దొరసాని

ధారావాహిక నవల – 16వ భాగం

” ముందుగా మీరందరూ కూర్చోండి… ఇప్పుడు చెప్పండి దేనికోసం క్లబ్ స్థాపించాలనుకుంటున్నారు దీని లక్ష్యం ఏమిటి?” అని అడిగింది నీలాంబరి.

వారంతా ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు తర్వాత గుసగుసలు పెట్టుకొని అందులో నుండి ఒక మహిళ లేచి నిలబడింది…

” చుట్టుపక్కల ఉన్న వాళ్ళమంతా ధనవంతులము ఇళ్లల్లో పనులు చేయడానికి మాకంతా పనివాళ్ళు ఉన్నారు ఇంకా ఊరికే ఇంట్లో కూర్చొని చాలా విసుగ్గా ఉంటుంది ఈ క్లబ్ ఉదయం10:00 నుండి రాత్రి 9 గంటల వరకు ఉంటుంది ఇందులో ఆటలాడుకోవడం కబుర్లు చెప్పుకోవడం ఒకరి సమస్యలు ఒకరం చెప్పుకోవడము వీలైతే ఇంకెవరైనా అనాధపిల్లలకు సహాయం చేయడము చేస్తాము.

ఇప్పుడు మేమందరము పొద్దున్నే బయలుదేరుతాము ఇప్పుడు క్లబ్ కోసం ఒక హాలు లాంటిది లేదు కాబట్టి ఎవరో ఒకరి ఇంట్లో కూర్చుని మాట్లాడుకుంటాము మళ్ళీ అందరం రాత్రి 9 గంటలకు చేరుకుంటాము… అప్పుడప్పుడు నగరానికి షాపింగ్ కోసం కూడా అందరం కలిసి వెళ్తాము ఎందుకంటే రోజు మేము తిరుగుతుంటాం కాబట్టి కొత్త కొత్తగా కనిపించాలని మా కోరిక మీరు కూడా క్లబ్ హాల్ అయిన తర్వాత రావచ్చు మనమందరం చక్కగా ఆడుకోవచ్చు ఎలాగో మీకు కూడా ఇంట్లో చేసే పని ఏమీ ఉండదు కదా!” అని అన్నది.

నీలాంబరి కాసేపు మౌనంగా కూర్చుంది…

తర్వాత వారిని ఇలా అడిగింది..

“మీ ఇళ్లల్లో పిల్లలకి భర్తలకి పెద్ద వాళ్ళకి ఎవరు చేసి పెడతారు మీరు ఉదయాన 10 గంటలకు బయటకు వస్తాము అంటున్నారు కదా అప్పటి వరకే మీకు పనులన్నీ అయిపోతాయా! ఎంత పనివాళ్ళు ఉన్నా ఇంటివాళ్లు చూసుకునే పనులు కూడా ఉంటాయి కదా” అన్నది నీలాంబరి.

” పనులు చేయాల్సిన అవసరం మాకు ఏమీ లేదండి మా పిల్లలకు ఇంట్లో చేయడానికి ఇద్దరు ఆయాలు ఉన్నారు పని మనుషులు ఉన్నారు వంట మనుషులు ఉన్నారు పెద్ద వాళ్ళని మా భర్తలని కూడా వాళ్లే చూసుకుంటారు మేము పొద్దున పలహారం చేసి తయారై బయటకు వస్తాము తర్వాత రాత్రి 9 అవుతుంది మేము వెళ్లడానికి అప్పటికే అందరు భోజనాలు చేసి పడుకుంటారు మేము కూడా భోజనం చేసి పడుకుంటాము ఇదే మా షెడ్యూల్” అని చెప్పింది మరో మహిళ.

” అనాధలకు అప్పుడప్పుడు సేవ చేస్తామని అంటున్నారు చేసినట్లు ఎక్కడ దాఖలా కనిపించడం లేదు… పోనీ ఇంట్లో పిల్లలకు అన్ని చక్కబెడుతున్నారా అంటే అదీ లేదు ఆయాల మీద మీపిల్లల్ని వదిలేసి మీరు పొద్దున్నే ఇంట్లో నుండి బయలుదేరుతారు పోనీ ఉద్యోగాలు చేస్తున్నారా అంటే అది ఏమీ లేదు ఇంట్లో తోచడం లేదని బయటకు వచ్చి కబుర్లు చెప్పుకోవడం ఆటలాడుకోవడం ఇదే కదా మీరు చేసేది దీనివల్ల ఎవరికి లాభం కనీసం మీరు ఏపనులు చేయకపోయినా ఇంట్లో ఉంటే మీఇంట్లో ఉన్న పెద్ద వాళ్ళకి పిల్లలకి మీ భర్తలకి సంతోషంగా ఉంటుంది కదా అయినా ఇంట్లో చేయడానికి ఏమీ ఉండదు అంటే నేను ఒప్పుకోను ఇల్లాలికి ఎంత చేస్తే అంత పని ఉండనే ఉంటుంది… మీరు 9 గంటలకి రాత్రికి ఇల్లు చేరుకుంటే మీ పిల్లలని ఎప్పుడు చూసుకుంటారు వాళ్ళు మిమ్మల్ని కనీసం రాత్రి కైనా చూస్తున్నారా ఎవరికి మీరు న్యాయం చేస్తున్నారు ఒక్కసారి ఆలోచించుకోండి చేసేది ..ఏదైనా దానికి ఒక ప్రణాళిక ఒక ధ్యేయం ఒక లక్ష్యం ఉండాలి.. అవేమీ లేకుండా కాలాన్ని వృధా చేయడమనేది చాలా బాధాకరం.. ఒక్కసారి మీరు ఆలోచించుకోండి మీరు సంఘానికి ఉపయోగపడే పని ఏదైనా చేస్తే తప్పక నేను సహాయం చేస్తాను అంతేకానీ ఇలా సమయం వృధా చేయడానికి నేను ఏ సహాయం చేయలేను ఇలాంటి వాటికి నేను వ్యతిరేకిని ..నాకు ఏమీ పని ఉండదు అన్నారు కానీ ఒక్కరోజు నాతోపాటు మీరు ఉండి చూడండి మీకే అర్థమవుతుంది” అని సున్నితంగా చెప్పింది నీలాంబరి.

అందరూ అలాగే ఏమి మాట్లాడకుండా కూర్చున్నారు నీలాంబరి మాటలు వాళ్ళకి రుచించినట్లు అనిపించలేదు…

మళ్లీ చెప్పింది నీలాంబరి…

” ఒకసారి ఆలోచించండి మీరు అనాధలకు సహాయం చేస్తాను అంటున్నారు కదా ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న మీ పిల్లలు అనాధలు కారా తల్లిపాలన లేకుండా పెరుగుతున్నారు అంటే వాళ్ళు అనాధలే కదా ముందు వారి సంరక్షణ చూడండి అదంతా అయ్యాక మీకు తీరిక ఉంటె సంఘసేవలో పాలుపంచుకోండి లేదా మీకు ఒక వ్యాపకం సృష్టించుకోండి” అని చెప్పి రెండు చేతులు జోడించి లోపలికి వెళ్ళిపోయింది నీలాంబరి.

కొంతమందికి మాత్రం పరివర్తన కలిగినట్లు అనిపించింది కొంతమంది మాత్రం విసుగ్గా కోపంగా మొహం పెట్టుకొని ఈవిడెంటి మాకు చెప్పేది అన్నట్లుగా చూస్తున్నారు..

అందరూ లేచి బయటకు వెళ్లిపోయారు…

లోపలికి వెళ్ళిన నీలాంబరికి చాలా బాధగా అనిపించింది… ఈమధ్య చాలామంది ఆడవాళ్లు సమయం వృధా చేసుకుంటూ ఏదో ఒక ఇంట్లో కూర్చుని కాలయాపన చేస్తున్నారు అన్నట్లుగా తాను వింటుంది అందులో కొంతమంది మాత్రం నిజాయితీగా ఏదో ఒక సేవ చేయడానికి ఉపయోగించుకుంటున్నారు కానీ చాలా మంది ఇలా ఒకచోట చేరి రకరకాల బట్టలు నగలు వీటి గురించి చర్చించుకుంటూ వారికి లేనిది అప్పుడే కొనుక్కోవాలని ఆలోచించుకుంటూ ఇలా తిరుగుతున్నారు ఎప్పటికీ వీళ్లంతా మారుతారు” అని అనుకున్నది.

కాలం చాలా వేగమైనది ఎవరి గురించి ఆలోచించకుండా తన కర్తవ్యం తాను నెరవేర్చుకుంటూ తిరుగుతూనే ఉంటుంది అలా వారం రోజులు గడిచింది…

బాలసదనం గురించి ఆలోచనలు ఒక కొలిక్కి వచ్చాయి దాని నిర్మాణం కోసం ఖర్చు ఎంత అవుతుంది? ఎలా ఉండాలి అనేది ఆలోచించి ఒక ప్లాన్ వేయించారు…

నీలాంబరికి అకస్మాత్తుగా గుర్తు వచ్చింది “ఆరోజు పూజారి గారు శివరాత్రి ఉత్సవాలు వస్తున్నాయి దాని ఏర్పాటు కోసం మాట్లాడాలి అన్నారు ఆ విషయమే గుర్తులేదు” అనుకొని…

“మహేశ్వరరీ! ఆరోజు యాదగిరినీ పని చేయడానికి రమ్మన్నాను కదా వస్తున్నాడా? ఈ మధ్య నేను ప్రొద్దున లేచి పెరట్లోకి వెళ్లడం లేదు” అని అడిగింది నీలాంబరి.

” వస్తున్నాడమ్మా” అని చెప్పింది.

“సరే ఒకసారి సిద్దయ్యకు చెప్పు రేపు ఉదయమే కచ్చరం సిద్ధం చేయమని శివాలయానికి వెళ్ళాలి నాతోపాటు నువ్వు కూడా తయారుగా ఉండు” అని చెప్పింది మహేశ్వరి.

ముందు పూజారి గారిని ఇంటికి పిలుద్దాము అనుకుంది కానీ అది గౌరవం కాదు అనిపించి తానే గుడికి వెళ్లడానికి సిద్ధపడింది “అమెరికా నుండి వచ్చిన తర్వాత శివయ్య దర్శనానికి వెళ్ళనే లేదు వచ్చినప్పుడు నుండి తీరికలేని పనులు ఏవో ఒకటి ఉండనే ఉంటున్నాయి.”..

ఆరోజు సాయంత్రం భూపతి నీలాంబరి పెరట్లో రాధా మాధవ పందిరి కింద కూర్చున్నారు చక్కని పరిమళం వేస్తుంది వాతావరణం ఎంతో బాగుంది ఇద్దరూ ప్రకృతి ఆరాధకులు కాబట్టి అప్పుడప్పుడు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అలాగే అక్కడికి “మువ్వను” కూడా తెచ్చుకున్నారు.. అది అటూ ఇటూ పరుగులెత్తుతుంటే దాన్ని చూసి మురిసిపోతూ దాని వెనకాల పరిగెత్తుతూ ఉంది నీలాంబరి మువ్వ పుట్టినప్పటి నుండి తనకు ఎంతో ముచ్చటగా ఉంది దాని వెనకాల పరిగెడుతుంటే అలసటే అనిపించడం లేదు. అప్పుడప్పుడు దానికి ఎన్నొదుల గడ్డి ( దూడలకు తినిపించే ఒక రకమైన గడ్డి) తినిపిస్తుంది నీలాంబరి…

” నీలా ఒకసారి ఇలా వచ్చి కూర్చో” అని పిలిచాడు భూపతి..

ఆయాసంతో రొప్పుతూ వచ్చి కూర్చుంది నీలాంబరి..

“ఇంకా చిన్న పిల్లవు అనుకుంటున్నావా నీలా నువ్వు కొన్ని నెలలలో అమ్మమ్మవు కాబోతున్నావు.. లేగదూడతో పరుగు పందెమా!” అన్నాడు నవ్వుతూ.

“అదేం లేదండి ఎందుకో దాని ముద్దు రూపం చూస్తుంటే అసలు దానితోటే ఉండాలనిపిస్తుంది చూడండి ఎలా చూస్తుందో” అని నుదుటపడ్డ ముగుర్లను అలవోకగా పైకి తోసి కొంగుతో చెమటను అందుకుంది నీలాంబరి…

ఆ సంధ్య వెలుగులో ఎంతో అందంగా కనిపించింది నీలాంబరి ..చెమట పట్టిన మొహంతో సింధూరం కొంచెం తడిసిపోయి ముక్కుకున్న ముక్కుపుడక మెరుస్తూ గాలికి ముంగుర్లు పైకెగురుతుంటే ఆమె వయసు వెనక్కి వెళుతుందా అనిపిస్తుంది అలాగే తదేకంగా చూస్తున్నాడు భూపతి.

” ఏంటండీ కొత్తగా చూస్తున్నారు” అని కొంచెం సిగ్గుపడుతూ అడిగింది నీలాంబరి..

” నువ్వు అసలు అమ్మమ్మలా లేవు ఇంకా చిన్నపిల్లలాగే ఉన్నావు ఏంటా రహస్యం నీలా! సౌందర్యం కోసం ఏం చేస్తున్నావు నువ్వు” అని నవ్వుతూ అడిగాడు భూపతి.

” అందం కోసం ఎవరూ పరుగులు పెట్టాల్సిన పని లేదండి ప్రకృతిలో ఉన్న వాటితోటే మనం ఎంతో అందంగా కనిపిస్తాము అప్పుడప్పుడు రాసుకునే పసుపు అంతే …మనసు ప్రశాంతంగా ఉంచుకోవడం ఎవరి పట్ల కోపం కానీ ద్వేషం కానీ ఉండకుండా చూసుకోవడం భగవన్నామ స్మరణ చేయడం ఇంతకు మించి నేను చేసేది ఏమీ లేదండి! అయినా మీకు తెలియదా ఏంటి” అని అన్నది నీలాంబరి.

” తెలుసు నీలా ఊరికే అన్నాను సరే కానీ ఒక మాట అడుగుతాను నిజం చెప్తావా!” అన్నాడు భూపతి.

” నిజమే చెప్తాను మీతో అబద్ధం నేనెందుకు చెప్తానండి అడగండి” అన్నది చిరునవ్వుతో..

” మన పెళ్లి జరిగి 25 ఏళ్లు అయింది కదా ఇన్నేళ్లలో నేను నిన్ను ఎన్నిసార్లు బాధపెట్టి ఉంటాను నావల్ల బాధపడి ఉంటావా ఎప్పుడైనా బాధపెట్టే ఉంటాను ఎందుకంటే అప్పట్లో జమీందారీ బిడ్డగా పెరిగాను కదా ఆ వగరు పొగరు ఉండి ఏదైనా అని ఉంటాను ఎందుకో నాకు అలా అనిపించింది నీలా!” అని అన్నాడు భూపతి..

ఇంకా ఉంది

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

అమెరికా కల

ఎడారి కొలను