ఇప్పటివరకు: వివాహం అయినా తరువాత తన గురించి ఎవరు పట్టించుకోవటం లేదు. సుబ్బారావు ప్రవర్తనలో చాల మార్పొచ్చింది. అందుకనే తానే తెలుసుకోవాలని హైదరాబాద్ బయలుదేరింది. హైదరాబాద్ వెళ్లిన మైత్రేయికి సుబ్బారావు మీద ఉన్న అనుమానాలు నిజమేమనిపించాయి. అతన్ని కలవకుండానే తెనాలి చేరుకుంది. ఆరోజే సుబ్బారావు కూడా తెనాలి వచ్చాడు. వారిద్దరి మధ్యన ఘర్షణ జరిగింది. సుబ్బారావు అసలు రూపం బయటపడింది. తాగిన మైకంలో ఉన్న సుబ్బారావు మైత్రేయి ని కొట్టాడు. ఆమె తిరగబడింది ఆత్మాభిమానంతో
“రాత్రంతా నిద్దరే లేదు. పాడు సంత. మన సంసారుల మధ్యలో కొచ్చిపడింది . ఈ కా లం చదువుకున్న అమ్మాయిలంతా విడ్డూరమే! సంపాదిస్తున్నామన్న అహంకారం. అర్థమయి చావరు! చెట్టంత మనిషి ని రాక్షసల్లే అలా వరండాలోకి లాగి పడేసింది. నేననుకోలేదమ్మా! ఈ పిల్ల అంత సమర్థురాలని! పైకేమీ అలా కనిపించనే కనిపించదు, ఏమిటో! పిదప కాలం పిదప బుద్దులు. మనం ఎప్పుడైనా ఇంత రాద్థాంతం చేసేవాళ్లమా ఏంటి? ఎంత గుట్టుగా కాపురాలు చేసుకోవటంలేదు.” అంటూ ఇంటి ఓనర్ గారి భార్య రమాదేవి చిత్ర విచిత్రంగ చేతులు తిప్పుతూ మడి నీళ్లు పట్టుకొంటూ, అక్కడ చేరిన వాళ్లందరికీ వివరిస్తున్నది.
వాళ్ళ మాటలు చెవిన పడుతున్న వినని దానిలాగే ఉండిపోయింది మైత్రేయి. ఆమెకు మనసంతా బాధతో నిండిపోయింది . ఎం చేయాలో తెలియని అగమ్య గోచరం లో ఉన్నది. ఆ రోజంతా ఆలోచిస్తూనే ఉండిపోయింది.
అక్కమ్మ పనికొచ్చింది. “అమ్మ ,ఇలాగ ఉన్నవేంటి?” అంటూ ఆరా తీసింది.
“ఎం లేదు అక్కమ్మ”, నీ పని చూసుకొని నువ్వెళ్లు అంది. అక్కమ్మకు ఎం జరిగిందో కొంత అర్ధమయింది.
పాల బూత్ దాక వెళ్లి మైత్రేయి ఖాతాలో ఒక పాల ప్యాకెట్ పట్టుకొచ్చింది. వేడి వేడి కాఫీ పెట్టించింది. తాను కూడా ఒక కప్పు కాఫీ తెచ్చుకొని మైత్రేయి పక్కనే కూల బడింది.
మైత్రేయి కి ఏడుపు ఆగలేదు. అక్కమ్మ ను పట్టుకొని పెద్దగా ఏడ్చేసింది.
“ఎందుకమ్మా అలాగ ఏడుస్తావు. మొగుడు పెళ్ళాం మద్దెన ఇవి మామూలే . మీ సదుకున్నోళ్ళు పరువు మర్యాద అని ఆలోచిస్తా ఉంటారు. మాల్లాటోళ్ళకి అలాటివేవీ అక్కరలేదమ్మా. ఈ పాటికి ఆడిని రోడ్ మీదకి ఈడ్చి మా ఆడోళ్ళందరం నాలుగు తగిలించేవాళ్ళం. వాడు జీవితంలో మల్ల ఇలాటి పని సేయ కుండా గాలీలిచ్చేవాళ్ళం. ఆడదానికి ఆడదే తోడు కావాలమ్మా. మన రమాదేవి అమ్మగారిలాంటోళ్ళు నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటారు. చేస్తుంటారు. అలాటోళ్ల నోరు ఎలా మూయించగలం. పైగా మనకేమన్న కష్టం ఒత్తే ఇలాగ మాటాడే వాళ్ళందరూ వచ్చి తీరుత్తారా, ఏటి, నాకు తెలవక అడుగుతాను? నువ్వు గమ్ముగుండు. ఇలాటి వాళ్ళ మాటలే వి మనసులో పెట్టుకోమాక,” అంటూ ఓదార్పు ఇవ్వటానికి అక్కమ్మ ప్రయత్నించింది.
అక్కమ్మ అక్కడే అందరి ఇళ్ళలో పని చేస్తుంది. సన్నగా పొట్టిగా , ఒక నైలెక్స్ చీర కట్టి, దాన్ని కాస్తంత పైకి ఎగ దోపి పనిలోకి దిగితే చకా చకా పది ఇళ్ళలో పని చుట్టబెట్టేస్తుంది. ఆ చుట్టుపక్కల ఇళ్లన్నింట్లోనూ అక్కమ్మే పనిచేస్తుంటుంది. తనకి తోడుగా ఒకరిద్దరు అమ్మాయిలను కూడా తెచ్చుకొంటుంది తనతో పని చేయటానికి . నమ్మకం, మంచితనమే ఆమె ఆభరణాలు. అందుకే ఆ కాలనిలో అందరికి తల్లో నాలుక లాటిది అక్కమ్మ. పొద్దునే ఆరు గంటల కల్ల దాని పని మొదలవుతుంది. ఆ రోజు అలాగే వచ్చింది. కానీ రమాదేవి గేటు దగ్గరే ఉంది. అక్కమ్మకు రాత్రి మైత్రేయి ఇంట్లో ఎం జరిగిందో చెప్పేవరకు మనసు ఆగలేదు. ఆమెకు అనిపించింది ఈ విషయం అక్కమ్మకు తెలిస్తే ఆ వీధి మొత్తం తెలిసిపోతుంది, ఆ రోజుకి తన కు మంచి కాలక్షేపం . అంతే కాదు మైత్రేయి మీదున్న అసూయతో కూడిన ద్వేషం కూడా శాంతించవచ్చు. ఎందుకంటే రమాదేవి నాలుగేళ్లు మాత్రమే మైత్రేయి కంటే వయసులో పెద్దది.తనకు చాల చిన్న వయసులోనే పెళ్ళిచేసేశారని, లేకుంటే తానూ కూడా మైత్రేయి లాగా నాజూకుగా జడ ఊపుకుంటూ తిరిగేదాన్నని’ ఆమె అనుకొంటుంటుంది.
అక్కమ్మలాంటి వాళ్ళందరూ అలాగే ఉండాలని లేదు. అక్కమ్మ బాగా వివరం తెలిసిన మనిషి. తన తో పాటు తన చుట్టుపక్కల వాళ్ళని కూడా అర్ధం చేసుకొనే మనిషి. ‘ఆడదంటే ఆడదే. ఏ కష్టమొచ్చినా ఏ ఆడదయినా కన్నీరు కార్చాల్సిందే, గొప్పింటి బిడ్డయినా, పేదింట్లో పుట్టిన, సదుకున్న, సదుకోకపోయిన ఆడపిల్లకొచ్చే కట్టం మాత్రం తీర్చలేనిది. ఇది ఏ ఒక్క అమ్మాయి కో జరిగే అన్యాయం కాదు. ఈ సమాజంలో ఆడపిల్ల ఆడపిల్లే, వాళ్ళ సమస్య సమస్యే,’ అని నమ్మే మనిషి అక్కమ్మ. ఎవరికీ భయపడే మనిషి కాదు. అందుకే, మైత్రేయికి ఆ రోజు తోడుగా ఉండాలని అక్కమ్మ రమాదేవి చెప్పిన విషయాలన్నీ విని కూడా ఏమీ మాట్లాడకుండా తన పనిని త్వరగా ముగించుకొని మైత్రేయి దగ్గర కొచ్చింది.
అక్కమ్మకు అలా కాళ్ళ్లుముడుచుకొని పడుకొన్న మైత్రేయిని చూస్తుంటే మనసంతా జాలితో నిండిపోయింది. శరీరమంతా నెప్పులు, వాటిని అలా భరిస్తూనే పడుకొనిపోయింది మైత్రేయి. ఆమెకు ఆ రోజు ఏమి చేయాలనిపించలెదు. మనసు పడే బాధముందు ఈ శారీరక బాధ ఎంత.
(ఇంకా ఉంది)