అమ్మప్రేమ లేని ఇల్లు… దేవుడు లేని దేవాలయం, పుస్తకాలు, లేని గ్రంథాలయం, జీవనం లేని శరీరం. కౌసల్యాదేవి తన పుట్టినింటివారైన నల్గొండ జిల్లా వాస్తవ్యులు కొలనుపాక వంశస్తులకు చెడ్డపేరు రాకుండా, మెట్టినింటి వారైనా పెండ్యాల వంశస్తులకు మంచిపేరు తేవాలని నిరంతరం శ్రమిస్తూ నిరాటంకంగా నిలబడిన ధీశాలి. కట్టుకున్న భర్త పెండ్యాల రాఘవరావు ఆదర్శాలను ఆలంబనగా చేసుకుని ముందుకుసాగింది. రాఘవరావు గారికి అన్ని కార్యక్రమాల్లో కష్టసుఖాల్లో తోడూ నీడగా నిలిచింది. ఆయన ఆమెను ఒంటరిని చేసిన ఈ ఇరవై ఎళ్ళలోనూ మొక్కవోని ధైర్యాన్ని ప్రదర్శిస్తూ బతుకును భారంగా కాక బంగారం అనుకుని జీవించాలని చెప్పిన ఆమె మరణించినా, మరణించినట్లే.
చిన్ననాటి నుంచి తనదైన ప్రత్యేక శైలి కలిగిన కౌసల్యదేవిపై తొలినాళ్లలో ఆర్థిక, సామాజిక, రాజకీయ పరిస్థితులు చూపిన ప్రభావం చాలా ఎక్కువే. ఆనాటి తెలంగాణ ప్రాంతంలోని ప్రభుత్వ నిరంకుశ పాలనా వైఖరి, రజాకార్ల దౌర్జన్యకర చర్యలూ ఆమెలోని మానవత్వాన్ని ఉప్పెనలా కదిలించాయి. తన తెలివిని తోటి అమాయక ప్రజలకు దోపిడికి గురైన జీవులకు ధైర్యాన్ని కొంతైనా సహాయపడితే చాలునని తనవంతు కృషి చేసిన స్వాతంత్య్ర సమరయోధురాలు కౌసల్యదేవి. తన అన్నగారైన కొలనుపాక గోపాల్ రావు గారి కమ్యూనిస్టు భావాలు, భర్త పెండ్యాల రాఘవరావు గారి సాయుధ పోరాట ప్రభావాలు సహజంగా ఆమెలో ఉన్న దేశ భక్తికి తోడయ్యాయి. సనాతన కుటుంబంలో పుట్టినా ఆమె సంప్రదాయాలను విప్లవాత్మకంగా ఆలోచించి, ఆచరించి సన్మార్గంలో పయనించింది. స్వతహాగా దైవభక్తి కలిగిన కౌసల్యాదేవి తనపై పడిన ఆదర్శ భావాలన్నీ కలిసి ఆమెను స్వచ్ఛమైన స్త్రీ మూర్తిగా తీర్చిదిద్దాయి.
ఈదేశం నాకేమిచ్చింది అని కాదు ఈ దేశానికి నేనేమి చేశాను అని ప్రశ్నించుకోవాలని, మనిషి స్వశక్తిని నమ్ముకోవాలని తన తోటి వారికి మేలు చేయలేక పోయినా కనీసం కీడు చేయకూడదనీ, సోమరితనం మనిషిని నిర్వీర్యం చేస్తుంది కాబట్టి ఎప్పుడూ ఏదో ఒకటి చేయలని చెప్పే స్థాయికి ఎదిగిన కౌసల్యాదేవి ఆచరించి చూపింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటి పార్లమెంటు ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాలకు, ఒక పార్లమెంటు స్థానానికి అత్యధిక మెజారిటీతో గెలుపొందిన కమ్యూనిస్టు నాయకులైన పెండ్యాల రాఘవరావు గారిని భర్తగా పొందినా గర్వం తన దరికి చేరనివ్వలేదు కౌసల్యదేవి. అనునిత్యం ప్రజలతో మమేకమయి, భర్తకు వెన్నుదన్నుగా ఉన్న మానవతామూర్తి. మహిళా మండలి అధ్యకక్షురాలిగా ఘనపురం మండలానికే చిన్న పెండ్యాల గ్రామం ఆదర్శ ప్రాయంగా ఉండేలా చేసిన కౌసల్యాదేవి ఆదర్శ మహిళ.
గొప్ప ఇంట్లోని స్త్రీలు బయట తిరగడం తప్పుగా భావించే ఆకాలంలో ఆమె బావుల వద్దకు పొలాల వద్దకు వెళ్లి వ్యవసాయం చేయించేది. కొత్త కొత్త వంగడాలను పరిచయం చేస్తూ ఎంతో శ్రద్ధాసక్తులు ప్రదర్శిస్తూ మంచి పంట తీయడంలో భర్తకు తోడుండేది. అంతేకాదు గ్రామాభివృద్ధికై పాఠశా ఏర్పాటు పశువుల ఆసుపత్రి, ఆరోగ్య కేంద్రం, రోడ్డు సౌకర్యాలు కల్పించడం వంటి ఎన్నో విషయాల్లో రాఘవరావు గారికి చేదోడు వాదోడుగా ఉంటూ విజయాన్ని సాధించిన అద్భుత స్త్రీ శక్తి. తను నమ్ముకున్న ఆదర్శాలను వమ్ము చేయకుండా జీవించిన మల్టీపుల్ టాలెంటెడ్ లేడీ అని పేరు తెచ్చుకున్న కౌసల్యాదేవి నేటితరం స్త్రీలకు మార్గదర్శకురాలు… నీతి, న్యాయం, ధర్మం, మంచితనం, ధైర్యం వంటి మంచి లక్షణాలన్నీ కౌసల్యాదేవి చివరి వరకు తనతో ఉంచుకున్నారు. పలువురితో పంచుకున్నారు. ప్రేమించడం తెల్సు, ప్రేమించబడడం తెలుసు కాబట్టే అదృష్టవంతులకు అనాయస మరణం సంభవిస్తుంది అనంటూ ఆమెకు బంధువులు, పెద్దలు నివాళులర్పించారు. గొప్ప వ్యక్తిత్వం కలిగిన పెండ్యాల కౌసల్యాదేవి తన 76 ఏళ్ల జీవితాన్ని మే28నాడు చాలించడం తీరని లోటు.