ఎర్ర చందనం

డా॥ కందేపి రాణీ ప్రసాద్

ఎర్ర బంగారం, ఎర్ర చందనం అని పిలవబడే టీరో కార్పస్ శాంటాలిన్’ చెట్టు చాలా విలువైనది. ఈ కలపతో తయారైన వస్తువులు ఇంటిలో పెట్టుకుంటే కలసివస్తుందనే నమ్మకం ఉన్న దేశాలు ఈ కలపను దిగుమతి చేసుకుంటున్నాయి. మనదేశం నుండి ఎర్ర చందనాన్ని ఎగుమతి చేస్తే కోట్ల రూపాయలు రావడంతో స్మగ్లింగ్ ఎక్కువగా జరుగుతున్నది. ఇంతకీ ఈ ఎర్ర చందనం ఎక్కడ పెరుగుతుంది ? ఎలా పెరుగుతుంది ? ఎందుకు ఇంత విలువ వచ్చింది ? వంటి విషయాలు తెలుసుకుందాం.
ఈ ఎర్రచందనం చెట్టు నల్లమల అడవుల్లోని శేషాచల మీరు కొండల్లోనే ఎక్కువగా పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరు కడప, నెల్లూరు, కర్నూలు జిల్లాలలో మాత్రమే లభిస్తుంది . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తప్ప మరెక్కడా కూడా ఈ చెట్లు పెరగవు. అందుకే ఆ చెట్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. శేషాచలం కొండల్లో పెరిగిన ఎర్ర చందనం మొక్కలకు మాత్రమే ప్రత్యేకమైన లక్షణాలున్నాయి. కొన్ని చోట్ల రైతులు వీటి సాగు చేసినప్పటికీ ఆ మొక్కల కలపకు రంగు రూపాల్లో తేడా వస్తున్నది. దీనికి కారణం శేషాచల కొండల్లోని మట్టిలో ప్రత్యేక లక్షణాలను కలిగి ఉండటమే. అక్కడి మట్టిలో ఐరన్, యురేనియం గ్రాఫైటు, కాల్షియం వంటివి మొక్కకు కావాల్సిన నిప్పత్రిలో ఉన్నాయి.

ప్రపంచం లోనే అరుదైన జాతికి చెందిన ఈ ఎర్ర చందనం మొక్కలు ‘ఫాబేసి’ కుటుంబానికీ, ఫాబోయిడే ఉప కుటుంబానికీ చెందినవి. దీని శాస్త్రీయ నామం “టీరోకార్పస్ శాంటాలిస్” అని చెప్పుకున్నాం కదా! దీని లోని ‘టీరో’ అంటే గ్రీకు భాషలో ‘కలప’ అనీ, ‘కార్పస్’ అంటే ‘పండు’ అనీ అర్ధం ఈ చెట్టు ఆకులు ‘ట్రైఫోలియేట్ గా ఉంటాయి. ఈ ఆకులు 3-9 సెం.మీ పొడవు వరకు పెరుగుతారు ఈ చెట్టు దాదాపు 8 మీటర్ల వరకు పొడవు పెరుగుతుంది. దీని కాండం చుట్టు కొలత 50-150 సెంమీ వరకు ఉంటుంది. దీని కాండం ముదురు ఎరుపు రంగులో ఉండడమే దీని యొక్క అత్యంత ప్రసిధ్ధమైన లక్షణం. ఈ కారణంగానే దీని కలపతో తయారైన వస్తువులు ఎరుపు రంగుతో ఆకర్శణీయంగా ఉంటాయి. ఇది మొక్కగా ఉన్నపుడు అంటే తొలి మూడు సంవత్సరాలలో చాలా వేగంగా పెరుగుతుంది. అంటే మూడేళ్ళ వయసుకే 16 అడుగుల దాకా పెరుగుతుంది. ఇరవై సంవత్సరాల వయసులో చెట్టు కలపను వాడటం మొదలు పెడతారు. దీని కాయ చాలా గట్టిగా ఉంటుంది . దీని ఫలం లో ఒకటి లేదా రెండు విత్తనాలు ఉoటాయి.
ఎర్ర చందనం కూడా అంతరించి పోయే వృక్షాలలో ఒకటని IUCN వివేదికల ప్రకారం తెలుస్తోంది. భారీగా ఈ చెట్లను కొట్టి వేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అందుకే ప్రభుత్వం ఎర్ర చందనం చెట్లను కొట్టటం నిషేధమని చెప్పింది. అయినప్పటికీ తెలియకుండా ఎన్నో చెట్లను నరికి వేసి స్మగ్లింగ్ చేస్తుంటారు. కడప, కర్నూలు జిల్లాలలో ఈ చెట్లను పెంచడానికి కొంత అనుమతి ఇచ్చినప్పటికీ ఆ చెట్ల కలపలో నాణ్యత కనిపించడం లేదు. కేవలం చిత్తూరు జిల్లాలో పెరిగిన ఎర్రచందనం చెట్లకే విదేశాలలో ఎక్కువ డిమాండ్ పలుకుతున్నది శేషాచల కొండలలో ఉన్న మట్టి లొ ఉన్న ఖనిజాలే కారణంగా తెలుస్తున్నది.
ఎర్రచందనం కలపతో తయారయ్యే సంగీత వాయిద్యానికి జపాన్ దేశంలో మంచి గిరాకీ ఉన్నది. ఈ సంగీత సాధనాన్ని ప్రతి ఇంటిలో పెట్టుకోవడం ఆ దేశ ప్రజల ఆచారం. ఇంకా జపాన్ దేశంలో ఎర్ర చందనంతో బొమ్మలు కూడా చేస్తారు. పూర్వం అధిక మొత్తంలో ఈ కలపను జపాన్ దేశం దిగుమతి చేసుకునేది. ఇపుడు చైనా దేశం కలపను ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నది మీరు కూడా బొమ్మలు, సంగీత వాయిద్యాలతో పాటు వాస్తుకు సంబంధించిన అనేక వస్తువులు తయారు చేస్తారు. ఈ కలప ఎర్రగా ఉండటం వలన నకిలీ రుద్రాక్షలు కూడా తయారు చేస్తున్నారు. అంతే కాకుండా సుగంధ ద్రవ్యాలు మందులు వంటివి తయారు చేయడం కూడా ఎక్కువగానే ప్రాచుర్యంలో ఉన్నది ఎక్కువగా ఈ కలపతో తయరైన వస్తువులు ఇంటిలో ఉచుకుంటే మంచి జరుగుతుందనే నమ్మకం ఉన్నది. నేను తిరుపతి వెళ్ళినపుడు ఈ చెట్టును చూపించమని అడిగితే లోయల్లో ఉంటుందని చెప్పారు. కాణిపాకం దగ్గర్లో ఎర్రచందనం చెట్టును మా కారు డ్రైవరు చూపించాడు. అప్పుడే అతను “ఏమైనా ఎర్రచందనం వస్తువులు కావాలా” అని అడిగితే వద్దని చెప్పాను అలాగే కడప జిల్లాలోని మిత్రులు ఎర్రచందనం తో గ్లాసులు చేయించుకుని మంచినీరు తాగితే మంచిదని చెప్పి వాళ్ళింట్లో ఆ గ్లాసుతో మంచి నీళ్ళు ఇచ్చారు. కడపలోని బ్రహ్మం గారి మఠం వెళుతున్నపుడు దూరంగా ఏర్ర చందనం చెట్లను చూపిచారు. కానీ దగ్గరగా చూడలేదు. ఆకులతో బొమ్మలు చేసుకునే ప్రాజెక్ట్ లో అప్పుడు లేనందున అక్కడ నుంచి ఆకులు తెచ్చుకోలేక పోయాను. దీని ఆకులు దీర్ఘ అండకారంలో ఉండి చూపరులను ఆకర్షిస్తాయి. పసుపురంగు పువ్వులతో ఆకర్షణ పత్రావళి ఒక గొట్టంలా ఏర్పడి ఉంటుంది. పువ్వులు పొట్టి రెసిమ్ లుగా ఉత్పత్తి అవుతాయి. కాయ 6-9 సెంటి మీటర్ల పొడువు తో ఉంటుంది.
పూర్వ కాలంలో చక్రవర్తులు, రాజులు ఈ కలపను కుర్చీలు, బల్లలు వంటి ఫర్నీచర్ కోసం ఉపయోగించే వారు. చైనాలోని క్వింగ్ రాజ వంశీయులు ఎక్కువగా ఈ కలపనే ఉపయోగించేవారు. అక్కడ దీనిని ‘జిటాన్’ అనే పేరుతో పిలుస్తారు. కానీ చైనా లోని పూర్వ పాశ్చాత్య రచయితలు ‘ట్టు-టాన్’ అని పుస్తకాలలో రాశారు. చైనా లోని బీజింగ్ లో ఉండే రాజ భవనాల ఫర్ బిడెన్ సిటీ లో ఇప్పటికీ ఎర్ర చందనం తో చేసిన కుర్చీ ఒకటి ఉన్నది. ఇది ‘ హాల్ అప్ సుప్రీమ్ హార్మొనీ’ లో ఉన్నది. నేను చైనా లోని ఫర్ బిడెన్ సిటీని చూసినప్పుడు అక్కడ ప్రత్యేకంగా ఈ కుర్చీని ఎవరూ చూపలేదు. అన్ని వస్తువుల్లాగే దానినీ చూశాము తప్ప ప్రత్యేకత తెలియదు. వేయి సంవత్సరాలుగా అత్యంత విలువైన చెక్కలలో ఎర్ర చందనం ప్రముఖంగా గుర్తించబడింది. దీనికి దగ్గరగా ఉండే జాతులలో వైలెట్ రోజ్ వుడ్ పేరు పొందినది. ఈ వైలెట్ రోజ్ వుడ్ ను “ బోయిస్ డి రోజ్ “ అని పిలుస్తారు. డల్బెర్జియా లవేలి డల్బెర్జియా దూరిటిమా “ అనే జాతులు జిటాన్ కర్రకు సారూప్యంగా కనిపిస్తాయి. ఈ కలపను కత్తిరిస్తే ప్రకాశవంతమైన క్రిమ్ సన్ పర్పుల్ రంగులో కనిపిస్తుంది. అంతే కాక తర్వాత ముదురు ఉదా రంగులోకి దూరుతూ సువాసనను వెదజల్లుతుంది.
ఎర్ర చందనం మొక్కకు అనేక పేర్లు ఉన్నాయి.రక్త చందనం, రెడ్ శాండర్స్, చెంచందనం, శాండర్స్ వుడ్ అనే రకరకాల పేర్లతో పిలవ బడుతున్నది. ఇది ఎర్రగా ఉండటం వల్ల కలర్ ఏజంట్ గా కూడా వాడతారు. ఎర్ర చందనాన్ని దూపం వేయటానికి కూడా ఉపయోగిస్తారు. ఎర్ర చందనం చెట్లలా కనిపించే ‘సుగంద శాంటాలమ్’ చెట్లు దక్షిణ భారతదేశంలో చాలా కనిపిస్తాయి. కాని ఇవి ఎర్ర చందనం చెట్లు కాదు పూర్వపు రాజులు ఈ కలపతో వంతెనలు నిర్మించేవారు. జపాన్ లోని సంగీత వాయిద్యం పేరు ‘షమీ సేన్’. ఈ వాయిద్యపు మెడ భాగానికి ఎర్ర చందనపు హార్డ్ వుడ్ పనికొస్తుంది.
ఈ కలపను గ్రేడింగ్ చేయడంతో ఇంకా ఎక్కువవ ధర పలుకుతుంది. 750 మీటర్ల ఎత్తులో పాక్షిక శుష్క వాతావరణ పరిస్థుతులలో విలక్షణంగా ఉంగరాల ధాన్యపు అంచును కలిగి ఉంటుంది. ఈ ఉంగరాల ధాన్యపు మార్జిన్ కలిగిన కలపను A గ్రేడ్ కలపగా గుర్తిస్తారు. దీనికి ప్రత్యేకమైన గుర్తింపు విలువ ఉంటాయి. ఈ చెట్లు చలిని తట్టుకోలేవు.
ఎర్ర చందనం చెట్టును అంతరించి పోతున్న చెట్లుగా I U C N జాబితాలో చేరిందని చెప్పుకున్నాం కదా! మరల 2018 లో ఈ ఎర్ర చందనాన్ని ‘ నియర్ ద్రిటెడ్’ గా మళ్ళి గుర్తించారు. అత్యధికంగా స్మగ్లర్ల దోపిడీకి గురవుతున్నoదున తీవ్రంగా అంతరించే దశలో ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు. పై పెచ్చు ఆంధ్ర రాష్ట్రంలో తప్ప ప్రపంచంలో మరెక్కడా పెరగదు.
ఆయుర్వేదంలో ఎర్ర చందనాన్ని ఎక్కువగా వాడతారు. ఎర్ర చందనాన్ని చర్మం నునుపుదనానికి కూడా వాడతారు. ఔషధాల తయారీలో వాడినప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువగానే ఉంటాయి. ఆయుర్వేదంలో దీనికి రక్తస్రావం అరికట్ట టానికి ఉపయోగిస్తారు. స్కిన్ బ్రైటేనింగ్, యంటి ఏజింగ్ ఏజంట్, ఆయిల్ బ్యాలెన్సింగ్ స్కిన్ డిటాక్సీ ఫికేషన్, యాంటి ఇన్ ఫ్లమేటరీ, యాక్షన్, స్కిన్ హీలింగ్ వంటి వాటికీ ఎర్ర చందనాన్ని ఉపయోగిస్తున్నారు. మొటిమల చికిత్సకు కూడా దీన్ని వాడతారు. రెడ్ శాండల్ సబ్బులు కూడా తయారు చేస్తారు. ఇన్ని ఉపయోగాలున్న ఎర్ర చందనాన్ని అంతరించి పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉన్నది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మాతృభాషను మర్చిపోవడం న్యాయమా?

మనుషులే !!