జరిగినకథ
ప్రేమ/ నమ్మకమా / స్వార్ధమా ? అన్న మీమాంసలో గతం లోకి వెళుతుంది మైత్రేయి. తను గవర్నమెంట్ కళాశాలలో అధ్యాపకురాలిగా ఉద్యోగం సంపాదించింది. ఆమె ప్రమేయం లేకుండానే తండ్రి పరంధామయ్యగారు వివాహంనిశ్చయించారు. సుబ్బారావు తోటి మైత్రేయి కి పెద్దల సమక్షం లో వివాహమైంది.
ఇక చదవండి…
మొదటి రాత్రే సుబ్బారావు లో ఆత్మన్యూనత భావం తలెత్తింది, దానిని దాచడానికి పురుష అహంకారం కూడా పడగ విప్పింది. ఆమె తన కంటే ఎక్కువ చదివిందన్న భావనే సుబ్బారావు ని నిలవనియ్యలేదు. అప్పటినుండి అణిచివేత మిషన్ మొదలయింది.
హాస్యం అంటూ “మైత్రేయి! నీకు ఎన్ని పెళ్లి చూపులు జరిగాయి? చూసిన వాళ్ళందరూ నిన్ను బాగా చీకట్లో చూసుంటారు,కనిపించుండవు. నేనే నిన్ను చూసిన మైకంలో ఒప్పేసుకున్నాను”. మైత్రేయికి ఆ హాస్యం అర్ధం కాలేదు. పెళ్ళికి ముందే తాను నలుపని తెలుసు కదా? మరేందుకు చేసుకున్నాడు తనని పెళ్లి? శేష ప్రశ్న? అయినా చురుకుగా చూస్తూ “మరే ! మీకు నా మొఖంలో డబ్బులు కనిపించాయి మరి”, అంటూ చురక వేసింది.
“ఆ! ఏముందిలే చీకట్లో చేసే కాపురానికి నలుపైన తెలుపైన ఒక్కటే! లైట్ ఆపేస్తే సరి! మనకేవి కనిపించవు. మనం మన పని పూర్తి చేసుకోవచ్చు ”, అంటూ వెకిలిగా నవ్వుతూ లైట్ ఆర్పేశాడు.
మైత్రేయి కి చాల ఇబ్బందిగా అనిపించింది. అతని నోటినుంచి ఎదో మందు వాసన వస్తున్నది. ఏమి చెప్పలేని నిస్సహాయత. కళ్ళు మసకబారుతున్నట్లనిపించింది. అతను తన ప్రమేయం లేకుండానే వళ్లంతా తడమటం మొదలుపెట్టాడు. ఆవేశంగా మొత్తం శరీరాన్ని ఆక్రమించేసాడు. నిస్సత్తువగా జీవితమే మసకబారుతున్నట్ట్లనిపించి తన కంటి కొనుకులనుంచి కన్నీటి చుక్కలు జాలువారాయి.
అలా మొదలయిన సంసారంలో ఒక రోజు హఠాతుగా “నీకు బ్యాంకు బాలెన్స్ ఎంత ఉంది ?”అని అడిగాడు. మైత్రేయి అమాయకంగా చెప్పింది. ఆ మర్నాడే ఆమె అకౌంట్ ని జాయింట్ అకౌంట్ గ మార్చేశాడు. ప్రతి నెల తన జీతం నుండి కొంత వాళ్ళ అమ్మ నాన్నలకు పంపమనేవాడు.
ఎంతో ప్రేమగా “మైత్రేయి మనమే ఈ బాధ్యతలన్నీ తీసుకోవాలి. నువ్వు మా ఇంటి కోడలివి, నా ప్రియమైన భార్యవి! నువ్వు కాకపోతే నాకెవరు సపోర్ట్ చేస్తారు చెప్పు” అంటూ మాట్లాడేవాడు. అలా ఒక ఏడాది అదే వాళ్ళ హనీ మూన్ పీరియడ్ గడిచి పోయింది. తనువు బాగా ఉపయోగ పడింది సుబ్బా రావు కి. మనసుతో పనే లేదు ఎందుకంటే ఆమె జీతమే ఒక పెద్ద ఆకర్షణ. ఎప్పుడు తన జీతం మీదనే ప్లాన్లు వేసేవాడు. ఒక్కరోజు కూడా ఇది తీసుకో అని ఒక్క మల్లె చెండు కూడా తీసుకురాలేదు అతను.
కాలం చాల వేగంగా పరిగెడుతుంది. తనతో ఏమవుతున్నదో కొద్దీకొద్దీగ అర్ధమవుతుంది. కానీ ఎదురు చెప్పలేని నిస్సహాయత. ఇవన్నీ అర్ధమవుతున్న, సహజమైన సామజిక బలహీనత తాను భార్య మాత్రమే. అతను తన భర్త. ప్రతి స్త్రీ కుండే సామజిక దౌర్బల్యం. సాధ్యమయినంత వరకు సర్దుకుపోవాల్సిందే. అతనేమీ తన మాటకు గాని, అభిప్రాయాలకు గాని విలువ ఇస్తున్నట్లుగ అనిపించదు. చాలా డబ్బు మనిషి. పైగా తాగటం అలవాటు కూడా ఉన్నది. ఈ లక్షణాలని భరించలేక పోతూఉంటే, దాంతో పాటు తానింకా కన్సీవ్ అవలేదని అమ్మ అత్తా పోరుపెట్టటం మొదలు పెట్టారు. కానీ వీళ్లేప్పుడు అడగలేదు నీ వైవాహిక జీవితం లో నువ్వు సంతోషంగా ఉన్నావా అని. అన్ని యాంత్రికంగా జరిగిపోవాలి. ఎక్కడ మనసుతొటిగాని, వ్యక్తి తోటి గాని సంబంధం ఉండవలసిన అవసరం లేనట్లే కనిపిస్తారు అందరు తనకి.
“పిల్లల్నెప్పుడు కంటారే మేము మంచిగా తిరుగుతున్నప్పుడే అన్ని జరిగిపోతే మాకు బాగుంటుంది.” అంటూ కానీ ఏ ఒక్కరు ఆలోచించలేదు మైత్రేయి పడుతున్న బాధని. తనతో పాటు తన బంధువుల్లో అమ్మాయిల క్కూడా పెళ్లిళ్లు అయ్యాయి. కానీ వాళ్ళందరూ తాను అదృష్టవంతురాలని అనుకొంటారు.
ఈ మధ్య కలిసిన రమ్య, మా మేనత్త కూతురు, కి కూడా నా తరువాతే పెళ్లి చేసారు. అదీ మధ్యనే కలిసింది. ఇప్పుడు తనకు ఏడోనెల అని చెప్పింది. దానితో మాట్లాడుతుంటే అర్ధమయింది అమ్మాయిలు ఎలా ఆలోచించాలి అనేది ముందే నిర్ణయించబడుతుందని.
“పెళ్లి అయ్యాక పిల్లలని కనటమే మన మొదటి పని. మా అత్తగారైతే నాకు ముందుగానే చెప్పేసారు ఇదిగో అమ్మాయి! ఏడాదితిరిగే లోపే మాకు మనవడు కావాలి. సరేనా అని. నేను బుద్ధిగా తలూపాను” అంది రమ్య .
“ఆడపిల్లలం మనం ఇంతకంటే ఎం ఆలోచించాలి. పెళ్లి కాన్నంత వరకు పెళ్లి కావాలని. ఆ తరువాత పిల్లలు కావాలని. అది ఒక కొడుకు తప్పని సరిగా ఉండాలి. లేకపోతే ఎన్ని సార్లయినా కాన్పులు పడాల్సిందే.అవసరమైతే కడుపు తీయుంచుకోవటానికైనా రాజి పడాల్సిందే. అదే మొదట్లోనే ఒక పిల్లాడు, ఆ తరువాత ఒక ఆడపిల్ల పుడితే పరవాలేదు, లేక పిల్లాడయితే మరీ మంచిది. ఏమంటావు వదిన! నువ్వుకూడా ఆలోచించు. త్వరలో ఎవరో ఒకర్ని కనేసెయ్. ఎక్కువ కాలం పెండింగ్ పెట్టుకోవాకు. నీకు జీవితం సెటిల్ అయిపోతుంది!”అంటూ చాల పెద్ద లెక్చర్ కొట్టింది.
దాని ఆలోచన విన్న తరువాత నేను చదువుకోకుండా ఉండాల్సింది. చదువుకుంటే పోని ఇంతలా ఆలోచించే శక్తి ని, స్త్రీ గ తన కున్న స్వతంత్రం, స్వేచ్ఛ మరియు ఒక వ్యక్తిత్వం మాత్రం అస్సలు ఉండకూడదు. ఇప్పటికి ఇదే సామజిక న్యాయం స్త్రీ పట్ల అనిపించింది.
తనకి ఇబ్బందిగా ఉన్నదని కార్ లోన్, అపార్ట్మెంట్ తీసుకున్నానని ఇంటి లోన్ ఇలా ఎన్నో బ్యాంకు లోన్స్ మైత్రేయి జీతానికి తగిలించాడు. ఉండేది విజయవాడలోనే అయినా రోజు తిరగడం కష్టం గ ఉంది అని రోజు రావడం మానేసాడు. పదిరోజులకొకసారి వచ్చే సుబ్బారావు ఇప్పుడు పూర్తిగా రావడం తగ్గించేసాడు. అత్తా మామలు ఎప్పుడు డబ్బులు కావాలంటే వచ్చి తీసుకొని వెళ్లేవారు తప్ప తన గురించి ఎప్పుడు అడిగేవారు కాదు.
అమ్మతో చెబితే,”ఈ మగవాళ్ళంతే తల్లి! సర్దుకుపో!” అనేది.
“నాన్నగారు నా మాటేప్పుడు లెక్క చేసేవారు కాదు. కావాలంటే డబ్బులు పట్టుకుపొమ్మను అనేవారు”. అలా నాన్న గారు మాట్లాడినప్పుడల్లా మైత్రేయి కి తన అభిమానం దెబ్బ తినేది.
రాను రాను సుబ్బారావు వ్యవహారం లో చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. అతను రావటం పూర్తిగా తగ్గించేసాడు.ఎంతసేపు డబ్బు కావాలి అంతే. అతను హైదరాబాద్ కి ట్రాన్స్ఫర్ అయిపోయాడు. తనకు జోనల్ ట్రాన్స్ఫర్ అవదుకాబట్టి తనని ఇక్కడే ఉండిపొమ్మని, తానే వచ్చి పోతుంటానని చెప్పాడు. హైదరాబాద్ అంత దూరం కాదు అయినా మైత్రేయి కి వేళ్ళటానికి మనస్కరించటంలేదు. అతను పట్టించుకోవడంలేదు.
మూడేళ్ళ వివాహ జీవితం లో డబ్బు తప్ప మరేమి పట్టని అతనన్న, అతని కుటుంబమన్నా మైత్రేయి లో ఒక విధమయ ఏహ్యత ఏర్పడింది. పిల్లలు ఎందుకు పుట్టలేదే ? డాక్టర్ కి చూపించుకోరాదు ? అంటూ తెలిసిన వాళ్ళందరూ సలహాలు చెప్పటం మొదలుపెట్టారు.
ఈ మద్య్హ తెనాలిలో పని ఉన్నదని వచ్చినా మా పిన్ని ఒకామె “ఏంటే , మీ అయన నీతోటి సరిగా ఉంటాడా లేదా మీ అయన నీతో సరిగా ఉండటంలేదని ఎవరో అన్నారు నాతోటి”’ అని అమాయకంగా మాట్లాడింది.
అందుకే అన్నయ్యకు ఈయన సంగతి చెప్పాలని చూశాను. అన్నయ్యకు చెబితే “ఇవన్నీ షరా మామూలే పట్టించుకోకు”’ అంటూ కొట్టిపడేశాడు.అమ్మానాన్న కూడా ఇదంత పెద్దవిషయం కాదన్నట్టు పట్టించుకునేవారు కాదు. కానీ తనే వెళ్లి సుబ్బారావు విషయం తెలుసు కోవాలను కుంది. అందుకే, తానే స్వయంగ సుబ్బారావు కి చెప్పకుండా హైదరాబాద్ కి బయలు దేరింది .
(ఇంకా ఉన్నది )