అక్షరాలన్నీ
నా కలం చుట్టూ తిరుగుతున్నాయి
నన్ను మేల్కొల్పాలని
పదాలు పరిగెడుతున్నాయి
మెదడుకు పదునుపెడుతూ
అనుభవాలన్నీ పందిరి వేసుకుంటున్నాయి
అల్లుకుంటూ వెళ్ళమని
మౌనమేమో నిశ్శబ్ధాన్ని చీల్చమని
మనసులోని భావాలు ప్రశ్నలు రేపుతూ
సమాధానాలు వెతకమంటున్నాయి
బంధాలేమో కట్టిపడేస్తూ
బ్రతుకుత్రోవన నడవమంటున్నాయి
దేహామేమో వినోదాలను వెతుకుతుంది
సుఖాలను అలవాటు చేసుకొని
కాళ్ళు కదిలిరావడంలేదు
కాసేపైన కొవ్వును కరిగిద్దామంటే
చేతులకేమో తపన కూర్చున్నచోటైనా
నీ ఉనికిని కాపాడుకోమని
కళ్ళేమో పుస్తకాలను శోధిస్తున్నాయి
చెవులేమో అలజడులను పసిగడుతున్నాయి
నాలుక రుచిని కోరుకుంటుంది
కడుపునింపితే సరి
చర్మం స్పర్శను కోల్పోయి
నిన్ను నువ్వు గిల్లిచూసుకోమని చెబుతుంది
ముక్కు మునకలు వేయమంటుంది ముక్తికోసం
జ్ఞానేంద్రియాలు అదుపు తప్పిన
అన్నీ నీ చేతిలోనే ఉన్నాయని
దృష్టి నిలుపుకోమని హెచ్చరిస్తున్నాయి
ఎందుకోసమంటారు?