దొరసాని

ధారావాహికం – 14 వ భాగం

ఆ సందడికి మెలకువ వచ్చింది నీలాంబరికి… ఉలిక్కిపడి నిద్రలేచిన నీలాంబరి…

” మహీ! ఏంటా గొడవ ఎవరు వచ్చారు?” అని అడిగింది నీలాంబరి..

” అమ్మా! ఊర్లో మసీద్ కాడ ఉన్న యాదగిరి పెళ్ళాంను మస్తు కొడుతున్నాడట ఊకే తాగుతాడట” అని చెప్పింది మహేశ్వరి..

” సరే వస్తున్నాను పద వాకిట్లో ఉన్న వరండా కుర్చీలలో కూర్చోమను మంచినీళ్లు ఏమైనా ఇచ్చావా వాళ్ళకి?” అని అడిగింది నీలాంబరి.

లక్ష్మీ మదన్

“అబ్బ అమ్మ మనసు ఎంత మంచిదో ఎవ్వరినైనా మంచిగా చూస్తది” అని మనసులో అనుకొని..

” ఇచ్చానమ్మ పొద్దుటి నుండి ఏమీ తినలేదట కూడా తినడానికి కూడా పెట్టాను” అన్నది మహేశ్వరి.

ఇద్దరూ కలిసి బయటకు వచ్చారు నీలాంబరిని చూడగానే..

యాదగిరి అతని భార్య భాగ్యమ్మ లేచి నిలబడ్డారు…

” దండాలు దొరసాని” అని ముక్తకంఠంతో అన్నారు…

” కూర్చోండి” అన్నది నీలాంబరి.

తనకోసం ఏర్పాటుచేసిన కుర్చీలో నీలాంబరి కూర్చున్నది వాళ్ళిద్దరూ మాత్రం కింద కూర్చున్నారు ముందు నుండి అలాగే అలవాటు కానీ అమెరికా నుండి వచ్చిన నీలాంబరి తనను తాను చాలా మార్చుకున్నది తన పద్ధతి కూడా మారింది..

” కింద నుండి లేచి ఇద్దరు కుర్చీల్లో కూర్చోండి” అన్నది నీలాంబరి.

” అమ్మో మీతో పాటు కుర్చీలలో కూర్చునుడా అట్ల వద్దు దొరసాని మేము గీడ కిందనే కూర్చుంటాం” అన్నడు యాదగిరి.

” అయితే మీతో పాటు నేను కిందనే కూర్చొని మాట్లాడతా” అన్నది నీలాంబరి.

” వద్దమ్మా మేమే మీద కూర్చుంటాం” అని ఇద్దరు భయంగా బిడియంగా కుర్చీలలో చివరి అంచుకు కూర్చున్నారు.

“భాగ్యమ్మ! ఇప్పుడు చెప్పు ఏం జరిగింది?” అన్నది నీలాంబరి.

యాదగిరి నోరు తెరిచి ఏదో చెప్పబోయే అంతలో…

” నిన్ను అడిగానా నిన్ను అడిగినప్పుడు నువ్వు మాట్లాడాలి ఇప్పుడు భాగ్యమ్మను అడిగాను కదా నువ్వు మాట్లాడకుండా కూర్చో” అన్నది నీలాంబరి.

నోరు మెదపకుండా అలాగే కూర్చున్నాడు యాదగిరి.

” చెప్పు” అని అన్నది భాగ్యవంక చూసి నీలాంబరి.

” ఏమీ లేదమ్మా ఊరికే తాగుతాడు తాగి వచ్చి కొడుతున్నాడు ఒళ్లంతా నొప్పులు నేను పొద్దంతా కైకలి వెళ్లి సంపాదించుకొని వస్తాను దాన్లో మూడంతులు డబ్బులు తాగుడుకే తీసుకెళ్తాడు నేను పిల్లలకి ఏం పెట్టాలి నేనేం తినాలి అసలు వాళ్లకు కడుపునిండా తిండిపెట్టి ఎన్నో రోజులు అయింది పనికి వెళ్లడం కూడా మానేసిండు” అని ఏడుస్తూ చెప్పింది భాగ్యమ్మ.

” ఇలా ఎన్నేళ్ల నుండి జరుగుతుంది” అని అడిగింది నీలాంబరి..

” శాన దినాలైంది… ఇన్ని దినాలు ఎవ్వరికీ చెప్పొద్దు అనుకున్న కానీ రోజు రోజుకు ఎక్కువైంది.. మీరు దివానంలకు వచ్చిండ్రని తెలిసి వచ్చినం” అన్నది భాగ్యమ్మ.

యాదగిరి వంక చూసి “ఎందుకు పనికి వెళ్లడం లేదు ఆడది సంపాదిస్తే కూర్చొని తింటావా? నువ్వు సంపాదించి సంసారాన్ని చూసుకోవాల్సింది పోయి ఇలా ఆమె రెక్కలు ముక్కలు చేసుకొని సంపాదిస్తే తిని తాగి ఇంకా కొడతావా?” అని కాస్త కోపంగా అన్నది నీలాంబరి…

ఆమె కోపం కళ్ళల్లో మాత్రమే కనిపిస్తుంది మాట తీరు అదే సౌమ్యంగా ఉంది కానీ పదునుగా ఉంది ఆ చిన్న మాటకే అవతలి వారు గజగజ వనికేంత గట్టిగా ఉంది…

యాదగిరి భయపడుతూ అలాగే కూర్చున్నాడు..

” సమాధానం చెప్పు” అని రెట్టించి అడిగింది నీలాంబరి..

” తప్పైపోయింది ఇంకా ఎప్పుడు కొట్ట ఏదైనా పని కూడా చేసుకుంటా” అని సమాధానం ఇచ్చాడు యాదగిరి…

” మహేశ్వరి !నీ భర్త నరసింహులు వచ్చాడా” అని అడిగింది.

” వచ్చిండమ్మా గొడ్లసావిడి శుభ్రం చేస్తున్నాడు నిన్న రాత్రి ఆవు ఈనింది కదమ్మా అందుకని లేగ దూడకు పడుకోవడానికి గడ్డిపరిచి ఏర్పాటు చేస్తున్నాడు” అన్నది మహేశ్వరి.

” ఒకసారి పిలువు” అన్నది నీలాంబరి.

లోపలికి వెళ్లి మహేశ్వరి నర్సింలు పిలుచుకుని వచ్చింది..

” అమ్మా!” పని చేతులు కట్టుకొని నిలబడ్డాడు నరసింహులు..

” రేపటినుండి ఇతన్ని పశువుల పని చేయడానికి నీకు సహాయంగా ఉంచుకో పాలు పితకడం శుభ్రం చేయడము అన్ని నేర్పించు” అని చెప్పింది నీలాంబరి

“యాదగిరి రేపటి నుండి పనులకు వస్తావా.?” అని సూటిగా అడిగింది నీలాంబరి.

” వస్తానమ్మా” అని తలవంచుకొని చెప్పాడు యాదగిరి.

” భాగ్యమ్మ పనిచేసుకు వచ్చి ఇంకా అతనికి డబ్బులు ఇవ్వడం నీ తప్పు. ఏ రోజైతే ఇలా చేశాడో అప్పుడే వచ్చి దివాణంలో చెప్పాల్సింది ఎందుకు ఇన్ని రోజులు అతని తప్పులను దాచి పెట్టావు అలా తప్పు లను ప్రోత్సహించడం కూడా తప్పే” అన్నది నీలాంబరి..

తలవంచుకొని కూర్చున్న భాగ్యమ్మ ఏమీ సమాధానం చెప్పలేదు..

” సరే మహేశ్వరి అన్నం పెట్టిస్తుంది తీసుకొని వెళ్లి పిల్లలకు పెట్టి మీరు తినండి రేపటి నుండి మాత్రము 5 గంటల వరకే పనిలో చేరాలి ఏ మాత్రం తేడా వచ్చిన ఊరుకోను నీకు నెల జీతం ఇస్తాను నీ పిల్లల ఫీజులు కూడా నేనే కడతాను వాళ్ళని చక్కగా చదివించు నీకు కూడా ఏదైనా పని ఉంటే చూస్తాను భాగ్యమ్మా!” అని చెప్పి లోపలికి వెళ్ళిపోయింది నీలాంబరి.

సంతోషంతో ఇంటికి వెళ్లిపోయారు యాదగిరి భాగ్యమ్మ…

మహేశ్వరి నీలాంబరి ఇచ్చిన తీర్పును చూసి..” ఎంతైనా దొరసాని కడుపు చూస్తది ఇట్లాంటి అమ్మ ఉండడము మాకు ఎంతో అదృష్టం” అని అనుకొని లోపలికి వెళ్ళిపోయింది..

అప్పటికి సమయం 12 గంటలు కావస్తుంది భోజనం ఏర్పాట్లు చేయడంలో మహేశ్వరి నిమగ్నమైపోయి ఉంది..

వంటింట్లోకి వెళ్లిన నీలాంబరి” మహేశ్వరి నువ్వు పక్కకు జరుగు నేను వంట చేస్తాను” అన్నది..

” అదేంటమ్మా నేను మంచిగా వండడం లేదా ఏమైనా తప్పు చేసిన్నా ఎందుకమ్మా మీరు వంట చేయడం” అని భయపడుతూ అడిగింది మహేశ్వరి..

” అలా ఏం కాదు మహి నేను అలేఖ్యమ్మ దగ్గరికి వెళ్లిన తర్వాత వంట చేయడం నేర్చుకున్నాను మళ్ళీ నేను వంట చేయకపోతే మరిచిపోతానేమో అని చేస్తాను అంటున్నాను” అన్నది నీలాంబరి…

” అయినా సరే ఇప్పుడు వద్దమ్మా మళ్లీ ఎప్పుడైనా చేద్దురుగాని ప్రయాణం చేసి వచ్చారు మీరు రెండు మూడు రోజులు విశ్రాంతి తీసుకోవాలి” అన్నది మహేశ్వరి..

ఇంతలో భూపతి వస్తూ కనిపించారు…

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

బాల రచయితలను తయారు చేస్తున్న ఘాలి లలిత ప్రవల్లిక

వాలు కుర్చీ!