పరాయి పాలన అంతమొందినా
మనకు పరభాష వ్యామోహం తీరలేదు.
ఆ వ్యామోహంతోనే తేనె పట్టు లాంటి మన తెలుగును విడిచి
అర్థంలేని ఆడంబరాలతో పరాయి పంచన పడి
అమ్మ వంటి మాతృభాషను మర్చిపోవడం న్యాయమా?
ఏ ఇతర భాషలో లేని శబ్దాలంకార సౌందర్యము,
నుడికారపు మాధుర్యము,
చెప్పదలుచుకున్న విషయాన్ని చెప్పకనే చెప్పే చతురోక్తులు
నానా రుచిరార్ధ సూక్తి నిధులు
నవరస రమ్య భరితమైన హావభావాలు….
ప్రతిపద చమకృతులు….
ఆలోచించే వ్యవదిలేని ఆశువులు….
కావ్యాలు, ప్రబంధాలు ,పురాణాలు, ఇతిహాసాలు,
కథలు ,పద్యాలు, గేయాలు, గల్పికలు ,నవలలు,
నాటికలు, యక్షగానాలు, ఇలా ఎన్నో ఎన్నెన్నో
ప్రక్రియల ద్వారా చెప్పదలుచుకున్న విషయాన్ని
Aఅలతి అలతి మాటలతో….
అర్థవంతమైన భావాలతో స్పష్టంగా
పండిత పామరులకు కూడా అర్థమయ్యే రీతిలో
తెలియజేసే అమ్మ వంటిది మన తెలుగు భాష.
పరాయి దేశాలు కూడా మన భాష, యాస,
సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తుంటే….
మనం మాత్రం పరాయిపోకడతో, పరభాషా వ్యామోహంలో పడి
అమ్మ చేతి గోరుముద్ద లాంటి కమ్మనైన అమ్మ, నాన్న ,
అక్క ,అన్న అనే పిలుపు మరచి
మమ్మీ, డాడీ ,సిస్టర్, బ్రో అనే నిర్జీవమైన పదాలను
అలవోకగా అలవాటు చేసుకున్నాం.
ఇది ఎంతవరకు సమంజసం????
నేటి నుండైనా పరభాషను పక్క నుంచి…. అమ్మ వంటి
మాతృభాషని ,దాని ప్రాముఖ్యతనీ గుర్తించి మసలు కుందాం.
మన మాతృభాషను కాపాడుకుందాం.
దాని వైభవాన్ని దశదిశల చాటుదాం.