సంధి అంటే?

3వ భాగం

రంగరాజు పద్మజ

ఇంతకుముందు భాగంలో ఏవి తెలుగు సంధులు, ఏవి సంస్కృత సంధులు అని తెలుసు కున్నాం. ఇప్పుడు వాటి గురించి వివరంగా తెలుసుకుందాం! మొదటి తెలుగు సంధులు గురించి తెలుసుకొని, అటు తరువాత సంస్కృత సంధులు గురించి తెలుసుకుందాం

 

ఈ భాగంలో ఇత్వసంధిలోని భేదాలు తెలుసుకుందాం!
” ఏమ్యాదుల యిత్తునకు సంధి వైకల్పికముగా నగు”.
ఏమి మొదలైన పదాల్లో ఉన్న హ్రస్వమైన ఇకారమునకు అచ్చు పరమైతే సంధి జరగవచ్చు, లేదా జరగకపోవచ్చు.
ఉదా:- ఏమి+ అంటివి
ఈ పదాల మధ్య సంధి జరిగితే ఏమంటివి అవుతుంది. ఈ రెండు పదాల మధ్య సంధి జరగకపోతే వాటి మధ్య యడాగమం వచ్చి ఏమియంటివి అనే రూపం ఏర్పడుతుంది.
అలాగే

మరి +ఏమి::: మరేమి, మరియేమి
హరికిన్ + ఇచ్చె సంధి జరిగితే పూర్వ రూపంలో ఉన్న ద్రుతం లోపిస్తుంది .ఆ తర్వాత ఇత్వం మీద సంధి జరిగి హరికిచ్చె అవుతుంది . ఒకవేళ సంధి జరగపోతే ముందున్న ద్రుతంతో కలిసిపోయి హరికినిచ్చె అని ఏర్పడుతుంది. సూరి ఈ సూత్రం కింద “ఏమి, మఱి , కి- షష్టి, అది, అవి, ఇది,ఇవి, ఏది, ఏవి” అనేవి ఆకృతిక గణాలని ఇచ్చారు. పైన ఇచ్చిన పదాల్లో ఇత్వ సంధి వైకల్పికముగా జరుగుతుందని అర్థం.
తరువాత సంధిని చూద్దాం!
“క్రియాపదములందిత్తునకు సంధి వైకల్పికముగా నగు”.
ఇంతకు మునుపు సూత్రంలో ఎక్కువ భాగం సర్వనామాలు మీదే సంధి జరిగిన విధానం చెప్పబడింది. ఇప్పుడు క్రియా పదాలు మీద సంధి వైకల్పికముగా జరుగుతుందని సూచించారు.
ఉదా- వచ్చిరి+ అపుడు :::
సంధి జరిగితే వచ్చిరపుడవుతుంది. సంధి జరగకపోతే రెండు పదాల మధ్య యడాగమం వచ్చి వచ్చిరియప్పుడు అని అవుతుంది.
ఇలాగే
వచ్చితిమి+ ఇప్పుడు ::: వచ్చితిమిప్పుడు, వచ్చితిమియిప్పుడు అని అవుతుంది.
తర్వాత సూత్రం గురించి తెలుసుకుందాం. “మధ్యమ పురుషక్రియలందిత్తునకు సంధి యగును”.
తెలుగులో పురుషలు మూడు రకాలు. అవి ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రధమ పురుష .
తన గురించి తాను తెలిపేది ఉత్తమ పురుష, ఎదుటివారి గురించి తెలిపేది మధ్యమ పురుష, దూరంగా ఉన్న వారి గురించి తెలిపేది ప్రథమ పురుష.
మధ్యమ పురుష క్రియల మీదున్న ఇత్వానికి అచ్చు పరమైతే సంధి నిత్యంగా జరుగుతుందని సూత్రార్థము.
ఉదాహరణలు పరిశీలిద్దాం.
ఏలితివి+ అప్పుడు ఇక్కడ ఏలుతివి అనేది మధ్యమ పురుష క్రియ. దీని మీదున్న ఇత్తునకు అచ్చు పరమైతే సంధి నిత్యంగా జరిగి ఏలితివపుడు అవుతుంది. ఇలాగే ఏలితి+ ఇప్పుడు… ఏలితిప్పుడు, ఏలితిరి+ ఇప్పుడు ఏలితిరిప్పుడు అనే రూపాలు ఏర్పడుతాయి .
తర్వాత సూత్రం చూద్దాం.
“క్త్వార్థంబైన యిత్తునకు సంధి లేదు”.
క్త్వార్థమంటే భూతకాలిక అసమాపక క్రియ. భూత కాలిక అసమాపక క్రియలు మీద ‘ఇ’ అనే ప్రత్యయం చేరుతుంది.
వండు+ ఇ:::: వండి
చదువు + ఇ:::: చదివి
ఇలా వచ్చిన క్త్వార్థమునకు అచ్చుపరమైతే సంధి జరగనే జరగదని సూత్రార్థం.
వచ్చి+ ఇచ్చెను. ఇక్కడ వచ్చి అనేది క్త్వార్థక ఇకారం ఉంది కాబట్టి దాని మీద సంధి జరగదు అలాంటి సమయంలో యడాగం వచ్చి
వచ్చియిచ్చెను అని అవుతుంది. అలాగే
వండి+ ఇచ్చెను::: వండియిచ్చెను
దీనితో ఇత్వ సంధి సూత్రాలు పూర్తి అయ్యాయి.

తర్వాత ద్విరుక్త టకారాదేశ సంధి గురించి తెలుసుకుందాం!
“కుఱు, చిఱు, కడు, నడు, నిడు శబ్దముల ఱ, డలకచ్చు పరమైనపుడు ద్విరుక్తటకారాదేశంబగు”
వివరణ చూద్దాం!
కుఱు, చిఱు అనే పదంలోని “ఱ”కారమునకు కడు, నడు, నిడు అనే పదములోని “డ”కారమునకు అచ్చు పరమైతే ద్విరుక్తటకారం అంటే రెండు టకారాలు(ట్ట్) ఆదేశంగా వస్తుందని సూత్రార్థం.
కుఱు+ ఉసురు
కుఱ్+ ఉ+ ఉసురు
ఈ సూత్ర ప్రకారం ‘ఱ్’ స్థానంలో ట్ట్ వచ్చి చేరి కుట్ట్ +ఉసురు అవుతుంది. తర్వాత ట్ట్ మీద ఉ చేరి ట్టు అవుతుంది. తర్వాత ఉత్తునకచ్చు పరమగునపుడు సంధి యగు అనే సూత్రంతో కుట్టుసురు అవుతుంది.
ఇలాగే
చిఱు+ ఎలుక…. చిట్టెలుక
కడు+ ఎదురు…. కట్టెదురు
నడు+ ఇల్లు… నట్టిల్లు
నిడు+ ఊర్పు… నిట్టూర్పు

తరువాత సంధిని గురించి తెలుసుకుందా!
” అందు, అవగాగమంబులనం దప్ప అపదాది స్వరంబు పరంబగుగనప్పుడు అచ్చునకు సంధి యగు”
అందు,అవక్ అనేవి తప్ప మిగిలిన అపదము
అనగా పదము కానిది పరమైతే సంధి నిత్యంగా జరుగుతుందని సూత్రార్ధం. అందు, అవక్ పరమైనప్పుడు వికల్పంగా సంధి జరుగుతుంది.
వాడు+ ఏ అన్నప్పుడు “ఏ” అనేది అపదం. అనగా ఏ అనేది పదం కాదు. అలాంటప్పుడు ఆ రెండు పదాల మధ్య సంధి నిత్యంగా జరిగి వాడే అవుతుంది.
ఇది+ ఓ…ఇదో
అది+ ఓ …. అదో
ఇలా పదాల్లో సంధి నిత్యంగా జరుగుతుంది.
మూర+ ఎడు ఇక్కడ ఎడు అనే పదానికి అర్థం లేదు, అది అపదం కాబట్టి నిత్యంగా సంధి జరిగి మూరెడు అవుతుంది.
వీసె+ ఎడు..‌‌ వీసెడు
అర్ధ + ఇంచు ఇక్కడ ఇంచు అనేది అపదం కాబట్టి సంధి నిత్యంగా జరుగుతుంది. అర్థించు అవుతుంది. ఇలాగే
నిర్జి+ ఇంచు::: నిర్జించు
అందు, అవుక్ అనేవి పరమైతే ఎలాంటి రూపాలు వస్తాయో చూద్దాం!
రాముల+ అందు…. సంధి జరిగితే రాములందు అవుతుంది. సంధి రాని పక్షంలో రాములయందు అవుతుంది.
ఎనిమిది+ అవ.. ఎనిమిదవ, ఎనిమిదియవ ఇలా రెండు రూపాలు ఏర్పడుతాయి.

సశేషం.
రంగరాజు పద్మజ

Written by Rangaraju padmaja

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

మన మహిళామణులు

ఎడారి కొలను