ఝరుల సిరుల సడులు
గిరుల తరుల సొగసు
మధుర వేద రవము
మిళితమైన శోభతో
అలరారుతున్నది
భరతమాత నగవు.
“ఝరుల”
వీరులైన అమరుల
త్యాగ రుధిర కాంతులే
భరతమాత నుదిటిపై
మెరియుచున్న తిలకము
చెమట చిందు రైతుల
కృషి ఫలముల పొలములే
భరతమాత మేనిపై
తళుకుమనెడి చేలము.
“ఝరుల”
ధరణిలోని గనులే
ఘనతనొసగు నిధులై
తరుణి భరతమాతకు
ఖ్యాతినొసగు వరములు.
“ఝరుల”
వర్ణ వర్ణ విరులవంటి
భిన్నమైన సంస్కృతి
ఏకసూత్ర మాలికగా
కంఠసీమనలంకరించి
వెలుగొందెను భరతమాత
సకల విజయ దాతగా.
“ఝరుల”
శ్రమ జీవుల పెన్నిధిగా
వృద్ధినొందు పరిశ్రమలు
ప్రగతి చిహ్న కేతనముగ
గగన వీధినెగురుచుండ
చిరునగవులు చిందించెడి
భరతమాత జయము జయము.