ఎన్నేళ్ళు ఎంతకాలం పోరాడినా
నేను ఆడపిల్లనే
ఈడపిల్లను కాలేను
కానివ్వదు ఈ లోకం
ఎందుకో తెలియదు
టెక్నాలజీ ఎంత మారినా
భద్రతా సౌకర్యాలు ఎంతపెరిగినా
ఆడపిల్లవి నువ్వు
ఒంటరిగా బ్రతకలేవు అంటుందేం ఈ లోకం
ఇల్లాలిని కమ్మంటుంది
తల్లిగా మారాలంటుంది
తనవాళ్ళకోసమే నీ బ్రతుకంటుంది
జీవితం కోసం ప్రశ్నిస్తే
సంసారబంధమే నీ సుఖమని చెప్పేస్తుందీ సమాజం
బ్రతుకంతా భారంగానే బ్రతుకుతూ
అందరి కోర్కెలు తనవేనని భావిస్తూ
బంధాలు,బాధ్యతల నడుమ తలమునకలేస్తూ
చివరిదాకా ఇలానే మిగిలిపోయే ఆడపిల్లని నేను
అన్ని సాంప్రదాయాలు తెంచుకున్న
కొన్ని సాంప్రదాయాలు తెచ్చుకోని ఆడపిల్ల ను
ఆడపిల్లగా అగ్గిపట్టిన విషయాలు
కథలవుతున్నవేం!
పేపర్ చూసామంటే ఆశ్చర్య కథనాలే
ఎందుకంటే ఇంకా నేను ఆడపిల్లనే
ఈడ పిల్లను కాని ఆడపిల్లనే
ఆడపిల్ల నే!