ఈ రోజుఅది వచ్చే చెలియ వయ్యారంతో! కథ చెప్పుకుందాము.
పున్నమి చంద్రుని వెన్నెలకిరణాలు అడవంతా పరుచుకొని, వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది. తన వడిలో పడుకొని, చేతి గాజులు సవరిస్తూ, వాటి, గలగలు వింటూ ఆనందిస్తున్న గోవిందుని తలపై మృదువుగా నిమురుతూ “స్వామీ బయట చాలా ఆహ్లాదంగా ఉంది. కాసేపు వనవిహారానికి వెళుదామా?” అడిగింది మంగమ్మ. ముద్దుల దేవేరి కోరికను కాదంటానా పద అని లేచాడు గోవిందుడు. ఇద్దరూ చిన్నగా కబుర్లు చెప్పుకుంటూ నడుస్తున్నారు.బద్దకంగా కునుకు తీసుతున్న కాలనాగు అడుగుల చప్పుడుకు రౌద్రంగా పడగెత్తి వారిని చూసి, పడగ దించుకొని వినమ్రంగా పక్కకు తప్పుకుంది. వారి అడుగుల సవ్వడి వినిపించి, ఏదో వేట దొరుకబోతోందని సంతోషంతో పరుగున వచ్చిన పులి ఒక్క క్షణం తడబడి వారికి సాగిల బడింది. అదేమీ గమనించకుండా ఒకరితోఒకరు సయ్యాటలాడుతూ ముందుకు సాగుతున్నారు గోవిందుడు, మంగమ్మ. అంతలో గునగునలాడుతూ వచ్చిన కుందేలు జంటను మురిపెంగా చూసి, చుట్టూ చూస్తూ “స్వామీ ఎక్కడ నుంచో ఎంత మంచి సువాసనలు వస్తున్నాయి” అంది మంగ గోవిందునితో.
“ఇదో ఈ అడవి, వీటిలోని ఈ జంతువులకు భయపడి పూజారులెవ్వరూ కొండ మీద ఉండేందుకు సాహసించటము లేదు. సూర్యోదయము తరువాతనే వచ్చి మన మందిరం తలుపులు తెరుస్తున్నారుకదా! అందుకని రామానుజులవారికోరిక మేరకు ఆయనశిష్యుడైన అనంతాళ్వార్ తన భార్యతో సహా తిరుమల కొండపైన నివసించడానికి ఒప్పుకున్నారు. మన ఆలయానికి వెనుక వైపు నివసించే అనంతాళ్వార్ మనకు నిత్యం పూజలు చేయడానికి పూలు కావాలని, ఆలయం వెనుక వైపు పూల తోట వేసి ఆ తోటలోని పూలను మాలలుగా అల్లి ప్రతి రోజు మనకు సమర్పిస్తున్నారు. ఆ పూల సువాసనలే ఈ పరిమళాలు” అన్నాడు గోవిందుడు.
“ఓసారి ఆ తోటలోకి వెళుదామా?” గోముగా అడిగింది మంగ. సరే నని ఆతోట లోకి వెళ్ళి వెన్నెల వెలుగులో మెరిసిపోతున్న వివిధ రంగుల పూలను చూసి మురిసిపోయారు. వాటి సువాసనలకు పరవశించి, ఆ పూలను తెంపి మంగ తల మీద చల్లాడు గోవిందు. పూలపానుపులా పరిచాడు. దాని మీద సరాగాలాడి, తెల్లవారే సమయానికి వారి మందిరానికి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయం స్వామివారి సేవకి పూల కోసం వచ్చిన అనంతాళ్వార్ తోటలో కోసిన పూలను చూసి ఇక్కడ ఎవరో విహరించారు, స్వామివారికి సమర్పించే పూల తోటలో ఇదేమిటి అని బాధపడి, ఆ దొంగలని పట్టుకోవాలని రాత్రి సమయంలో తోటకి కాపలా ఉన్నాడు. కానీ ఆ పూల అందాలకు, సువాసనలకు ముగ్దులయిన గోవిందూ, మంగ అనంతాళ్వార్ కన్నుగప్పి, రోజూ రాత్రిపూట వచ్చి విహరిస్తూ ఉండేవారు. ఇలా ఎనిమిది రోజులు జరిగాయి. అనంతాళ్వార్ దిగులు పడి స్వామివారి ఆలయానికి వెళ్లి, స్వామీ ఎవరో నా కన్ను గప్పి ఇలా చేస్తున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది అని బాధపడుతూ స్వామివారి ప్రార్ధించగా, అప్పుడు స్వామివారు తన భక్తుడి పుష్ప కైంకర్యాన్ని, భక్తిని లోకానికి తెలియచేయాలని నిశ్చయించుకున్నాడు. తొమ్మిదవ రోజు, ఈ రోజు ఎలాగయినా పూల దొంగలను పట్టుకోవాలని అనంతాళ్వార్ దృఢ నిశ్చయముతో తోటలో తిరుగుతుండగా ఒక పొద చాటు నుంచి గుసగుసలు వినిపించాయి. అటుగా వెళ్లి చూస్తే అక్కడ ఒక జంట కనిపించింది. అప్పుడు అనంతాళ్వార్ “నా తోటలో పూలని నాశనం చేస్తున్నారు, ఎవరు మీరు?” అంటూ వెళ్లి వారిద్దరిని పట్టుకున్నాడు. “గోవిందా… గోవింద. మంగా పరుగెత్తు” అని అరుస్తూ గోవిందుడు తప్పించుకొని వెళ్లగా మంగ తప్పించుకోలేక నిస్సహాయంగా అతడికి బందీగా చిక్కింది. అప్పుడు అనంతాళ్వార్ మంగను ఆ తోటలో ఒక చెట్టుకి కట్టివేసి పారిపోయిన అతడి కోసం వెతికాడు. గోవిందుడు ఆలయానికి అప్రదక్షిణంగా పరిగెత్తుతూ అనంతాళ్వార్ కి దొరకకుండా మాయమవుతాడు. ఎంత వెతికినా అతడు కనిపించకపోవడంతో తోటలోకి తిరిగి వచ్చి తెల్లవారు జామున వెతుకుదాం అని నిద్రపోతాడు అనంతాళ్వార్.
ఇక మరుసటి రోజు ఉదయం అర్చకులు బంగారు వాకిలిని తెరిచి స్వామివారిని మేల్కొల్పారు. అయితే స్వామివారి వక్షస్థలం మీద అలివేలు మంగ బంగారు ప్రతిమ కనిపించకపోవడంతో ఆందోళన చెందారు. అప్పుడు స్వామివారు అర్చకులారా అమ్మవారు అనంతాళ్వార్ తోటలో బందీగా ఉంది మీరు వెళ్లి విడిపించి తీసుకొనిరండి అని చెప్పారు.అర్చకులు తోటకు వెళ్లి, ఎంతటి అదృష్టవంతుడవయ్యా సాక్షాత్తు అమ్మవారిని బంధించిన పరమ భక్తుడివి అన్నారు. జరిగింది తెలుసుకొని అయ్యో ఎంత అపరాధం చేశాను అని అమ్మవారికి సాష్ఠాంగనమస్కారం చేసి, అమ్మవారిని ఒక పూల గంపలో కూర్చోపెట్టి, ఆలయానికి పదిలంగా తీసుకొని వచ్చాడు. “నీ కూతురుని పూలగంపలో జాగ్రత్తగా తీసుకొచ్చి, నాకు అప్పగిస్తున్నావా మామా” అని స్వామివారు ఆప్యాయంగాఅనంతార్వాళ్ తో అన్నారు. అప్పటి వరకూ పూలగంపలో ఒద్దికగా కూర్చున్న అలివేలుమంగ అమ్మవారు చెంగున లేచి, బంగారు ప్రతిమగా మారి, స్వామివారి వక్షస్థలానికి చేరుకొని, “ఇలా నన్ను వదిలి వెళ్ళిపోవటం మీకు బాగా అలవాటయ్యింది” అని రుసరుసలాడింది. స్వామివారు అమ్మవారి అలుక తీర్చే పనిలో పడిపోయారు!
ఇదండీ అలివేలుమంగమ్మ వయ్యారంగా స్వామివారితో వనవిహారానికి వెళ్ళి, బంధీగా పట్టుబడిన కథ.ఈ కథ నా సొంతము కాదు.మా తాతగారు నాకు చిన్నప్పుడు చెప్పిన ఈ కథను ఇలా చిన్నకథగా రాసాను. ఇంకా చిన్నచిన్న పురాణ కథలు కూడా చెప్పేవారు. వెంకటేశ్వర సుప్రభాతం కూడా మాతాతగారే నేర్పించారు.