మనకు మనం పరాయిడమౌతున్నామా? మనుషులం కదా కించిత్ దుఃఖము,కించి త్ ఆవేదన ఉండక్కర్లేదా? మనసుల్లోకి లో లోపలికి ఒక్కసారి ఆలోచించి చూద్దామా!! ఓ నేనే చేస్తాను అంటూ తెగ చెప్పేస్తూ పబ్బం గడుపుకునే వాళ్ళు కొంతమంది ఉంటే, కొంతమంది నిజంగానే నిస్వార్ధంగాను ఎంతో కొంత సమాజానికి సేవ చేస్తూ ఉంటారు. ఎవరికి సేవ చేసినా చేయకున్నా కనీసం మనస్సు లోపల చెడు ఆలోచన, దుర్మార్గపు ఆలోచన రాకుండా ఉన్నా కూడా సమాజానికి మేలు చేసిన వాళ్లే అవుతారు. ఆడపిల్లలైతేమి మగ పిల్లలయితేమి కన్నది మనమే కదా మన వల్లనే కదా అనే చిన్న స్పృహ ఉంటే చాలు ఆడవాళ్ళ పట్ల చులకన భావము ఉండదు.ఆడపిల్లలంటే భయము విసుగు అసహ్యము కోపము వంటి సర్వ వికారాలు ఉండవు. జాతీయ బాలిక దినోత్సవం అంటూ జనవరి 24 ను చేసుకోవాల్సిన అవసరం జరుపుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో ఒక్కసారి అంతర్ముఖులమై ఆలోచన చేద్దాం. ఇలాంటి మన కంటి దీపాలు,మన ఇంటి వెలుగులు, కుటుంబ ఐశ్వర్యానికి చిహ్నాలు ఏమవుతున్నారో ఓ పరిశీలన చేద్దాం.ఆడపిల్లలు లేని వాళ్ళను అడగాలి వాళ్ళ బాధ ఏంటో చెబుతారు. ముందు వద్దు అని అనుకొని పిల్లల్ని కనని వాళ్ళు ఆడపిల్లలు పుడితే బాధపడిన వాళ్ళ కంటే ఆడపిల్లలు లేని వాళ్ళు ఎన్నో సందర్భాల్లో ఒక్క ఆడపిల్లుంటే ఎంత బాగుండు అని తప్పకుండా అనుకుంటారు. నిజమా కాదా ఆలోచించండి.
అది 2008 సంవత్సరం. మన దేశం జాతీయ బాలికల దినోత్సవం గా జనవరి 24న ప్రకటించి ప్రతి ఏడు కార్యక్రమాలను జరుపుతోంది. ఏం కార్యక్రమాలను జరుపుతోంది? బాలికలకు అవకాశాలను కల్పించడం. ఆపదలో ఉన్న వాళ్లకు అండగా ఉండడం .శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ నేషనల్ గర్ల్ చైల్డ్ డే ను నిర్వహించడం ఆ రోజు స్ఫూర్తిదాయకంగా అమ్మాయిలకు నాలుగు మంచి మాటలు చెప్పడం ధైర్యాన్ని అందివ్వడం , వాళ్ళ హక్కుల కు సంబంధించిన అవగాహన కల్పించడం వంటివి చేస్తోంది. అమ్మాయిల ఆరోగ్యము పోషణ వంటి విషయాలను లక్ష్యంగా చేసుకొని కళాశాల ద్వారా పాఠశాలల ద్వారా సంస్థల ద్వారా కార్యక్రమాలను నిర్వహింపజేయడం వంటి ఎన్నో మంచి పనులు చేస్తున్నారు.
సమాజంలో ఉన్న అసమానతలను గుర్తించి కుల,వర్గ,చైతన్యాన్ని కలిగించి, సామరస్యం నేర్పించడానికి ప్రభుత్వాలే కాదు సంస్థలే కాదు మనము మన వంతు సేవ చేయాలి, కృషి చేయాలి. అమ్మాయిలపై లైంగిక వేధింపులు ఎలా జరుగుతున్నాయి?ఎందుకు జరుగుతున్నాయి? ఇవి ఇళ్లల్లో ఉండే ఆడవాళ్ళకి తెలియకుండా ఉండదు. అది పసిగట్టగలగాలి. తన భర్తకు, తన అన్నదమ్ములకు,తన కొడుకుకు తన తండ్రికి ఇళ్లల్లో ఉండే ఆడవాళ్ళు చెప్పినప్పుడు వాళ్లలో కొంతైనా మార్పు వస్తుంద. ఎందుకు ఆడపిల్లలను గర్భస్థంగానే చిదిమేస్తున్నారు? అని కాస్త ఆలోచిస్తే ఉపాయం తట్టకపోదు .శిశు హత్యలు ఎందుకు జరుగుతున్నాయి ?ఇంతగా లింగ అసమానతలు ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళని ఎందుకు ఇంతగా అవమాన పరుస్తూ ఉంటారు? వాళ్ళ హక్కుల్ని ఎందుకు కాజేస్తూ ఉంటారు ?వాళ్ల వరకు వచ్చేసరికి వాళ్ళ పోషణ సరిగ్గా ఎందుకు చూడరు ?ఇటువంటివి ఈ లింగ వివక్ష అనే విషయం పైన ఒక ఉద్యమం లాగా ఇళ్లల్లో ఉండే ఆడవాళ్ళే ముందుకు రావాలి అని ‘తరుణి’ అభిప్రాయపడుతుంది ఎలా అంటారా?
మొట్ట మొదలు ఇంట్లో కూతురికి గాని కోడలికి గాని ప్రెగ్నెన్సీ రాగానే టెస్ట్ చేయించుకో !అమ్మాయా ?అబ్బాయా ?అని అడగకండి. అసలు టెస్ట్ ఎందుకు చేయించుకోవాలి? ఎవరు పుట్టినా సరే కదా?
ఒకవేళ అమ్మాయి అని తెలిస్తే దొంగ చాటుగా గర్భం తీయించే ప్రయత్నాలు చేయకండి. ఎవరైనా చేస్తున్నట్టు అనుమానం వస్తే వాళ్ళకి జ్ఞానోదయం కలిగేలా చెప్పడము లేదా పోలీసులకు పట్టించడం చేయండి.
ఇక పుట్టిన తర్వాత నువ్వు ఆడపిల్లవు కదా ఈ మాత్రం పని నేర్చుకోకుంటే ఎలా అని అనకండి.
దీనికన్నా ముఖ్యమైన విషయం ఏమిటంటే అబ్బాయిలకి ఆడపిల్లలు అన్నింట్లో తక్కువ అని నూరిపోయకండి. నూరిపోయకుండా ఇన్ డైరెక్ట్ గా పరోక్షంగా వాళ్ళ మెదడులలో ఇలాంటి భావన చేరేలాగా మాట్లాడకండి.
స్నేహితులతో మాట్లాడేటప్పుడు, బంధువులతో మాట్లాడేటప్పుడు పక్కన పిల్లలు ఉన్నారా మగ పిల్లలు తిరుగుతున్నారా గమనించండి నోరు అదుపులో పెట్టుకోండి.
అమ్మాయిలు కాస్త ఎదుగుతున్నట్టు అనిపించగానే వాళ్ళని కూర్చోపెట్టుకొని ఎవరి ముందు కాకుండా ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళ ను ఇబ్బంది పెట్టకుండా,భయపెట్టకుండా – జాగ్రత్తగా- శారీరక మార్పులు ఎలా వస్తాయి, ఇళ్లల్లో ఉండే వాళ్ళు బయట ఉండే పురుషులు ఏ విధంగా మిస్ బిహేవ్,తప్పుడు ప్రవర్తన చేస్తారు, ఎక్కడ ముట్టుకుంటారు, ఎలా పట్టుకుంటారు , ఎక్కడ ముట్టుకుంటారు, ఏ విధంగా మాట్లాడుతారు ఈ విషయాలను ఆడపిల్లలకు అర్థమయ్యేలా చెప్పి, అలా ఎవరైనా చేస్తే వెంటనే నాకు చెప్పమ్మా. అక్కడ ఎవరైనా పెద్ద వాళ్ళు ఉంటే చెప్పమ్మా జాగ్రత్తగా ఉండు అని అర్థం చేయించి ఈ మృగ సమర రంగంలోకి పంపాలి.అలా ఎవరినైనా కనిపెడితే వాళ్ళ వైపు వెళ్ళకు, వాళ్ళని దూరంగా పెట్టు అని ఇటువంటివి జాగ్రత్తలు చెప్పాల్సిన బాధ్యత నానమ్మలది అమ్మమ్మలది అమ్మలది అత్తమ్మలది పిన్నమ్మ అని నేను గట్టిగా తరుణి పత్రిక పక్షం నుండి చెప్పదలుచుకున్నాను. ముందు ఈ మార్పు తీసుకువస్తే ఆ తర్వాత తప్పకుండా సమాజం ఆలోచన మారుతుంది .ఎట్లాగైతే ఆడపిల్లలు చదువుకోవచ్చు అనేది ఒక ఉద్యమం లాగా తీసుకువచ్చి ఆనాడు పెద్దలు చేశారో ఆ విధంగా చేయాలి.ఇప్పుడు చదువుకుంటున్నారు బాగానే ఉంది .కానీ ,ఇటువంటి తెలియని ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు .వీటి నుంచి బయటపడేలాగా స్త్రీలుగా మహిళలుగా మనం ముందు వరసలో ఉంటే తప్పకుండా భవిష్యత్తులో మార్పు అనేది వస్తుంది అప్పుడే ఈ దినోత్సవాలకు అర్థం పరమార్ధం కలుగుతుంది సేవ్ ద గర్ల్ చైల్డ్ ,బేటి బచావో ,బేటి పడావో ఇవన్నీ ఎందుకు వచ్చాయో ఒకసారి ఆలోచించుకొని బాధపడి ,కుమిలిపోయి, అంతర్ముఖులమై మన వంతు మంచి పనులు చేద్దాం.