వసంత పంచమి ( శ్రీ పంచమి)

వసంత పంచమి సందర్బంగా

మన సంస్కృతిలో ఎన్నో పండగలు వస్తూ ఉంటాయి. అవన్నీ భక్తి పరంగాను ,ఆరోగ్యపరంగానూ, జ్ఞాన ప్రధానంగాను ఉంటాయి. ఏదో పండుగలు ఆనవాయితీగా చేసాములే అన్నట్లు కాదు. ఆడంబ ప్రదర్శనకి అన్నట్టు అసలే కాకూడదు. అందులో ఉన్న అంతరార్ధాన్ని గ్రహించాలి. తెలియకపోతే పండితులనో, మన చేతిలో ఉన్న గూగుల్ ను అడిగి తెలుసుకోవచ్చు. ఎలా చేసినా పూజ ద్వారా జ్ఞానమును పెంపొందించుకోవడమే ముఖ్యం. జ్ఞానమే మానవజాతికి వన్నె తెచ్చే పెన్నిధి. జ్ఞానంలోనే అన్ని సుగుణాలు మిళితమై ఉంటాయి. అందుకే జ్ఞాన సముపార్జన జీవితానికి రాసబాట వేస్తుంది అంటారు. జ్ఞానము కలిగిన వ్యక్తుల వలన సమాజం శాంతి భద్రతలు కలిగి ఉంటుంది. పసితనం నుండి వారిలో జ్ఞానాన్ని నింపడానికి తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు సహకరిస్తూ ఉంటారు. మన పూర్వీకులు తీర్చిదిద్దిన వారిలో ఎందరో మేధావులు ఉన్నారు. సృష్టిలోని ప్రతి జీవి స్వసిద్దంగానే తమ జీవిత గమనానికి కావలసిన జ్ఞానం కలిగే ఉంటాయి.
మన హైందవ సాంప్రదాయంలో మనల్ని ఆదుకోవడానికి అనేక దేవీ దేవతలను కొలుస్తూ ఉంటాము. అందులో సరస్వతి విద్యారూపిణి,జ్ఞానస్వరూపిణికూడా. మాఘశుద్ధ పంచమి రోజు సరస్వతి జన్మించిన రోజు. దీన్ని శ్రీ పంచమి అని కూడా అంటారు. అందుకే ఆమెను ఆరోజు కొలుస్తాము. ఆరోజు పిల్లలు సరస్వతి దేవి ముందు పుస్తకాలు, పెన్నులు, పలకలు మొదలైన విద్యా సంబంధమైనవి పెట్టి పూజిస్తారు. ఒక్క చదువే కాదు కళలు అన్నీ కూడా సరస్వతి స్వరూపాలే.ఆ ఒక్క రోజే కాదు… వెనుకటి రోజులలో పిల్లలు ఇంట్లో కానీ, బడిలో కానీ చదువుకునే ముందు ” సరస్వతీ నమస్తుభ్యం “అనే శ్లోకము ” తల్లి నిన్ను తలంచి ” అనే శ్లోకము చదవాలని చెప్పి నేర్పించేవారు. ” తల్లి నీకు నమస్కరించి పుస్తకమును చేత పట్టుకున్నాను. నీవు నా మనసులో నిలబడి శుశబ్దములను పలికించు నా మాటల ద్వారా. ” అని ప్రార్థించే వారు. అంటే జ్ఞానాన్ని ఇమ్మనే కదా… సరస్వతి దేవి అహింస మూర్తి. ఇతర దేవతల వలె క్రూరమైన ఆయుధాలు ధరించి ఉండదు. తెల్లని పద్మములో ఆశీనురాలై వీణ,పుస్తకము, జపమాల, అభయ హస్తము కలిగి సాత్విక రూపంతో కనిపిస్తుంది. వీణ శ్రవణ శక్తిని, పుస్తకం పఠన శక్తిని, జపమాల మనన శక్తిని ప్రసాదిస్తుంది. ఈ శక్తులన్నీ విద్య గరపడానికి మూల సూత్రాలు. వీటి ద్వారా మనలో ధారణ నిలుస్తుంది. ఈ ధారణే అమ్మ ఇచ్చే అభయం ముద్ర. మనం నేర్చుకోవాల్సినవన్నీ తన స్వరూపం ద్వారా తెలియజేస్తోంది అమ్మ సరస్వతీ.


మాఘమాసం శశిర రుతువుతో ప్రారంభమవుతుంది. ఈ సమయంలో పంటలు పచ్చగా మారటం, పువ్వులు వికసించడంతో ప్రకృతి నయన మనోహరంగా ఉంటుంది. కాబోయే వసంత రుతువుకు స్వాగతం పలకడానికి నిండుగా అలంకరించుకుని ఉంటుంది. ఈరోజును వసంత పంచమి అనడానికి కూడా ఒక కారణం కలదు. రతీ మన్మధులు ప్రేమకు మారు రూపాలు. వారిద్దరి ప్రేమ మనందరిలో ప్రవేశించి సృష్టి కార్యాన్ని జరిపిస్తుంది. వారి ప్రేమ” ప్రేమకు పరాకాష్ట.” అందుకే పాశ్చాత్యులు కూడా ఫిబ్రవరిలో” వాలెంటైన్స్ డే ” అనే పేరుతో ప్రేమికుల రోజు జరుపు కుంటారు. ప్రేమ అనేది మానసిక స్పందన. తర్వాత అది బాహ్యస్పందన లోకి మారుతుంది.
ముఖ్యంగా తల్లులు మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తూ పూజలు జరిపించండి. పిల్లలకు కూడా వాటి గురించి వివరించండి. స్తోత్రాల్లో ఉన్న అర్ధాన్ని తేలికైన మాటలలో వివరించండి. వాటికి కొన్ని సోదాహరణలు కూడా వివరించండి. చదువు అంటే పుస్తక జ్ఞానమే కాదు. సంఘంలో ఎలా నడుచుకోవాలి. ఎవరెవరితో ఎలా ముసులుకోవాలో తెలియజేయాలి. నేటి ఆధునిక యుగంలో ఆడంబరాలే గాని అర్థ పరమార్ధాలు మాయమయ్యాయి. ఆధునిక స్త్రీ ఉద్యోగంతో పాటు సంసారం కూడా నడుపుకోవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పిల్లలను మూడో ఏటి నుంచి ప్లే స్కూల్లో చేర్పిస్తున్నారు. ఉమ్మడి కుటుంబాలు పోయి తాత నాన్నమ్మలు దగ్గర ఉండటం లేదు. తల్లి ప్రేమ లేమి అప్పటినుండి వాళ్ళ హృదయాలలో నాటుకుంటోంది. పిల్లలను గమనించే సమయం కూడా తల్లికి దొరకటం లేదు. ఇది చాలా అనర్ధాలకు దారితీస్తుంది. పిల్లలు ఫ్రెండ్స్ మీద ఎక్కువ ఆధారపడి పోతారు. తల్లులూ…. తస్మాత్ జాగ్రత్త! మీరు పెద్దవారై, విద్యావంతులై జ్ఞానాన్ని పొందే ఉంటారు కదా. ఇంటికి రాగానే పిల్లలని ప్రేమతో ఒక కంట కనిపెట్టండి. బాహ్యంగా అందరూ కూర్చుని చూసే టీవీ పోయి.. ఇప్పుడు” షైనీ టాయ్ ” అనే స్మార్ట్ ఫోన్ ఒకటి వచ్చింది కదా. దానితో పొందలేని జ్ఞానం అంటూ లేదు. ఇంట్లో అందరూ తల ఒక ఫోను పట్టుకుని కూర్చుని.. ఎవరిలో వారు నిమగ్నమైపోయి ఉంటున్నారు. బొడ్డు ఊడని పిల్లాడు కూడా తిండి తినడానికి ఫోన్ పెట్టాలి. పెద్దల ఎవరి చేతుల్లో ఫోన్ ఉండనివ్వడు. డాక్టర్లు కూడా దీనిని పదే పదే హెచ్చరిస్తున్నారు ఆరోగ్యరీత్యా మంచిది కాదని . పిల్లల్ని గమనించుకోండి.. ప్రేమతో మాత్రమే.. దండించి కాదు. ఇప్పటి పిల్లలు కంప్యూటర్ జనరేషన్ పిల్లలు. దానికి తోడు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెంట్ కూడా తోడవుతుంది. ఫిజికల్ అవసరాలు ఎప్పుడో తగ్గిపోయాయి. మానసిక అవసరం కూడా తగ్గిపోయే కాలం వస్తోంది. అందువల్ల పిల్లలకి అవగాహన ఎక్కువ అవుతుంది . ఫోను వాడకం పరిమితంగా ఇవ్వండి. మీరు కూడా వీలైనంతవరకు తగ్గించుకోండి. నెమ్మదిగా మంచి చెడులను వివరించడం చేయండి. వారి స్నేహితులను కూడాగమనిస్తూ ఉండండి. డబ్బు యొక్క విలువలను తెలపండి. పూర్వల్లా పదిమంది సంతానం లేరు కదా. ఒకరు ఇద్దరే కదా. ఇప్పుడు పిల్లల పెంపకంలో చేసిన పొరపాట్లు చివరి కాలంలో మనల్ని…, భవిష్యత్తులో మెండయిన జీవితాన్ని అందుకోవలసిన పిల్లలను అధోగతి పాలు చేయవచ్చు. చేతులు కాలేక ఆకులు పట్టుకున్న తీరు అవుతుంది. కొందరికి ఒకసారి చెప్తే అర్థం అవుతుంది మరి కొందరికి ఒకటికి రెండు సార్లు చెప్పాలి.మీ ఓరిమి, మీ సహనము అక్కరకు వస్తాయి.
ఇక్కడ పిల్లలు కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలి. తల్లిదండ్రులు చెప్పినట్లు విని నడుచుకోవాలి. యవ్వనం వచ్చేదాకా స్వతంత్ర భావాలు పనికిరావు. ఇరుగుపొరుగు వారిని ప్రేమిస్తూ, ఒక విద్యార్థిగా విద్యతో పాటు జ్ఞానాన్ని ఆశిస్తూ, సంఘంలో నేను ఒకడినే దాని బాధ్యత కూడా నాదే అని మసులుకున్ననాడు Alarm గౌరవం పొందుతారు. ఇది జీవితానికి బలాన్నిస్తుంది. అందుకు మన చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. చత్రపతి అనే పిలవబడే శివాజీకి వాళ్ళమ్మ జిజియా భాయి చిన్నప్పటినుంచి ఎన్నో నీతి బోధలను చేసిందట. వివేకానందుని చూడండి ఎంతకి ప్రజ్ఞావంతుడో. నమ్మిన సిద్ధాంతాన్ని విడిచిపెట్టలేదు. తల్లులారా గొప్ప గొప్ప వారి చరిత్రలో వినిపించండి. నేటి బాలలే రేపటి పౌరులు కదా. అందుతున్న విజ్ఞానాన్ని ప్రజ్ఞానంగా మార్చుకోమని చెప్పండి. ప్రకృతిలోని ప్రతి జీవి మనకు హితబోధ చేసే ” జ్ఞాన సరస్వతి “రూపమే అని తెలపండి. పంచభూతాలు మానవ మనుగడకుఎలా సహాయపడుతున్నాయో తెలపండి. వాటిని కాలుష్యం చేయడం వల్ల కలిగే అనర్ధాలను బోధించండి. ఒక్క రోజు సరస్వతీ పూజ ఆడంబరంగా జరిపితే సరిపోదు. సౌశీల్యము సౌబ్రాతృత్వము, స్వాభిమానము ఇదే మీరు సరస్వతికి ఇచ్చే నైవేద్యాలు. భక్తితో చేస్తే భుక్తికి లోటుండదు. నేటి ప్రపంచ విజ్ఞానం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది.,”పెరుగుట విరుగుట కరికే ” అనే చందాన కాకుండా… పెరిగినదాన్ని( అవసరం లేని దానిని ) కాస్త కత్తిరిస్తూ ఉంటే( మీ భవిష్యత్తు) ఏపుగా పెరగడానికి దోహదం చేసిన వాళ్లు అవుతారు.. మంచి నడవడిక అనే నీరు పోస్తూ. మారుతున్న కాలానికి అనుగుణంగా నడుచుకోవడం ఉత్తమమైన మార్గం అందరికీ. జ్ఞానమే వీటన్నిటికీ మూలం.
జ్ఞాన సరస్వతిని కొలుద్దాం… మన నడవడికలను మార్చుకుందాం

Written by Kameshwari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఆత్మ నివేదన

ప్రేమ — మాయ