జనజీవనస్రవంతిలో ఆటవిక యుగంలోని ఎగువ దిశకు, అనాగరికయుగం దిగువదశకు సరిహద్దుగా కుండ నిలచి ఉంది. అతిప్రాచీనమైన గ్రామీణసమాజాన్ని సూచించే ఆధారంగా ఇంకా మిగిలి ఉంది. ఆహార సేకరణ కోసం, ఆహారం నిలవ కోసం ఉపయోగించబడింది. అది అటు తర్వాత నీటిపాత్రగా, పచనపాత్రగా, శక్తులు కలిగిన అక్షయపాత్ర గా, సఫలతా చిహ్నంగా, గ్రామదేవతల పండుగల్లో రంగం కుండగా, స్త్రీ గుణారోపణ చేసుకొని, స్త్రీకి ప్రతి రూపంగా, శక్తి దేవతగా క్రమాభివృద్ధి చెంది నేటి వరకు జనజీవితంలో, తెలుగురాష్ట్రాలసంస్కృతిలో సుస్థిరంగా నిలిచి ఉంది. దాని గురించి సోదాహరణంగా సాక్ష్యాధారాలతో తెలుసుకుందాం.
అందరికి తెలిసిన తెలుగురాష్ట్రాల్లో గ్రామ(శక్తి)దేవతల పండుగల్లో కుండలలో ‘బోనాలు’ సమర్పించడం తెలిసిన విషయమే. అయితే అన్ని ప్రాంతాల్లో దీనిని ‘బోనం’ అనే పేరుతో వ్యవహరించడం లేదు. ఒక్కోప్రాంతంలో ఒక్కోరకంగా – బోనం అనీ, బోనంకడవనీ, కుండబోనం అనీ, బోనంకుండలనీ, కరగ అనీ, కడవ అనీ, ఘటం అనీ, ఘటంకుండలనీ, కుంభం అనీ అనేక రకాలుగా వ్యహరిస్తున్నారు.
బోనం పేరు లాగానే బోనం అలంకరణ కూడా ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా ఉంది. అయితే
నేపథ్యంలో సమానలక్షణం ఒకటుంది – బోనాన్ని సమర్పించకుండా గ్రామదేవతల పండుగలు జరగక పోవడం. ఒకవేళ అలా ఎక్కడైనా జరిగినా, అది పండుగ అనిపించుకోదు. ఇంత ప్రాధాన్యం కలిగి, వివిధ రకాలుగా పిలవబడుతున్న ‘బోనం కుండ’ భౌతికంగా చూస్తే కేవలం ఒక ‘మట్టికుండ’ మాత్రమే.
ఈ మట్టికుండకు శక్తిదేవతల పండుగల్లోనే గాకుండా సంప్రదాయబద్ధమైన వివాహాది ఆచారాల్లోనూ, వ్యవసాయ సంబంధాది ఆచారాల్లోనూ, ఇంకా ఇతర సాంస్కృతిక పరమైన ఆచారవ్యవహారాల్లోనూ అంతే
ప్రాధాన్యం ఉంది. కాబట్టి బోనం లేదా కుండ గురించి విశ్లేషణాత్మకంగా తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.
మతపరంగా బోనం:
తెలంగాణా ప్రాంతంలో ఆషాఢ శ్రావణమాసాల్లో ముత్తైదువలు, కన్యలు తల మీద అలంకరించిన ‘బోనం కుండలను’ పెట్టుకొని గుంపులు గుంపులుగా గ్రామదేవతల గుళ్ళకు వెళ్ళడం తరచూ కనిపించే దృశ్యం. నిఘంటువుల ప్రకారం చూస్తే బోనం అనే ఈ పదం భోజనానికి వికృతి పదం. మహాభారతంలో బోనం అనే ఈ పదం భోజనార్థం లోనే ప్రయోగించబడింది. అయితే కాలక్రమంలో ఈ భోజనం అనే పదం తన అస్తిత్త్వాన్ని కోల్పోయి, గ్రామదేవతలకు సమర్పించబడే ఆహారానికి మాత్రమే పర్యాయపదమైంది, పరిమితమైనది.
బోనం చేసే పద్ధతి:
కుమ్మరింటి నుండి తెచ్చిన కొత్తకుండలో ‘వరి అన్నం లేదా జొన్న అన్నం లేదా గడ్డలపాశం’ ఏదో ఒకటి వండుతారు. అన్నం వండిన తర్వాత కుండకు పట్టిన మసిని కడిగి, దాని దిగువ సగ భాగాన సున్నం పూస్తారు. పై భాగానికి నూనె, పసుపు రాసి, బొట్లు పెట్టి, గంధం చల్లుతారు. కుండ కంఠానికి మామిడాకుల కంకణం, వేపరెమ్మల దండ కడ్తారు. కుండపై భాగాన దీపం వెలిగించడానికి ‘మట్టిమూకుడు’ పెడ్తారు. కుండకు మూకుడుకు మధ్య ‘వేపరిల్లలు (కొమ్మలు)’ పెడ్తారు. పండుగరోజు గ్రామంలో పోతురాజు వేషధారి మేళతాళాలతో ఇంటింటికి తిరిగి, బోనాలు వసూలు చేసి, గ్రామదేవతల గుళ్ళవద్దకు తీసుకెళ్తాడు.
అతను ఇంటిముందుకు రాగానే అతని కాళ్లకు అడ్డంగా బిందెలతో నీళ్లు పోస్తారు. అవివాహితకన్య లేదా
ముత్తైదువ స్త్రీ ఇంటిలో నుండి బోనాన్ని తలమీద ఎత్తుకొని బయటకు రాగానే ఎడమచేతిలో
డబ్బులను పట్టుకొని బోనానికి దిష్టి తీసి, ఆ డబ్బులను
డప్పులవాళ్లకు ఇస్తారు. అలా ఒక్కొక్క ఇంటి వద్ద నుండి వసూలుచేసిన బోనాలతో గుడివద్దకు వెళ్తారు. గుడిలో ఉన్న
కుమ్మరి పూజారి మాట్లాడకుండా, తన “ఎంగిలి” దేవత ఆహారంలో పడకుండా, నోటికి అడ్డంగా చలువాది (తెల్లబట్ట) కట్టుకొని,
, ఆ బోనాలను దేవతకు సమర్పిస్తాడు.
బోనాలను సమర్పించే తీరును బట్టి ‘కడనబోనం, అంతరాల బోనం, వెయ్యిగండ్ల బోనం, బండి బోనం’ మొదలైన పేర్లతో పిలుస్తున్నారు. బోనాలను సమర్పించే వారిని బట్టి కూడా ‘ఊరబోనాలు, మాదిగబోనాలు, మాలబోనాలు’ అనీ
అనేకరకాలుగా వ్యవహరిస్తారు.
కుంభం:
నిఘంటువుల ప్రకారం కుంభం యొక్క అర్థం ‘కుండ’నే కాని ఇది కూడా గ్రామదేవతలకు పెట్టే అహారార్థం లోనే వాడబడుతున్నది. కాని కుంభం, బోనం ఒకటి కాదు. బోనాలను ఎవరికి వారే వండుకొని, ఆయా కుటుంబాల వారే స్వయంగా నెత్తమీద పెట్టుకొని తెస్తారు. కుంభం అలా కాదు.
కుంభం చేసే పద్దతి:
ప్రతి కుటుంబం నుండి కొంత ధాన్యాన్ని, కొంత రొక్కాన్ని పండుగ నిర్వాహకులు వసూలు చేస్తారు. ఆ ధాన్యాన్ని హరిజనులు (దళితులు) దంచుతారు. లేదా కూలీలచేత దంపిస్తారు. దంచిన ధాన్యాన్ని కుమ్మరి వాళ్ళు పెద్దపెద్ద బానల్లో వండుతారు. దేవతకు ఎదురుగా ‘రతి(ముగ్గు)’ వేసి, ఆ రతిపై వండిన అన్నం పెడ్తారు. జంతువు (మేక లేదా పొటేలు లేదా దున్నపోతు)ను బలి ఇచ్చి, దాని రక్తాన్ని ఆ అన్నం లో పోస్తారు. దాని కడుపులోని కసరు(పేగుల్లోని పదార్థం)ను అందులో వేస్తారు. దానినే కుంభం అని వ్యవహరిస్తారు.
ఈ కుంభానికి ఎదురుగా బలి జంతువు తలను పెడ్తారు. దాని కాలును మోకాలు వరకు నరికి, దాని ‘నోటిలోనే అడ్డంగా కరిపిస్తారు (పెడ్తారు)’. ఆ తలను ఆ విధంగా ఒక రోజు మొత్తం దేవతకు ఎదురుగా ఉంచుతారు (పెడ్తారు). మరుసటిరోజు తెల్ల వారుజామున దానిని (కుంభాన్ని) కొత్త చేటలో లేదా గంపలో హరిజనుల చేత ఎత్తించుకొని, ఊరి సరిహద్దుల చుట్టు, పశువుల పాకల మీద, మేకల గొర్రెలమందల మీద, ‘పొలి పొలో అంటు చల్లిస్తారు. ఈ విధంగా ఆహారాన్నిఊరు మొత్తం చల్లుతారు. ఇలా బోనాల్లోని అన్నాన్ని ఊరు మొత్తం చల్లారు.
ఘటం:
ఘటం యొక్క నైఘంటికార్థం కూడా కుండనే. ఈ పదం గ్రామదేవతలకు ప్రతీకగా కోస్తా, ఆంధ్ర, రాయలసీను ప్రాంతాల్లో వ్యవహారంలో ఉంది. పూర్వ మండలమైన శ్రీకాకుళం, శాఖ పట్టణప్రాంతాల్లో దీనిని(ఘటం) శరీరార్థంలో ఉపయోగిస్తున్నారు.
విజయనగరంలో “నాఘటం చల్లగా ఉంటే నీకు ఘటం తీస్తాన”ని గ్రామదేవతలకు మొక్కుకుంటారు. అనంతపురం, కడపజిల్లాల్లో దేవతకు సమర్పించే కల్లు, సారాయి వంటి మత్తుపానీయాలను ఘటం’ అంటారు. గంగమ్మ జాతరలో సంతానసంఖ్యప్రకారం లేదా మొక్కు ప్రకారం ఘటంకుండ్లు(కుండలు) నిలుపు కుంటారు. ఇది వారికి ఒక మొక్కు, ఆనవాయితీ.
ఘటం చేసే పద్ధతి:
కొత్తకుండను కుమ్మరింటినించి తెచ్చి, దాని నిండుగా నీళ్ళు నింపి, బోనంలాగా అలంకరిస్తారు. దేవుని ఇంట్లో గానీ, నట్టింట్లోగానీ ఇసుక తిన్నె వేసి, దానిపై ఈ ఘటాలను పెడ్తారు. ఆ కుండకు మానవ రూపును – కళ్ళు, ముక్కు, నోరు, ‘మీసాలు(వెండి రేకులు), కోరలు మొదలైన వాటిని చింతపండు సహాయంతో అతికిస్తారు(పెడ్తారు). కుండ కంఠానికి పూలమాలవేసి, కుండలో సిక్క(నాణెం) వేస్తారు. వేపరెమ్మలు, పూలకొమ్మలు కంఠం నిండుగా కూరుతారు. ఆ తర్వాత ఘటాలకు నైవేద్యం పెట్టి, ఎవరి ఘటాన్ని వారు ఎత్తుకొని, దేవతల వద్దకు వెళ్తారు. పురుషులు స్త్రీల లాగా చీర, జాకెట్టు ధరించి, ముఖానికి పసుపు రుద్దుకొని, బొట్టుకాటుక పెట్టుకొని, గాజులు వేసుకొని, ఘటం ఎత్తుకొని దేవత వద్దకు వెళ్తారు. అక్కడ ఆ ఘటంతో మూడు ప్రదక్షిణలు చేసి, ఆ ఘటాన్ని దేవతకు ఎదురుగా పగలగొట్టి, పగిలిపోయిన ఆ ఘటంలోని ఒక ముక్కను ఇంటికి తెచ్చుకుంటారు.
ఆంధ్ర, కోస్తా ప్రాంతంలో దేవతను అత్తింటి నుంచి పుట్టింటికి తీసుకొని వస్తున్నామని దేవతా ప్రతీకగా భావించే ఘటాన్ని ఊరి బయట నుంచి ఊళ్ళోకి మేళతాళాలతో తెచ్చి, నడివీధిలో ప్రతిష్ఠిస్తారు. ఆ ఘటాన్ని పండుగ చేసే సమయాన్ని బట్టి, “వీధి వీధి, ఊరు ఊరు తిప్పుతారు. ఘటం ఊళ్ళో తిరిగినప్పుడు భక్తులు మొక్కులు సమర్పిస్తారు. కొన్నిచోట్ల మొక్కులవల్ల లభించే రాబడి ఎక్కువ కావడంతో దానిని వేలం వేస్తారు. చాకళ్ళు ఆ వేలం పాడుకొని, ఆ ఘటాన్ని ఊళ్ళో తిప్పుతారు.
గ్రామదేవతగా, ఇంటిదేవతగా, గూటి దేవతగా:
సర్వసాధారణంగా శక్తిదేవతల ప్రతీకగ మట్టిగురిగి(పాత్ర)ని పెడ్తారు. అందులో నల్లపూసలు, జీడిగింజలు, గవ్వలు, గాజులు, పసుపుకుంకును పెట్టి దేవతగా భావిస్తారు. కొన్నిచోట్ల గురుగులకు బదులుగా కుండలనే పెడ్తారు. వీటిని ఇంట్లో పెట్టుకున్నట్లైతే ‘ఇంటిదేవర అని లేదా గూటిదేవర’ అని అంటారు. ఇదే కుండను ఆరుబయటగాని, గుళ్ళోగానీ పెట్టినట్లైతే గ్రామదేవత అని అంటారు. ఉదా: దండుమారెమ్మ, కుక్కలపెల్లి (చిత్తూరుజిల్లా), ఈ ఊరిలో మానవరూపుతో తీర్చిదిద్దబడిన కుండనే ‘దండుమారెమ్మ’గా భావిస్తున్నారు.
ఎల్లమ్మదేవత ప్రతీకగా కూడ కుండనే నిలుపుతారు. ఆ దేవతకుండకుగానీ, దానిపై పెట్టే మూతకు గానీ నాగుపాముపడగను ఆ కుండలను తయారు చేస్తున్నప్పుడే
తయారుచేస్తారు (చిత్రీకరిస్తారు). ఇవే గాకుండా ఎల్లమ్మకథకు సంబంధించిన ఇతర చిత్రాలను – పరశురాముడు ఎల్లమ్మను సంహరిస్తున్నట్లు, ఎల్లమ్మ బోనం ఎత్తుకొని పోతున్నట్లు చిత్రీకరిస్తారు.
ఉదా: ఎల్లమ్మదేవత, కొరటికల్ గ్రామం, నల్లగొండ జిల్లా.
కొన్నిచోట్ల పండుగ సమయాల్లో అర్ధరాత్రి పచ్చి కుండలో (కాల్చని కుండ) నీళ్ళుదెచ్చి, దేవతగా ప్రతిష్ఠిస్తారు. ఉదా: కాళహస్తిలోని ద్రౌపదమ్మ దేవత.
ఇవేగాకుండా దేవతకు వెయ్యిగండ్ల బోనం కూడా సమర్పిస్తారు. ఈ వెయ్యిగండ్ల (కండ్లు)బోనానికి కుండనిండా రంధ్రాలే ఉంటాయి. ఒక్కోరంధ్రం ‘దేవత యొక్క ఒక్కో కన్ను’ తో సమానం. ఈ కండ్లను దేవత యొక్క సర్వవ్యాపకతకు, విశాలమైనదృష్టికి చిహ్నంగా భావిస్తారు. దీన్ని బట్టి కూడా గ్రామదేవతల పూజలో ‘సింబాలిజమ్’ ఇమిడి ఉందని చెప్పవచ్చు. దేవతకు సంబంధించిన ఈ సర్వవ్యాపకతను తెలియజేసే కథలు, గేయాలు చాలా ఉన్నాయి.
వివాహాది ఆచారాల్లో కుండ:
హిందువులు వివాహాది వేడుకల్లో మేళతాళాలతో నల్లకుండలు, అయిరేణి కుండలు, గడికుడుకలు మొదలైన కుండలు కుమ్మరింటి
నుంచి తప్పనిసరిగా తెస్తారు. ఆ అయిరేణికుండలపై ఆకులు, తీగలు, స్త్రీపురుషులు రేఖాచిత్రాలు మొదలైనవి చిత్రించబడి ఉంటాయి. గడికుడుకలుగా పిలువబడే – రెండు కుండల్లో నీళ్ళు నింపి, దానికింద వరి ధాన్యం పోసి, వాటిపైన, పసుపు పూసిన కొత్త వస్త్రాలను కప్పుతారు. దానిపై పసుపుముద్ద పెట్టి, గౌరమ్మగా భావించి, వధూవరులు ఎవరింటి వద్ద వారే అయి(అవి)రేణికుండలను పూజిస్తారు. ఆ కుండల కిందమొలచిన ధాన్యాన్ని (మొలకను) భద్రంగా దాచి పెడ్తారు. ఉపనయనాది సంస్కారాల్లో కూడా దాదాపుగా ఇలాంటి ఆచారాన్నే పాటిస్తారు.
గృహప్రవేశ సమయంలో:
ఇతర శుభకార్యాలు జరిగినప్పుడు కూరాడు, కూరాడుకు సైదోడుగా నీరాడు పెట్టి పూజించడం మన తెలుగువారి ఆచారం. కూరాడును ప్రతిరోజు అలంకరించడం (పసుపు కుంకుమబొట్లు పెట్టడం) కొందరికి నంతన(ఆచారం). నూతన గృహప్రవేశ సమయంలో ఆ ఇంటి ఆడపడుచులు తప్పనిసరిగా కూరాడు ఎత్తుకోవాలి. ఆమె భర్త నీరాడు ఎత్తుకొని రావాలి. కూరాడు ఎత్తుకొని గృహప్రవేశం చేయని ఇండ్లల్లో దీపారాధన నిషిద్ధం.
సవతిగా (ముత్తైదువగా)కుండ:
సుమంగళిగా చనిపోయిన స్త్రీకి, ముఖ్యంగా అర్థాంతరంగా చనిపోయినవారికి ప్రతీకగా ఓ చిన్నకుండను(ముంత, పటును అలంకరించి గద్దెపై పెట్టి, ర కమడుపు పెట్టి, నైవేద్యం మొదలైన సమర్పించి, పూజిస్తారు. సవతి విషయంలో ఈ నియమాన్ని తప్పనిసరిగా పాటిస్తారు. లేనియెడల ఆమె కోపగిస్తుందని భయం.
వ్యవసాయాది ఆచారాల్లో కుండ:
తొలి విడత పునాస (మెట్ట) విత్తనాలు వేసేటప్పుడు ‘కలగల్పులు’ చేస్తారు, అంటే
అనేకరకాల విత్తనాలను
పెద్దచాపలో పోసి, ఒక్కటిగా కలుపుతారు. దోసగింజలు, నువ్వులు, గోగులు, సజ్జలు, జొన్నలు మొదలైన వాటిన్నిటిని
మిశ్రమం చేస్తారు ఆ ఇంటి ఆడపడుచులను తూర్పు వైపు ముఖం ఉండేటట్టు కూర్చో బెట్టి, ఆమె ఒడిలోపైన కలిపిన విత్తనాలను మూడు దోసిళ్లు పోస్తారు. ఆ తర్వాత ఆ విత్తనాలనుండి ఆ రోజు విత్తనాలు వేయడానికి తీసుకెళ్లే వాటిని
‘అలంకరించిన కొత్తకుండ’లో నింపుతారు.
(ఒడిలో విత్తనాలు నింపడానికి ఆ ఆడపడుచు – కన్యగానీ, ముత్తైదువగానీ అయి ఉండాలి, అంతే గానీ విధవ కాకూడదు). అ విత్తనాల్లో బంగారుతీగ లేదా నగ పెట్టి, తమ పంట బంగారం లాగా పండాలని భావిస్తారు. ఆ విత్తనాలు వేయడం పూర్తి అయిపోయేవరకు ఆ కుండలోనే విత్తనాలను తీసుకొని వెళ్తారు.
విత్తనాలను మొట్టమొదటగా ముత్తైదువ అయిన స్త్రీ తోనే వేయిస్తారు. కలుపు, కోతలను కూడా మొట్టమొదట ముత్తెదున అయిన స్త్రీతోనే ‘మునుం’ (వరుస) పట్టిస్తారు.
ఆడపడుచుకు ఒడిలో పోసిన విత్తనాలవల్ల పండిన పంటను ఆ
ఆడపడుచుకే ఇవ్వాలి. కాని అందుకు బదులుగా పంట పండిన తర్వాత కల్లంలోధాన్యం కొలిచేరోజు ‘ఆడపడుచుగంప’ అని ‘ధాన్యం’ అని ఇస్తున్నారు.
పై ఆచారాలు “మాతృస్వామికవ్యవస్థలో స్త్రీకి ఉన్న ఆస్తి హక్కును, విత్తనం పైనున్న పేటెంట్ హక్కును సూచిస్తున్నాయి.
అంతేగాకుండా స్త్రీకి ఉన్న సఫలతా శక్తి’కి ప్రతిబింబాలు , సజీవసాక్ష్యాలు.
అశుభ కార్యాలలో కుండ:
తల్లికైతే చిన్ననాడు, తండ్రికైతే పెద్దవాడు శవం
ముందర ‘కొత్తకుండను పట్టుకొని’ నడుస్తారు. ఆ తర్వాత అతను నీళ్ళల్లో మూడు మునుగులు మునిగి, ఆ కొత్తకుండ నిండ నీళ్ళు ముంచుకొని, భుజం మీద పెట్టు కొని, శవం వద్దకు వస్తాడు. ఆ కుండతో శవం చుట్టు వెనుదిరిగి చూడకుండా మూడుసార్లు
తిరుగుతాడు. ఒక్క చుట్టు పూర్తికాగానే, ఎత్తుకున్న కుండకు ‘శిలారాయి’తో ఒక్క రంధ్రం పెడ్తారు. మూడోసారి మాత్రం వెనుదిరిగి చూడకుండా కుండను వెనుకకు వదలివేస్తాడు.
మన సంస్కృతిచిహ్నం పూర్ణకుంభం:
ఇప్పుడు పూర్ణకుంభం లోహపాత్రనే అయినా ఒకప్పుడు అది మట్టిపాత్రేనని దాని పేరును బట్టి చెప్పవచ్చు. ఈ పూర్ణకుంభంలో కూడా రెమ్మలుండడం గమనార్హం.
కలశం:
నోములు, వ్రతాల్లో కలశంగా నీరు నింపిన రాగిచెంబు, అందులో
మామిడిరెమ్మలు, కొబ్బరికాయ పెట్టి, పూజించడం మన రివాజు. పై విధంగానే గాకుండా దైనందిన జీవితంలో – వంటపాత్రలుగా, నీటిసాధనాలుగా, ధాన్యం, విత్తనాలు మొదలైన వాటిని భద్రపరిచే గాదెలుగా, కాగులుగా, కుండలను ఉపయోగించడం సర్వసాధారణ విషయం.
ఈ విధంగా కుండ ప్రజల దైనందిన జీవితంలో ఒకభాగమై సుస్థిరమైన స్థానాన్ని సంపా దించుకున్న కారణాల గురించి తెలుసుకోవాలంటే ‘కుండ గతం’ ఏమిటో తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆ గతాన్ని సమాజశాస్త్రంతో, విజ్ఞానశాస్త్రంతో అన్వయించి చూసుకోవాలి. వచ్చిన ఫలితాన్ని సాహిత్య ఆధారాలతో ధ్రువపరచుకోవాలి. అప్పుడే మనకు సంతృప్తికరమైన జవాబు లభిస్తుంది.
కుండ గతం:
కుండ మానవుని సృష్టి. ఆ మానవుడు భగవంతుని సృష్టి అని మతవాదులు చెప్తున్నారు. అతను భగవంతుని సృష్టి కాదని ‘ప్రొటిస్టా’ అనే జీవకణం నించి లక్షలకొద్ది సంవత్సరాలు పరిణామం చెందిన ప్రాణి’ అని పరిణామవాదం, విజ్ఞానశాస్త్రం నిరూపిస్తున్నది. మానవుడు కూడా ఎకాయెకి నాగరిక జీవితంలోకి ఆడుగిడలేదని, ఆటవిక అనాగరిక యుగాలు దాటిన తర్వాతనే నాగరిక జీవితంలోకి అడుగిడాడని నరవర్గ శాస్త్రం, సమాజశాస్త్రం చెప్తున్నది. మానవజీవితం, మానవ సమాజం గురించి నిర్విరామంగా నలభై (40 ) సంవత్సరాలు కృషి చేసిన లూయీ హెన్రీమోర్గాన్ సమాజాన్ని మూడు ప్రధాన భాగాలుగా విభజించాడు. అ : 1)ఆటవిక యుగం 2) అనాగరిక యుగం 3) నాగరికయుగం. మళ్ళీ వీటిని ఒక్కోదాన్ని మూడు భాగాలుగా దిగువ చూపినట్లు విభజన చేసాడు.
ఆటవిక యుగం:
దిగువ దశ:- మానవజాతి శైశవదశ నుంచి, తర్వాతదశ ఆరంభం వరకు
మధ్యదశ:- చేపలను ఆహారంగా ఉపయోగించుకోవడం, నిప్పును కనుక్కోవడం, దాని ఉపయోగం తెలుసుకోవడం వగైరా.
ఎగువదశ:- విల్లంబులు కనుక్కోవడం, బుట్టలల్లడం నేర్చుకోవడం వగైరా.
అనాగరిక యుగం:
దిగువదశ:- కుండలు చేయడం దగ్గర నుంచి.
మధ్యదశ:- పశువులను ముచ్చిక చేయడం, నీటిసాగు కింద పైరులను పండిచడం,
పచ్చి ఇటుకలతోనే ఇండ్లుకట్టుకోవడం.
ఎగువదశ:- కాకిరాయి కరిగించి ఇనుము చేయడం, ఇనుప పనిముట్లు వాడడం
నాగరిక యుగం:
ధ్వని సంకేతాలను కనుగొని, రాతకుపయోగించడం నుంచి నేటి వరకు
మోర్గాన్ కుండను చేయడాన్ని ఆటవిక యుగం లోని ఎగువదశకు, అనాగరికయుగం దిగువదశకు సరిహద్దుగా తీసుకున్నాడు. దీనికి కారణం కుండ గ్రామీణజీవితాన్నిసూచించడమే. దీనిని బట్టికుండకు, మానవునికి ఉన్న సాహచర్యం ఈనాటిది కాదని తెలుస్తున్నది. కుండకున్న పూజార్హత గురించి తెలుసుకోవడానికి ఆనాటి జీవన విధానాన్ని తరచి చూడాల్సి ఉంది.మానవుని ఆటవికదశ ప్రధానంగా ఆహార సేకరణ ‘మీద ఆధారపడ్డదశ. ఆహారం సేకరించుకోవడానికి, భద్రపరచుకోవడానికి పరికరాలు అవసరం ఉన్న కాలం అది. అదే సమయంలో స్త్రీకి వరంగాను, శాపం గాను భావించబడుతున్న మాతృత్వం, మరియు శారీరక అసమానతలు తాత్కాలికంగానైనా స్త్రీని ఒకచోట ఉండవలసిన పరిస్థితులు కల్పించాయి. ఆ సమయంలో ‘ఏదో పనికి అలవాటుపడ్డ చేతులు’ అవసరం తీర్చే బుట్టలు అల్లడం నేర్చుకున్నాయి ఇదే ఆటవిక సమాజపు ఉత్పత్తిశక్తుల్లో మొదటి మార్పు. ఈ బుట్ట కేవలం ఆహార సేకరణకే కాక, ఆహారం నిలవ చేయడానికి కూడా ఉపయోగ పడింది. ప్రకృతి నుంచి ఎదురయ్యే ఆటుపోట్లనుంచి ఆహారాన్ని సంరక్షించు కునే ప్రయత్నంలో భాగంగా బుట్టకు మెత్తనిమన్ను మెత్తడం ఆరంభించారు. నన్ను మెత్తిన బుట్టలను, కర్రపాత్రలను వంటపాత్రలుగా కొంతకాలం ఉపయోగించారు. కాలక్రమంలో పాత్రలకు మట్టిని మెత్తడంనుంచి, మట్టిని జంతికల పిండిలాగా సాగదీసి, ఒక చుట్టుపై ఇంకో చుట్టు పెట్టి కుండను చేయడం, ఆ కుండలను దేవదారు బొందు మీద సన్నటి సెగతో కాల్చడం నేర్చుకున్నారు. కొన్ని కుండలను కాల్చే అవసరం లేకుండా ఒండ్రుమట్టి, ఇసుక కలిపిగాని, మంచినీటిలో ఆలుచిప్పగుండను కలిపి గాని చేసేవారు. ఈ విధంగా కుండలను తయారుచేయడాన్ని నేర్చుకోవడం తోనే నూననజీలుత పురోగతిలో ఓ నూతనదశ ఆరంభమైంది. జీవన పద్ధతులు మెరుగయినాయి. ఆహారం ఉడక బెట్టుకోవడానికి, నీరు తెచ్చుకోవడానికి నుంచి పాత్ర దొరికింది. ప్రకృతి వైపరీత్యాల నుంచి, సేకరించిన ధాన్యాన్ని సంరంక్షించుకోవడానికి ఒక మేలైన సాధనం అందుబాటులోకి వచ్చింది.
బుట్టలు అల్లడం నేర్చుకోవడానికి స్త్రీకి ఏ పరిస్థితులు కారణమయ్యాయో అనే పరిస్థితులు స్త్రీలు వ్యవసాయం కనుక్కోవడానికి కారణమయ్యాయి. వ్యవసాయంవల్ల పునరుత్పత్తి చర్యగురించి మానవునికి తెలిసింది. భూమి నుంచి విత్తనం మొలకెత్తడం, ఆ అభివృద్ధికి భూమి కారణం కావడం మనిషికి వింతగా అనిపించింది. ఇదే సమయంలో తాను అష్ట కష్టాలు పడి సేకరించి, భద్రంగా దాచుకున్న ధాన్యం ప్రకృతి వైపరీత్యాలవల్లనో, యాదృచ్ఛిక సంఘటనల వల్లనో లేక ఏ ఇతర కారణాలవల్లనో తడిసి మొలకెత్తడం జరిగింది. ఈ చర్య – పునరుత్పత్తి గురించి అయోమయంలో ఉన్న మానవుని ఊహకు ఊతం అయింది.
విత్తనం మొలకెత్తడానికి నీటి అవసరాన్ని, అది ఎదగడానికి భూమి అవసరాన్ని గుర్తించడం జరిగింది.తమ మస్తిష్కానికి పదును పెట్టి ఆలోచించారు. నిత్య జీవితంలోని సంఘటనలకు, స్త్రీపురుషుల సంగమాన్ని మరియు భూమిని దున్నడానికి, నీరు పోయడానికి అన్వయించుకొన్నారు. దినదిన ప్రవర్ధమాననుయ్యే ‘గర్భ ఆకారం’ కుండ ఆకారం లాగా అనిపించింది. అంతేగాక ధాన్యం భద్రపరిచే సాధనంగా కనిపించే కుండ, సఫలతకు కారణంగా కూడా కనిపించింది. దానితో కుండకు, భూమికి సారూప్యతను సమన్వయించుకున్నారు. ఇప్పటికీ భూమిని స్త్రీగానూ, పురుషున్ని నాగలితోను, సంతానాన్ని
ధాన్యంతోను పోలుస్తారు. అది తరచు నిపించే వ్యంగ్యపు విసుర్లలో ‘నల్ల రేగడిని దున్నితే – తెల్లజొన్న పంట పండుతుందని (నల్లటి స్త్రీని) అనడం కనిపిస్తున్నది.
ఇత్తోటి పెడితే చెట్టోటి మొలుస్తదా? ‘విత్తు ఏది పెడితే చెట్టు అదే మొలుస్తది, తండ్రికి ఏ లక్షణాలు ఉంటే పిల్లలకు అవే
లక్షణాలు వర్తిస్తాయి’ అనే అర్థంలో అంటుంటారు. శిష్టసాహిత్యంలో సరేసరి. స్త్రీని క్షేత్రంతో పోల్చడం ఉండనే ఉంది.
పై షయాలను బట్టి మనం కొన్ని అంశాలను చెప్పుకోవచ్చు.
1) స్త్రీయే కుండను కనుక్కోవడానికి, వ్యవసాయం కనుక్కోవడానికి కారణభూతురాలైంది.
2) భూమిసఫలతకు కారణమని గ్రహించిన తర్వాతనే స్త్రీని మానవ జీవిసృష్టికర్త గా గుర్తించడం జరిగింది.
ఇవన్నీ జరిగే కాలంనాటికి ఆనాడు ఉన్న వ్యవస్థ ‘మాతృపరంపరవ్యవస్థ’. ఆనాటి ఆ కాలంలో స్త్రీపురుషులకు కట్టుబాట్లు అనేవి లేక పోవడం వల్ల – వారి కలయికవల్ల కలిగిన సంతానాన్ని స్త్రీయే సంరక్షించుకునేది. వారికి అసలైన తండ్రి ఎవరో తెలిసేది కాదు. ఆ కారణంగా తల్లిపైన – భయభక్తులు, ప్రేమాభిమానాలు ఏర్పడ్డాయి. అవి ఉండడం అత్యంత సహజం. అలాంటి స్థితిలో ‘సఫలత (ఫెర్టిలిటీ) ‘ గురించి తెలుసుకోవడం సంభవించింది.
దీనితో అంతకు మునుపే ఆమె పై ఉన్న భయం, భక్తి గౌరవాలు కాస్త ఇబ్బడిముబ్బడి అయ్యాయి. ఈ భావాన్ని తనకు తెలిసిన సాంకేతిలిపి ద్వారా మనకు తెలియజేసాడు.
1. స్త్రీగర్భం అతనికి ఒక వింత, ఆశ్చర్యం. ఇందుకు ఉదాహరణ : అతను జీవంపోసిన మట్టి ప్రతినులు.
అ) ఆస్ట్రియా, మెసపొటేమియా ప్రతిమలు,
ఆ) నాగార్జునకొండలో, ఆలంపురంలో నగ్నంగా, ఉబ్బెత్తుగా నున్న కడుపుతో నున్న ప్రతిమలు,
ఇ) అగ్గార్లు (అక్కగార్లు). అగ్గార్ల ప్రతిమలు ఆర్ట్స్ కాలేజి, ఉస్మానియా విశ్వ విద్యాలయం, ఫోక్ మ్యూజియలో నేను సేకరించినవి ఉన్నాయి).
వీటన్నిటికి కన్ను, ముక్కు, చిన్నచిన్న స్తనాలు లేదా జారిన స్తనాలు ఉండడం, ఆ తర్వాత భాగాన్ని (కడుపును) – ఉబ్బెత్తుగా, బోలుగా, కాగులాగా సూచించారనా
2. స్త్రీని కుండగా భావించారనడానికి
భవిష్యత ఆధారం – స్త్రీదేవతల గ్రహాలుగా కుండను ప్రతిష్టించడం, నాటికి మానవరూపు తీర్చిదిద్దడం – కంఠానికి అలంకరణ(నగ) చేయడం; శవపేటికల్లో కుండలు పెట్టడం, కుండల్లో శవాలు పెట్టడం; హిరణ్యగర్భ సంస్కారం చేయడం, ముత్తైదున పటునను పెట్టుకోవడం ఉదాహరణగా చెప్పుకోవచ్చు.
3. స్త్రీకి భూ ) గుణారోపణ చేసారనడానికి ఆధారం; సింధూనది లోయ త్రవ్వకాల్లో బయల్పడ్డ ప్రతినులు. తలక్రిందులుగా స్త్రీని చిత్రించి, ఆమె కాళ్ళమధ్య నుంచి చిగుళ్ళు, మొక్కలు మొలకెత్తినట్లు చూపడం.
4. స్త్రీకిభూమి గుణారోపణ చేసినట్లుగానే, స్త్రీకి కుండ గుణారోపణ కూడా చేసారు.
అ) శిశువు క్రమపరిణామం చెందే కొద్దీ, రోజురోజు పెరిగే ఉదరం – మట్టిని చేతితో అదుముతున్న(దెబ్బ వేస్తున్న) కొద్దీ ‘సాగే కుండ పరిమాణం’ ఒకేలా ఉండడం;
ఆ) కుండలోని విత్తనం నీటితో తడిసి, సఫలత చెందడాన్ని, స్త్రీ గర్భం పురుష వీర్యంతో సఫలత చెందడంతో అన్వయించుకున్నారు.
ఆ సఫలతకు చిహ్నంగానే వివాహ సమయంలో గడికుడుకలు పెట్టడం, వాటిని నీటితో నింపడం, గడికుడుకల కింద వడ్లు పోయడం, నవధాన్యాలు పోయడం; గరగలు, ఘటం, బోనం, పూర్ణకుంభం, కలశం మొదలైన వాటిలో రెమ్మలు పెట్టడం మొదలైనవి.
పూర్ణకుంభాన్ని ‘స్త్రీ గర్భ ప్రతీక’ అని పాశ్చాత్య శాస్త్రజ్ఞులు కూడా అన్నారు.
ఇదే విషయాన్ని జానపదసాహిత్యంలోని పెద్దమ్మ కథ నిరూపిస్తుంది. దాని గురించి క్లుప్తంగా తెలుసుకుందాం.
పెద్దమ్మ బ్రాహ్మణుని కూతురు. వారి ఇంటిలో ఊరుపేరు లేనివాడు ఒకడు పనిచేస్తూ శ్రుతపాండిత్యాన్ని గడిస్తాడు. అతని పాండిత్యాన్ని మెచ్చి, బ్రాహ్మణుని కూతురు పెద్దమ్మ అతన్ని స్వయంవరంలో ఆమెను పాండిత్యంలో ఓడించడంతో
వరిస్తుంది.
కులగోత్రాల గురించి తెలుసుకోకుండానే వివాహమాడుతుంది. ఇద్దరు పిల్లలు కూడా కలుగుతారు. అలాంటి సమయంలో ఆమె భర్త ఆమె అత్తగారిని తీసుకు వస్తాడు. ప్రేమతో కోడలు భక్ష్యాలు (పోలెలు) చేసి పెడుతుంది.
వాటిని చూసి ఆ వృద్ధురాలు కొడుకు చెప్పిన విషయాలు మరచి, ఆ పోలెలను
గొడ్డు నాలికల్లా ఉన్నాయని వ్యాఖ్యా నిస్తుంది. ఆ వృద్ధురాలి మాటల ద్వారా వారు బ్రాహ్మణవర్ణానికి చెందినవారు కారని, హరిజనులని గ్రహిస్తుంది. వెంటనే తండ్రి వద్దకు వెళ్ళి, నర్మగర్భంగా ‘కుక్కముట్టిన కుండను ఏం చేయాలని’ ప్రశ్నిస్తుంది. తండ్రి వివరా లే మితెలుసుకోకుండా ‘కాల్చితే పవిత్రనువు తుంది’ అని సమాధానం చెప్తాడు. ఆమె వెంటనే తాము ఉన్న నివాసాన్ని అగ్నికి ఆహుతి చేస్తుంది. అందులో తాను, తన పిల్లలతోపాటుగా సజీవంగా ఆహుతైపోతుంది.
ఇక్కడ పెద్దమ్మ తనశీలాన్ని, గర్భాన్ని కుండతో పోల్చుకోవడము గమనార్హం. ఇలాంటిదే నురొక ఉదాహరణ. బాలిక వ్యక్తురాలైతే ‘జాజు గురిగి పగిలింది’ అని అంటారు. ఈ విధంగా స్త్రీని కుండతో పోల్చడం గురించి పాశ్చాత్య జీవశాస్త్రజ్ఞుడు – (ప్రకృతి స్వభావాన్ని గురించి స్తృత పరిశోధన జరిపిన వారు) జి. ఇలియట్ అభిప్రాయం ఎన్నదగింది. ఇతను ‘భూమిలో విత్తనాలు ఫలవంతం కావడానికి నీరు అవసరమనే’ సిద్ధాంతాన్ని సమస్త జీవులకు అన్వయించి చెప్పాడు.
పై సిద్ధాంతాన్ని ఆధారంగా తీసికొని, పశువుల “వీర్యంవల్ల పశుగణాభివృద్ధి జరుగు తుందనీ, పురుషుల వీర్యంవల్ల స్త్రీ గర్భంఫలవంతం అవుతుందనీ, భూమిని నీరు ఫలవంతం చేస్తే, పురుష వీర్యం స్త్రీగర్భాన్ని ఫలవంతం చేస్తుందనీ స్త్రీకి భూమికి సామ్యం చెప్పాడు. ఓసిరిస్ కు నీటితత్త్వం, ఐసిన్ కు భూతత్త్వాన్ని వర్తింపజేసాడు. అందుకే హిందువులకు భూమి ‘భూదేవి,భూమాత, పృథ్వీమాత’ అయిందనీ అంటారు. ఈ విషయం ‘భూమికి స్త్రీకి, నీటికి వీర్యానికి, కుండకు గర్భానికి’ సామ్యం చెప్పడం సమంజసం కాదని అనుకోవడానికి వీలు లేదు. అందుకు తగిన సాక్ష్యాధారాలు, తార్కాణాలు మన సాహిత్యంలో కూడా కోకొల్లలుగా లభిస్తాయి. వాటి గురించి కూడా తెలుసుకుందాం.
అగ్ని, వరుణుడు ఎటో వెళ్ళి వస్తుండగా మార్గమధ్యంలో ‘వీరు ఊర్వశిని చూస్తారు. ఆమెను చూడగానే వీరికి ‘వీర్యస్కలనం అవుతుంది. దానిని ఆమె ‘కుంభం’లో భద్రపరుస్తుంది. అందులో నుంచే వశిష్ఠుడు, అగస్త్యుడు జన్మిస్తారు.
అమావాస్యరోజు మునులు హోమాలు చేస్తుంటారు. వారికి వారి భార్యలు సపర్యలు చేస్తుంటారు. వారిని చూసి, అగ్ని మోహితుడవుతాడు. అది గమనించిన అగ్నిభార్య స్వాహాదేవి మునుల భార్యలరూపంలో వెళ్ళి, అగ్నిని కలుస్తుంది. ఆ శుక్లాన్ని ‘కనకభాండం’ లో భద్రపరు స్తుంది. అందులో నుంచే కుమారస్వామి జన్మిస్తాడు.
సగరుని భార్యలు ఋతుమతులైనపుడు నారాయణుడు శోణితాన్ని నూతన భాండంలో పోయమని చెప్తాడు.
రావణుడు మునులరక్తాన్ని సేకరించి భాండంలో జాగ్రత్తగా దాచిపెడ్తాడు. కృతనుృదుడను
ముని భాండంలోని పాలను మంత్రించి పెట్టుకోగా, రావణుడు దానిని ఎత్తుకొని వస్తాడు. రావణుడు తాను దాచిన రక్తాన్ని, ఈ పాలను కలిపి, ఆ మిశ్రమాన్ని భద్రంగా పెట్టమని మండోదరికి ఇస్తాడు. మండోదరి దానిని తాగుతుంది. మండోదరికి గర్భం రాగా, పుట్టింటికి వెళ్ళి, కూతురును కని, వస్తుంది. రావణుడు భద్రపరిచిన రక్త భాండాన్ని మండోదరి గర్భంగా చెప్పుకోవచ్చు.
గాంధారి గర్భతాడనం చేసుకోవడం వల్ల ముక్కలైన పిండాలను ” ఘృతకుంభాల్లో ఉంచమని వ్యాసుడు సలహా ఇస్తాడు.
ఔర్వుడు సుమతికి పుట్టిన వానిని 60 వేల ఖండాలు చేయించి ‘ఘృతకుంభాల్లో పెట్టిస్తాడు.
గణముఖ్యులు రాజులు కాదల్చుకున్నప్పుడు ‘బంగారుపాత్ర’లో ప్రవేశించి, పిండం లాగా ముడుచు కొని కూర్చునేవారు. బ్రాహ్మణులు మంత్రతంత్రాలు వల్లించేవారు. అందులో నుండి వచ్చినవారు పునర్జన్మ ఎత్తినట్టుగా భావి౦చేవారు.
ఈ రకంగా మన సాహిత్యంలో కనిపించే కుంభం, భాండం స్త్రీ గర్భానికి ప్రతిరూపమేనని మనం చెప్పవచ్చు.
కుంభం ఎలాగ సాహిత్యంలో చోటు చేసుకుందో అలాగే వీర్యం నీటిగుణారోపణ చేసుకొని సాహిత్యంలో నిలిచి ఉంది.
చిత్రరేఖ మృగమై దాహం తీర్చుకోవడానికి నీటిని తాగగా ఆ నీటిలో కలిసిన భాండకుని వీర్యం వల్ల ఆమె గర్భవతి అవుతుంది.
వసువు ఆకులో పెట్టి, డేగతో పెట్టిన వీర్యం నీటిలో పడగా మత్స్యం మింగుతుంది.
అది గర్భం ధరిస్తుంది.
దధీచి వీర్యం స్ఖలితం అవడం వల్ల సరస్వతీనది గర్భం ధరిస్తుంది.
బ్రహ్మరేతస్సు పంకంలో కలియడం వల్ల వాల్మీకి జన్మిస్తాడు.
మహిష్మతి అనునామె కొలనులో నీరు తాగుతుండ గా సింధుద్వీపుడను రాజు వీర్యం
నీటిలో పడుతుంది. ఆ నీటితో పాటు దానిని కూడా తాగుతుంది. దానితో ఆమె గర్భవతి అవుతుంది. మహిషాసురుడు జన్మిస్తాడు.
యవనాశ్వుడనే రాజు మంత్రపూరిత జలం తాగి గర్భం ధరిస్తాడు.
దశరథుడు పాయసాన్ని ముగ్గురు భార్యలకు నాలుగు సార్లు పంచడం వల్ల నలుగురు కుమారులు జన్మిస్తారు.
ఈ విధంగా మన లిఖితసాహిత్యంలో, సాంప్రదాయిక సాహిత్యంలో స్త్రీ గర్భాన్ని కుండలోను, పురుష వీర్యం నీటితోను పోల్చిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి ఇలియట్ చెప్పిన సిద్ధాంతం వాస్తవమేనని రుజువవుతున్నది. ‘సంతానం కోసం దేవుడు వరమిచ్చినా మొగుడు కావాలి’ అనేది జానపద సామెత. దీన్నిబట్టి నీరు త్రాగితే గర్భం వస్తుందనేది అపోహ మాత్రమేనని చెప్పవచ్చు. చివరకు చెమట బిందువులను, కన్నీటిని(ద్రవపదార్థాలను) కూడా వీర్యం ప్రతీక(సంకేతం) గానే మన వారు భాంచారు.
ఈ వ్యాసంలో చెప్పుకున్న ఆచారాలు, శిష్టసాహిత్యం, జానపదసాహిత్యంలోని రుజువులు ఆటవిక సమాజంలోని పరిణామం, ఆదిమానవుని సాంకేతికలిపిని, “వీటన్నిటినీ అన్వయించుకుంటే కుండ కుంభం; నీరు “వీర్యం; మొక్కలు సంతానం సఫలతకు చిహ్నమనీ రుజువైంది. అంతేగాక నాగరికదశ ఎంత ఎత్తు ఎదిగినా, మానవుడు అద్భుతమైన జ్ఞానాన్ని ఎంత వేగంగా సమకూర్చుకున్నా, అది ప్రాచీన నాగరికతలను దిగతొక్కి కనపడకుండా చేసేటంత అధికం మాత్రం కాదు. అది ప్రాచీన నాగరికతలోని మంచినంతను స్వాయత్తం చేసుకొనే ముందడుగు వేస్తున్నదనే చెప్పవచ్చు.
ఆధార గ్రంథాలు:
13
జనజీవన స్రవంతిలో బోనంకుండ శిష్టత
1) పురాతన సమాజం
2) ప్రాచీనభారతదేశచరిత్ర
3) చరిత్రలో ఏం జరిగింది
4) లోకాయత
5) పూర్వగాథాలహరి
6) పరిణామవాదం
7) ఆదిమానవులు
8) సూర్యారాయాంధ్ర నిఘంటువు
9) స్టాండర్డ్ డిక్షనరీ ఆఫ్ ఫోక్ లోర్, మైథాలజీ అండ్