బండల మీద రాతలు

కథలు

కందేపి రాణిప్రసాద్

అంగలకుదిటి గోవిందమ్మ !
మా పెళ్ళయిన చాలా కాలం దాకా పిల్లలు కలగలేదు. మా అత్తగారు ఎంతో ఆత్రంగా పిల్లల కోసం ఎదురుచూసేది. ఆమెకు మా వారు ఒక్కడే కొడుకు కావడంతో మనవ సంతానం కోసం ఆరాట పడేది. మా మామగారు మా పెళ్ళికి ముందే చనిపోయారు. ఇరవై ఏళ్ళ తర్వాత మా మాగ్గురి ఆశలకు రూపం పోసుకుని అమ్మాయి పుట్టింది. మా ఇల్లు ఆనందోత్సాహాలతో నిండిపోయింది
మా అమ్మాయికి సంవత్సరం నిండేసరికి మాటలు పూర్తిగా వచ్చేశాయి. పేర్లు, నెలల పేర్లు, వారాల పేర్లు, నెలల ఇంగ్లీషు నెలల పేర్లు, తిధుల పేర్లు అంటూ ఏది నేర్పించినా నేర్చేసుకునేది. అన్నీ బాగా నేర్చుకుంటోందని పుస్తకం కొనుక్కొచ్చి బొమ్మలు చూపించటం మొదలుపెట్టాం. బొమ్మలు చూపించి పేర్లు చెపితే చక్కగా చెప్పేసేది. ఇలా ఏమి నేర్పించినా చకచకా చెప్పేసేయటంతో అందరూ మెచ్చుకునేవారు. ఇంటి చుట్టు పక్కల వాళ్ళందరూ మెచ్చుకుంటుంటే మాకు మనసులో చాలా సంతోషమనిపించేది.
మూడేళ్ళు వచ్చేసరికి ఎబిసిడిలు, ఏ బి సి డి లు, అ ఆ లు కూడా నేర్పించడం మొదలుపెట్టాము. నక్షత్రాల పేర్లు, ప్రభవ, విభవ అంటూ సంవత్సరాల పేర్లు చెపితే పొల్లు పోకుండా చెప్పేది. చందమామ రావే, చిట్టి చిలకమ్మా, చేత వెన్న ముద్ద వంటి పద్యాలను రోజూ చెప్పించేదాన్ని ఆరు బయట మంచాలు వేసుకుని పక్కలో మా అమ్మాయుని పడుకోబెట్టుకుని పద్యాలు పాటలు చెప్తుంటే పలికేది. మెల్లగా పద్యాలు అన్నీ అప్ప జెప్పటం మొదలు పెట్టింది.
అప్పట్లో ఐదో ఏడు వచ్చాకే బడికి పంపించేవారు మా వారు అమ్మాయికి ఘనంగా అక్షరాభ్యాసం చేయించి బడికి పంపాలనుకున్నారు. కాబట్టి ఐదో ఏడు వచ్చేదాకా, అక్షరాభ్యాసం చేసేదాకా చేత్తో ఏమీ రాయ కూడదు. అందువలన పలక బలపం తాకకుండా అంటే చేత్తో రాయించకుండా పాఠాలు చెప్పాలన్నమాట కేవలం నోటితోనే అన్నీ చదివించాలనుకున్నాం
ఆ సమయంలో మా కుటుంబానికి సన్నిహితులైన ఒక కవిగారు తన పుస్తకాన్ని ముద్రించుకోవడానికి సహాయాన్ని అర్థించారు. ఆ పుస్తరానికి మేమే ఆర్థిక సహాయం చేసి వారి రచనను వెలుగులోకి తీసుకువచ్చాము. ఆ కవిగారు మా కుటుంబ ఫోటోలను పుస్తకంలో ప్రచురించి చక్కని పద్యాలతో మా కుటుంబ చరిత్రను రాశారు. అలా మూడేళ్ళకే మా అమ్మాయి పోటో పద్య కావ్యంలో ప్రచురితమైంది. ఈ కావ్యానికి ముందు మాట ఎవరు రాశారనుకుంటున్నారు. తొలి జ్ఞానపీట అవార్డు గ్రహీత విద్యనాథ సత్యనారాయణ గారు.
ఐదో ఏడు వచ్చేసరికి వేమన శతకాలు, సుమతీ శతకాలు కరుణ శ్రీ పద్యాలు వంటి వన్నీ నేర్పించాం. వీటితో పాటు ఇంగ్లీషు పుస్తకాలను కూడా తెప్పించి చెప్పేదాన్ని. వాళ్ళ నాన్నేమో రైసుమిల్లు పనులతో బిజీగా ఉండేశారు. ఎ ఫర్ యాపిల్, బి ఫర్ బ్యాట్ అంటూ రోజూ వంట చేసుకునేటపుడు పిల్లను పక్కనే కూర్చో బెట్టుకుని చెప్తుండేదాన్ని. అలాగే ట్వింకిల్ ట్వింకిల్, లిటిల్ స్టార్, పుస్సీ కాట్ పుస్సీ కాట్ అనే ఇంగ్లీషు పద్యాల పుస్తకం కూడా పూర్తి చేసేసింది.
ఇంటికి ఎవరు చుట్టాలొచ్చినా, తెలిసిన వాళ్ళాచ్చినా మేము అమ్మాయి చేత పద్యాలు చెప్పించటం వచ్చిన వాళ్ళు ఆశ్చర్యపోయి పొగడటం నిత్యకృత్యమైపోయింది. అందరు మా అమ్మాయిని పొగుడుతుంటే మాకు సంతోషంగా ఉన్న లోపల్లోపల దిష్టి తగులుతుందేమోనని భయంగా ఉండేది. అసలే ఎన్నో సంవత్సరాలు పూజలు పునస్కారాలు చెసి పెద్దపరేషన్ చేయించుకుని మరీ కన్నాము. ఆ రోజుల్లో పెద్దాపరేషన్ అంటే చాలా ప్రమాదం అని భయపడేవారు. మా అమ్ముయి పుట్టినపుడు చేసిన ఆపరేషనే కుట్లు మానడానికి సంవత్సర కాలా పట్టింది.
మా అమ్మాయి అక్షరాభ్యాసం చెయ్యడానికి బోలెడు సన్నాహాలు చేస్తున్నా ప్రముఖ కవులను, పండితులనూ ఆహ్వాదించాలని సిద్ధం చేసుకున్నాం. ఆనాడు పేరు గాంచిన కవి పండితులందరినీ మా ఇంటి పండుగకు పిలిచాము. ఆ సమయంలో ప్రముఖ కవి పండితులు శ్రీ విశ్వనాధ సత్యనారాయణ గారిని కూడా పిలిస్తే బాగుంటుందని కవి మిత్రులు అభిప్రాయపడ్డారు. కళా ప్రపూర్ణ కొండూరు రాఘవాచారి, గణిత అవధానులు పులివర్తి, శరచార్యులు, సంస్కృత పండితులు మునుగంటి కృపాచార్యులు, అష్టావధానులు బంగవోలు ఆదిశేష శర్మ వంటి పడితులు ఎందరో హాజరె అమ్మాయిని ఆశీర్వహించారు. ఓనమః శివాయః, సిద్ధం నమః అంటూ వేలితో బియ్యంలో దిద్దించి అక్షరాభ్యాసం చేయించారు. అంత మంది పండితుల సమక్షంలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని అంగరంగ వైబోగంగా జరపటం ఎంతో గొప్పగా ఉన్నది.
అక్షరాభ్యాసం తరువాత మా అమ్మాయిని స్కూలుకు పంపలేదు. బిఏ బియిడి చదివి ఖాళీగా ఉద్యోగం లేకుండా ఉన్న మాస్తారును ఇంటికి పిలిపించి చదువు చెప్పించాం. అ ఆ లు ఎ బి సి డిలు రాయించటం నేర్పించేవాడు మాస్టరు. రోజు మాస్టర్ దగ్గర కూర్చుని శ్రద్ధగా నేర్చుకున్నది. చెప్పినవి చదివేవి. రాయమన్నవి రాసేది.
ఇక్కడే ఒక విచిత్రమైన విషయం చెప్పాలి. అప్పట్లో పలక మీద రాసుకునేవాళ్ళు. అది కూడా మట్టి ఉండేవి పలక మీద అ ఆ లు రాసిచ్చి దిద్దించే వాడు మాస్టార్. అ ఆ లు మొత్తం నేర్చేసుకున్నది. పలక మీద దిద్దించే విధంగానే అ ఆ లు పెద్దగా రాసేది. ఒక రాజు మాస్టర్ వర్ణమాల మొత్తం రాసి పెట్టమని హోం వర్కుకు ఇచ్చాడు. మా అమ్మాయి పలక మీద ఒక వైపు అ ఆ రెండవ వైపు ఇ ఈ లు రాసేసింది. మిగతావి ఎక్కడ రాయాలో తనకు తెలియ లేదు. మొత్తం వర్ణమాల ఎలా రాయాలని నన్ను అడిగింది.
నాకో ఉపాయం వచ్చింది. మా ఇల్లంతా నల్లని నాపరాయి బండలే. ఒక బండ చూపించి దాని మీద రాయమని చెప్పాను. చక్కగా బంప మీద అ ఆలు మొత్తం రాసేసింది. పెద్ద పెద్ద అక్షరాలతో మచ్చటగా రాసింది చెప్పనే లేదు కదా మా అమ్మాయి రాత ముత్యాల వరసలా ఉంటుంది. పెద్ద నాపరాయి నిండా అ ఆలు మొత్తం 56 అక్షరాలు రాసి పెట్టి మాస్టారుకు చూపించింది . మాస్టారు బాగుందని మెచ్చుకున్నాడు. రోజూ ఇచ్చే హోంవర్కును బండల మీదనే రాయమని చెప్పేవాడు. నేను వంట కోసం కూరగాయలు తరుక్కుంటుంటే తను చక్కగా అక్షరాలు రాసుకుంటుండేది.
గుణింతాలు నేర్చుకునేటపుడు ఒక్కొక్క బండ మీద ఒక్కొక్క గుణింతం రాసి పెట్టేది . తెల్లవారి మాస్టర్ వచ్చి చూసే దాకా ఎవర్ని తోక్కనిచ్చేది కాదు. నేనేమో నడవటానికి ఒక వరస బండలను వదిలి రాసుకోముని చెప్పేదాన్ని. రాత్రికి ఇంటికి వచ్చిన వాళ్ళ నాన్నకు తను రాసిన హోంవర్కును తొక్కకుండా నడవాలని జాగ్రత్తలు చెప్పేది. తెల్లవారాక మాస్టార్రు వచ్చి గుణింతాలు బాగా రాశావని చెప్పేదాకా జాగ్రతగా చూసుకునేది మాస్టారు చూశాక నేను తడిబట్టతో ఈ బండలన్నీ తుడిచేసి శుభ్రంగా పెట్టేదాన్ని. మరల మాస్టారు వెళ్ళిపోయాక హోంవర్కులు చెయ్యాలి కదా!
అందరు పలకల మీదా, బ్లాక్ బోర్టుల మీదా అక్షరాలు రాయటం నేర్చుకుంటే మా అమ్మాయి మాత్రం బండల మీద అక్షరాలు రాయటం నేర్చుకుంది. ఇదీ ఆ కాలం నాటి చదువులు. నాపరాయి బండల మీద బలపాలతో రాసి చదువుకోవడం ఈనాటి మీ తరానికి విచిత్రంగా అనిపిస్తుంది అందుకే ఈ హోం థియేటర్ లో నేను మా అమ్మాయి చదువు గురించి మీకు చెప్పాలనుకున్నారు. ఆ కాలం నాటి చదువులు గురించి మీకు తెలియ జేస్తున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

సంకల్పం

అదే వచ్చే చెలియ వయ్యారంతో!