పల్లవించు ప్రతి రాగమిది … Heartbeat of the country !!

26-1-2024 తరుణి పత్రిక సంపాదకీయం – డాక్టర్ కొండపల్లి నీహారిణి తరుణి సంపాదకులు

ఎన్నో పోరాటాలు చేసి ఉద్యమాలు చేసి సాధించుకున్న స్వాతంత్ర ఫలాలకు సమయోచితమైన రాజ్యాంగం ఉండాలని పాలన రూపుకు లిఖిత రూపం ఇచ్చుకున్న ప్రత్యేకమైన రోజు జనవరి 26. భారత రాజ్యాంగాన్ని అమలులోకి తెచ్చుకున్న, వెలుగులోకి తెచ్చుకున్న గణతంత్ర దినం జనవరి 26. అందుకే ఆనాటి నుండి ప్రతి ఏడు ఉత్సవంగా జరుపుకుంటున్నాం. 1949 నవంబర్ 26న మొట్టమొదలు ఆమోదింపబడిన ఈ రాజ్యాంగం 1950 జనవరి 26న ప్రజాతంత్ర పరిపాలన పద్ధతికి ప్రాతినిధ్యమిస్తూ 24 మంది సభ్యుల ప్రతిపత్తి మొత్తం 284 మంది సభ్యుల సంతకాలు చేయగా స్వతంత్రమైన రాజ్యాంగంగా అమలులోకి వచ్చింది.
డాక్టర్ రాజేంద్రప్రసాద్ ఇండియన్ యూనియన్ అధ్యక్షుడిగా మొదటి పదవీ కాలాన్ని ప్రారంభించడం, జాతీయ జెండాను ఎగురవేయడం భారతదేశాన్ని సర్వసత్తాక గణతంత్ర దేశంగా ప్రకటించడం 200 ఏళ్ల బ్రిటిష్ వారి నియంతృత్వ పరిపాలన అనంతరం జరిగినటువంటి స్వేచ్ఛ అస్థిత్వాల ప్రతీక ల ఉత్సవం. ఆనాడు లక్షలాదిగా ప్రాణత్యాగం చేసి స్వాతంత్రాన్ని సంపాదించుకున్న 1947 ఆగస్టు 15 కాలం నుండి 1950 లోసమగ్రమైన రాజ్యాంగ రూపం ఏర్పడింది. అహింసా మార్గంలో స్వాతంత్య్రం సిద్ధించేలా చేసిన మహాత్మా గాంధీ జాతీయ ఉద్యమాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోవడం భారతీయులుగా మన బాధ్యత. తొట్ట తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ను, రాజ్యాంగ నిర్మాణానికి కృషిచేసిన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ను గుర్తు చేసుకోవడం మన ధర్మం.
ప్రస్తుతం మన దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు జాతీయ జెండాను ఎగురవేసి మనలో స్ఫూర్తిని నింపుతారు.
రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్రపతి భవన్ కు దగ్గరలో ఉన్న రాసిన హిల్ దగ్గర ప్రారంభమై ఇండియా గేట్ నుంచి ఎర్రకోట వరకు దాదాపు 5 కిలోమీటర్ల దూరం సాగే వివిధ రక్షక దళ జవాన్లు చేసే రిపబ్లిక్ డే పర్యటన ఎంతో స్ఫూర్తిదాయకం గా ఉంటుంది.
రక్షణ దళాలకు చెందిన మహిళా సైనిక బృందాలు ఉంటాయి. నూట నలభై నాలుగు మంది మహిళలా సైనికులు ఈ పరేడ్లో పాల్గొంటారు. వీరిలో ఆర్మీ బృందం,ఇండియన్ ఎయిర్ ఫోర్స్ బృందం, రక్షణ శాఖ బృందం ఉంటారు. ఇది మన అందరికీ స్ఫూర్తిని కలిగించే విషయం.

అయితే,రిపబ్లిక్ డే పరేడ్ జరుపుకోవడం, జాతీయ జెండాను ఆవిష్కరించుకోవడం, సైనిక కవాతు లు, ప్రగతి శకటాలు చూడడం, ఇచ్చిన సెలవులు సెలవు గానే తీసుకోవడం మాత్రమే కాదు , స్వాతంత్ర పోరాటాలలో త్యాగం చేసిన వారిని గుర్తు చేసుకోవాలి, ఈ సందర్భంగా వచ్చిన పాటలను గుర్తు చేసుకోవాలి,
ఈ పాటలు స్వాతంత్ర్య పోరాటాలలో వచ్చినవి, కొన్ని పాటలు స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దినోత్సవ సందర్భంగా వచ్చినవి ,మరికొన్ని భారత రాజ్యాంగాన్ని రూపొందించుకున్న తర్వాత వచ్చినవి ఇలా దేశభక్తి గేయాలు ఎన్నో ఉన్నాయి. అవి సినిమా పాటలు గా ఉన్నా ,లలిత గీతాలు గా ఉన్నా ఆ పాటలను ఒక్కసారి స్మరించుకోవడం ప్రస్తుతం తప్పనిసరి. ఇవి స్వార్థ ప్రయోజనాల కోసమే బ్రతికే రోజు లు. ఈ దారుణ పరిస్థితుల్లో మనసును చెడు మార్గంలో కి పోకుండా చక్కని శాంతి సందేశాల్నిచ్చే సాహిత్యం చాలా అవసరం. విస్తరినిండా అన్నీ వడ్డించి ఉన్నప్పుడు తినడానికి కూడా బద్ధకిస్తున్నటువంటి నేపథ్యాన్ని , ఈనాటి యువతను చూస్తున్నాం. ఏ కష్టమూ లేకుండా అందుబాటులోకి సౌకర్యాలు అన్నీ వచ్చినా కూడా ఇంకా అసంతృప్తి, ఇంకా బయటి ఎదుటి వారి మీద ఈర్ష్య కనబరుస్తున్నారు. ఇవి పోవాలంటే తప్పకుండా కుటుంబ సభ్యులు నీతి వాక్యాలను చెప్పడం మంచి మాటలను గుర్తు చేయడము మనం అనుభవిస్తున్న సంతోషాలకు మన పూర్వీకులు చేసిన కృషి, త్యాగాలు కారణం అని తెలియజేయడం అనే బాధ్యత తప్పకుండా తీసుకోవాలి.

“విశాల విశ్వంలో మా భారతదేశం ఉన్నతం/ సుస్వరాలము మేము /మధురవీణ నాదేశం నా దేశం..” అనడానికి మనము పిడికిళ్లెత్తుదాం , గళాలమవుదాం.
” జాబిలంటి మా అమ్మకు స్వాగతాలివే జాజిపూల జావళీల విన్నపాలివే పాలవెల్లికి మా ప్రేమ వెల్లువా ” అనే పల్లవితో సాగిన ఈ పాటలో
“భరతమాతకు భేదాలనేవే లేవులే రంగులన్నీ తెల్లవై సంఘమించవా ఆరు రుతువులు ఏకమై సమ్మతించవా అంతరాల అంధకారమంతరించిపోయెగా …” అంటూ అద్భుతమైనటువంటి సమ భావాన్ని వ్యక్తపరిచారిక్కడ.
“జయ జయ భారత..జాతీయాభ్యుదయానందోత్సవ శుభ సమయం..”
ఈ పాటలో స్వాతంత్యానంతరం విజయ గీతికలు పాడిన పదాలను చూస్తే “హిందూ ముస్లిం క్రైస్తవ పార్సి ఏకవేదికను నిలపండి..జాతులెన్నున్న దేశం ఒక్కటని లోకసన్నిధికి చాటండి” అంటూ గొప్ప సంస్కృతి కి నీరాజనాలు పలికారు.
అందరికీ తెలిసిందే యావత్ప్రపంచానికీ తెలిసిందే కేవలం భారత దేశంలోనే ఇన్ని రకాల కుల మతాలు ఉన్నాయనేది. దీన్ని విశాల హృదయంతో తీసుకోవాలి కానీ.. ఒకరిపై ఒకరికి ద్వేషం కలిగేలా మాట్లాడకూడదు అని చెప్పడానికే ఈ పాట.
ఒకవి ,”సారే జహాసే అచ్చా… హిందూస్తాన్ హమారా” అన్నాడు. మరో కవి ఎలుగెత్తుతూ,,”విజయీ విశ్వతిరంగా ప్యారా జండా ఉంచా రహే హమారా”అన్నాడు .
కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు భారతీయులమంతా ఒకటే అంటూ”సాగరమేఖల చుట్టుకొని సురగంగ చీర గా మలచుకుని “అంటూ ఈ దేశాన్ని తల్లిలాగా భావించే మనందరికీ ఒక గొప్ప పాటను అందించారు మరొక కవి.
” భేదాలన్నీ మరచి, మోసం ద్వేషం విడిచి , మనిషి మనిషిగా బ్రతకాలి, ఏనాడూ నీతికి నిలవాలి” అంటూనే “అవినీతిని గెలిచే బలమివ్వు” అని కోరుతూ ఓ కవి రాసిన పాటలు ఉన్నాయి. స్వాతంత్రం వచ్చిన తర్వాత అవినీతి అనే ఒక పెద్ద దుర్గుణం ప్రజల్లో ప్రాణవాయువులా చొరబడిపోయింది.ఈ చెడు గుణం పోవాలని కోరారు.” నడిచే దారిలో నవ్వే పువ్వులు శాంతి నాదా లతో ఎగిరే పిట్టలు” అంటూ కోయిల కంఠమయ్యాడో కవి.ప్రాణికోటి లో మనిషి తప్ప అన్ని ప్రాణులూ అన్యాయం, అవినీతి లేని వే.
“కులమత బేధం వలదన్నాడు, కలిసి బతికితే బలమన్నాడు ,మానవులంతా ఒకటన్నాడు ,మనలో జీవం పోశాడు”ఈ బాల గేయం ఎవరిని ఉద్దేశించి రాయబడిందో అందరికీ తెలిసిందే. యుద్ధం లేకుండా స్వాతంత్రాన్ని సంపాదింపజేసిన మహోన్నత వ్యక్తి గురించి అని అందరికీ తెలిసిందే.కులాలు మతాలు ఉండవద్దు అని అనలేదు. భేదాలు ఉండవద్దు అని అన్నాడు .ఏ కులం ఎవరికైనా గొప్పే. ఏ మతం ఎవరికైనా గొప్పే . కలిసి ఒకటైనప్పుడు ఒకరినొకరు తక్కువ చేసుకోవద్దు అనే జ్ఞానాన్ని కలుగజేసుకోమని చెప్పారు. ఇది అవలంబిస్తే ఆనాడు కోట్ల ప్రాణాలను త్యాగం చేసిన ఆ త్యాగధనుల బలిదానాలకు అర్థం చేకూర్చిన వాళ్ళం అవుతాం. అలా కానప్పుడు,
” మతమన్నది నా కంటికి మసకైతే ,మతమన్నది నా కంటికి మబ్బయితే, మతం వద్దు గితం వద్దు మాయ మర్మం వద్దు “అనీ అన్నారు. ఈ విభేదాలు మనుషుల కంటికి మసకలు చేర్చినా, మంచితనానికి అడ్డు తగిలి కన్నీరు కార్పించినా ఈ మాయామర్మాలే వద్దు. అసలు మతము అంటే ఏంటి? మతము అంటే అందరూ ఆచరించదగినట్టుండే ‘మంచి’ అని చెప్పడం.
గణతంత్ర దినోత్సవం ఒక సందర్భం కావాలి మంచి మాటలు చెప్పడానికి మంచి పనులు చేయడానికి
“మాది స్వతంత్ర దేశం, మాదే స్వతంత్ర జాతి, భారత దేశమే మా దేశం, భారతీయులం మా ప్రజలం” అంటారు. పల్లవిలో ఇలా పల్లవించి చరణం లో పూవులెలా పూసిందో చూడండి పాట…. “అహింసా పరమో, ధర్మః సత్యం వదా ధర్మం చర ఆది ఋషుల వేదవాక్కులు, మా గాంధీ గౌతముల సువాక్కులు ” అంటూ చక్కని లలిత గీతం మనకు ఉన్నది. విద్య వ్యాపారమై వ్యాపారమే ఒక పెద్ద విద్య అయిపోయి ,మనుషుల మధ్య అన్ని ఆర్థిక సంబంధాలే అడుగడుగునా అడ్డువస్తున్నప్పుడు ఈ స్వతంత్ర ఉత్సవాలు ఈ గణతంత్ర ఉత్సవాలు మనిషిలో ని మనీషిని మేల్కొల్పాలి.

Written by Dr. Kondapalli Neeharini

డా|| కొండపల్లి నీహారిణి, తరుణి సంపాదకురాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

భారతీయ శిల్పకళా చరిత్రలో స్త్రీ మూర్తుల

 ఎడారి కొలను