(ఇప్పటివరకు: సుబ్బారావు తో మైత్రేయి వివాహం జరిగిపోయింది. ఏడాది లోపే సంసారంలో పదనిసలు ఆగిపోయాయి మైత్రేయి వివాహ జీవితంలో ఇంకా పిల్లలు పుట్టలేదని ఆమె పైనే ఒత్తిడి చేయడం మొదలు పెట్టారు పుట్టింట్లోనూ,మెట్టినింట్లోనూ. సుబ్బారావు హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ మీద వెళ్ళిపోయాడు. రాక పోకలు తగ్గిపోయాయి. అతని వ్యవహారంలో చాల మార్పు కనిపిస్తున్నది. అటువాళ్ళు గాని ఇటు వాళ్ళు గాని ఈ విషయం గురించి పట్టించుకోవటం లేదు. అందుకనే తానే తెలుసుకోవాలని హైదరాబాద్ బయలుదేరింది మైత్రేయి. )
పొద్దునే బస్సు దిగగానే సుబ్బారావు ఉంటున్న కూకట్పల్లి లోని అపార్ట్మెంట్ కి వెళ్ళింది. ఇల్లు లాక్ చేసి ఉంది. బయటే ఒక హోటల్ ల్లో కొంచెం సేపు కూర్చొని బ్యాంకు ఓపెన్ చేసే టైం కి బ్యాంకు కి చేరుకుంది మైత్రేయి. బి.ఎం వాసుదేవ రావు, సుబ్బారావు యొక్క స్నేహితుడే. వీళ్ల మ్యారేజ్ కి కూడా వచ్చినట్లున్నాడని ఆమె అతన్ని గుర్తు పట్టింది. అతను మాత్రం ఆమెను చూస్తూనే తెల్ల బోయాడు.
ఆమెను కూర్చోబెట్టి, సుబ్బారావు కోసం ప్యూన్ ని పంపాడు.
ప్యూన్ యాదగిరి “సారూ ! సుబ్బారావు సారు లేరు. ఇయాల హాఫ్ డే లీవ్ అంట”. అని చెప్పి తెచ్చిన కాఫీలు టేబుల్ మీద పెట్టి వెళ్లి పోయాడు.
వెళుతూ వెకిలిగా నవ్వుతూ “ఇయాల లావణ్య మేడం గారు కూడా హాఫ్ డే లీవెలోనే ఉన్నారట సారు”, అని అన్నాడు.
మైత్రేయి కి పరిస్థితి కొంచం అర్ధమయింది. సుబ్బారావు గురించి వాసుదేవ రావు గారిని అడిగి తెలుసుకుందామని అనిపించినా మర్యాద కాదేమో అని మౌనంగా కాఫీ సిప్ చేస్తూ కూర్చుంది.
“మైత్రేయి గారు! మీరు కాలేజీ లో లెక్చరర్ కదూ? ఎలా ఉన్నది మీ టీచింగ్ జాబ్”. అంటూ మాట పెంచాలని ప్రయత్నం చేసాడు .
“పర్లేదు సార్. వర్క్ బాగానే ఉంటుంది. స్స్టూడెంట్స్ తోటి కదా చాల లైవ్లీ గ ఉంటుంది.”అని ముక్త్గసరిగా సమాధానం చెప్పింది.
“ఓకే. ఏదైనా పని మీద వచ్చారా? సుబ్బారావుని పిలిపించమంటారా ? ఫోన్ చేస్తాను. వాడు వచ్ఛేస్తాడు “. అని ఎంతో చనువుగా ఫోన్ కలపబోయాడు.
“అయ్యో! వద్దండి. ఏ పని మీదున్నారో. పర్లేదు నేను మధ్యాహ్నం బస్సు లో తెనాలి వెళ్లి పోతాను. ఆయన వస్తే నేను వచ్చానని చెప్పండి చాలు.” అంటూ మొహమాటంగా లేచింది. బీ.ఎం కి ధన్యవాదాలు తెలిపి తిరుగు ప్రయాణం చేసింది.
ఆమె బ్యాంకు దాటగానే యాదగిరి బి.ఎం రూమ్ లోకి వచ్చాడు. “ఈ మేడం కి సుబ్బారావు గారి సంగతి తెలిసిపోయినట్లున్నది. ఎంక్వయిరీ కి వచ్చినట్లుంది”. అంటూ తన అనుమానం వెళ్లబుచ్చాడు.
బి.ఎం సాలోచనగా తలూపి సుబ్బారావు కి ఫోన్ కలిపాడు.
తాను తెనాలి చేరిన గంటకల్లా సుబ్బారావు కూడా తెనాలి చేరాడు. చాలా ఆవేశంగా ఇంట్లోకొచ్చాడు.
“ఎందుకో వచ్చావుట,” కాస్త వెటకారంగా అడిగాడు.
“ఊరికినే” పొడిగా సమాధానం చెప్పింది .
“డబ్బులిచ్చి రాక పోయావా” వెకిలిగా నవ్వాడు .
“ఎవరికీ” అంతే వ్యగ్యంగ అడిగింది.
“నీకు పొగరు. అహంకారం . మాటకి మాట చెబుతావు. నీకు నాకంటే జీతం, డిగ్రీలు ఎక్కువని బాగా పొగరు ”.
“ఇంకా “ సూటిగా అడిగింది.
“ఇంకా ఏమున్నాయి నీతో ! తారు డబ్బా మొఖం నువ్వు! నిన్ను చూస్తే నాకు అసహ్యం !. నిన్ను ముట్టు కోవాలంటేనే వెగటు” ఇలా ఏదేదో సంబంధం లేకుండా మాట్లాడుతున్నాడు ముద్ద ముద్దగా. కళ్ళు ఉబ్బి నట్లున్నాయి. బ్రాందీ వాసనా వస్తున్నది అతను మాట్లాడుతుంటే.
“కాఫీ తాగుతారా ? మజ్జిగ చేసివ్వ మంటారా “
“ మజ్జిగ ఎందుకు”
“మత్తు దిగితే మాట్లడటానికి”.
“ఎం మాట్లాడాలి నాతోటి. ఎప్పుడు ఉండే నసేగా”.
“ఇవాళ లీవ్ లో ఎందుకున్నారు”
“నీకన్ని చెప్పాలా?”
“ఎవరితోనో వెళ్లారని మీ అటెండర్ అనటం విన్నాను”
“అంటే? నువ్వు నా మీద ఎంక్వయిరీ కి వచ్చావా ?”
“అవును. అలాగే అనుకోండి”అంటూ తీవ్రంగా సమాధానం చెప్పింది.
“ఇలాటి వేషాలేసావనుకో – నా సంగతి నీకు పూర్తిగా తెలియదు, నీ పని చెబుతా జాగర్తగ ఉండు. నా గురించి ఎంక్వయిరీకి వస్తావా !” అంటూ ఆవేశంగా ఆమె మీదకి చేయి ఎత్తాడు.
“నేను కాబట్టి చేసుకున్నాను. లేక పోతే పెళ్లి పెటాకులు ఏవి లేకుండా అలాగే ఉండే దానివి. గుర్తుంచుకో “ అహంతో మరీ రెచ్చి పోయాడు .
“మీరు నన్ను పెళ్లి చేసుకోకపోయినా గౌరవంగా బ్రతికే దాన్ని. ఈ రోజు మొగుడుండి కూడా లేని దాని లాగా ఆ కాస్త గౌరవం కూడా పోయి బతుకుతున్నాను. అందరు నన్ను మొగుడు వదిలేశాడేమో అన్న ట్లు జాలిగా చూస్తున్నారు. మన ఇంటి ఇరుగుపొరుగువాళ్ళు కొందరు అడుగుతున్నారు కూడా.ఎం చెప్పమంటారు. మీరు వదిలేశారనా ? ఇంకెవతితోనో ఉంటున్నారనా లేక నన్ను వదిలేశారనా?ముండమోశాననా ? ” ఆవేశపడింది.
“ముండమోసాననుకుంటున్నావా! నన్ను చంపుతావా? అంత ధైర్యం వచ్చిందా నీకు,“ అంటూ అంతు లేని ఆవేశంతో ఆమె జుట్టు పట్టుకొని వంచి వీపు మీద పిడిగుద్దులు గుద్దటం మొదలు పెట్టాడు. ఆమె శరీరం బాధతో మెలికలు తిరిగిపోతున్నది. చేయి మెలిపెట్టి ఉంచాడు. ఆమె విదుల్చుకోలేక పోతున్నది. మధ్యమధ్య లో ఆమె జుట్టును పట్టు కొని వెన్నక్కి వంచి ఆమె డొక్కలో కూడా తన్నడం చేస్తున్నాడు. మనిషి బాగా అదుపు తప్పిపోయాడు. ఇంగితం మరిచిపోయి ఆమెను తిడుతున్నాడు.
“మైత్రేయీ ! మైత్రేయీ ! మైత్రేయీ ! “అంటూ ఆమె ఆత్మ గోషిస్తున్నది. శారీరక హింస కన్నా మానసిక హింస ఎక్కువయి పోయింది. అనరాని, వినలేని మాటలను మాట్లాడు తున్నాడు అతను. ఆత్మాభిమానం నిదురలేచింది. యుగాలుగా స్త్రీ రక్తంలో ఇంకిపోయిన కట్టుబాట్లు సడలిపోయాయి. తాను బలహీనురాలు కాదు . ఎందుకీ రాక్షసత్వం భరించాలి; అంతే ఆమెలో ఎక్కడలేని తెగింపు. తన బలమంతా ఉపయోగించి అతను మేలేపెట్టిన చేతిని విడిపించుకున్నది. భుజాలు రెండు పట్టుకొని తిరుగు దాడి చేసింది. సుబ్బారావు కాళ్ళ మధ్యన మోకాలితో ఒక్కసారి చాలా బలంగా కొట్టింది. అంతే సుబ్బారావు లోని పురుషాహంకారం విలవిల్లాడిపోయింది. కుప్పకూలిపోయాడు. ఆమెలో ఆవేశం తగ్గ లేదు. అతన్ని ఈడ్చుకెళ్లి వరండాలో లో పడేసి లోపలికెళ్ళి గడియ పెట్టేసింది. సుబ్బారావు గోల చేస్తున్నాడు. ఎవరు వినలేని విధంగా మైత్రేయిని తిడుతూనే ఉన్నాడు.అదొక వీధి బాగోతమే అయింది. ఒక రాత్రి కి అంతా నిశబ్దం.
ఆవేశం తగ్గింది. ఆమె లోనే స్త్రీత్వం ఆమెను కదిపింది. ఆమె బయటి కొచ్చి చూసింది. ఎవరు లేరు. తెల్లవారింది. కానీ మైత్రేయి జీవితం లో సామజిక బహిష్కరణ అనే చీకటి పొడచూపింది.
ఇరుగుపొరుగువాళ్లంతా ఆమె నొక దోషిగ చూడ్డం మొదలు పెట్టారు. వాళ్ళందరి చూపులు సూదుల్లా గా గుచ్చుకుంటున్నట్లుగా అనిపించింది. అందుకే, నీళ్లు పట్టుకోవాలని పంపు దగ్గరికి వెళ్లిన మైత్రేయి నీళ్లు పట్టుకోకుండానే ఇంట్లోకి వెళ్ళిపోయింది.
(ఇంకా ఉన్నది)