దొరసాని

19 వ భాగం

అమ్మా! మీ ఇంట్లో తరతరాల నుండి మేము పని చేస్తున్నాము అప్పట్లో మా అత్త చేసిందట నా పెళ్లి కాగానే నన్ను మీ ఇంట్లో చేయమని చెప్పింది మా అత్త “అమ్మగారు మంచిది ఆడనే పని చేసుకో నీకు నిమ్మలంగా ఉంటది మాకు కూడా ధైర్యం ఉంటది” అని చెప్పింది… అట్లే నేను నా పెళ్లయిన నుండి మీ ఇంట్లోనే చేస్తున్నా… ఇప్పుడు ఇద్దరు ఆడపిల్లలు పుట్టిండ్రు… ఇక్కడనే వచ్చింది సమస్య..

        లక్ష్మి మదన్

మా ఆయన చాలా మంచోడు నన్ను చాలా మంచిగా చూసుకుంటాడు ఇంట్లో పనిలో కూడా సహాయం చేస్తాడు అంతా బాగానే ఉంది కానీ ఈ మధ్య నన్ను చాలా ఏడిపిస్తున్నాడు…” మగ పిల్లవాడు కావాలి ఇద్దరు ఆడపిల్లలే ఉన్నారు మనకు వారసుడు కావాలి ఇంకో బిడ్డను కను” అంటున్నాడు…

నాకేమో ఇష్టం లేదు ఉన్న ఇద్దరు ఆడపిల్లలను మంచిగా చదివించుకొని మంచి ఇండ్లలకు పెండ్లి చేసి ఇస్తే చాలు అని నేను అంటున్నా. ఏ పిల్ల అయితే ఏంటమ్మా ఆడపిల్ల మగ పిల్లోడు వేరువేరా ఈ కాలంలో.. ఇలా ఎంత చెప్పినా కూడా వినడం లేదు రోజు ఇదే గొడవ మనకు కొడుకు కావాలి అంటాడు ఈరోజు ఆ మాటే పెద్ద గొడవగా మారింది నాకు ఇంకొక బిడ్డను కనడం ఇష్టం లేదమ్మా” అని మొహం చేతుల్లో దాచుకొని ఏడవ సాగింది..

” ఓ పిచ్చిదానా ఇంతదానికే ఏడుస్తున్నావా నాకు చెప్తే ఎప్పుడో పరిష్కరించేదాన్ని కదా ఇది చాలా చిన్న విషయం నేను మీ ఆయనతో మాట్లాడతాలే” అని చెప్పి ఊరడించింది నీలాంబరి..

” ముందు కళ్ళు తుడుచుకో మన దివాణం వచ్చేసింది ఎవరైనా చూస్తే బాగుండదు” అని చెప్పింది నీలాంబరి.

కళ్ళు తుడుచుకుని కిందికి దిగింది మహేశ్వరి… పూల బుట్ట ప్రసాదం తీసుకొని ఇంట్లోకి వెళ్ళింది నీలాంబరి కూడా ఆ వెనకే ఇంట్లోకి వెళ్లింది…

” మహీ! ఈ పూటకి నువ్వు ఇంటికి వెళ్ళిపో పొద్దటి నుండి నీ మనసు బాగాలేదు కదా ఇంటికి వెళ్లి నీ పిల్లలతో గడిపితే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది నేను నీ సమస్యను పరిష్కరిస్తాను వెళ్లి విశ్రాంతి తీసుకో” అని చెప్పింది నీలాంబరి.

” అయ్యో వద్దమ్మా నేను ఇంకా వంట కూడా చేయలేదు అయినా కూడా నాకు ఎంతో వెసులుబాటు కల్పిస్తున్నారు. పొద్దున వచ్చి మీకు ఫలహారం చేసి ఇంటికి వెళ్లి పోతున్నాను మళ్ళీ వచ్చి వంట చేస్తున్నాను ఇలా ఎన్నోసార్లు ఇంటికి వెళ్లి వస్తూనే ఉన్నాను ఇల్లు దగ్గరే ఉండటం వల్ల వస్తూపోతూ ఉన్నాను నన్ను ఎప్పుడు కూడా ఇక్కడే ఉండాలని మీరు నిర్బంధించలేదు కూడా ఇప్పుడు నేను వంట చేయకుండా వెళ్ళలేనమ్మ అయినా కూడా నా సమస్య మీకు చెప్పాను కదా దేవత వరం ఇచ్చినట్లే నాకు” అని చెప్పింది మహి.

” నేను చెప్తున్నా కదా నా మాట విను ఈరోజు వెళ్ళిపో ఇదిగో ఈ 500 తీసుకొని ఇంట్లోకి ఏవైనా కొనుక్కొని వెళ్ళు ఈరోజుకు పని నేను చూసుకుంటాను” అని కొంచెం గట్టిగా చెప్పింది నీలాంబరి.

” సరేనమ్మా” అంటూ వెళ్లిపోయింది మహేశ్వరి.

గదిలోకి వెళ్లి ఇంట్లో కట్టుకునే నూలు చీర కట్టుకుంది నీలాంబరి ఆ తర్వాత వంటింట్లోకి వెళ్లి ఏం వంట చేయాలని ఆలోచించింది అమెరికాలో రకరకాల వంటలు చేసేది గుర్తొచ్చింది… ఫ్రిజ్ తెరిచి ఏం కూరగాయలు ఉన్నాయో ఒకసారి చూసుకున్నది… అన్ని కూరగాయలు ఉన్నాయి వెంటనే పులావ్ చేద్దామని అనుకున్నది..

భోజనం చేసేది ఇద్దరే కాబట్టి ఒక ఆలుగడ్డ ఒక క్యారెట్ కొన్ని బీన్స్ కొంచెం మెంతికూర కొంచెం పుదీనా రెండు ఉల్లిపాయలు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు రెడీగా పెట్టుకుంది… బాస్మతి బియ్యం కడిగి నానబెట్టింది… తర్వాత కూరగాయలన్నీ ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లో పెట్టుకుంది…

తర్వాత మరో గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో ఉప్పు పసుపు వేసి వంకాయలను నాలుగు పక్షాలుగా చీల్చి అందులో వేసింది దానికి కావలసిన మసాలా అంతా తయారు చేసుకుంది.. పల్లీలు నువ్వులు ఎండు కొబ్బరి ఎండుమిర్చి ధనియాలు కొంచెం జీలకర్ర ఉల్లిపాయలు ఇవన్నీ వేయించుకొని ముద్దనూరుకొని పెట్టుకుంది కొంచెం చింతపండును కూడా నానబెట్టి పెట్టుకుంది…

ముందుగా వంకాయ కూర చేసేసింది నీలాంబరి.. బాండ్లీ లో నూనె వేసి అందులో పోపు దినుసులు వేసి వంకాయలు వేసి బాగా మగ్గించింది తర్వాత నూరుకున్న మసాలాని అందులో వేసి తగినంత ఉప్పు కారం చింతపండు పులుసు వేసి చక్కగా మూత పెట్టి మగ్గించింది ఆపై కొత్తిమీర చల్లి దించేసింది దానిని ఒక డిష్ లో పెట్టి మూత పెట్టి టేబుల్ పైన పెట్టేసింది…

తర్వాత పులావ్ కోసం కుక్కర్లో నెయ్యి వేసి దాల్చిన చెక్క లవంగము కొంచెం షాజీరా వేసి అందులో సన్నగా కోసిన ఉల్లిపాయలు ముందుగా వేసింది అవి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయిన తర్వాత కోసి పెట్టుకున్న కూరగాయ ముక్కలన్నీ వేసేసి నానబెట్టిన బియ్యాన్ని అందులో వేసి తగినంత ఉప్పు వేసి మూత పెట్టేసింది రెండు విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ దింపేసి తర్వాత పైన కొత్తిమీర ఉల్లికాడలు తరిగి వేసేసి కొంచెం పైనుండి నెయ్యి వేసి మూత పెట్టింది… ఇదంతా తనకు వంటలో ఎంతో నేర్పు ఉన్నట్లుగా చేసేసింది…. తర్వాత పులావ్ ని ఒక హాట్ కేసులో పెట్టేసి దాన్ని టేబుల్ మీద పెట్టింది తర్వాత ఫ్రిజ్లో నుండి పెరుగు తీసుకుని అందులో సన్నగా కోసిన ఉల్లిపాయ ముక్కలు కీరా దోస ముక్కలు ఉప్పు, పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర వేసి మూత పెట్టి టేబుల్ పైన పెట్టింది.. తనకే ఆశ్చర్యం అనిపించింది “ఏమిటి నేను ఇంత త్వరగా వంట చేయగలిగానా” అనుకున్నది…

వెళ్లి మొహం కడుక్కొని బొట్టు పెట్టుకొని ఫ్రెష్ గా తయారై వచ్చి హాల్లో కూర్చుంది… భూపతి ఇంకా రాలేదేమిటి! అని గేటు వైపు మాటిమాటికి చూస్తూ కూర్చుంది ఇంట్లో పని వాళ్ళు ఎవరూ లేనందున ఇల్లంతా బోసిపోయినట్లుగా ఉంది ఎప్పుడు అలా ఒంటరిగా ఉండడం అలవాటు లేని నీలాంబరి భూపతి కోసం ఎదురుచూస్తుంది.

ఇంతలో గెట్ చప్పుడు అయ్యింది బయటకు చూస్తే భూపతి వస్తూ కనిపించారు…

” ఏంటి నీలా! ఏవో ఘుమఘమలు బయటి వరకు వస్తున్నాయి… మహేశ్వరి కొత్త వంటకం ఏమైనా చేసిందా ఏంటి!” అని అడిగాడు.

” మహేశ్వరికి సెలవిచ్చి ఇంటికి పంపించానండి నరసింహులును కూడా వెళ్ళమన్నాను ఏదో చిన్న గొడవ వాళ్ళిద్దరి మధ్య అది రాజీ చేయడానికి ఇద్దరినీ వెళ్ళమన్నాను ఆ విషయం రేపు మాట్లాడతానని చెప్పాను ఈరోజు వంట అంతా నేనే చేశాను తెలుసా” అన్నది నీలాంబరి చిన్న పిల్లలాగా.

” ఓహో దొరసాని అమెరికా నుండి వచ్చిన తర్వాత పద్ధతులన్నీ మార్చేసిందే!” అన్నాడు నవ్వుతూ..

” మీరు వెళ్లి కాళ్లు చేతులు కడుక్కొని రండి ఆకలి వేస్తుంది భోజనం చేద్దాం” అని అన్నది నీలాంబరి.

భూపతి వచ్చేవరకు పళ్ళాలలో వడ్డించి పెట్టింది… అడ్డంగా కోసిన ఉల్లిపాయ ముక్కలు కొన్ని నిమ్మకాయ ముక్కలు పులావ్ ,వంకాయ మరియు పెరుగు పచ్చడి గిన్నెలో వేసి పెట్టింది.

భూపతి వచ్చి కూర్చుని తినడం మొదలుపెట్టాడు..ఒక ముద్ద నోట్లో పెట్టుకోగానే.. అలాగే చూశాడు..

” ఎలా ఉందండి ఏమి సమాధానం చెప్పడం లేదు బాగాలేదా? అయ్యో మహేశ్వరిని ఉండమనాల్సింది నేను బాగానే చేస్తానని వెళ్ళమన్నానండి” అన్నది నొచ్చుకుంటూ నీలాంబరి.

” అరే నేనేమీ చెప్పక ముందే నువ్వే అని నిర్ణయం చేసుకుంటావా చాలా బాగుంది. ఇంత రుచిగా ఉందో నేను చెప్పలేను వంకాయ కూడా అద్భుతంగా ఉంది నువ్వు ఏమనుకోనంటే ఇకనుండి వంట నువ్వే చేయనీలా!” అన్నాడు భూపతి.

చిన్నపిల్లలాగా నీలాంబరి సంబర పడిపోయింది..

” నిజమా బాగుందా మీకు నచ్చితే అంతకంటే నా రోజు చేస్తాను” అన్నది నీలాంబరి.

” ఈ పనులన్నీ ఏమీ పెట్టుకోకు నీలా ఊరికే అన్నాను మనకు ఇంకా బాలసదనం పనులు ఉన్నాయి అవి కాక ఏవో పనులు పెట్టుకుంటూనే ఉంటావు కదా అయినా ఈ మధ్య చూస్తున్నాను నీ చిత్రలేఖనం ఆగిపోయింది నీకు ఇష్టమైన అభిరుచిని మానవద్దు… నీలా చిత్రలేఖనం వేసేవాళ్లు ఉంటారా నీకు వచ్చిన విద్యను నీవు ప్రదర్శించుకుని నైపుణ్యం చూపించుకో వంట అంటావా ఎవరు చేసినా బాగానే ఉంటుంది ఎప్పుడో ఒకసారి చేద్దువు కానీ!” అన్నాడు భూపతి.

” సరే మీరు చెప్పినట్లే చేస్తాను” అని ఇద్దరు భోజనం చేశారు…

ఆరోజు సాయంత్రం పూజారి గారు ఫోన్ చేశారు…” అమ్మ ఆ ఇద్దరి పిల్లల వివరాలు సేకరించాను వాళ్ళు ఎవరి పిల్లలో మీకు ముందే చెప్పాను ఇద్దరు పట్టణంలో కాలేజీ చదువుకుంటున్నారు..దగ్గర దగ్గరగా సంవత్సరం నుండి కలిసి తిరుగుతున్నారంట.. కానీ అది ఇంట్లో తెలిస్తే పెద్ద రచ్చే అవుతుంది అందుకని ఈ విషయం మీకు చెప్తున్నాను వాళ్ల ఫోన్ నెంబర్లు కూడా మీకు చెప్తాను రాసుకుంటారా అమ్మా!” అన్నాడు పూజారి.

” సరే ముందు మీరు నంబర్లు చెప్పండి నేను రాసుకుంటాను ఈ విషయం గురించి మీరు నిశ్చింతగా ఉండండి రేపు వాళ్ళిద్దర్నీ పిలుస్తాను ఆ సమయంలో మీరు కూడా రండి” అని చెప్పి ఫోన్ పెట్టేసింది నీలాంబరి.

భూపతి విశ్రాంతి తీసుకోవడానికి పడకగదిలోకి వెళ్ళిపోయాడు. నీలాంబరి టీవీలో వచ్చే “పాడుతా తీయగా” చూస్తూ కూర్చుంది… ఈ వేదిక ఎంతమందినీ గాయకులుగా మార్చింది.. ఎంతోమంది వెలుగులోకి వచ్చారు రామోజీరావు ఈటీవీని నెలకొల్పితే దీనికి పూర్తి బాధ్యత తీసుకొని ఒక గొప్ప టీవీ షోగా తీర్చిదిద్దింది మాత్రము గానగంధర్వులు బాలసుబ్రమణ్యం గారు.. వారు లేకపోయినా కూడా ఇంకా వారి పేరుతో నడుస్తున్న పాడుతా తీయగాను ఎంతో మంది ప్రేక్షకులు వీక్షిస్తున్నారు” ఇలా ఆలోచిస్తూ ఒకపక్క మహేశ్వరి సమస్యను ఎలా తీర్చాలా అని అనుకుంటూ మరొక పక్క ఆ యువ జంటకి ఇలా కౌన్సిలింగ్ ఇవ్వాలా అని అనుకున్నది..

ఇంకా ఉంది

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఈ గాలిలో…. The Air

ఎడారి కొలను