అమలిన గంగ

అమలిన గంగ

పీ.వి.యస్.కృష్ణకుమారి ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్ శ్రీవాణి మోడల్ హై స్కూల్

పావనగంగా తీరం. నదీస్నానాలు ఆచరించే భక్తులు ఒకపక్క, పిండప్రదానాలు చేసేవారు కొందరు, ఆస్తికులు నిమజ్జనం చేసేవారు మరికొందరు. ఆ గంగా మాత స్పర్శతో తమ పాపాలన్నీ ప్రక్షాళన చెందుతాయని భావించేవారితో  కోలాహలంగా ఉన్నది ఆప్రాంతమంతా.

తల్లి అస్ధికలు నిమజ్జనం చేసే క్రతువులో ఉన్నాడు కృష్ణమోహన్. ఆపక్కనే కూర్చుని కార్యక్రమం చూస్తూ, మధ్యమధ్యలో చుట్టుపక్కల వాళ్ళని గమనిస్తున్న రాగసుధ దృష్టి కొంచెం దూరంలో ఉన్న ఒక స్త్రీ మీద పడ్డది. పరిణీత!  ఇక్కడ ఉంటున్నదా? లేక తమలాగే వచ్చిందా? ఎలాఉంది ఆమె జీవితం ఇప్పుడు. అసలు ఆమె పరిణీతేనా? పదిహేను సంవత్సరాల తర్వాత పరిణీతని చూసిన రాగసుధలో ఎన్నో సందేహాలు. ఆమె మనసు గతం వైపు పరిగెత్తింది.

*

“ఎక్స్ క్యూజ్ మీ మేడం, న్యూ ఎడ్మిషన్.  వాళ్ళ మదర్ మీతో మాట్లాడాలి అంటున్నారు” అన్నాడు క్లర్క్ దినకర్.

“ఎందుకు, ఫీజు గురించేగా”   ప్రశ్న వేసి సమాధానం కూడా చెపుతూ అడిగింది ప్రిన్సిపల్ రాగసుధ.

కొంతమంది పేరెంట్స్, యాజమాన్యం వారు చెప్పిన ఫీజులు కట్టలేక కన్సెషన్ అడగటం సాధారణ విషయం.  అలాంటప్పుడే వాళ్ళు ‘మేడమ్ తో మాట్లాడతాం’ అంటుంటారు.

“ఫీజు గురించి కాదు మేడమ్. మొత్తం ఫీజు కట్టారు. ఏదో మాట్లాడాలిట, నాకు చెప్పటంలేదు,” అన్నాడు.

“సరే, ఒక పదినిమిషాల తర్వాత పంపండి,” అన్నది రాగసుధ, రికగ్నీషన్ కి సంబంధించిన ఫైలులో సంతకాలు పెడుతూ.

తన పని కాగానే కాలింగ్ బెల్ కొట్టి, దినకర్ లోనికి వచ్చాక, ” ఆమెని పంపండి,” అన్నది.

“గుడ్ మార్నింగ్ మేడం” అంటూ లోపలికి వచ్చింది.

“కూర్చోండి,” అన్నది రాగసుధ.

ఆమె‌ కూర్చుని, ” పిల్లల్ని జాయిన్ చేసాను మేడం.  సెకండ్ క్లాస్, యూకేజీ.” అన్నది.

“ఓ, వెరీ గుడ్,” అన్నది. మామూలుగా అయితే ఆమెకి ఇలా అనవసరంగా తనతో మాట్లాడుతూ, తన టైం వేస్ట్ చేసేవాళ్ళంటే వెంటనే కట్ చేసి పంపించేదే. కానీ ఎందుకో ఆమెని చూడగానే చాలా గౌరవం కలిగింది.

“చెప్పండి, మీకేమైనా సందేహాలు ఉన్నాయా?”

ఏంలేదు మేడం, చిన్నవాడు, ప్రదీప్ నెమ్మదిగా,డిసిప్లీన్డ్ గా  ఉంటాడు. బాగా చదువుతాడు.  కానీ పెద్దవాడు ప్రణీత్ బాగా అల్లరి. చదువు తక్కువ. కాస్త జాగ్రత్తగా చూసుకోండి మేడం. వాడు ఇన్ డీసెంటుగా ప్రవర్తిస్తే పనిష్ చేయండి” అంది.

రాగసుధకి ముచ్చటేసింది. ‘మా పిల్లల్ని కొట్టవద్దు, వాళ్ళకి మంచి మార్కులు రావాలి అనే వాళ్ళని చూసింది కానీ ఇలా క్రమశిక్షణ గురించి మాట్లాడిన మొదటి పేరెంట్ ఈమే. ఆమెని పరీక్షగా చూసింది.

చామనచాయ రంగు, పెద్ద కళ్ళు, పెద్ద జడ, సింపులుగా, సాంప్రదాయ బద్దంగా ఉంది. మాటతీరు చూస్తుంటే చదువుకున్న దానిలానే‌ఉంది. ఆమె కళ్ళలో ఏదో ఆకర్షణ. 

“మీపేరు” వెళుతున్న ఆమెని అడిగింది రాగసుధ.

“పరిణీత”.

మనిషిలానే పేరుకూడా అందంగా ఉంది అనుకుంది రాగసుధ.

                                           *

ప్రతిరోజు ఎనిమిది గంటల కల్లా రాగసుధ, దినకర్ వచ్చే సమయానికే ప్రదీప్,ప్రణీత్ ఇద్దరూ  స్కూలుకు వస్తారు. ప్రదీప్ బెరుకుగా కూర్చుంటాడు, కానీ ప్రణీత్ మాత్రం ఆటలాడుకుంటూ ఉంటాడు. వాడికి అసలు టీచర్స్ అన్నా, ప్రిన్సిపల్ అన్నా భయమే ఉండదు. అలాగని వాళ్ళని లెక్కచేయక పోవటం ఉండదు. ఇంట్లో వ్యక్తులతో మాట్లాడినట్లే మాట్లాడతాడు. తన క్లాస్ పిల్లలు వచ్చేదాకా దినకర్ తో కబుర్లు చెపుతూ, ఏదోఒకటి వాగుతునే ఉంటాడు.

స్కూల్ అయిపోయిన తర్వాత, వాళ్ళ అమ్మ వచ్చేదాకా రోజుకొక ఫ్రెండ్ ఇంటికి వెళతారు.

ఒకరోజు ప్రదీప్ నిఅడిగాడు దినకర్,” రోజు ఇంత తొందరగా ఎందుకు వస్తారు. మీ మమ్మీ ఆఫీసుకి ఎన్ని గంటలకు వెళతారు,” అడిగాడు.

ప్రదీప్ వెంటనే, ” ఎయిట్ కే వెళతారు. ఒక్కొక్కసారి రాత్రి కూడా ఆఫీసుకి వెళుతుంది. అప్పుడు భయమేసి ఏడుస్తే మా నాన్న కొడతాడు” ప్రదీప్ చెపుతుంటే, వెంటనే ప్రణీత్, తమ్ముడితో మెల్లగా,

“ఎందుకు అలా చెప్పావు, అమ్మ ఎవరికీ అలా చెప్పవద్దు అన్నది కదా!” అని అమాయకంగా అనటం దినకర్,      

అప్పుడే అటుగా వచ్చిన రాగసుధ ఇద్దరూ విన్నారు.

“నైట్ షిఫ్టులు ఉంటాయి కాబోలు. పిల్లల్ని వదిలి వెళ్ళాలంటే కష్టమే. అయినా భర్త కొట్టటం ఏమిటి?”    

ఆ సాయంత్రం ఇద్దరే ఉన్నప్పుడు అన్నాడు దినకర్ రాగసుధతో.

“ఏమో, వీడేం చూసాడో, చిన్న పిల్లల మాటలు పెద్దగా పట్టించుకోకూడదు.” అంది రాగసుధ, అక్కడితో ఆటాపిక్ ఆపేస్తూ.

అయితే సుధ తనకి తెలియకుండానే పరిణీతని స్కూల్ కి వచ్చినప్పుడు గమనించసాగింది. చాలా రిజర్వుడుగా ఉంటుంది. ఒక్కొక్కసారి తానే దగ్గరుండి తినిపిస్తుంది. ఒక్కొక్కసారి భర్తతో కలిసి వచ్చి, లంచ్ బాక్స్ ఇచ్చి వెళ్ళిపోయేది. వారానికి ఒకసారి ఖచ్చితంగా ప్రిన్సిపల్ ని కలిసి, చదువు గురించి కాక, పిల్లల ప్రవర్తన ఎలా ఉందో కనుక్కుంటుండేది. నెల నెలా కండక్ట్ చేసే పేరెంట్ మీటింగ్స్ కి మాత్రం వచ్చేది కాదు. ఎప్పుడూ కడిగిన ముత్యంలా ఉంటుంది. ఆమె మాట్లాడుతూ ఉంటే, పిల్లలే  ఆమె లోకం అని అర్ధం అయింది. ఆమె భర్త ఏదో బిజినెస్ చేస్తాడు. ఇద్దరూ చాలా అన్యోన్యంగా ఉన్నట్లే అనిపించింది.

                                        *

“హలోఎవరూ,” ఫోన్ లిఫ్ట్ చేసి అడిగింది సుధ.

“మేడమ్ గారేనా మాట్లాడేది,” అడిగింది అవతలి వ్యక్తి.

“అవును, చెప్పండి ఎవరు మీరు,” 

“అమ్మా, నాపేరు పార్వతమ్మ. మీ స్కూల్ లో రెండో తరగతి, యూకేజీ చదివే ప్రదీప్, ప్రణీత్ వాళ్ళ అమ్మమ్మని. మీరు ఏమీ అనుకోకు పోతే రెండు నిమిషాలు వాళ్ళతో మాట్లడవచ్చా తల్లీ. మీ అమ్మ లాంటి దాన్ని,” ఆమె గొంతులో వేడుకోలు.

సాధారణంగా పేరెంట్స్ చాలా ముఖ్యమైన పని ఉంటేనే ఫోన్ చేస్తారు.  ఈమె పేరెంట్ కూడా కాదు. కానీ ఆమె అభ్యర్ధనకి వద్దు అని చెప్పలేక, వాళ్ళిద్దరినీ ఆఫీస్ రూంకి పిలిపించింది.

వాళ్ళు మాట్లాడిన తర్వాత, ” మేడమ్, మా అమ్మమ్మ మీతో మాట్లాడుతుందిట” అంటూ ఫోన్ చేతికి ఇచ్చారు.

“అమ్మా, మీ స్కూల్ చాలా బాగుంది అని మా అమ్మాయి చెప్పింది. మనవళ్ళని బాగా చూసుకో తల్లి.  వచ్చి వాళ్ళని చూసే అదృష్టం నాకు లేదు. ఇంటికి ఫోన్ చేస్తే అల్లుడు ఊరుకోడు. నెలకొకసారి ఫోన్ చేస్తానమ్మా, ఏమీ అనుకోవద్దు.” అని ఫోన్ పెట్టేసింది.

వాళ్ళ మాటలతో సుధకి ఒకటి అర్ధమైంది. అల్లుడికి,అత్తకి పడదు. భార్యని పుట్టింటికి కూడా పంపడు. పిల్లల మీద కూడా ప్రేమ తక్కువే. వాడి మాటకు ఎదురు చెపితే నిర్దాక్షిణ్యంగా కొడతాడు. ఆమె మనవళ్ళని చూడాలనుకుంటే దొంగతనంగా చూసి వెళుతుంది.

సుధ మనసు పరిణీత మీద సానుభూతితో నిండిపోయింది.

                                        *

సరిగ్గా ఇది జరిగిన పది రోజులకి, కాలనీలోని ‘పెద్దమనుషులు’ ఇంటికి వచ్చారు. ఏదో కాలనీ విషయాలు భర్తతో మాట్లాడటానికి అనుకుంటూ, టీ పెట్టటానికి లోపలికి వెళ్ళింది రాగసుధ. వాళ్ళ మాటలు స్పష్టంగా వినిపిస్తున్నాయి.

“సార్, మన స్కూల్లో మంచి సంస్కారం గల కుటుంబాల వాళ్ళ పిల్లలు ఉన్నారు. పిల్లల్ని చేర్చుకునేటప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎలాంటి వాళ్ళో విచారించి చేర్చుకుంటే మంచిది” అన్నాడు కాలనీ ప్రెసిడెంట్ గా ఉన్నతను.

“కొత్తగా పెట్టిన ఇస్కూల్  గదా అని ఎవరిని బడితే వాళ్ళని చేర్చుకుంటే, వాళ్ళ దోస్తానాతో మా బిడ్డలు కూడా ఆగమైతరు” సెక్రటరీ అన్నాడు.

“మీరు ఏం మాట్లాడుతున్నరో, ఎవరి గురించి అంటున్నారో అర్ధం కావటం లేదు. కొంచెం క్లియర్ గా చెప్పండి” అంటున్నాడు కృష్ణమోహన్.

“కాలనీ అంతా గుప్పుమంది, మీకు తెలీదా! అదే, మన స్కూల్లో చదువుతారుట ప్రదీప్, ప్రణీత్ అని, మా మిసెస్ చెప్పింది, వాళ్ళ అమ్మ గురించి ఎవరూ మంచిగా అనుకోవటం లేదు సార్” అన్నాడు ఇంకొకతను.

“అదసలు సాని…. సార్. మొన్న మన కిరాణా షాపు జగన్ రాత్రి పది గంటలకి షాపు కట్టేసి వస్తుంటే, వాళ్ళ సందు చివర నిలబడి, రమ్మందిట,” గవర్నమెంట్ ఆఫీసులో ఉన్నత స్థాయిలో ఉన్న మరొకతను.

“ఇలాంటి వాళ్ళని కాలనీ నుంచి వెళ్ళగొట్టాలి. కానీ సొంత ఇల్లు కదా!” ఇంకొకరు.

వాళ్ళ మాటలు ప్రవాహం ఎటో పోతున్నది. మధ్యమధ్యలో వినకూడని బూతులు, కుళ్ళు జోకులు.

రాగసుధకి తల తిరిగి పోతున్నది. టీ కూడా పెట్టలేక బెడ్ రూం లోకి వెళ్లి పడుకుంది.

ఇదంతా నిజమేనా! ఎంత అమాయకంగా ఉంది. ఛీ,ఛీ. చాలా జుగుప్సాకరంగా అనిపించింది.

వాళ్ళని పంపేసి, లోపలికి వచ్చాడు కృష్ణమోహన్.

రాగసుధ పరిస్థితి అర్ధమైంది అతనికి. నిజానికి ఈ విషయం అతనికి రెండు రోజుల ముందే తెలుసు. అయితే ఏ విషయంలోనైనా నిజానిజాలు తెలుసుకోకుండా మాట్లాడటం అలవాటు లేదు. అందుకే ఇప్పుడు కూడా ఆ విషయం ఏమీ డిస్ కస్ చేయదలచుకోలేదు.

రాగసుధైతే వాళ్ళని ఇప్పటికిప్పుడే టీ.సీ.ఇచ్చి పంపేయాలి అన్నంత కోపంతో ఉంది. దసరా సెలవులు కావటంతో ఇప్పుడు ఏం చేయటానికి లేదు. స్కూల్ రీ ఓపెన్ కాగానే మొదటి రోజే టీ.సీలు ఇచ్చి పంపేయాలి అని నిర్ణయించుకుంది.

                                           *

దసరా సెలవులు ఇంకో రెండు రోజుల్లో అయిపోతాయి. ఈ పదిరోజుల్లో ఇంటికి వచ్చి కొంతమంది, స్కూల్ కి వచ్చి కొందరు పరిణీత గురించి చెపటం, ఆ పిల్లలకి టీసీ ఇవ్వక పోతే మా పిల్లల్ని వేరే స్కూల్ లో జాయిన్ చేస్తాం అనటం. రాగసుధ పరిస్థితి అయోమయంగా ఉంది.

స్కూల్ పెట్టి రెండు సంవత్సరాలే అయినా, మంచి పేరు వచ్చింది. ఊహించిన దానికంటే ఎక్కువ మంది జాయిన్ అయినారు. అప్పటికే కాలనీలో ఉన్న నాలుగైదు స్కూల్స్ పోటీ తట్టుకుని నిలడుతున్నది. ఇప్పుడు తను పేరెంట్స్ మాట వినకపోతే తను నిలదొక్కుకోలేదు.

కానీ, ఏ కారణం చెప్పి వాళ్ళని రావొద్దని చెప్పాలి? అభం,శుభం తెలియని పిల్లల మొహాలు, ప్రశాంతంగా ఉండే పరిణీత మొహం గుర్తొచ్చి మనసు ఏదోగా అయిపోతున్నది. ఇంకో స్వార్ధం కూడా ఉంది. తనది కొత్త స్కూలు. ఒక పిల్లాడిని  కూడా వదులుకోవడానికి తనకి బాధాకరమే. అందునా చాలా ఏక్టివ్ గా, టాలెంటెడ్ గా ఉన్న పిల్లలు వీళ్ళు. మోహన్ కూడా, ‘తొందర పడకు ‘ అని చెప్పటంతో రీ ఓపెనింగ్ తర్వాత నిర్ణయం తీసుకుందాం లే అనుకుంది.

మర్నాడు స్కూల్ తెరుస్తారు అనగా, ఆ ఉదయం మోహన్ అన్నాడు రాగసుధతో,

“ఆమె ప్రవర్తన ఇక్కడ ఎవరికి ఇబ్బందికరంగా లేదుకదా! పిల్లలు బుద్ధిమంతులు. నేను కాలనీలో చాలా మందిని, మన పేరెంట్స్ ని ఈ నాలుగు రోజుల్లో కలిసాను. అందరూ ఇదే మాట చెప్పారు. ఆమె చాలా డీసెంట్ అని.  మన దగ్గరికి వచ్చి ఆమె మీద ఈ అభాండాలు వేసిన ఆ పదిమంది ఎలాంటి వాళ్ళో మనకి తెలుసు. ఇదిగో పులి అంటే అదిగో తోక అనే రకాలు. ముఖ్యంగా ఆ జగన్ ఎంతో లోఫరో అందరికీ తెలుసు. ఇంకో విషయం, వచ్చిన వాళ్ళలో కొంతమంది పిల్లలు మన స్టూడెంట్స్ కానేకాదు.  అటువంటి వాళ్ళ మాటలకి విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు.”

రాగసుధకి కొంచెం రిలాక్స్ అనిపించింది కానీ మనసులో పురుగు తొలుస్తూనే ఉంది. నిప్పు లేనిదే పొగ రాదు అంటారు కదా! ఏమీ లేకుండా వీళ్ళు అలా ఎందుకు అంటారు? ఎలా తెలుస్తుంది?

మళ్ళీ అంతలోనే వివేకం మేల్కొనేది. ఛీ,ఛీ, నేనేనా ఇలా ఆలోచిస్తున్నది? ఎంత చదువుకున్నా కొన్ని బలహీనతలు పోవుకదా!  ఇలాంటి ఆలోచనలతో ఉన్న సుధకి ఆ సాయంత్రమే పరిణీత గురించి కొన్ని బాధాకరమైన విషయాలు తెలిసాయి.

“మేడమ్, మేడం” గేటు గడియ టకటక లాడిస్తూ పిలుస్తున్నారు ఎవరో. తలుపు తీసిన సుధకి గేటు దగ్గర నిలబడి పిలుస్తున్న ప్రణీత్, ప్రదీప్ కనపడ్డారు. వారి వెనకే సుమారు అరవై సంవత్సరాల వయసులో ఉన్న ఒక స్త్రీ నిలబడి ఉంది.

సుధ కనపడగానే ప్రణీత్, ” మేడం మా అమ్మమ్మ మీతో మాట్లాడాలని వచ్చింది” అన్నాడు.

ఈవిడ నాతో ఏం మాట్లాడాలి?  అనుకుంటూ అలాగే నిలబడింది.

“మేడం,గేటు గడియ రావటం లేదు.తీయరా” అమాయకంగా  ప్రదీప్ అడిగేసరికి ఆగలేక వెళ్లి గేటు గడియ తీసి,

“రండి లోపలికి” అంటూ లోపలికి దారితీసింది.

“అమ్మా, నేను హైదర్ గూడలో ఉంటా. వీళ్ళమ్మ నా కూతురు” ఆగింది ఆమె.

రాగసుధకి అనీజీగా ఉంది. ఎంత వద్దనుకున్నా, కాలనీ వాళ్ళ మాటలు చెవుల్లో మారుమోగుతున్నాయి. విసుగ్గా మోహం పెట్టి,

“తెలుసు. చెప్పండి ఎందుకొచ్చారు?” పరిణీత మీద అసహ్యం అంతా ఆ ఒక్కమాటలో వెళ్ళగక్కింది.

“నాకు తెలుసమ్మా నీకు నాతో మాట్లాడటం ఇష్టం లేదని. కానీ ఒక చిన్న కోరిక, వీళ్ళమ్మ చావుకి దగ్గరగా వెళ్ళి వచ్చింది. ఆరోగ్యం బాగాలేదు. నా దగ్గర ఉండమంటే, పిల్లల బడి పోతుంది అని వచ్చింది. కొన్ని రోజులు వీళ్ళు సరిగా హోంవర్కులు చేయకపోయినా కొట్టొద్దని టీచర్లకి చెప్పండమ్మా” వేడికోలుగా అంది.

ఆమె చెప్పిన తీరుకు, అసంకల్పితంగా ” ఏమైంది?” అంది రాగసుధ.

“ఆత్మహత్యా ప్రయత్నం చేసిందమ్మా.  పిల్లల అదృష్టం బతికి బట్టకట్టింది” చేతుల్లో మొహం దాచుకుని, వెక్కసాగింది. శబ్దం బయటికి రాకుండా ఉన్న ఆమె రోదన రాగసుధ మనసుని కలిచివేసింది.

పిల్లలు ఇద్దరూ బిక్కమొహం వేసుకుని చూస్తున్నారు.విపరీతమైన జాలి ముంచుకు వచ్చింది సుధకి. ఇద్దరినీ దగ్గరికి తీసుకుని, పైన మేడమీద తన గదిలో చదువుకుంటున్న కూతురిని పిలిచి,

“వీళ్ళని కాసేపు నీ దగ్గర కూర్చోబెట్టుకుని ఆడించు” అని వాళ్ళని పంపించివేసింది.

అప్పటిదాకా తను ఆమెని నిలబెట్టే మాట్లాడుతున్నానని గుర్తొచ్చి, తనే చేయిపట్టుకుని తీసికెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి, గ్లాసుతో మంచినీళ్లు తెచ్చి ఇచ్చింది. కాసేపటికి తేరుకుంది.

“అమ్మా, నీకు తెలిసే ఉంటుంది మీ కాలనీలో దాని గురించి అనుకోవటం. అది ‘ఈ వృత్తి ‘ చేయటంలేదు. బలవంతానా, ఆ వెధవ, దాని మెళ్ళో తాళి కట్టిన సన్నాసి వెధవ దగ్గరుండి ఈపని చేయిస్తున్నాడు. వేరే మార్గం లేక చావాలనుకుంది. ఇది రెండో సారి. అది పోతే ఈపిల్లల గతేంకావాలి?”  హౄదయవిదారకరమైన ఆమె ఏడుపు గుండెల్ని పిండేస్తున్నది.

“మాకు పరిణీత ఒక్కతే అమ్మాయి.  బీ.ఎస్సీ.చదివింది. నా కూతురని కాదు కానీ ఎంతో ఓర్పు,సహనం. మా ఆయన బీహెచ్ఈఎల్ లో చేసేవాడు. మా చుట్టాలే ఈ సంబంధం చెప్పారు. ఎంసీఏ చదివాడు. ఉద్యోగం ఉంది. తల్లి తండ్రి చిన్నప్పుడే పోతే, వాళ్ళూ,వీళ్ళూ చేరదీసారుట. మాకు మగపిల్లలు లేరు కదా వీడే కొడుకైతాడు అనుకున్నాం.

మా ఆయన ఉన్నంతకాలం చాలా బాగా ఉన్నాడు. నిజంగానే కొడుకులాగా. నా భర్త అనుకోకుండా గుండె పోటుతో చనిపోయాడు.  అన్నీ కార్యక్రమాలు బాగా చేసాడు. రావలసిన డబ్బులు ఆఫీస్ చుట్టూ తిరిగి తెప్పించాడు. 

రెండోవాడు, ప్రదీప్ కాన్పు కోసం పుట్టింటికి వచ్చింది పరిణీత.  ఎలా కలిగిందో కానీ ఒక సినిమా వాడితో వీడికి స్నేహం కలిసింది. వాడి పేరు మనం వింటూనే ఉంటాం మేడం.  కొంత పెట్టుబడి చాలు, మిగిలినది నేను పెట్టుకుంటాను సినిమా తీద్దాం అన్నాడుట.  మా అల్లుడు కన్ను మా ఆయన డబ్బులు మీద పడింది.  ముందు మామూలుగా అడిగాడు, ఆ తర్వాత నా కూతురిని ఎన్నో వేదింపులకు గురిచేసాడు.

‘డబ్బులు తెస్తేనే నా ఇంటికి రా’ అన్నాడు.

ఏంచేయాలి? సరే ఎప్పటికయినా ఆస్తి అంతా వాళ్ళకే కదా అని, బిడ్డ సుఖపడతుందని ఇచ్చాను”

సినిమా సంగతి ఏమో కానీ, వీడికి అన్ని చెడలవాట్లు వంటబట్టాయి. సినిమా మధ్యలో ఆగిపోయింది. అప్పులన్నీ వీడి పేరుమీదనే ఉన్నాయి. అప్పులు తీర్చడానికి,మళ్ళీ వేరే బిజినెస్ మొదలుపెట్టటానికి ఈసారి పెట్టుబడి నా కూతురే అయింది”

చెపటం ఆపి వెక్కి వెక్కి ఏడ్వసాగింది. రాగసుధకి ఆమెని ఎలా ఓదార్చాలో అర్ధం కాలేదు. ఇలాంటి వాళ్ళు ఉంటారా?

“బంధువుల్లో ఈ విషయం తెలిస్తే ఇంకేమన్నా ఉందా! పోలీస్ కంప్లైంట్ ఇచ్చే ధైర్యం లేదు. పైగా న్యాయం జరగకపోగా, వీధిన పడతాము. నిస్సహాయంగా ఉండిపోయాము. అప్పుడే మొదటిసారి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. వాడే హాస్పిటల్ కి తీసికెళ్ళి విషయం బయటికి రాకుండా చేసాడు. నా కూతురు వాడి స్నేహితులకి అంగడి బొమ్మైంది.

వాడు వేరే ఇంకో పెళ్ళి చేసుకుని, నా కూతురికి ఇక్కడ ఇల్లు ఒకటి కొనిచ్చాడు. ప్రశాంతంగా పరువుగా బతుకుదామనుకుంది. కానీ ఎక్కడి ప్రశాంతత? వాడి ఫ్రెండ్స్ పిలిచినప్పుడల్లా వెళ్ళాలి.  ఏం బిజినెస్ చేస్తాడో అర్ధంకాదు. నన్ను రానివ్వడు. కూతురు, మనవళ్ళు ఎట్లా ఉన్నారో అని మనసు పీకి, మీకు ఫోన్ చేసేదాన్ని.  చావలేక బతుకుతున్న నా కూతురికి ఆశలు అన్నీ పిల్లల మీదే. ఎట్లా తెలిసిందో మరి కాలనీ అంతా ఒక్కసారి గుప్పుమంది. తట్టుకోలేక మళ్ళీ చావాలనుకుంది. నా దగ్గర పిల్లల్ని వదిలి, నేను లేనప్పుడు ఉరేసుకోబోయింది. దాని దురదృష్టమో, పిల్లలు అదృష్టమో, నేను సమయానికి చూసాను.”

రాగసుధ మనసు వికలమైంది. ఎవరూ ఏమీ చేయలేని పరిస్థితి. తోచిన రీతిలో ఆమెని ఓదార్చి పంపించింది.

కృష్ణమోహన్ రాగానే అతనికి చెప్పిన తర్వాత కొంత గుండె బరువు తగ్గింది సుధకి.

                                                 *

లోకరీత చిత్రంగా ఉంటుంది. ఏదైనా ఒక విషయం కొత్తల్లో అదే అత్యంత ప్రాధాన్యమైనది అన్నట్లు ఉంటారు.  కొన్ని రోజుల తర్వాత అది మరుగున పడి, ఇంకో కొత్త విషయం వస్తుంది.

పరిణీత విషయం కూడా అంతే. నెల రోజులు హంగామా చేసినవాళ్లు క్రమంగా ఆ విషయం మర్చిపోయారు. ఇప్పుడు ఆమె తల్లి కూతురి దగ్గరే ఉండిపోయింది. అందువల్ల పరిణీత మళ్ళీ కనపడలేదు.

రాగసుధ మాత్రం ఆమె గురించి ఆలోచించని రోజు లేదు. ఆ ఏరియా సీఐ, చక్రవర్తి, కృష్ణమోహన్ కజినే. ఒకరోజు అతను వచ్చినప్పుడు అడిగింది పరిణితని ఈ కూపం నుండి లాగటానికి అవకాశం లేదా అని.

“ఇదంత తేలిక అనుకుంటున్నావా? కొందరు బహిరంగంగా చేస్తారు. వాళ్ళమీద ఏక్షన్ తీసుకోగలుగుతాము. కానీ పరువుగల కుటుంబం నుంచి వచ్చి బలవంతంగా భర్తలచే వంచించ బడినవాళ్ళు బయటికి చెప్పుకోలేరు. జీవశ్చవాల్లా ఉండాల్సిందే.  ఒకసారి ఈ ఊబిలోకి వెళితే వెనక్కి రావటం కష్టం” అన్నాడు అతను.

కొన్ని సంఘటనలు చాలా యాదృచ్ఛికంగా జరుగుతాయి. అలాంటిదే ఒకటి కొన్ని నెలల తర్వాత సంభవించింది. పరిణీత భర్త కారులో వస్తుంటే, గుర్తు తెలియని వాహనం గుద్దేసింది. స్పాట్లో చనిపోయాడు.

ఆ తర్వాత నెలకే పరిణిత కుటుంబం, ఇల్లు అమ్మేసి వెళ్ళిపోయారు.ఎక్కడికి వెళ్లిపోయారో ఎవరికీ తెలియదు. అందరూ ఆమె గురించి మర్చిపొయినా, రాగసుధ స్మ్రతిపధం నుంచి పరిణీత, ముద్దులు మూటకట్టినట్లు ఉండే ప్రణీత్, ప్రదీప్ తొలగిపోలేదు. మళ్ళీ పదిహేను సంవత్సరాల తర్వాత ఇక్కడ ఆమెని చూసిన రాగసుధ మనసు ఉద్వేగానికి లోనయింది.

ఈ లోపు క్రతువు పూర్తిచేసి మోహన్ అక్కడికి వచ్చాడు.

“ఏమండీ అటుచూడండి ఆమె పరిణీత కదూ!” అన్నది.

“అవును, ఆమె మనల్ని కలవటానికే వచ్చింది. ఆమె ఇక్కడే ఉంటున్నది” అన్నాడు చిన్నగా నవ్వుతూ.

              “కొన్ని విషయాలకి గోప్యత అవసరం. బయటికి రాకూడదు. అందుకే నీకు చెప్పలేదు. పరిణీత వంచించ బడింది. ఆమెకి అవకాశం ఉంటే ఆ నరకకూపం నుంచి బయటికి వచ్చి పవిత్రంగా గడపగలదు అనిపించింది. ఆమె భర్త పోయిన తర్వాత నేను, చక్రవర్తి ఆమెని కలిసి అదే విషయం చెప్పాము. అంతకంటే ఇంకేం కావాలి అంది. చక్రవర్తి ఫ్రెండ్ కి ఇక్కడ లెదర్ ఫ్యాక్టరీ ఉంది. అందులో ఎకౌంటెంట్ గా జాబ్ చూపించి, రెండో కంటికి తెలియకుండా ఇక్కడికి పంపాము. అతనికి పరిణిత పరిస్థితి చెప్పి ఆమెకి ఎలాంటి ఇబ్బందీ లేకుండా చూడమన్నాము. తోడ తోడుగా ఎలానూ వాళ్ళ అమ్మ ఉంది. మా నమ్మకం, శ్రమ వృధా కాలేదు. ఆమె ఎప్పుడూ పునీతే. పిల్లల్ని వృద్ధిలోకి తెచ్చింది. ప్రణీత్ ఆస్ట్రేలియా వెళ్ళిపోతున్నాడు ప్రదీప్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ‘ఒక్కసారి మేడం, మీరు రండి అని ఎప్పటినుంచో అడుగుతున్నది. అనుకోకుండా అవకాశం వచ్చింది ” కృష్ణ మోహన్ మాటల్లో ఏదో తృప్తి.

         అంతా విన్న రాగసుధ మనసు పరిణిత పట్ల గౌరవ భావంతో నిండిపోయింది.

        గంగానదిలో ఎంతోమంది పాపులు నిరంతరం స్నానమాచరిస్థూ ఉంటారు. అయినా వారి మాలిన్యం గంగకు అంటదు. అది ఎప్పుడూ పావన గంగే. పరణీత గంగానది వంటిదే. బురదలో ఉన్నా ఆమె అమలినంగానే ఉంది. ఆమె ఎప్పుడూ పునీతే.

Written by PVS Krishnakumari

పీ.వీ.యస్.కృష్ణకుమారి.
ప్రిన్సిపాల్ అండ్ కరస్పాండెంట్
శ్రీవాణి మోడల్ హైస్కూల్
9494510994

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు

ఈ గాలిలో…. The Air