తనువు మొత్తం ఒక వేణువు అనుకుంటే, వాయువు ఉశ్చ్వాస నిశ్వాసాలనుకుంటే, నిరంతరం సాగిపోయే సంగీతం వంటిదే జీవితం అవుతుంది. ఈ సంగీతంలో స్వరాల గతులు మారినట్టు బ్రతుకు నడకలో ఒడిదొడుకులు ఉంటాయి. ఇవి మనుషి తనంతట తాను సృష్టించుకున్న ఒడిదొడుకులు అనేవి ఒక రకం ,సమాజం వల్ల చేయబడ్డ ఒడిదొడుకులు మరోరకం.
సమాజం వల్ల కష్టనష్టాలు రావడం ఏమిటి అని ప్రశ్న తప్పకుండ జనిస్తుంది. అవును మారుతున్న అవసరాలు,కోరుకోకుండా తప్పించుకోలేని ఆధునిక సౌకర్యాలు, యంత్ర వినిమయ జీవితాలు అన్ని నీటి కరువును తీసుకొచ్చాయి. త్రాగునీరు సమస్య, నిత్యావసరాల నీటి సమస్య, పారిశుద్ధ్య సమస్య, అవినీతిమయ కల్తీ సమస్య సమస్యల వలయంలో చిక్కుకున్న మనిషి ఇప్పుడు ఓ తప్పు చేయని ముద్దాయి. సామాజిక ,ఆర్థిక ,రాజకీయ సంబంధాల వలన ప్రభావం చూపే విధంగా సమస్యలు ఎన్నో ఉత్పన్నమవుతున్నాయి. నీటి కొరత విషయంలో ఏ శ్రద్ధ చూపించడం లేదు. ప్రత్యామ్నయాలు వెతుక్కోవడం లేదు. Water Aid గుండె గుండె కూ పంపించవలసిన అగత్యం ఏర్పడింది. ఒక్క పైపు ద్వారా వంద ఇళ్లకు నీళ్లని ఇస్తారు. మొట్టమొదటి ఇళ్ళకు ,ప్రారంభంలో ఉన్న ఇళ్లకు పైపుల నుండి నీళ్లు ఒత్తిడిగా వస్తుంటాయి చివరి చివరిగా ఉండే వాళ్లకు ఆ ఒత్తిడి తగ్గుతూ ఉంటుంది.ఇటువంటిదే ఈ సమస్య .ఇలాంటి సమయంలో ఎవరికి వాళ్లు తమకోసం ఏదైనా సౌకర్యాలని ఏర్పరచుకుంటారు. ఇదీ ఒక పద్ధతి.
వీటిలో పారిశుద్ధ్యం అనేది చాలా ముఖ్యమైన విషయం. నీళ్లు పరిశుభ్రంగా వస్తున్నాయా లేవా అనేది చూడాలి. తర్వాత వృధాఎంత చేస్తున్నామో చూడాలి. వృధా చేసే తెలివి తక్కువ తంతును నివారించాలి.
ముందు జాగ్రత్తగా నీటిని కాపాడుకుంటే రాబోయే తరాలకు కష్టాలు తగ్గించిన వాళ్ళం అవుతాం.
సరే,మరి గాలి సంగతేంటి? సహజ సిద్ధంగా ప్రకృతి ఇచ్చే గాలిని కలుషితం చేసి స్వచ్ఛమైన గాలిని పీల్చుకోలేని దురవస్థలో మనిషి మిగిలిపోతున్నాడు. చెట్లను నరికేసి అడవులను పాడు చేసి ప్రాణవాయువును అందించే సహజమైన వనరులు ధ్వంసం చేస్తూ, జీవితాలను దుర్భరం చేస్తున్నారు.ఇవన్నీ మానవ తప్పిదాలే. చెట్లకు కూడా క్లోరినేటెడ్ నీళ్లను పోయవలసిన పరిస్థితిని తెచ్చారు. ఇక స్వచ్ఛ మైన గాలి ఎలా వీస్తుంది? నదులను కలుషితం చేయడం, చెరువులను కలుషితం చేయడం అవే నీటిని తీసుకువచ్చి చెట్లకు పోయడం ఇదే జరుగుతోంది. సహజసిద్ధంగా వర్షం పడితే ఆ నీటితో పెరిగే చెట్లు తక్కువయ్యాయి. ఇది ప్రమాదకరమైపోయింది. చెట్లకు మురుగు నీటిని పోయవద్దు! ఈ జ్ఞానం అందరికీ ఉండాలి. స్వార్థంతో చూసి చూడనట్టు ఉంటారు. ఇటువంటి వారిని శిక్షించాలి. అలా అంటే ముందు పసిగట్టాలి.
కొత్త కొత్త వంగడాలను, కొత్త కొత్త ఆర్గానిక్ పంటలను పండించడం చూస్తున్నాం .జీవ పదార్థాలను తీసుకొస్తున్నారు .వాటి ఉపయోగాలను అందరికీ సరిగ్గా వివరించాలి. ఏవైతే నష్టాలు ఉంటే గ్రహించాలి.” గంగిగోవు పాలు గరిటెడైనను చాలు” అని ఊరికే అనలేదు ఆ మహాకవి. స్వచ్ఛత,విలవ ఎంత అవసరమో చెప్పే వాక్యం ఇది. వాయువు ఉశ్చ్వాస నిశ్వాసాలకెంత అవసరమో ప్రాణం విలువ తెలిసిన వాళ్లకు తప్పకుండా తెలుస్తుంది. ఆరోగ్యంగా ఆనందంగా బ్రతకాలంటే స్వచ్ఛమైన గాలి వాతావరణం కావాలి. వీటితోపాటు మంచి ఆహారం కావాలి .మరీ ముఖ్యమైనది పరిశుభ్రంగా ఉండాలి .ఇవన్నీ కూడా మన పూర్వీకులు భయాలతో నేర్పించారు. కొన్ని నష్టాలు ఎలా ఉంటాయో చూస్తే మనకు ఒక అవగాహన కలుగుతుంది. ఉదాహరణకు స్త్రీలకు చాలా వరకు వంశపారంపర్యంగా ఉంటేనే తప్ప జుట్టు తొందరగా రాలి పోదు, బట్టతల అనేది ఆడవాళ్లకు రాదు కానీ ప్రస్తుత కాలంలో విపరీతంగా ఆడవాళ్లకు జుట్టు రాలడం గమనిస్తున్నాం. క్లోరినేటెడ్ వాటర్ అంటే నీళ్లలో క్లోరిన్ ఎక్కువగా కలిపి పంపులద్వారా పంపించే నీళ్లు మంచిది కాదు.కానీ తప్పడం లేదు. కలుషితమై ఉన్న నీళ్ల కంటే ఇలా శుద్ధి చేసిన నీళ్లు
మంచిది అనే ఉద్దేశ్యం.తల వెంట్రుకలు విపరీతంగా రాలిపోవడం మరీ పట్టణ ప్రాంతాలలో ఉన్న వాళ్లకు ఎక్కువగా చూస్తున్నాం. దీనికి ప్రధాన కారణం నీళ్లతోపాటు గాలి కూడా కారణమే.ఒకవైపు ఉద్యోగరీత్యా ఒత్తిడి, ఒకవైపు కుటుంబాలలో అనవసరమైన వాటికి గొడవలు పడే ఒత్తిడిలతోనే కాకుండా కొంతమంది విషయాలలో హార్మోన్స్ బాలెన్స్ తప్పడం వలన జుట్టు రాలడం వంటివి ఎక్కువగా చూస్తున్నాం. అపరిశుభ్రంగా ఉన్న నీళ్ల వలన స్త్రీలకు జుట్టు రాలుతుంది.అపరిశుభ్రత అనేది నీళ్లలో ఉన్నప్పుడు గాలిలో ఉన్నప్పుడు జరిగేదంతా నష్టమే! కొన్ని దేశాల్లో వాడుక నీళ్లలో క్లోరిన్ ఎక్కువ గా ఉపయోగించరు. జాయింట్ యాక్షన్ ఫర్ వాటర్ ప్యూరిటీ అనేదాన్ని పటిష్టంగా పాటిస్తారు వాళ్ళు. మనమూ అలాగే చేయాలి.
మనిషి ముఖ్యంగా రెండు విషయాలలో భయస్తుడు. ఒకటి చావు. ఒకటి దరిద్రం. అందుకే పూర్వకాలంలో దరిద్రం వస్తుంది అని చెబితే భయపడి మంచి పద్ధతులను పాటించేవాళ్లు. ఇళ్లల్లో ఆడవాళ్ళకి ఇటువంటివి వివరించి చెప్తూ మంచి అలవాట్లను నేర్పించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తల్లిని చూసి బిడ్డను తెచ్చుకోవాలి అని ఒకప్పుడు పెళ్లి సంబంధాలకు వెళ్తే అనేవాళ్ళు. దీనికి కారణం ఏంటి ?అలాగే,కోడల్ని తెచ్చుకునేటప్పుడు ఎలా ఎలాంటి ముద్రను వేస్తారో బిడ్డను మనం ఇచ్చేప్పుడు కూడా ఈ ముద్ర పడుతుంది. ఇళ్లల్లో స్త్రీలు పిల్లలకి నయాన భయాన పద్ధతులను పాటించమని చెప్పితే శుభ్రత మీద దృష్టిని పెడతారు. శుభ్రమైన గాలి శుభ్రమైన నీరు అవసరాలు భయంతోనైనా చెప్పాలి, అవగాహన రాహిత్యంతో కాదు!ఈ భయం అర్థం చేయించే శక్తి సామర్ధ్యాలు కూడా అలవర్చుకోవాలి. ఎందుకు అని పిల్లలు ప్రశ్నిస్తే జవాబు చెప్పలేని స్థితిలో తల్లులు ఉండకూడదు.చెప్పగా చెప్పగా కొన్నైనా పిల్లలమనసులకు ఎక్కుతాయి. విని విని మంచి అలవాట్లు చేసుకుంటారు.ఇవి నమ్మండి ఇవి నమ్మండి అని చెప్పుతూ ఉంటే తెలుసుకుంటారు.ఫలితం గురించి ఆలోచించకుండా చెప్తూ పోవాలి సమాజంలో తప్పకుండా మార్పు వస్తుంది. ఒక చెట్టుని నాటి పెంచేటువంటి మంచి పనులు చేయాలి. చల్లని గాలులు పీల్చి, చక్కని జీవన సంగీతం ఆలపిస్తూ సంతోషం గా జీవిద్దాం.చెట్లు మనకు గాలిని ఇస్తాయి, ప్రాణాన్ని కాపాడతాయి