ఒంగోలు పనిమీద వెళ్లిన సుధాకర్ కి దారిలో బట్టల షాపు దగ్గర గాయత్రి కనిపించింది.
కారు ఎక్కి వెళ్ల బోతుంటే గాయత్రీ అని పిలిచాడు.
వెనక్కి తిరిగి చూసింది.
చెల్లెమ్మా బాగున్నావా! అంటూ పలకరించాడు సుధాకర్.
నువ్వా!అన్నయ్యా! ఎంత కాలానికి చూశాను. మేము ఇక్కడే ఉంటున్నాము అన్న సంగతి మర్చిపోయావా! అవునులే మేము ఎలా గుర్తుంటాం! ఇక్కడికి మా ఇల్లు దగ్గరే రా వెళదామంది.
ఒక ముఖ్యమైన పనిమీద ఆఫీస్ కి వెళ్ళాలి. సాయంత్రం వస్తాలే అన్నాడు సుధాకర్.
మనం కలిసి చాలా కాలమైంది. ఫోన్లు కూడా చేసుకోవడం లేదు. ఇంతకీ సారధి ఎలా ఉన్నాడు. ఏమైనా మారాడా ! ఇంకా అలాగే ఉన్నాడా!
సాయంత్రం వస్తావుగా చూడు. అన్నది.
అడ్రస్ తీసుకొని బయలుదేరాడు సుధాకర్.
గాయత్రి ని చూస్తే ఆశ్చర్యంగా అనిపించింది. కూరగాయల సంచి మోసుకుంటూ చాలా దూరం నడిచి వెళ్ళేది. అలాంటిది ఇవాళ కార్లలో తిరుగు తున్నది. సారధి బాగనే సంపాదిస్తున్నాడు. తప్పకుండా వెళ్లి చూడాల్సిందే అనుకున్నాడు.
సాయంత్రం ఆఫీసు పని పూర్తి చేసుకుని అడ్రస్ వెతుక్కుంటూ సారధి వాళ్ళ ఇంటికి వెళ్ళాడు.
ఆరంతస్తుల అపార్ట్మెంట్. లిఫ్ట్ సెకండ్ ఫ్లోర్ లోకి వెళ్లాడు. పుట్టి పెరిగిన ఊరిని తల్లిదండ్రులని వదిలేసి ఇక్కడ బిజినెస్ చేస్తున్నాడు. సారధి కి మొదటి నుంచి డబ్బు మీద ఆశ. ఇద్దరూ కలిసి జిల్లా పరిషత్ హై స్కూల్ లో పదవ తరగతి వరకు చదువుకున్నారు. సారథి వాళ్ల నాన్న వ్యవసాయం చేస్తాడు. కొడుకుని కూడా వ్యవసాయంలోకి దింపాడు. వ్యవసాయం చేయటం సారధికి ఇష్టం లేదు. పెద్ద ఉద్యోగం చేయాలని కోరిక ఉండేది.
సుధాకర్ మాత్రం డిగ్రీ పూర్తి చేసి టైప్ పరీక్షలు అన్ని పాసై మున్సిపాలిటీ ఆఫీసులో టైపిస్ట్ గా చేరాడు. అప్పటినుంచి వాళ్ళ స్నేహం మాత్రం చెడిపోలేదు.
సారధి చేసే పనులు గాయత్రి ద్వారా తెలుసుకొని బాధపడేవాడు సుధాకర్. సారధిని కలిసినప్పుడల్లా నువ్వు తప్పు చేస్తున్నావ్ అంటూ హెచ్చరించేవాడు. ఇప్పుడేమైనా మార్పు వచ్చిందేమో అనుకుంటూ కారిడార్ లో నడుస్తున్నాడు.
మెట్ల చివరగా నిలబడిన వ్యక్తి తెల్లని ఇస్త్రీ బట్టలు వేసుకుని చేతిలో సెల్ఫోన్ పట్టుకొని అటువైపు తిరిగి ఎవరితోనో మాట్లాడుతున్నాడు సీరియస్ గా.
అతను సారధి అనుకున్నాడు సుధాకర్. ఫోన్ మాట్లాడటం పూర్తయ్యాక కలవచ్చు అనుకొని అక్కడే నిలబడ్డాడు.
అటు నుంచి గట్టిగా ఎవరినో హెచ్చరిస్తున్నాడు సారధి. నేను చెప్పిన పని పూర్తయిందా! మన చేతులకు మట్టి అంటకూడదు. చెప్పిన పని జాగ్రత్తగా చేయండి. మాట వినకపోతే ఏం చేయాలో మీకు తెలుసుగా! అడ్డు తొలగించైనా సరే ఆ స్థలం మనకి దక్కాల్సిందే. ఏమన్నా జరిగితే నేను చూసుకుంటాను. పోలీసులు, లాయర్లు అంతా మన చేతిలో ఉన్నారు. ఇంకా అవసరమైతే ఆ క్రిమినల్స్ ని కూడా రంగంలోకి దింపుతాను. ఎవరికీ అనుమానం రాకూడదు. రాత్రికి వచ్చి కలవండి. ఖర్చుల కోసం నోట్లు పడేస్తాను. ఎలాగైనా మనం అనుకున్నది జరగాల్సిందే అంటూ ఫోన్ కట్ చేశాడు.
అక్కడే ఉన్న సుధాకర్ అంతా విన్నాడు. ఎంతకి దిగజారిపోయాడు. పేదవాళ్ల జీవితాలతో ఆడుకుంటున్నాడు. స్థలం కోసం ప్రాణాలు తీయటానికి అయినా సిద్ధపడ్డాడన్నమాట. ఎంత సంపాదించుకొని ఏం లాభం.
అప్పటికే సారధి లోపలికి వెళ్ళిపోయాడు. సుధాకర్ ఇంట్లోకి అడుగు పెట్టాడు. ఇల్లంతా ఇంద్ర భవనంలా ఉంది. ఇంటి నిండా ఖరీదైన వస్తువులు. ఎటు చూసినా ఆడంబరంగా కనిపిస్తున్నది.
గాయత్రి వచ్చి సుధాకర్ ని చూసి ఇప్పుడేనా రావటం. ఎవరొచ్చారో చూడమంటూ భర్తను పిలిచింది.
సారధి వస్తూనే సుధాకర్ ని చూసి ఎంత కాలానికి వచ్చావు. నీకు మిత్రుడు ఉన్నాడని మర్చిపోయావన్నమాట. పోనీలే! ఇప్పటికైనా వచ్చావు సంతోషం.
గాయత్రి లోపలికి వెళ్లి కాఫీ కప్పులతో తిరిగి వచ్చింది. ఉదయం దారిలో కనిపిస్తే నేనే అడ్రస్ చెప్పి రమ్మన్నాను.
మంచి పని చేశావు. సుధాకర్ ఈ పూట ఇక్కడే భోజనానికి ఉంటాడు. అన్ని వెరైటీ వంటలు చేయాలి అంటూ భార్యకి ఆర్డర్ వేశాడు.
మా చెల్లాయి పిల్లలు ఎలా ఉన్నారు! ఇల్లేమైనా కొన్నావా! పిల్లలు ఏం చదువుతున్నారు! బ్యాంక్ బ్యాలెన్స్ ఏమైనా దాచావా! నీతి పాఠాలు వల్లిస్తూ మడి కట్టుకొని కూర్చున్నావా!
అదే నీకు నాకు ఉన్న తేడా! వచ్చిన జీతంతో గుట్టుగా ఇల్లు జరిగిపోతున్నది. పిల్లలిద్దరినీ మామూలు కాన్వెంట్లో చదివిస్తున్నాను. అద్దె ఇంట్లో కాలక్షేపం. ఇంతకంటే నాకు ఎక్కువ ఆశలు ఏమీ లేవు అన్నాడు సుధాకర్. నువ్వు మారవులే! గొర్రె తోక బెత్తడి అన్నట్లు ఉంటావు. చూశావుగా! ఈ ఫ్లాట్ నా సొంతం. పిల్లల్ని హాస్టల్లో పెట్టి చదివిస్తున్నాను. మనదంతా ఫైనాన్స్ బిజినెస్. వడ్డీలకి ఇవ్వడం, తీసుకోవటం. మరోపక్క రియల్ ఎస్టేట్. ఈ రెండిటికీ మంచి టార్గెట్ ఉంది. రాబడికేం తక్కువ లేదు. ఈమధ్యనే కారు కొన్నాను. అంటూ తన దర్జాని బయట పెట్టాడు.
సారథి చెప్పక పోయినా అతని వాలకం తెలుస్తూనే ఉంది.
చేతి ఐదు వేళ్ళకి ఉంగరాలు, మెడలో గోల్డ్ చెయిన్ కనిపిస్తూనే ఉన్నాయి.
“అంతేనా! రౌడీ ఇజం కూడా చాలా ఇస్తున్నావా?
నువ్వు చెప్పకపోయినా ఇందాక నీ మాటలను బట్టి తెలుసుకున్నాను.
“ఈ రోజుల్లో కండబలం అండబలం ఉన్నవాడే మనిషి. రాజకీయ మైనా, రౌడీయిజమైన బతకడానికి ధైర్యం ఉండాలి. బతకాలంటే కొన్ని పనులు చేయక తప్పదు. భయపడటం కాదు భయపెట్టాలి. అప్పుడే సమాజంలో ధైర్యంగా తిరగ గలుగుతాం.
పాపము అని జాలి పడితే జనాభా లెక్కల లోకి కూడా పనికి రాము.
అందుకని పరాయి వాళ్ళ ఆస్తి కోసం ఆశ పడటం తప్పు కాదా. ఎంతమంది దగ్గర మోసం చేసి స్థలం లాక్కుంటావు. ఎప్పటికైనా అది ప్రమాదమని తెలుసుకో!
దేనికైనా ఒక హద్దు ఉండాలి..
నా ఒక్కడి కోసం సంపాదించ టం లేదు. నా పిల్లలు కష్ట పడకూడదని. నా భార్యాబిడ్డల్ని సుఖ పెట్టాలని.
పేదల సంక్షేమం కోసం పాటుపడాలి కానీ కడుపులు కొట్టి ప్రాణాలు తీయడం మానవత్వం అనిపించుకోదు.
సరేలే. నాకు ఎన్నో సార్లు హితబోధ చేశావు. నేను మారలేక పోతున్నాను. ఇది నా బలహీనత.
నీలాగా బతకటం నాకు చేత కాదు. సొంత ఇల్లు లేకపోయినా బాధ పడను. పచ్చడి మెతుకులు తిన్నా హాయిగా బ్రతుకు తాను..
కాఫీ చల్లారి పోయింది. తాగలేదు.
నాకు తాగాలనిపించలేదు.
కాఫీ నీకు ఇష్టమే కదా! మానేశావా ఏమిటి?
“మీ ఇంట్లో కాఫీ తాగాలనిపించడం లేదు. ఆ కాఫీలో నాకు పేద వాళ్ళ ప్రాణాలే కనిపిస్తున్నాయి. నువ్వు ఇలాంటి వాడవని తెలిస్తే ఇక్కడికి వచ్చేవాడిని కాదు. పొలాలు స్థలాల కోసం డబ్బు కోసం హత్యలు చేయడానికి వెనుకాడనివాడివి నిన్ను నా స్నేహితుడని చెప్పుకోవడానికి నాకు చాలా బాధగా ఉంది.
పోనీలే అన్నయ్య! ఆయన్ని మార్చడం మన వల్ల కాదు. ఆ భగవంతుడే ఎప్పుడో ఒకరోజు మార్చలేక పోతాడా!
నేను బయలు దేరుతానంటూ లేచాడు.
ఇంత కాలానికి వచ్చావు. భోజనం అయిన చేసి వెళ్ళమని ఇద్దరు ఎంత బ్రతిమాలిన సుధాకర్ అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండలేక బయటకు వచ్చేసాడు.
సుధాకర్ అలా వెళ్ళిపోవటం గాయత్రి కి బాధగా అనిపించింది.
“బ్రతకటం చేత కానివాడు. సుఖ సంతోషాలను, ఎవరు వదులు కొంటారు. చూస్తుంటే పిచ్చి వాడిలా ఉన్నాడని నవ్వు కొన్నాడు సారథి.
కొందరికి మంచి మాటలు చెవి కెక్కవు. సారథి తన రూట్ మార్చు కాలేదు. అన్యాయంగా సంపాదించినది ఎంత కాలం ఉంటుంది. ఎప్పుడో ఒకప్పుడు ఫలితం అనుభవించక తప్పదు.
గాయత్రి గురించి బాధ పడ్డాడు సుధాకర్.
అప్పుడప్పుడు గాయత్రి ఫోన్ చేస్తూనే ఉంటుంది. పిల్లలకి కష్టం ఏమిటో తెలియనికుండా పెంచుతున్నాడు. అడిగినంత డబ్బు ఇచ్చి వాళ్ళని చెడగొడుతున్నాడు. వాళ్లు కూడా ఏదో ఒక రోజు తండ్రి బాటలో నడుస్తారని భయంగా ఉందని తన బాధను వెళ్ళబోసుకుంది సుధాకర్ దగ్గర.
నువ్వు భయపడినట్లు జరగదులే ధైర్యంగా ఉండు. అవసరం అనుకుంటే నాకు ఫోన్ చేయమంటూ ధైర్యాన్ని చెప్పాడు.
కాలం గడిచే కొద్ది సారధి మరింతగా ఎదిగాడు. ఎక్కడ బడితే అక్కడ ఇళ్ళు, స్థలాలు పొలాలు కొనిపెట్టాడు. రౌడీ యిజంపెచ్చు మీరి పోయింది. నన్ను మించిన వాడు లేడని విర్ర వీగు తున్నాడు.
“కాలం ఎప్పుడూ ఒకటిగా వుండదు.
ఆరు నెలల తర్వాత పేపర్ లో వచ్చిన వార్త చూసి సుధాకర్ ఆశ్చర్యపోయాడు.”రౌడిగా చెలామణి అవుతున్న సారథి అనే వ్యక్తి స్థలం వివాదంలో మరొక రౌడీ చేతిలో హత్య చేయబడ్డాడు అంటూ పేపర్లో పెద్దపెద్ద అక్షరాలతో రాయబడి ఉంది.
ఇప్పుడు అనుకొని ఏం లాభం. ఎంతమంది అమాయకులను దోచుకున్నాడో, ఎంతమంది ప్రాణాలను బలి తీసుకున్నాడో!
చేసిన పాపం ఊరికే పోతుందా! పోలీసులకు చిక్క కుండా తప్పించుకు తిరిగాడు. చివరికి ఒక రౌడీ చేతిలోనే హత మయ్యాడు.
“గాయత్రి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది.”
వెంటనే బయలు దేరి వెళ్ళాడు సుధాకర్.
చేసిన తప్పు దిద్దుకో లేదు. మోసం ఎంత కాలం దాగు తుంది. చివరికి హత్య చేయ బడ్డాడు.
గాయత్రి గొల్లు మంది.
పోలీసులు వచ్చి డెడ్ బాడీని స్వాధీనం చేసు కొన్నారు. అన్యాయంగా సంపాదించినది పోలీసులు స్వాధీనం చేసుకొన్నారు.
ఎంత మందిని బెదిరించి భూ కబ్జాలు చేశాడు. అది పేద వాడి స్థలం అని తెలిస్తే చాలు. తన సొంతం కావటానికి ఎంతటి దారుణానికైనా తెగిస్తాడు. పేదల శవాల సమాధుల మీద బిల్డింగులు కట్టించాడు. మూడు తరాలకు సరిపడా దాచి పెట్టాడు. చివరికి ఏం మిగిలింది. చచ్చాక ఖననం చేయటానికైనా, దహనం చేయడానికి అయినా ఎన్ని అడుగుల నేల కావాలి. అక్రమంగా సంపాదించిన ఆస్తులు స్థలాలు ఎన్నటికీ నిలవలేవు. కష్టపడి సంపాదించుకుంటేనే ఫలితం దక్కుతుంది. సారధి లాంటి వాళ్ళకి ఆదేవుడే తగిన శిక్ష విధించాడు.
జరిగిన దాన్ని తలుచుకొని బాధపడ్డాడు సుధాకర్.