కష్టాల సరస్సులో విరిసిన కమలం! చైతన్య కలం!13మంది సంతానం లో9మంది ఆడపిల్లల్లో ఒకరు.పేరుకి తగినట్లు వెలుగులు విరజిమ్మే ఈమె మంచి రచయిత్రి.మిర్యాలగూడ బల్లూనాయక్ తండాలో పుట్టి ఉస్మానియా యూనివర్సిటీ లో తెలుగు శాఖ అధిపతి! ఆమెయే డాక్టర్ సూర్యా ధనంజయ్.తన జీవితం ని చకచకా చదివించే లా తరుణి కోసం మనముందు ఉంచారు.
మాది నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం భల్లూ నాయక్ తండ. తల్లిదండ్రులు ధ్వాళీబాయి, భల్లునాయక్ లు. మాది వ్యవసాయ కుటుంబం. మా నాన్న పేరు మీదనే మా తండా ఏర్పడింది. చదువు ప్రాధాన్యత తెలిసిన నాన్న తండాలోనే పాఠశాలను ఏర్పాటు చేయించారు. ఆడపిల్లలు పుడితేనే భారంగా భావించే తండా సమాజంలో ఆడపిల్లలకు చదువు ఎంత అవసరమో పసిగట్టిన కుటుంబంలో పుట్టాను నేను. నాలుగేండ్ల వయసులోనే తండ్రిని కోల్పోయాను. అమ్మ ద్వాళీబాయి తానే కుటుంబ భారాన్ని మోసింది. పది మంది పిల్లలను కష్టపడి పెంచింది. పెళ్లిళ్లు చేసింది. నేను చిన్న నాటినుండి చదువు మీద చూపిన ఆసక్తిని గమనించి ఎన్ని కష్టాలైనా భరించి నన్ను చదివించాలనుకుంది అమ్మ. కాని నాన్న మాకు దూరమయ్యాక తండాలోని పాఠశాల మూతపడింది. పక్క తండాలో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశాక ఉన్నత పాఠశాలలో చేరడానికి మిర్యాలగూడకు వెళ్లలేని ఆర్థిక పరిస్థితి. ఆరోజుల్లో తండాకు రోడ్డు లేదు. కాలిబాట మాత్రమే ఉండేది. అటువంటి స్థితిలో నాకు చదువు నేర్పిన గురువు అమ్మకు నచ్చజెప్పడంతో అతి కష్టం మీద అమ్మ ఒప్పుకుంది. అమ్మ ఒప్పుకోకపోవడానికి కారణం ఉంది. ఆ రోజుల్లో మా సమాజంలో ఆడపిల్లల్ని గడప దాటనిచ్చేవారు కాదు. అంతే కాకుండా బాల్య వివాహాలు ఎక్కువగా ఉండేవి. కానీ, మా అక్క ఆమె కూతుర్ని కూడా నాకు తోడుగా పంపుతానని చెప్పి అమ్మకు నచ్చచెప్పడంతో నన్ను మిర్యాలగూడలోని బాలికల ఉన్నత పాఠశాలలో చేర్పించారు. తండా నుండి మిర్యాలగూడకు రోజు నడిచి వెళ్ళేదాన్ని. కొంతకాలానికి ఎస్సి బాలికల హాస్టల్లో సీటు రావడంతో అక్కడే ఉండి పదవ తరగతి పూర్తిచేశాను. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నప్పుడే డా. ధనంజయ్ నాయక్ తో వివాహం జరిగింది. రెండవ సంవత్సరంలో మా పెద్ద బాబు సంజయ్ జన్మించాడు. దానితో చదువు మధ్యలోనే ఆగిపోయింది. నా కల చెదిరిపోయింది బాధపడ్డాను. కాని, ఇద్దరు పిల్లలు పుట్టినంక మా వారి ప్రోత్సాహంతో డా. బి.ఆర్. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా బి.ఎ. చేశాను. ఆంధ్ర మహిళా సభ కళాశాలలో బీఈడీ, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ. (తెలుగు), B.L.I.Sc, కోర్సులు పూర్తి చేశాను. అనంతరం, ఆచార్య మసన చెన్నప్ప గారి మార్గదర్శనంలో 2001 లో ‘రామాయణ అరణ్య కాండలోని ఆశ్రమాలు – శ్రీరాముని దర్శనాలు’ అనే అంశంపై ఎం.ఫిల్. చేశాను. తర్వాత వారి మార్గదర్శనంలోనే “నల్గొండ జిల్లా బంజారా సాహిత్యం – జీవన చిత్రణ” అనే అంశంపై పరిశోధన చేసి 2006 లో డాక్టరేట్ పట్టా పొందాను.
నేను చదువుకున్న తెలుగుశాఖలోనే ప్రొఫెసర్ గా నియమించబడడం నా విజయానికి తోలి మెట్టు. అక్కడినుండి అంచెలంచెలుగా తెలుగుశాఖకు రెండు పర్యాయాలు అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించాను. అంతే కాదు, విశ్వవిద్యాలయంలో మహిళా వికాస కేంద్రానికి డైరెక్టర్ గా అదనపు విధులు నిర్వహిస్తున్నాను. తెలుగు శాఖ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్‌పర్సన్‌గా, యూత్ వెల్ఫేర్ ఆఫీసర్ గా పనిచేశాను. బనారస్ హిందూ యూనివర్సిటీ (BHU), వారణాసి, UP, మహాత్మా గాంధీ విశ్వ విద్యాలయం, నల్లగొండ కు బోర్డ్ ఆఫ్ స్టడీస్ మెంబర్ గా ఉన్నాను. అనేక ప్రభుత్వ కమిటీల్లో సభ్యులుగా ఉన్నాను. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్‌కు సభ్యురాలుగా (2014-17) నియమించబడ్డాను. 2016-17-19, 2017-18 & 2018-19 సంవత్సరాలకు మహిళా అచీవర్స్ రాష్ట్ర అవార్డుల కోసం ఎంపిక కమిటీలో, దాశరథి కృష్ణమాచార్య, కాళోజీ రాష్ట్ర పురస్కారాల ఎంపిక కమిటీలో ఉన్నాను.
నిరంతరంగా కొనసాగిస్తున్న పరిశోధనల్లో భాగంగా 2009-12 మధ్య కాలంలో ‘తెలంగాణ బంజారా గేయ సాహిత్యం – సామాజిక మానవ శాస్త్ర అధ్యయనం’ అనే పేరుతో UGC మేజర్ రీసర్చ్ ప్రాజెక్ట్ కు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ గా ఉండి ప్రాజెక్టు రిపోర్ట్ తయారు చేసి UGC కి సమర్పించడం జరిగింది. దాన్ని త్వరలోనే ముద్రించడానికి ప్రయత్నిస్తున్నాను. 2020-21లో “సమగ్ర బహుభాషా బంజారా (గోర్బోలి) నిఘంటువు సంకలనం’ అనే UGC (RUSA) ఇంటర్-డిసిప్లినరీ మేజర్ రీసర్చ్ ప్రాజెక్ట్ కు ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్ గా ఉండి ‘బంజారా బహుభాషా నిఘంటువును రూపొందించడం జరిగింది. దాన్ని త్వరలోనే ముద్రించడానికి ప్రయత్నిస్తున్నాను.
నేను ఇప్పటికి (70) పరిశోధక వ్యాసాలను ప్రచురించాను. (6) గ్రంథాలను రచించాను. (2) గ్రంథాలకు సహ రచయితను, (11) గ్రంథాలకు సంపాదకత్వం, (5) గ్రంథాలకు సహ సంపాదకత్వం వహించాను. (2) గ్రంథాలను అనువాదం చేశాను. ‘నల్లగొండ జిల్లా బంజారా సాహిత్యం – జీవన చిత్రణ’, ‘రామాయణ అరణ్యకాండలోని ఆశ్రమాలు – శ్రీరాముని దర్శనాలు’, ‘బంజారా నానీలు’, ‘తాంగ్డి’, ‘గమనం’నేను రచించిన గ్రంథాల్లో ముఖ్యమైనవి. సహ రచయితగా ‘గోర్ బంజారా – యాన్ ఎండ్యూరింగ్ ట్రైబ్స్’, ‘గోర్ బంజారా చరిత్ర’ గ్రంథాలను అందించాను. బోధనతో పాటు పరిశోధనలో కూడా ముందు…
తండాలో పుట్టిన నేను, నా బాల్య దశను అక్కడే గడపడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే అక్కడి మట్టి మనుషులు, వారి నిర్మలత్వం, ప్రకృతి పరిమళాలు నా గుండెల్లో ఎప్పుడు పచ్చగానే ఉంటాయి. ఐతే, తండాల్లో మూఢ నమ్మకాలు, నిరక్షరాస్యత, అమాయకత్వం వారిని వెనకబడేలా చేస్తున్నాయి. బంజారాల కష్టనష్టాలన్నీ బంజారేతర సాహితీకారులకు తెలిసే అవకాశాలు చాలా తక్కువ. ఎందుకంటే వారి సమాజం ఇతర సమాజాలకు దూరంగా వుంటుంది. మానవీయ సంబంధాలు భిన్నంగా ఉంటాయి. గిరిజన బిడ్డగా ఆ సమాజాన్ని నేను దగ్గరగా చూస్తూ పెరిగాను. వారి వెతలు నాకంటే ఎక్కువగా ఎవరికీ తెలియవు. కాబట్టి, బంజారా సమాజంలోని వెతలను బాహ్యప్రపంచానికి చూపే బాధ్యత నా మీద ఉందని భావించాను. నేను ముందుగా వారి సంస్కృతీ సంప్రదాయాలను బాహ్యప్రపంచానికి తెలియచేయాలననే ఉద్దేశ్యంతో పరిశోధన చేసి వారి మౌఖిక సాహిత్యలోని అందచందాలను, సంస్కృతిని ప్రపంచానికి తెలియజేశాను. తర్వాతి దశలో బంజారాల జీవన నేపథ్యంలోని వ్యాసాలను వెలువరించి వారి జీవనంలోని అనేక పార్శ్వాలను లోకం ముందు ఉంచాను. మరో దశలో నా బాల్యం నుండి నేటి వరకు నేను కన్న, విన్న, అనుభవించిన సంఘటనల్లో కొన్నింటికి కథారూపాన్నిచ్చాను. తండా ప్రజల గుండె చప్పుడు ప్రపంచం వినేలా కథలు రాశాను. ఝోళి, మస్తానన్న డబ్బా, అంబాలి, ధర్మి బాయి దొకాన్ వంటి కథల ద్వారా బంజారాల జీవితాలకు అక్షర రూపం ఇచ్చే ప్రయత్నం చేశాను. నేను చూసిన బంజారాల జీవితాలపై మున్ముందు ఇంకా ఎన్నో సృజనాత్మక రచనలు సాహిత్యంలో చూపాలని వుంది. సమయానుకూలతను బట్టి బంజారాల బహుముఖీన పార్శ్వాలను లోకానికి తెలియజేయాలన్నదే నా ఆకాంక్ష.
చదువుకునే రోజుల్లో నేను అందరిలాంటి సాధారణ విద్యార్థినే. మా తండాలో, పక్క తండాలో పాఠశాలలో ఐదో తరగతి వరకు చదువుకున్నాను. నేను చదువులో, ఆట పాటల్లోనూ చురుగ్గా ఉండేదాన్ని. తండాల్లో చదువు అయిపోగానే నన్ను మిర్యాలగూడలో అప్పర్ ప్రైమరీ పాఠశాలలో చేర్పించామని మా సారు అమ్మకు చెప్పి ఒప్పించడంవల్ల నన్ను మిర్యాలగూడలో గాంధీ పార్క్ పాఠశాలలో చేర్పించారు. తర్వాత మిర్యాలగూడలోనే బాలికల ఉన్నత పాఠశాలలో చేర్పించారు. ST బాలికల కొరకు హాస్టల్ లేకపోవడంతో SC హాస్టల్లో చేర్పించారు. ఊరు విడిచి హాస్టల్ కి వెళ్తున్నప్పుడు అమ్మ చెప్పిన మాటలు, ఊరుకాని కానీ ఊళ్ళో చదువు కోసం నేను పడ్డ కష్టాలు నన్ను బాగా చదువుకునేలా చేశాయి. చిన్నప్పుడే నాన్న మాకు దూరమయ్యారు. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అమ్మే మాకు ఆధారమైంది. ఆమె నిత్యం ఒకటే మాట చెప్పేది. “మనలాంటి బడుగుల బతుకుల్లో వెలుగు నింపేది చదువొక్కటే” అని అమ్మ చెప్పిన మాటలు, పెళ్ళైన తరువాత మా వారు ఇచ్చిన ప్రోత్సాహం, ముఖ్యంగా నాకు చదువుమీద ఏర్పడ్డ మక్కువ నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి. హైస్కూల్లో ఉన్నప్పుడు కానీ, ఇంటర్లో కానీ నేను ఎన్నడూ ఊహించలేదు, పి.జి. చేసి ఎం.ఫిల్., పిహెచ్.డి. చేస్తానని, ప్రొఫెసర్ అవుతానని. కాకపొతే ‘చదువుని నమ్ముకొని మంచి స్థాయికి చేరాలని’ నాలో బీజాలు నాటింది మాత్రం మా అమ్మ ధ్వాళి బాయి. తొలి అడుగు ‘అమ్మ మాట’ అయితే, మలి అడుగు మా వారు డా. ధనంజయ్ నాయక్ తో వివాహం. వారి ప్రోత్సాహం, మార్గదర్శకత్వం నా ప్రస్థానాన్ని మరింత విస్తృతం చేసింది.
ఎవరి మాతృభాష వారికి మధురం ఉండడం సహజం. నా మాతృభాషపైన ఉన్న పట్టు నాకు తెలుగు భాషపైన పట్టు వచ్చేలా చేసిందని చెప్పాలి. బంజారా భాషకు లిపి లేదు. దానిని ‘గోర్ బోలి’ అంటారు. మన దేశంలో ఇండో-ఆర్యన్ భాషా కుటుంబానికి చెందిన అనేక భాషలకు ‘దేవనాగరి’ ని లిపిగా ఎన్నుకున్నారు. బంజారా భాషకు కూడా అది సరిపోతుం దని నా అభిప్రాయం. దేశవ్యాప్తంగా దాదాపు 18 రాష్ట్రాల్లో ఉన్న బంజారాలకు గొప్ప సాహిత్య సంపద ఉంది. అది మౌఖికంగానే ప్రచారంలో ఉంది. ఆ భాషకు ఇంతవరకు ఒక లిపిని అధికారికంగా ప్రకటించకపోవడంవల్ల లిఖిత సాహిత్యం అభివృద్ధి కాలేదు. అనేకమంది బంజారా రచయితలు ప్రాంతీయ భాషల్లో బంజారా సాహిత్యాన్ని రచిస్తున్నారు. తెలుగు మన రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో బోధనా భాష కాబట్టి తెలుగులోనే చదవాల్సివచ్చింది. డిగ్రీ వరకు సెకండ్ లాంగ్వేజ్ తెలుగు చదివాను. తెలుగు భాషా సాహిత్యాలమీద అభిమానం పెంచుకున్నాను. అందుకే ఎం.ఎ. లో తెలుగు సాహిత్యాన్ని ఎంచుకున్నాను. కాబట్టి పరిశోధన, బోధన తెలుగు సాహిత్యంలో చాలా ఇష్టంగా చేయగలుగుతున్నాను. విద్యార్ధి దశలో తొలుత నా మాతృభాషా ప్రభావం తెలుగు భాషపైన ఉండేది. కానీ, అది నేను ఎం.ఎ., ఎం.ఫిల్., పిహెచ్.డి., చేసే క్రమంలో నా మాతృ భాషకు మించిన భాషా పరిజ్ఞానం నాకు వచ్చింది. ఇక బోధన నాకు ఇష్టమైన వ్యాపకం కాబట్టి విద్యార్థులకు తెలుగు సాహిత్యం బోధించడం నాకెప్పుడూ ఇబ్బంది అనిపించలేదు.
తెలుగు నా మాతృభాష కాకున్నా నాకు కూడు పెట్టిన భాష. అమ్మ జన్మనిస్తే, తెలుగు నాకు జీవితాన్నిచ్చింది. తెలుగు సాహిత్యం చదవడం వల్లనే నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను. రెండు పర్యాయాలు తెలుగు శాఖ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించే అవకాశం వచ్చింది. తెలుగు బోధనలో ఎలాంటి వివక్షను నేను ఎదుర్కోలేదు. నా పని నేను సక్రమంగా చేయడం నేను మొదటినుండీ అలవాటు చేసుకున్నాను. నా లోపాలను ఎత్తిచూపే పరిస్థితి రాకుండా ఎప్పుడూ జాగ్రత్త పడతాను. ప్రతిక్షణం నన్ను నేను చెక్కుకుంటూ శిల్పంగా తయారయ్యాను. బోధనతో పాటు, అనేక పాలనా పదవులను కూడా బాధ్యతగా నిర్వర్తించాను. మూడు సంవత్సరాలుగా ‘సెంటర్ ఫర్ ఉమెన్ స్టడీస్’ కి డైరెక్టర్ గా బాధ్యతలు విజయవంతంగా నిర్వర్తిస్తున్నాను. కానీ ఎక్కడా ఎలాంటి వివక్షనూ ఎదుర్కోలేదు.
రచనా వ్యాసంగం: ఎం.ఫిల్ అనంతరం 2009లో నా రచనా వ్యాసంగం మొదలైంది. ముందుగా “రామాయణ అరణ్య కాండలోని ఆశ్రమాలు – శ్రీరాముని దర్శనాలు” నా ఎం.ఫిల్ సిద్ధాంత వ్యాసాన్ని గ్రంథంగా తీసుకొచ్చాను. ఈ గ్రంథం పరిశోధకులకు మార్గదర్శనంగా ఉపయోగపడుతోంది. పిహెచ్.డి. పరిశోధన సిద్ధాంత గ్రంథం “నల్గొండ జిల్లా బంజారా సాహిత్యం జీవన చిత్రణ” ద్వారా తొలిసారిగా బంజారా సాహిత్యాన్ని,ముఖ్యంగా వారి మౌఖిక సాహిత్య వైభవాన్ని, సాంస్కృతిక పరిమళాన్ని తెలుగు పాఠకలోకానికి అందించగలిగాను. ఆచార్య గోపి గారి ప్రోత్సాహంతో నేను రాసిన “బంజారా నానీలు” ఎటువంటి పరిస్థితులు వచ్చినా ఒదిగిపోయే బంజారాల జీవితాల సౌందర్యాన్ని, వారి బ్రతుల్లోని వ్యథలను లోకంముందు ఉంచింది. ఈ నానీల్లో తండా సమాజం సజీవంగా సాక్షాత్కరిస్తుంది. “తాంగ్డి” సాహిత్య వ్యాస సంపుటిలో బంజారా సంస్కృతిని,సంప్రదాయాల వైభవాన్ని, గిరిజన జీవితాన్ని హృద్యంగా మలిచి అందించాను. “గమనం” వ్యాస సంపుటి. ద్వారా సాహిత్యంలోని విభిన్న కోణాలను, రచయితల కవితా హృదయాన్ని నాదైన శైలిలో ఆవిష్కరించగలిగాను. అనువాదం అనేది ఇతర భాషల సాహిత్య సుగంధాన్ని పంచుతుంది. నేను ‘చతురాయికి బహుమాన్’ అనే హిందీ కథను తెలుగులోకి “చతురతకు బహుమానం” అన్న పేరుతో అనువాదం చేశాను. ‘జంగల్ మే ఏ రాత్’ అనే మరో హిందీ కథను కూడా తెలుగు ‘అడవిలో ఒక రోజు’ అనే పేరుతొ అనువాదం చేశాను. 2019 లో ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగుశాఖ వంద సంవత్సరాలలోకి అడిగిడింది. ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకుని నా ఆధ్వర్యంలో శతాబ్ది సంబరాలు సంవత్సరం పొడుగునా నిర్వహించుకోవడం మరిచిపోలేని అనుభూతి. నా సంపాదకత్వంలో “సినారె సాహితీ వైభవం”, “తెలంగాణ సాహిత్యం సమాలోచన” వంటి సాహిత్య వ్యాస సంకలనాలను తీసుకొచ్చాను. “శత వాసంతిక” నూరేళ్ల ఉస్మానియా విశ్వవిద్యాలయానికి విజ్ఞాన సర్వస్వం లాంటి గ్రంథం. దీనికి కూడా సంపాదకత్వం వహించాను. వ్యాసకర్తగా 70కి పైగా జాతీయ, అంతర్జాతీయ సదస్సుల్లో సమర్పించిన పరిశోధన పత్రాలు ప్రచురితం అయ్యాయి. “అమెరికన్ ఫోక్లోర్ సొసైటీ” వారు అమెరికాలో నిర్వహించిన సదస్సుకు హాజరై “భారతీయ సంస్కృతిలో బంజారాల వస్త్ర, ఆభరణాల ప్రాముఖ్యత” అనే అంశంపై పత్ర సమర్పణ చేసే అవకాశం నాకు కలగడం నా అదృష్టం. మా వారు, నేను కలిసి “GOR BANJARA – AN ENDURING TRIBE” అనే పేరుతో బంజారాల చరిత్రను అక్షరబద్దం చేసి ఒక గ్రంథాన్ని వెలువరించాం. ఈ గ్రంథం జాతి చరిత్రకు నిలువుటద్దంగా ఎందరో మేధావుల ప్రశంసలు అందుకుంటుంటే ఆనందంగా ఉంది. ఇక ఈమధ్యనే ‘ఝోళి’ పేరుతో కథా సంపుటిని వెలుకరించాను. ఈ సంపుటిలో బంజారాల జీవితాలను, ఆధునిక సమాజానికి దూరంగా వారు అనుభవిస్తున్న వెతలను, తరతరాలుగా వారిని పీడిస్తున్న సమస్యల్ని, ప్రపంచీకరణ నేపథ్యంలో వారి సంస్కృతి ఎదుర్కొంటున్న సవాళ్ళను కథలుగా మలిచాను. నిజంగా ఇవి కథలు కావు. మా జీవితాలకు ప్రతిబింబాలు. నేను సంపాదకురాలిగా వర్ధమాన కవి రచయిత రమేష్ కార్తిక్ తో కలిసి “కేసులా” అనే కథల సంపుటిని త్వరలో తీసుకొస్తున్నాము. ఇవన్నీ వేటికవే ప్రత్యేకం. 2012 లోనే రూపొందించిన ‘తెలంగాణ బంజారా గేయ సాహిత్యం – సామాజిక మానవ శాస్త్ర అధ్యయనం’ అనే UGC మేజర్ రీసర్చ్ ప్రాజెక్ట్ర్ రిపోర్టును త్వరలోనే ముద్రించడానికి ప్రయత్నిస్తున్నాను. 2021లో రూపొందించిన ‘సమగ్ర బహుభాషా బంజారా (గోర్బోలి) నిఘంటువు’ ను కూడా త్వరలోనే ముద్రించడానికి ప్రయత్నిస్తున్నాను.
సాహితీ రంగంలో 25 ఏళ్ళ ప్రస్తానం నాది. తెలుగు సాహిత్యంలో నాదైన ఒక ముద్రను వేయడానికి ప్రయత్నిస్తున్నాను. ప్రతీ రచన, ప్రతీ గ్రంథం,ప్రతీ సంపాదకత్వం నాలోని రచనా తృష్ణను, సాహితీ దాహార్తిని తీర్చుకున్నవే. ఏపనినైనా మనసు పెట్టి చేస్తే అది విజయవంతం అవుతుందని నేను నమ్ముతాను. అదే నా ఆచరణలో చూపిస్తాను. ఈ ప్రయత్నంలో నేను తలపెట్టిన పనులు నాకు సంతృప్తినివ్వడమే కాకా మున్ముందు మరిన్ని రచనలు చేయడానికి నాకు ప్రేరణను, ఉత్సాహాన్ని అందించాయి. సామాజిక సేవలో భాగంగా ‘యాడి’ (అమ్మ) చారిటబుల్ ట్రస్ట్ ను స్థాపించి నిరుపేద గ్రామీణ, తండా బిడ్డల చదువుకు నా సహకారం అందిస్తున్నాను. ఉజ్వల్ క్రియేషన్స్, శీతల్ పబ్లికేషన్స్ సంస్థలను స్థాపించి యువ రచయితలను ప్రోత్సహిస్తున్నాను. అనేక సంస్థలు నాకు జాతీయ, రాష్ట్ర అవార్డులను అందజేశాయి.
రచయితగా నేను సాహితీలోకానికి చేసిన కృషి చిన్నదే అని నా అభిప్రాయం. ఐతే, ఇప్పటివరకు చ్చేసిన రచనలు నాకు తృప్తినిచ్చాయి. కానీ, చేయవలసింది చాలా వుంది.
అడగ్గా నే వివరాలు పంపిన సూర్య గారి కి తరుణి తరుఫున ధన్యవాదాలు