ప్రేమ ఒక అనిర్వచనీయమైన అనుభూతి.హృదయాల స్పందన. మనిషికి మనిషికి మధ్యన మానవత్వపు వారధి. మనిషికి మనసుకు అనుసంధానకర్త. శరీరానికి మనసు అంతరంగ సారధి. వీటిని బట్టి ప్రేమ స్థానం మూడు రకాలుగా చెప్పుకోవచ్చు. మనిషి మనసుకు, మనిషి దేహానికి, మనిషిఆలోచనకు త్రికోణాత్మక గుణ సంహితమే ప్రేమ. మొదటిది నీ మనసుపై నీకు నియంత్రణ ఉండడం లో చూపే ప్రేమ. ఇది నిలిచి ఉండడానికి కావలసిన ఒంటి పై చూపవలసిన ప్రేమ. మూడవది ఆచరించే ఆలోచన పై ప్రేమ. ప్రథమంగా నీపై నీకు ప్రేమ ఉంటే ఇతర అంశాలపై ప్రేమను కురిపించగలం. ప్రేమకు మరో మాటను ఇష్టం అనీ చెప్తాం. It’s an automatic process. కావాలని చేసే పని వలన కాదు సహజ సిద్ధంగా మనిషి లోపల నిబిడీకృతమై ఉండవలసినటువంటి తీరు ప్రేమ లక్షణం. ప్రేరకాలు ఏమిటి అని ఆలోచిస్తే మనిషి నడవడి, పరిసరాలు, వ్యాపారం.వ్యాపారం అంటే చేస్తున్నటువంటి పనులు. ఒక శక్తివంతమైన భావన. ప్రేమను దుర్వినియోగం చేయకుండా ఉండాల్సిన బాధ్యత వ్యక్తిది. ప్రేమ చాలా రకాలుగా ఉంటుంది. నేను, నాది ,నాకు నుండి కన్న తల్లిదండ్రుల పై ప్రేమ సోదర సోదరీ మణులపై ప్రేమ, సహచరైన భార్యపై, భర్తపై ప్రేమ, కన్న సంతానంపై ప్రేమ,సభ్య సమాజం పై ప్రేమ,పశు పక్ష్యాదులపై ప్రేమ, ప్రకృతి పై ప్రేమ,వస్తు ప్రేమ అనేవన్నీ ప్రేమలో భాగాలే.మమత, అభిమానం ,పాశం, అనురక్తి, ప్రీతి వంటి పదాలన్నీ ప్రేమకు నానార్ధాలుగా, పర్యాయపదాలుగా చెప్పుకుంటాం. కొంత వాత్సల్యమూ, కొంత వ్యామోహం కూడా ప్రేమలోని భాగాలే. Love is beauty.love is blind.love is brave. అవును లవ్ ఇస్ బ్రేవ్ థింగ్. ప్రేమ వస్తువా? ప్రేమను వస్తు వితరణ లో ప్రదర్శిస్తే ప్రేమ ‘థింగ్ ‘,వస్తువూ అవుతుంది .ప్రేమించడానికి ధైర్యం కావాలి. కమిట్మెంట్ కావాలి. సుగుణశీలమూ ఉండాలి. అప్పుడే ప్రేమను జయించగలం. మూగ ప్రేమ , గుడ్డి ప్రేమ …. ఏ ప్రేమకై నా నిబద్ధత ఉండాలి.సహజత్వం ప్రేమ తత్వం.ప్రేమ జనించి, తగ్గి పోయే సందర్భంలో సరైన ‘కారణం’ కూడా ఉండాలి. ప్రేమ సముద్రమంతా లోతు, ఆకాశమంత వైశాల్యం కలిగినటువంటిది. ఈ ప్రేమ విస్తృతిని నాలుగు మాటల్లో కుదించి చెప్పడం కష్టం. అయితే’ ఫిబ్రవరి 14న ‘ప్రేమికుల దినోత్సవం అనే పేరుతో ప్రత్యేకమైనటువంటి రోజుగా జరుపుకోవాలని ఉన్న మూల చరిత్ర ను తెలుసుకుంటే, వాలెంటైన్ అనే ఓ ప్రవక్త ప్రేమను గురించి సందేశాలు ఇవ్వడాన్ని చూసి రోమ్ దేశ యువరాణి అతని అభిమాని గా మారడం చూసి రాజు నచ్చక అతనికి మరణశిక్షను విధించాడు. ఆరోజు ఫిబ్రవరి 14! ఇది జరిగిన ఓ రెండు దశాబ్దాల తర్వాత , అప్పటి పోపు వాలెంటైన్స్ డే అంటూ ప్రత్యేకమైన దినంగా ప్రకటించినప్పటి నుంచి ప్రేమికుల దినోత్సవం గా జరుపుకుంటున్నారు. ఇష్టమైన కానుకలనూ, సందేశాలను ఇచ్చిపుచ్చుకోవడం ప్రారంభమైంది. ఎప్పుడో క్రీస్తుపూర్వం 270 ల్లో యువకుల మధ్య ప్రేమ విషయం కోసం ఏర్పరిచిన ఈ ‘ వాలెంటైన్స్ డే’రోజు ను ప్రపంచమంతా జరుపుకోరు.గత కొన్నేళ్లుగా మాత్రమే సెలెబ్రేట్ చేస్తున్నారు.డెన్మార్క్, ఫ్రాన్స్, అమెరికా, లండన్, ఇటలీ ,జపాన్, ఆస్ట్రేలియా, కెనడా దేశాలలో మాత్రమే తప్పనిసరిగా చేస్తారు. ఏదైనా వేలం వెర్రిగా ఉంటే ఎవరు నచ్చరు,అందరూ ఆచరించరు. దీనికి రుజువుగా చెప్పుకోవాలంటే, ఈ వాలెంటైన్స్ డే ప్రారంభించిన ఉద్దేశ్యం నుండి మార్పు వచ్చి ,ప్రేమ అందరిదీ, అందరికీ ,అందరిచే అనే కొత్త వాదనను తీసుకువచ్చారు. కాని ఇప్పుడు వాలెంటెన్స్ డే కు విస్తృతిని తీసుకురావడానికి అమెరికా వంటి దేశాల్లోనూ , ఏ ఏ దేశాలైతే విస్తృతంగా నిర్వహించాయో ఆయా దేశాలు ఇప్పుడు వాలెంటెన్స్ డే కు కొత్త అర్ధాన్నిస్తున్నాయి. ప్రేమికులంటే యువతి యువకులు మాత్రమే కాదు, మనుషుల మధ్యన కలిగే స్పందన కేవలం శారీరక ఆకర్షణకు సంబంధించింది మాత్రమే కాదు అనే సత్యాన్ని ఇప్పుడు బాగా ప్రచారం చేస్తున్నాయి. అమ్మానాన్నల మీద ప్రేమ కురిపించేలా పిల్లలతో టీచర్స్ గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేయించి ఇప్పిస్తున్నారు. టీచర్స్ పైన ప్రేమ కురిపించేలా ఇండల్లో పిల్లలతో తల్లిదండ్రులు గ్రీటింగ్ కార్డ్స్ ను తయారు చేయించి ఇప్పిస్తున్నారు. స్నేహితులకు, అమ్మమ్మ తాతయ్య, నానమ్మ తాతయ్యలకు,ఇష్టమైన వ్యక్తుల కు గ్రీటింగ్ కార్డ్స్ తయారు చేయించి పిల్లలతో ఇప్పిస్తున్నారు. ఈ మార్పు స్వాగతించదగినది. భారతీయ సంప్రదాయంలో మాతృభక్తి, పితృభక్తి,గురుభక్తి అంటూ ఆచరించడం తెలిసిందే. ఈ భావాలు దైవభక్తి నుండి వచ్చినవే అని అర్థం చేసుకోవాలి.ఏ మతం వాళ్ళైనా వాళ్ళ వాళ్ళ దేవుళ్ళపై ఆనిర్వచనయమైన ప్రేమ ను కలిగి ఉండడమే భక్తి అనేది అర్థం చేసుకోవాలి. భక్తి అంటేనే ప్రేమ. ప్రేమ అంటేనే భక్తి. ప్రేమలోనే భక్తి ఉంటుంది భక్తి లోనే ప్రేమ ఉంటుంది అనే భావం సనాతనంగా చాలా దేశాలలో ఉన్న ఆచారాన్ని ఇప్పుడు కొత్త తరహాలో చూపిస్తున్నారు. అటువంటప్పుడు ఈ,’ ప్రేమ’ అనే విషయంపై ఒక ప్రత్యేకమైన రోజు ఎందుకు అనే ఒక ప్రశ్న కూడా వెలువడుతుంది. సర్వకాల సర్వావస్థలలో ఉండాల్సినటువంటి ప్రేమ కు ఒక ప్రత్యేకమైన రోజు ఎందుకు అని ఒక ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు వేసుకోవాలి. కానీ, మనిషి పుట్టుక గొప్పతనాన్ని ప్రతిరోజు జీవించి ఉన్నంతవరకు పుట్టుక ప్రాముఖ్యతను తెలిపేలాగా పుట్టినరోజులు చేసుకున్నట్టుగా ఒక ప్రత్యేకమైన రోజును ఏర్పాటు చేసుకోవడం, దాన్ని ఒక ఉత్సవంగా జరుపుకోవడం అనేది నిత్య నూతనంగా భావతరంగాలను వెలువరించడానికి ఒక పునాదిగా ఉంటుందని మాత్రం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రేమికుల దినోత్సవం ఆహ్వానించవచ్చు. ఆచరణలో జాగ్రత్తలు వహించినప్పుడు అందరికీ ఆనందదాయకమే!