(ఇప్పటివరకు: ఆమె భర్త సుబ్బారావు కూడా హైదరాబాదు నుండి తెనాలి వచ్చాడు ఆమె వెనకాలే ఆమెకు తెలియకుండ. తాగిన మైకంలో ఉన్న సుబ్బారావు మైత్రేయిని కొట్టాడు. ఆమె తిరగబడింది ఆత్మాభిమానంతో. పనిమనిషి అక్కమ్మ ఓదార్చేప్రయత్నం చేస్తుంది, కానీ ఆ అవమాన భారం నుండి ఆమె తేరుకోలేక పోయింది మైత్రేయి తన స్నేహితురాలు వసుంధరని కలిసింది. లాయర్ వసుంధర తన స్నేహితురాలికి ధైర్యం చెప్పి మెడికల్ చెకప్ చేయించి అన్ని ఆధారాలతో సుబ్బారావు పైన పోలీస్ స్టేషన్ లోగృహ హింస కేసు పెట్టించింది)
కేసు పెట్టిన విషయం మాత్రం దావానలంలా పాకిపోయింది. అత్తగారు ఏడుస్తూ శాపనార్ధాలు పెట్టారు ఫోన్ లోనే “ఛీ నీ మొహం అస్సలు చూడకూడదు. ఎం పాపం చేసామో, ఇలాటి పిల్ల మాకు తగులుకుంది, ”.
కొద్దీ సేపట్లోనే అమ్మ ఫోన్ ,”ఇదేంటే ముదనష్టపు దాన! ఇలా పరువు తీసావు. మీ నాన్న ఇక తలెత్తుకోని అందరి మధ్య తిరగగలడా ! ఎం పోయే కాలం వచ్చిందే ?”అంటూ ఫోన్ లోనే శోకాలతో పాటు శాపనార్ధాలు కూడా పెట్టింది. అన్నిటికి మౌనమే సమాధానం గ ఉండిపోయిది మైత్రేయి.
కేసు వాపస్ చేసుకోమని వెంటనే తల్లితండ్రుల్నుంచి వత్తిడి వచ్చింది. ఆ తరువాత అత్తమామల నుంచి రాయబారాలు. విమర్శలు, వెక్కిరింపులు, బహిష్కరణలు. ఇలా ఎన్నో మైత్రేయిని చుట్టుముట్టాయి. ఆమె భయపడలేదు. బెంగ పడలేదు. తనకు ఒక మంచి పరిష్కారం కావాలని మాత్రమే కోరుకుంది.
డాక్టర్ సర్టిఫికెట్ పెట్టీ నెలరోజుల పాటు మెడికల్ లీవ్ పెట్టింది. అన్నయ్య వచ్చాడు.”వదినను తీసుకు రాలేదా అన్నయ్య”అడిగింది.
“తనెందుకు ఈ పెంటలోకి” చాల దురుసుగా సమాధానం చెప్పాడు. మళ్ళీ మౌనాన్నే ఆశ్రయించింది మైత్రేయి .
“ఇలాటివి ఏవైనా ఉంటె మాతో సంప్రదించాలి కదా మైత్రేయి! అంతా నీ సొంత నిర్ణయమేనా! కుటుంబ గౌరవం చూసుకొన్నక్కరలేదు. ఇప్పటి కైనా మించి పోలేదు. సుబ్బారావు తో నేను మాట్లాడతాను. కేసు వాపస్ తీసుకుందాము. అందుకే నాన్న నన్ను పంపించాడు.” అంటూ తనెందుకొచ్చాడో చెప్పాడు.
మైత్రేయి మౌనంగా ఉండిపోయింది. ఏ సమాధానం చెప్పలేదు. కోపంలో పళ్ళు పటపట కొరుకుతూ, కాళ్ళతో నేలను దడ దడ మని తొక్కుతూ ఆప్పటికప్పుడే అన్నయ వెళ్ళిపోయాడు.
వెర్రి నవ్వు నవ్వు కొంది ,”నేనెలా ఉన్నాను, ఏ స్థితిలో నేను ఇలాటి నిర్ణయం తీసుకున్నానో, ఇవేమి పట్టలేదు. కనీసం నాకెలా ఉందొ అని కూడా అడగలేదు వాడు. వాడికి, కుటుంబ గౌరవం కావాల్సి వచ్చింది.” కళ్లనీళ్లు వచ్చాయి. ఇవి ఇంకెప్పటికీ ఆగవేమో !తనకు తోడుగా ఇవే మిగులుతాయేమో!”
“ముసురు పట్టిన ఆకాశం నుండి పడే వాన చినుకు కోసం ఆశగా నిరాశగా ఆశ నిరాశల మధ్య ఊగిసలాటగా! శూన్యం లోకి చూ స్తూ ఉండి పోయింది ఆమె.
*****************
అరెస్ట్ వారంట్ కు ముందుగానే కోదండపాణి గారిని కలిసి విషయమంతా ఏకరువు పెట్టాడు. ఒక్క రోజులోనే సుబ్బారావు కి వారెంట్ తో పాటు బెయిల్ పేపర్స్ కూడా అందాయి. బెయిల్ తెచ్చుకొన్నాడు. డిఫెన్సె లాయర్ కోదండపాణి గారి ని పెట్టు కొన్నాడు. బెయిల్ కింది 20,000 జమనాత్ కట్టాల్సివచ్చింది . జాయింట్ అకౌంట్ నుంచి ఆ మొత్తం డ్రా చేసాడు.
డబ్బు డ్రా అయినట్లు ఆటోమేటెడ్ బ్యాంకు మెసేజ్ వచ్చింది మైత్రేయి కి. ఆమెకు ఇంకో కొత్త సమస్య వచ్చిపడింది. ఇలా అయితే అతి కొద్దీ రోజులలోనే తనని రోడ్ మీద పడేస్తాడు. ఎం చేయాలి? నాన్నకు చెప్పలేదు. అసలే సుబ్బారావు మీద కేసు పెట్టిన విషయం ఆయనకీ ముందుగా చెప్పలేదని చాల కోపం మీద ఉన్నారు.
”అమ్మేమో ఇలాటి విషయాలు సామరస్యంగా పరిష్కరించుకోవాలి గాని ఇలాగ రోడ్ మీద వేస్తామా. సంసారమంతా రట్టు చేసుకుంది. తన సంసారమే కాదు, మా కుటుంబ పరువు కూడా తీసేసింది. ఇప్పుడు దానితో మాట్లాడితే ఆయన ఏమంటారో“ అంటూ నాతో మాట్లాడానికి జంకుతున్నది. నేను మళ్ళి వసుంధర తోనే మాట్లాడాలి”, అనుకొంటూ మగతగా కళ్ళు మూసుకుంది.
వసుంధరకి తన అకౌంట్ నుంచి డ్రా అయిన డబ్బుల విషయం చెప్పింది. ఆ మరునాడే వసుంధర మైత్రేయి తోటి బ్యాంకుకెళ్ళి వాళ్ళ జాయింట్ అకౌంట్ ని ఫ్రీజ్ చేయించింది. ముందయితే బ్యాంకు మేనేజర్ జాయింట్ అకౌంట్ ని ఫ్రీజ్ చేయడానికి ఒప్పుకోలేదు. కానీ వసుంధర పోలీస్ గృహ హింస చట్టం కింది అతని భార్యే పెట్టిన కేసు తాలూకు FIR కాపీ ని సబ్మిట్ చేయడం వలన అతను ఆ యాక్షన్ తీసుకోక తప్పలేదు. మైత్రేయి చేత కొత్త అకౌంట్ ఓపెన్ చేయించడం , అది ఆమె సాలరీకి లింక్ చేయడం అన్ని చకచకా జరిగి పోయాయి.
బ్యాంకు ఉద్యోగి కావడం చేత సుబ్బారావు కీ విషయాలన్నీ చాల త్వరగా తెలిసిపోయాయి. ఆవేశంతో పళ్ళు పటపట కొరుకుతూ “నీ అంతు చూస్తానే “అని మనసులోనే ప్రతిన చేసుకున్నాడు.
మైత్రేయికి రోజులు చాల భారంగా గడుస్తున్నాయి. దొరికినప్పుడల్లా ఇంటి ఓనరు రమాదేవి సూటిపోటి మాటలు, అమ్మ శాపనార్ధాలు, అత్త గారి తిట్లు రోజు మామూలైపోయాయి. ఇంట్లో ఒంటరిగా పడుకోవాలంటే నే భయం ఏర్పడింది మైత్రేయికి. అక్కమ్మను కొద్దీ రోజులు రాత్రిపూట తనతో ఉండమని చెప్పింది. అందుకే అక్కమ్మ సాయంత్రం ఆరింటికల్లా మైత్రేయి దగ్గరకు వచ్చేసేది. కాలేజి లో కూడా పని చేయటానికి ఎదో బెరుకు. అందరు తనను ఎదో దోషి లాగా చూస్తున్నారని పిస్తున్నది.
కొందరు ఏమితెలియనట్లున్న తన వెనకాల చాలా మాట్లాడుతున్నారని తెలిస్తూనే ఉన్నది. వీళ్ళనే పబ్లిక్ అంటారేమో. వీళ్లే ఈ సమాజంలోని మనుషులు. వీళ్ళకి ఎదుటి వాళ్ళ సమస్యలు, ఒకరి వ్యక్తిగత విషయాలు కావాలి గని, ఆ మనిషి పడుతున్న భాధను మాత్రం పట్టించుకోరు . అవకాశం ఉంటే మీద బురద చల్లడానికి వెనుకాడరు. జరిగిన దాంట్లో తన తప్పు ఉన్నదో లేదో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఒకరి జీవితం కేవలం కాలక్షేపం మాత్రమే వీరికి. సమస్యలుండాలి కానీ పరిష్కారం మాత్రం అక్కరలేదు. ఆ వ్యక్తి బలహీనురాలయితే , అది ఒక స్త్రీ అయితే చాలు. రోజులు గడిపేస్తారు గాసిప్పులతో. ఇలాటి ఆలోచనలతోటి నిద్దర కరువయింది మైత్రేయి కి. రోజు ఒక నిద్దర మాత్ర అవసరం పడుతూనే ఉన్నది.
అక్కమ్మ చపాతీ కూర చేసి పెట్టింది. తన రూమ్ లోనే , పక్కనే ఉన్న చిన్న మంచం మీద అక్కమ్మ ను పడుకోమని చెప్పింది. నిద్రకు ఉపక్రమించింది.
‘చిమ్మ చీకటి, తనకేమి కనిపించటంలేదు పరిగెడుతూనే ఉన్నది సన్నటి సందులో పక్కనే ఎతైన గోడలు ఎంతసేపు పరిగెడుతున్న తరగని సందులు నిలువెత్తు గోడలు . ఆయాసపడుతున్నది. ఊపిరిఆడడంలేదు. వళ్ళంత చేమటలుపడుతున్నాయ్. ఎవరయినా ఉన్నారా! తలుపులుంటే తెరవండి అని అరుస్తున్నది. అంతా చూస్తుంటే తాను ఒక జైలు గోడల మధ్య ఉన్నట్టుగా ఉన్నది.
దారివెతుకుతు పరిగెడుతూనే ఉన్నది అక్కడి నుండి బయట పడాలని.ఎక్కడ తలుపు కనిపించటంలేదు. ఏడుస్తున్నది. ఆ గోడలను పట్టుకొని పరిగెత్తాలని చూస్తున్నది. ఏదో అచేతనావస్థ. మైత్రేయి మంచం మీద లేవాలన్నట్లు ఫిట్స్ వచ్చినదానిలా ఎగిరెగిరిపడుతున్నది.
అక్కమ్మకి ఎదో అలజడిగా అనిపించి కళ్ళు తెరిచి చూసింది. అచేతనావస్థలోనే మంచంపైన ఎగిరెగిరిపడుతున్నది మైత్రేయి. దగ్గరికెళ్లి చూసింది ఆమె వళ్లంతా చెమటతో ముద్దయింది. మనిషికి మాత్రం స్పృహ రావటంలేదు. కళ్ళనుండి కన్నీళ్లు కారిపోతున్నాయి. .
“లేమ్మ, లే! అంటూ . అక్కమ్మ మైత్రేయి ని కుదిపింది చాల బలంగా. కూర్చో పెట్టాలని ప్రయత్నించింది. కానీ తనకు తెలుస్తున్నది కానీ లేవలేకపోతున్నది. తనకి టాబ్లెట్ ప్రభావంవలన కళ్ళు తెరుపుడు పడటంలేదు. అక్కమ్మ పక్కనే ఉన్న చెంబులోంచి నీళ్లను ఆమె మొఖం మీద చిలకరించింది. బలవంతంగ లేపి గ్లాసుడు నీళ్లు తాగించి మళ్ళీ పడుకోపెట్టింది. ఫ్యాను తిరుగుతున్న కూడా తాను కూడా విసన కర్రతో విసురుతూనే ఉన్నది. అలా తెల్లవారుఝాము వరకు అక్కమ్మ మైత్రేయిని కనిపెట్టుకొని పక్కనే కూర్చుంది. ఎప్పటికో గాని మైత్రేయి కి పూర్తిగా నిద్దర పట్టలేదు.
అలా కూర్చున్న అక్కమ్మ అక్కడే మంచం మీదే తలవాల్చి నిద్రపోయింది.
“వాకిలింకా చిమ్మనేలేదు , కళ్ళాపి చల్లలేదు ముగ్గువేద్దామంటే. ఎక్కడ చచ్చింది అక్కమ్మ ఇవాళ!” అంటూ పెద్దగా అరుస్తున్న రమాదేవి అరుపులకు అక్కమ్మ లేచింది. గబా గబా లేచి తలుపు దగ్గిరకేసి వాకిళ్లు చిమ్మటానికి వెళ్ళింది.మైత్రేయి మాత్రం ఇంకా నిద్రలోనే ఉన్నది.
(ఇంకావుంది)