కొంచెం సేపు మౌనంగా ఉన్న నీలాంబరి మెల్లగా తల ఎత్తి ఇలా మాట్లాడింది…
” మీరెందుకు అలా అనుకుంటున్నారు ఎప్పుడైనా నేను అలా అనుకోవడం కానీ అలా బాధ పడ్డట్లు గాని మీకు అనిపించిందా! “
” అట్లా నువ్వు ఎప్పుడూ అనిపించలేదు నీలా కానీ నాకే ఎందుకు నా ప్రవర్తన ఎలా ఉండేది అప్పట్లో అని ఆలోచన వచ్చింది” అన్నాడు భూపతి.
” ఈ ప్రవర్తన వల్ల కానీ మీ మాటల వల్ల కానీ నేను ఎప్పుడూ బాధపడలేదండి కాకపోతే ఒక విధమైన పెళుసు ఉండేది మీ మాటల్లో… కానీ అది మీ నైజం కాదు ఇంట్లో పెరిగిన వాతావరణం వల్ల కావచ్చు అలాగని నేను అప్పట్లో అలాగే ఉండేదాన్ని అది సహజం దాన్ని తప్పు పట్టడానికి లేదు కానీ మీరు నన్ను అనుక్షణం ప్రోత్సహిస్తూనే ఉన్నారు నేను వేసే చిత్రాలను మీరు మెచ్చుకొని వాటిని ఫ్రేమ్ చేయించారు ఎన్నో సార్లు అడిగారు కూడా వీటిని ఎగ్జిబిషన్లో పెడదామా అని కానీ నేనే నచ్చక వద్దు అనుకున్నాను చాలా సార్లు మీరు నన్ను బయటకు తీసుకు వెళ్లడానికి కూడా ప్రయత్నం చేశారు… కొన్నిసార్లు తప్ప నేను ఎక్కువగా బయటకు రాలేదు. మీరు నాకు ఏమీ తక్కువ చేయలేదు ఈరోజు నా మనసు ఇంత స్థిరంగా ఉంటుంది అంటే దానికి మీరే కారణం…. ఈరోజు కూడా మీరు నాకు ప్రోత్సాహం ఇస్తూనే ఉన్నారు. నా మనసులో ఉన్న కోరిక తీర్చడానికి నాకన్నా ఎక్కువ మీరు ఉత్సాహం చూపిస్తున్నారు. నా తరం వాళ్లలో మహిళలను ఇంత ప్రోత్సహించినవారు ఎవరూ లేరు నేను చాలా సంతృప్తిగా ఉన్నానండి” అని కొంచెం ఉద్వేగంతో చెప్పింది నీలాంబరి.
భూపతి కళ్ళు సంతోషంతో వెలిగిపోయాయి.. దగ్గరికి వచ్చి నీలాంబరి చేయి పట్టుకుని అలాగే కాసేపు కూర్చున్నాడు…
” నువ్వు కూడా నా ఎదుగుదలకు స్ఫూర్తివి … ఎన్నో పద్ధతులు నీవల్ల నేను మార్చుకున్నాను నువ్వు అందరితో మాట్లాడే తీరు స్వచ్ఛంగా ఉండే నీ మనసు ఆధ్యాత్మికమైన నీ భావనలు దానితో పాటే మానవసేవ అనే నీ సంకల్పం ఇవన్నీ నాకు ఎంతో ఇష్టం. ఇంత వివరంగా మాట్లాడుకునే అవకాశం మనకు రాలేదు కదా ఇప్పుడు నా మనసు చాలా తేలికగా ఉంది.. ఇక లోపలికి వెళ్దాం పద రాత్రి అయిపోయింది అసలే నీకు చల్లగాలి పడదు..” అంటూ ఆమె చేయి పట్టుకుని లోపలికి నడిచాడు భూపతి.
సాయంత్రం మహిచేసిన అల్పాహారం తినేసి పిల్లలతో మాట్లాడక చాలా రోజులు అయింది అని మొబైల్ తీసుకొని ముందుగా కొడుకు సాగర్ కి ఫోన్ చేసింది…
” అమ్మా! సారీ ఈమధ్య కొంచెం బిజీగా ఉండడం వల్ల నీకు ఫోన్ చేయలేకపోయాను ఎలా ఉన్నావమ్మా నాన్న బాగున్నారా?” అని ఆత్రుతగా అడిగాడు.
” పర్వాలేదు నాన్న పనులు ఉన్నప్పుడు నువ్వు మాత్రం ఏం చేస్తావ్ నాన్న నేను ఇద్దరము బాగున్నాము నీ ఆరోగ్యం బాగుందా నేనే వారం నుండి నీకు ఫోన్ చేయాలి అనుకుంటున్నాను అమెరికా నుండి ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు కొంచెం పనులు ఒత్తిడి పెరిగింది అందుకే చేయలేకపోయాను రా! ” అని చెప్పింది నీలాంబరి.
” అవునా అమ్మ అంతగా ఏమి పనులు పెట్టుకున్నావు నువ్వు?” అని అడిగాడు సాగర్.
” చెప్పాను కదరా బాలసదనం నిర్మాణం చేయాలని దాని గురించే కొంచెం పని ఒత్తిడి ఉంది అక్క ఇచ్చిన లాప్టాప్ లో ఇన్ఫర్మేషన్ అంతా తీసుకున్నాను ఇంకా కొందరు సలహాలు తీసుకొని నాన్నగారు కూడా ఆ పనులు మొదలుపెట్టే ఆలోచనలో ఉన్నారు…” అని చెప్పింది నీలాంబరి.
“అమ్మ నువ్వు చిన్నప్పుడు చెప్పిన విషయం నాకు ఒకటి గుర్తొచ్చింది” అన్నాడు సాగర్.
” ఏం చెప్పాను సాగర్” అన్నది నీలాంబరి.
” ఒకసారి నువ్వు నాకు ఏదో పని చెప్పావు పూలు కోయడమో లేదా ఏదో సర్ది పెట్టడం నాకు సరిగా గుర్తులేదు…
అప్పుడు నేను అన్నాను ఇది ఆడవాళ్లు చేసే పని నేను చేయను అన్నాను..
అప్పుడు నువ్వు నా దగ్గరికి వచ్చి నా చెయ్యి పట్టుకొని” పనుల్లో ఆడ పనులు మగ పనులు అని వేరువేరుగా ఉండవు నాన్న ఎప్పుడూ అలా మాట్లాడకూడదు ఆడపిల్లలు మగ పిల్లలు సమానంగా ఉండాలి ఇద్దరూ ఒకేలాగా పుడతారు పెరుగుతారు అంతేకానీ ఇలాంటి తారతమ్యం ఉండకూడదు ఒకరికొకరు సమానంగా గౌరవం కూడా ఇచ్చిపుచ్చుకోవాలి రేపు కాలేజీకి వెళ్లిన ఉద్యోగం చేసిన ఈ విషయం ఎప్పుడూ మర్చిపోకూడదు” అని నువ్వు చెప్పిన మాటలు నా చెవుల్లో ఇంకా నిలిచే ఉన్నాయమ్మా..
ఎన్నో మంచి సలహాలు ఇచ్చి మా ఎదుగుదలకు కారణం అయ్యావు అందుకే ఎక్కడికి వెళ్ళినా కూడా నేను ఆడవాళ్ళకి చాలా గౌరవం ఇస్తాను అలాగే నాన్నగారు కూడా మహిళలను గౌరవించే వ్యక్తి అతని వ్యక్తిత్వం కూడా కొంతలో కొంత నాకు అబ్బింది అనుకుంటున్నాను గ్రేట్ పేరెంట్స్ అమ్మ మీరు” అన్నాడు సాగర్.
నీలాంబరి మొహం ఒక్కసారి సంతోషంతో ఉప్పొంగిపోయింది పిల్లలు ఇలా సత్ప్రవర్తనతో మెలిగితే ఏ తల్లిదండ్రులకు మాత్రం ఆనందంగా ఉండదు… తల్లిదండ్రులు మంచి బుద్ధులే చెప్పాలనుకుంటారు కానీ అవి పాటిస్తున్న వాళ్ళు ఎంతమంది బాధ్యతగా తల్లిదండ్రులు చదువుల కోసం ఖర్చుపెట్టిన వాటిని సద్వినియోగపరిచి చక్కని చదువులు చదువుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు… నా పిల్లలు మాత్రం ఆణిముత్యాలు” అని అనుకొని సాగర్ తో కాసేపు మాట్లాడి అలేఖ్యకు ఫోన్ చేసింది…
అలేఖ్య ఫోన్ తీయలేదు ఏదైనా బిజీగా ఉందా లేక ఆరోగ్యం ఎలా ఉందో అని కాసేపు కంగారు పడింది..
ఇంతలో అల్లుడు సుదీర్ ఫోన్ చేశాడు..
” అత్తయ్య మీరు ఫోన్ చేశారు కానీ అలేఖ్య తీయలేక పోయింది తనకు అత్యవసరమైన మీటింగ్ ఏదో ఉందట అందుకని నాకు మెసేజ్ చేసింది నన్ను మాట్లాడమని రేపు ఫోన్ చేస్తానని చెప్పమన్నది మీరేం కంగారు పడకండి అలేఖ్య ఆరోగ్యం బాగుంది. మీరందరూ బాగున్నారా!” అని నమ్రతగా మాట్లాడాడు.
ఒక్కసారి మనసు తేలిక అయిపోయింది..” అవునా అలాగే రేపే మాట్లాడమనండి తను ప్రెగ్నెంట్ గా ఉన్నది కదా దగ్గర ఎవ్వరం లేకపోయామే అనే బాధ నన్ను తొలచి వేస్తుంది… అందుకే ఫోన్ చేశాను సరే ఉంటాను రేపు మాట్లాడతాను సరేనా!” అని ఫోన్ పెట్టేసింది నీలాంబరి..
ప్రొద్దుట నుండి ఏవో ఆలోచనలతో గడిపిన నీలాంబరికి అలసటతో నిద్ర ముంచుకొచ్చేసింది పడక గదిలోకి వెళ్లి కళ్ళు మూసుకుని పడుకుంది క్షణాల్లో నిద్ర పట్టేసింది..
కిటికీలో నుండి పక్షుల కిలకిలలతో మెలకువ వచ్చింది… అలా కళ్ళు తెరచి ముందుగా తన అరచేతులను చూసుకొని నమస్కరించుకొని కిటికీలో నుండి బయటకు చూసింది….
అక్కడ కనపడ్డ దృశ్యం చూసి ఆశ్చర్యపోయింది నీలాంబరి….
ఇంకా ఉంది