని సందీప్ ఎంతో చెప్పాడు. కానీ అదే సమయంలో డైరెక్టర్ గా తనకి ప్రమోషన్ వచ్చింది. ఇండియా వెళ్ళలేని పరిస్థితి. చివరికి సందీప్ ఒక్కడే వెళ్ళాడు కానీ  చివరిచూపు దక్కలేదు.

అయినవాళ్ళు  ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నాకూడా ఏనాడు తను సాయం చేయలేదు. బావకూతురు పెళ్ళి ఖర్చు తమకి పెద్ద సమస్య కాదు. కానీ మాటవరసకు కూడా డబ్బు కావాలా అని అడగలేదు. కానీ వారందరూ తమని ఎంతో ప్రేమిస్తున్నారు. ప్రతి ఫంక్షన్ లోను తమని కోల్పోతున్న బాధ వాళ్ళలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.

అనూషకి తనకీ ఎంతో తేడా! కోట్లు మూలుగుతున్నా ఒకళ్ళకి సాయం చేయాలనే ఆలోచనే రాదు తనకి. కానీ అనూష మరిది కొడుకు కోసం, తన సొంత ఇల్లు ఏర్పరచుకోవాలనే ఆలోచనని ఆనందంగా పక్కున పెట్టింది.

రేపు నిజంగానే తన బిడ్డలకి వారసత్వ సంపద ఏమి ఇస్తుంది తను ? ప్రేమాఆప్యాయతలు, మాతృభూమి మీద ప్రేమ లోపించిన ధనం ఇస్తున్నది.

బావ కూతురు పెళ్ళికి సందీప్ వెళ్ళాలని ఎంతో ఆశపడ్డాడు. కానీ అదే రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంది. దాంతో వెళ్ళలేక పోయాడు. అది అతనిలో అశాంతిగా మారి, రోజు రోజుకూ పెరుగుతోంది.

*.      *.      *

రెండు రోజుల తర్వాత వచ్చారు అనూష వాళ్ళు ట్రిప్ నుంచి. ఆ సరికే తన మనసులోని ఆలోచనలకు ఒక రూపం ఏర్పరచుకుంది అనుపమ.

“సందీప్, నీవు,నేను, శ్వేత డిసెంబర్ లో  ఇండియా వెళ్దాం,” టూర్ నుంచి సందీప్ రాగానే చెప్పింది అనుపమ.

“ఏంటి ఇంత సడెన్ గా,”

“అమ్మని, అత్తమ్మని చూసి చాలా ఏళ్ళయింది. చూడాలని ఉంది. అలాగే,మనూర్లో పొలాలు అమ్మొద్దని బావకి చెప్పు. తనకి డబ్బు ఏదైనా అవసరమైతే మనం ఇద్దాం,” అన్న అనుపమ మాటలకి,

కలో నిజమో అర్ధం కాలేదు సందీప్ కి  అలాగే చూస్తూ నిలబడ్డాడు.

“సందీప్, ఆకాశానికి ఎదగాలంటే  భూమితో తెగతెంపులు చేసుకోకూడదు అనే సత్యం ఇన్నేళ్ళకి గ్రహించాను.  నా ప్రవర్తనతో నీవు ఎంత విసిగి పోయి ఉంటావో.  పిల్లలు ఇప్పుడు శాశ్వతంగా ఇండియా రావటానికి ఇష్టపడరు. కానీ మనకి అవకాశం ఉంది. కావల్సిన దానికంటే ఎక్కువగానే సంపాదించాం. ఇంకో ఐదేళ్ల తర్వాత మనం ఇండియాలోనే ఉందాం” అంది అనుపమ.

ఆమెని అలాగే చూస్తూ నిలబడ్డాడు. శిల నుంచి శిల్పం గా మారిన భార్యలో తాను మొదటిసారి చూసిన అనుపమ కనపడుతోంది అతనికి .

తను శిల్పంగా మారటానికి కారణం అనూష అని సందీప్ కి ఏదో ఒక రోజు తెలియ చేయాలి అనుకుంది అనుపమ.

*                 *             **

రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో లాండయింది ఫ్లైట్. చిన్ననాటి జ్ఞాపకాలు చిరుజల్లులై మనసును తాకుతుండగా, ఉద్వేగంతో తన మాతృభూమి పైపాదం మోపింది అనుపమ.

క్యాబ్ లో కూర్చోగానే, అసంకల్పితంగా ఆమెకి తన  అమెరికా లోని తన ఫ్రెండ్ జెన్నీఫర్ గుర్తుకొచ్చింది. ఎప్పటినుంచో అడుగుతున్నది, ‘ఇండియన్ కల్చర్ మీద రీసెర్చ్ చేయాలనుకుంటున్నా, హెల్ప్ చేయవా’ అని.

అప్పుడు బోర్ అనిపించిన సబ్జెక్టు ఇప్పుడు అనుపమకు ఇష్టమైంది.

వెంటనే కాల్ చేసింది, “హాయ్ జెన్నీ, నీ రీసెర్చ్ కి ఇన్ఫర్మేషన్ నేను ఇండియా నుంచి వచ్చాక ఇస్తా.”

విండో కుండా బయటికి చూస్తూ మెల్లిగా హోమ్ చేసుకోసాగింది, ” నాదు జన్మభూమి కంటే నాక మెక్కడుంది,సురలోక మెక్కడుంది,”

సమాప్తం

Written by PVS Krishnakumari

పీ.వీ.యస్.కృష్ణకుమారి.
ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్
శ్రీవాణి మోడల్ హైస్కూల్
9494510994

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

నేను చూసిన మూడుతరాల ‘స్త్రీ’

తరుణి తరుణం