తెల్లారగట్ల కిటికీ ఊచలపై ఓ పిట్ట వాలి నన్నే జాలిగా చూస్తూ ఏవేవో కువకువలాడుతోంది….
నాకర్ధం కాలే ఏంటో దీని పాట అనుకుంటూ దానివైపే నా చూపు నిలిపాను…
అప్పుడు నాకర్థమైంది
నా హృదయాగ్ని దావానలా తనను చుట్టేసినట్లుంది…
నాకన్నీటి సంద్రం ఉప్పెనై తనను ఉక్కిరిబిక్కిరి చేసినట్లుంది…
నా ఆవేదనల సుడిగాలి తనమేనును చుట్టేసినట్లుంది….
నా నిర్లిప్త అడుగులు ఈమన్నును తాకగానే అది గూడుపెట్టుకున్న చెట్టు నిలువెత్తు రందితో కుప్పకూలి పోతున్నట్లుంది….
వెలుగును మింగిన ఆకాశం చీకట్లను నామనసునిండా పరిచి కీచురాళ్ళ కూతలతో హోరెత్తించినట్లుంది….
పాపం పంచభూతాల ప్రకృతితో స్నేహం చేసే ఆ చిన్నిపిచ్చుక నాబాధనంతా తాను మింగి నింగిలో కలుపుతాననుకుంటున్నట్లుంది…
కొన్ని ఆనందాక్షరాలను నాచూపులవాకిలిలో పరిచి శుభోదయానికి స్వాగతం పలుకుతున్నట్లుంది….