మన మహిళామణులు

ఒక జర్నలిస్టు గా ఆమె అనుభవాలు పంచుకున్న – – జె.శ్యామల by అచ్యుతుని రాజ్యశ్రీ

అక్షరం ఓ వెలుగు
అక్షరం ఓ ఆలంబన
అక్షరం ఓ ఆయుధం
అక్షరం అజరామరం..

అని మనసా, వాచా భావించే జె.శ్యామల.. సీనియర్ జర్నలిస్ట్, రచయిత్రి, కవయిత్రి, పుస్తక సమీక్షకురాలు. హైదారాబాద్ కు చెందిన జె.శ్యామల గతంలో ఉదయం దినపత్రికలో, ఆ తర్వాత వార్త దినపత్రికలో ..వెరసి 34 సంవత్సరాలు పత్రికారంగంలో పని చేశారు. వారి గురించిన పరిచయం ..


నిజామాబాదులో అక్షరాభ్యాసం, ఆదిలాబాదులో పాఠశాల ప్రవేశం జరిగాక .. నాన్నగారి ఉద్యోగరీత్యా కొంతవరకు విద్యాభ్యాసం అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని వివిధ ప్రదేశాల్లో జరిగినా, తొమ్మిదో తరగతి నుంచి చదువు హైదరాబాద్ లోని మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాలలో, ఆ తర్వాత రాజా బహద్దుర్ వెంకట్రామా రెడ్డి మహిళా కళాశాలలో కొనసాగింది. ఆ తర్వాత తెలుగు సాహిత్యం మీది ఇష్టంతో తెలుగు ఎం.ఏ . చేశారు. చదువుకునే రోజులనుంచి తెలుగు వారపత్రికలు, మాసపత్రికలు చదవడం అలవాటు.
ఆ తర్వాత ముందుగా బ్యాంక్ ఉద్యోగం వచ్చినా, వ్యక్తిగతమైన ఇబ్బందుల వల్ల ఆ ఉద్యోగంలో చేరలేదు. వివాహమై, ఇద్దరు పిల్లలు పుట్టాక అనుకోకుండా పత్రికారంగంలో పనిచేసే అవకాశం రావడంతో ప్రవృత్తి, వృత్తి ఒకటే కావడం ఆనందం కలిగించిందంటారు శ్యామల.
‘జర్నలిస్టుగా మీ ఉద్యోగ జీవిత విశేషాలు కొన్ని పంచండి ‘ అని అడిగినప్పుడు, శ్యామల ఇలా చెప్పారు…
‘ ఉదయం వీక్లీ ‘ లో ట్రెయినీ సబ్ ఎడిటర్ గా నా ఉద్యోగ ప్రస్థానం మొదలైంది. అప్పట్లో ప్రతి వారం మేగజైన్ తో పాటు ఓ నవలను అనుబంధంగా ఇవ్వాలని నిర్ణయించారు. నవలల ఆహ్వాన ప్రకటన మేరకు అసంఖ్యాక నవలలు వచ్చేవి. ఓ పెద్ద బీరువా నిండా నవలల రాత ప్రతులే. వీక్లీ ఆరంభానికి ముందర కొన్ని నెలలు ..రోజు నవలలు చదవడం, కథ సారాంశం, అభిప్రాయం రాసి వాటికి పిన్ చేసి పెట్టడం పనిగా ఉండేది. నాకున్న ఆసక్తి కొద్దీ రోజుకు రెండు నవలలు చదివేదాన్ని. ఎడిటింగ్ లో మెలకువలు, ప్రకటనలు వైవిధ్యంగా రాయడం నేర్చుకున్నాను. ఇంగ్లీష్ నుంచి తెలుగు అనువాదం సరే సరి. ఎందుకంటే పత్రికల్లో ఎత్తిపోతలు తప్పనిసరి. ఎందరో పెద్ద రచయితలు మా కార్యాలయానికి వస్తుండేవారు. అంతా చక్కనిసాహిత్య వాతావరణం. పనిలో స్వేచ్ఛ ఉండేది. అక్కడ సీనియర్ సబ్ ఎడిటర్ వరకు ఎదిగాను. జీతం తక్కువైనా చేస్తున్న పని ( నా వరకు ) తృప్తి నిచ్చేది. ఆ బంగారు కాలం ఓ తీపి గురుతు. ఆ తర్వాత కారణాంతరాల వల్ల వీక్లీ ఆగిపోవడంతో, నేను ఆదివారం అనుబంధం విభాగంలో కొనసాగాను. ఆ కాలంలోనే పూతరేకులు, సాధన ..కాలమ్స్ రాశాను. ఉదయంలో అప్పట్లో ఉద్యోగుల యూనియన్ కూడా ఉండేది. అప్పట్లో జర్నలిస్టుల జీతాలు ‘ బచావత్ వేజ్ బోర్డు’ ప్రకారం పెంచాలని చేసిన సమ్మెలు, నిరసన కార్యక్రమాలలో నేను కూడా పాల్గొన్నాను. జర్నలిస్టుల డిమాండ్ నెరవేరింది. పెరిగిన జీతం చూసుకుని ఎంత సంతోషమో ! కానీ కొద్ది కాలానికే పరిస్థితులు మారిపోయాయి. ‘ ఉదయం ‘ యాజమాన్యం మారిపోయింది. కంప్యూటర్లు ప్రవేశించాయి. పని తీరు మారింది. కంప్యూటర్ పై పని ఉన్నపళంగా నేర్చుకోవడం సవాలే అయింది. అవసరం అన్నీ నేర్పుతుందన్నట్లు అదీ నేర్చుకున్నాం. టైపింగ్..పేజ్ మేకింగ్ అదనపు బాధ్యతలు సబ్ ఎడిటర్ లపై పడ్డాయి. ఉద్యోగజీవితంతో కుస్తీ పడుతుండగానే నష్టాల పేరు చెప్పి పత్రికనే మూసేయడం అశనిపాతమే అయింది. ఉదయం ఉద్యోగులందరూ వీధిన పడ్డారు. ఆ కష్టం అక్షరాలకు అందనిది. అందరి సమస్యలు, కష్టాలు రాసి, ప్రపంచానికి తెలిపే ‘ కలం’ కారులు ‘ పత్రికా ఉద్యోగులు. కానీ వారి సమస్యలు, కష్టాలు మాత్రం అరణ్య రోదనే. ఇప్పుడయితే పత్రికల్లో ఎక్కడా ఉద్యోగుల యూనియన్ అనే మాటే వినపడదు.
ఆ తర్వాత వార్తలో ఉద్యోగం.. బాలల విభాగం ‘ మొగ్గ ,’ లో పని చేసే అవకాశం వచ్చింది. అందులో పని చేస్తూనే మహిళల పేజీకి, ఆదివార అనుబంధానికి .. ఇతర స్పెషల్స్ కి విరివిగా వ్యాసాలు, వార్త ఆదివారం అనుబంధంలో ‘ సాలోచనమ్ ‘ పేరిట కాలమ్ , పుస్తక సమీక్షలు, కొన్ని కథలు రాశాను. కాలక్రమంలో చీఫ్ సబ్ ఎడిటర్ స్థాయికి ఎదిగాను. వార్తలో సన్ డే మేగజైన్ ఇంచార్జిగా ప్రమోట్ అయి పలువురి ప్రశంసలు అందుకున్నాను.
అన్ని రంగాలలో ఉన్నట్లే పత్రికా రంగంలోనూ రకరకాల వివక్షలు.. ఆశ్రిత పక్షపాతాలు మామూలే. అతివినయం, భట్రాజుల్లా వ్యవహరించడం, మాటలుచేసిన పనిని కొండంతగా, ప్రత్యేకంగా చెప్పుకోవడం వంటి విద్యలు తెలియాలి. లేకపోతే గుర్తింపు కష్టమే. టైమ్ ప్రకారం పని, పత్రికల్లో చాలాచోట్ల కుదరదు. టైమ్ ప్రకారం హాజరు కావాలి కానీ వెళ్ళడానికి టైమ్ ప్రకారం కుదరదు. పని పూర్తి కావలసిందే. తగిన సిబ్బంది ఉండరు. వసతులు ఉండవు. రేపు సెలవు అంటే ఈరోజే ఆ పని చేసుకుంటేనే సెలవు మంజూరు. కష్టపడి ముందుగా పని పూర్తి చేస్తే అంతలోనే దాన్ని మార్చి మళ్లీ చేయాల్సిన పరిస్థితులు వచ్చిపడుతుంటాయి. అయితే ‘ తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ..’ అన్నట్లు మొక్కుబడి పని చేసేవారికి బాగానే చెల్లుబాటు అయిపోతుంది. అంకిత భావంతో పారదర్శకంగా, పద్ధతి ప్రకారం చేయలనుకునే వారు ఇక్కట్లు భరించాల్సిందే ‘ .
‘ మీ తొలి కథ గురించి .. ‘అనగానే ఆమె నవ్వుతూ ‘ అచ్చు కాని కథ అయితే ఎనిమిదో తరగతిలో వుండగానే రాశాను. కుల వివక్ష గురించి పిల్లల మనోభావాలు ఆ కథలో రాశాను. మరో కథ పెద్దలు, పిల్లలతో ప్రేమగా, అనునయంగా మాట్లాడకుండా , కోపంగా కసురుకోవడం అంశంపై రాశాను. అయితే ఏ పత్రికకూ పంపలేదు. ఆ తర్వాత అవి ఎటు పోయాయో తెలీదు. ఆ తర్వాత ఉద్యోగంలో చేరక ముందర ‘ పాట తెచ్చిన ప్రమాదం ‘ పేరుతో కథ రాశాను. కానీ కథాంశం దృష్ట్యా నా పేరుతో పంపడానికి మొహమాట పడి మా వారి పేరుతో పంపాను. హస్యప్రభ వారు ఆ కథను ‘ చాదస్తపు మొగుడు ‘ పేరుతో ప్రచురించారు. అప్పట్లో మగవాళ్ళు తమ రచనలను పత్రికలకు ఆడ పేర్లతో పంపేవారు..త్వరగా ప్రచురిస్తారనే భావనతో..కానీ నా విషయంలో అది రివర్స్ అయింది. ఆ తర్వాత  ‘ సుఖీభవ ‘ అనే కథ ఆంధ్రప్రభలో అచ్చయింది. అలా మొదలై ముందుకు సాగింది నా కథాయానం. ఇప్పటి వరకు దాదాపు 80 కథలు, 25 బాలల కథలు, 35కి పైగా కవితలు, కొన్ని యాత్రా కథనాలు రాశాను. పడక్కుర్చీ, ఆదివారం శని, భారతంలో బాల భీముడు, ప్రేమ సాక్షి, దొంగా దేవుడే, స్కూటరహో!, చాప కింద నీరు, స్మితప్రజ్ఞ , శ్రీహరి..స్మార్ట్ ఫోన్, అనగనగా ఓ ప్రియంవద, అసలైన కొడుకు ..నా కథల్లో కొన్ని. నా కథలకు కొన్నింటికి బహుమతులు లభించాయి. భూమిక కథల పోటీ, వాసా ప్రభావతి స్మారక కథల పోటీ, విడదల నీహారిక ఫౌండేషన్ వారి కథల పోటీలలో బహుమతులు పొందాను.
సంచిక డాట్ కామ్ లో నేను రాసిన ‘ మానస సంచరరే ‘, ‘ అన్నింట అంతరాత్మ ‘ కాలమ్స్ కు విశేష ఆదరణ లభించింది. ఇక ప్రచురిత పుస్తకాల విషయానికి వస్తే, మెగసెసే అవార్డు పొందిన భారతీయులు; జాతక కథలు : పునః కథనం ; ముల్లా నసీరుద్దీన్ కథలు : పునః కథనం పుస్తకాలుగా వచ్చాయి . నేను రాసిన కథలను పుస్తక రూపంలో తేవాలన్న తలంపు ఉంది ‘ అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఇక నిశ్చింతగా….

సంధి అంటే?