మౌంట్ రష్మోర్ లో రాధామాధవులు

(లాంగ్ వీకెండ్ అమ్మాయి, పిల్లలతో కలిసి మౌంట్ రష్మోరా వెళ్ళినప్పుడు, ఆ కొండలూ, ఆ అడివీ, ఆ ప్రకృతి చూసినప్పుడు నా మనసులో రాధామాధవులు మెదిలారు. వారి ప్రేమ అమరం. ఎన్ని యుగాలు గడిచినా మరువలేనిది, మధురమైనది. రాధామాధవులు ఎక్కడుంటే అదే బృందావనం. నా ఆభావననే ఈ కథగా రూపుదిద్దుకుంది.ఆ కథే మౌంట్ రష్మోరాలో రాధామాధవులు…మాధవుడికై ఎదురుచూస్తున్న రాధమ్మలో అష్ఠవిధనాయికలను చూపించే ప్రయత్నం చేసాను.)

“ఇన్ని సార్లు అడవిలో ఉన్నావు. ఇంకా అడవిలో ఉండాలని కోరికేమిటి? అలనాడు సీతమ్మవారు రామయ్యను కోరినట్టు కోరావు” నవ్వుతూ అన్నాడు మాధవ్.

రాధామాధవ్ అమెరికాకు పిల్లల దగ్గరకు వచ్చి నెల రోజులవుతోంది.లాంగ్ వీకెండ్ లో రెండురోజులు సరదాగా గడుపుదామని, నార్త్ డెకోటాలోని మౌంట్ రష్మోరా ను చూసేందుకు పిల్లలతో కలిసి వచ్చారు రాధామాధవ్. తిరుగు ప్రయాణానికి సిద్దమవుతుండగా మాధవ్ ను “మనం కొన్ని రోజులు ఇక్కడే ఉందామండీ” కోరింది రాధ.

“ఆ ఎత్తైన కొండలల్లో, పచ్చని చెట్లు, వాటి మీద కువకువలాడే రంగురంగుల పిట్టలు, అడవంతా పరుచుకున్న అడవిపూలసువాసనలు, చల్లగా వీచే గాలులు. అబ్బ ఎంత అందంగా ఉన్నాయో. ఎవరూ లేని ఏకాంతం లో నువ్వూనేనూ ఒకరికొకరము. ఏమండీ… ఏమండీ… ప్లీజ్… ప్లీజ్ కొన్ని రోజులు ఉందాము” పరవశంగా చుట్టూ చూస్తూ గోముగా అంది.

“ఎవరూ లేకపోవటమేమిటి? అటు చూడు మనం ఎక్కడున్నా ఆ నలుగురు పెద్దోళ్ళూ మనలని చూస్తూనే ఉంటారు”

 “పోనిద్దురూ చూస్తే చూసారులెండి. వాళ్ళ రోజులు గుర్తు తెచ్చుకుంటారు”ముసిముసిగా నవ్వింది.

భార్య కోరిక కాదనలేక, పిల్లలను పంపేసి, జనాలకు దూరంగా, అడవి లోపలికి, అన్ని వసతులు ఉన్న చిన్న కుటీరంలాంటి రిసార్ట్ అద్దెకు తీసుకున్నాడు మాధవ్. ముందు జాగ్రత్తగా కూతురు ఇంటి నుంచి తెచ్చిన సామానులతో, మురిపెంగా తన చిన్ని సంసారం సద్దుకుందిరాధ.

“ఆకులో ఆకునై

పూవులో పూవునై

ఆ అడవీ సాగి పోనా

ఎటులైనా ఇచటనే ఆగిపోనా.”

కూనిరాగం తీస్తున్న రాధతో, “అట్లాగేలే ఉండు. నేను ఇప్పుడే కాసేపు వాకింగ్ వెళ్ళి వస్తాను” నేనూ వస్తాను అంటున్న రాధ మాట వినిపించుకోకుండా వెళ్ళాడుమాధవ్. ఉమూ అని ముచ్చటగా మూతి తిప్పుకుంది. మాధవ్ వచ్చే లోపల వంట చేస్తే సరి.  మాధవ్ కు జొన్న రొట్టెలు, ఉల్లి ఖారం, పల్లీ పొడి ఇష్టం. ఈ రోజు అవి చేస్తాను. నాకు మటుకు అన్న వండుకోవలసిందే అని ఇన్స్టాపాట్ లో బియ్యం, నీళ్ళూ వేసి ఆన్ చేసింది. జొన్నపిండి మైక్రోవేవ్ లో వేడి చేసిన నీళ్ళతో తడిపి, తడి నాప్కిన్ కప్పింది. ఉల్లిపాయలు సన్నగా తరిగి అందులో ఉప్పూ, ఖారం, జీరా పొడి, గార్లిక్ పేస్ట్ వేసి మెత్తగా కలిపింది. రోలుంటే బాగుండేది చక్కగాకచ్చాపచ్చాగా దంచేదానిని అనుకుంది. వండటమే కాదోయ్ ప్రెజెంటేషన్ కూడా బాగుండాలి అనే మాధవ్ మాటలను తలుచుకుంటూ డైనింగ్ టేబుల్ మధ్యలో ఖీరా, టమాటో ముక్కలతో ఉన్న సలాడ్ ప్లేట్ ను పెట్టి దాని మీద స్ప్రింగ్ ఆనియన్స్, కొత్తిమీరా అలంకరించింది. సోఫాలోని కుషన్స్ ను సద్దింది. బెడ్ రూం లో పక్కను సరి చేసింది. సరి చేయటమే కానీ రోజూ డెక్ మీదేగాపడక అనుకొనినునుసిగ్గుగా నవ్వుకుంది.

ఇంతలోమాధవ్ వచ్చినట్లుగా అనిపించి డెక్ మీదకు వెళ్ళి చూసింది.మాధవ్ రాలేదు కానీ చందమామ చల్లగా నవ్వుతూ కనిపించాడు.

“కొండలలోనా కోనలలోనా

గోగులు పూచే జాబిలీ”

కూనిరాగం తీస్తూ లోపలికి వచ్చి, సద్దినవే మళ్ళీ మళ్ళీ సద్దుతూ  ఎక్కడవక్కడ నీట్ గా లేకపోతే చిరాకు పడుతాడుబాబూఅనుకుంది మురిపెంగా.

స్నానం చేసి, తెలుపు మీద  చిన్నచిన్న పసుపురంగు పూలున్న చీర కట్టుకుంది. పొద్దున వాకింగ్ చేస్తుంటే అడవిలో కనిపించిన చిన్న పసుపుపూలు, చిట్టిచేమంతుల్లా ఉన్నాయనీ, మంచి సువాసన ఉన్నాయనీ కోసుకొచ్చింది.అవి దండ కట్టుకొని సిగలో ముడుచుకుంటూ  కాసిని పూలే దొరికాయి. ఇంకాసిని ఉంటే బాగుండేదిఅనుకుంది కాస్త నిరుత్సాహంగా.

అరే ఇంతసేపయ్యింది. మాధవ్ ఎక్కడికెళ్ళాడబ్బా ఇంకా రాలేదూ! డెక్ మీదకెళ్ళి చుట్టూ చూసింది. ఎక్కడా కనుచూపు మేర లో కనిపించలేదు. ఏమయ్యింది? ఎక్కడి దాకా వెళ్ళాడు? గాభరా మొదలయ్యింది.  ఏ పులివాతో పడలేదో కదా. కాదు… కాదు ఇక్కడ పులుండవన్నారుగా. పామా బాబోయ్… మనసు పరిపరి విధాల భయపెడుతోంది.ఎంత వద్దనుకున్నా నెగిటివ్ ఆలోచనలు వస్తున్నాయి. ఎంత చెడ్డదాన్నీ ఈ అడివిలో వంటరిగా ఉందామని కోరాను. తననుతాను తిట్టుకుంటోంది. ఇంట్లోకి బయటకు తిరుగుతోంది.అప్పటి దాకా అందంగా కనిపించిన అడవి భీతి గొలుపుతోంది. లోపల నుంచి బైనాక్యులర్ తెచ్చి చుట్టూ చూసింది. అల్లంత దూరాన ఎవరో  కొండ మీద నుంచి దిగుతున్నారు. మాధవ్ నా పరికించి చూసింది. దూరం నుంచి తెలియటము లేదు. మాధవ్ అయితే ఎవరినో ఎత్తుకొస్తున్నట్లుందే! ఉమ్హూ మాధవ్ కాదు. కొంచం దగ్గరగా వచ్చాడు. అరేమాధవే! ఎవరినబ్బా అట్లా పొదుపుకొని తీసుకొస్తున్నాడు. ఇంకొంచం దగ్గరగా వచ్చాడు. మాధవే. ఎవరినో ఎత్తుకొని తీసుకొస్తున్నాడు. అమ్మాయిలా ఉందే. ఎవరైనా అమ్మాయి అడవిలో తప్పిపోయి ఈయనగారి కంట పడిందా? అసలుకే పరొపకారి పాపన్న. అ…  కాదులే. ఇంత చీకట్లో ఏ అమ్మాయి అంత అడవిలోకి వెళుతుంది? ఏ అడవి పిల్లనో కనిపించి వల్లో వేసుకోలేదు కదా? అసలుకే అందగాడు! అంతే అయి ఉంటుంది. హుం… మగబుద్ది. మసక చీకట్లో ఎవరినో ఎత్తుకొని వస్తున్న మాధవ్ ను గుర్తు పట్టి రుసరుసలాడుతూ లోపలికి వెళ్ళింది.

కొద్దిసేపు తరువాత మాధవ్ లోపలికొచ్చి ఆయాసపడుతూ సోఫాలో కూర్చుంటూ “రాధా మంచి నీళ్ళివ్వు” అడిగాడు.

మంచినీళ్ళందిస్తూ “ఇంత సేపు ఎక్కడికెళ్ళారు?” కోపం గా అడిగింది.

“అడవిలో ఓ గర్ల్ ఫ్రెండ్ దొరికిందిలే. దాన్ని తీసుకొని వస్తున్నాను” అన్నాడు ధుమధుమలాడుతున్న రాధ మొహం వినోదం గా చూస్తూ.

మాధవ్  చెంప మీద ఉన్న గాటును చూస్తూ “అక్కడేమైంది?” అనుమానంగా అడిగింది.

“నా గర్ల్ ఫ్రెండ్ గోటితో గీరింది” అన్నాడు తమాషాగా.

కోపం ఆపుకోలేక సోఫా లో ఉన్న కుషన్ మాధవ్ మీదికి విసిరి బయటకు వెళ్ళింది. అక్కడ….. 

డెక్ మీద వేసి ఉన్న తెల్లని పరుపు మీద, వత్తుగా పరిచి ఉన్న చిన్నిచిన్ని పసుపుపచ్చనిపూలు వెన్నెల్లో పచ్చగామెరుస్తున్నాయి!

“ఈ పూలు చాలా?” వెనక నుంచి అడిగాడు మాధవ్.

“మీరు వీటి కోసం వెళ్ళారా? అయితే మీరు ఎత్తుకొస్తున్నట్లున్నది ఈ పూలున్న సంచీనా?”  ఆశ్చర్యంగా అడిగింది.

“మరి ముద్దుల పెళ్ళాం కోరిక తీర్చాలిగా. ఇన్ని పూలు కావాలంటే  ఎక్కడెక్కడో వెతకాల్సి వచ్చింది.”

“మరి ఆ చెంప మీది గాటు?” ఇంకా అనుమానం తీరని రాధ అడిగింది.

“పూలు కోస్తుంటే ఓ కొమ్మ గీరింది. ఈ కొమ్మకు కాకుండా ఇంకే కొమ్మకుంటుంది నన్ను ముట్టుకునే ధైర్యం” చిలిపిగా అన్నాడు.

“పాపిష్టిదాన్ని. మిమ్మలిని అనుమానించాను. నా కోసం ఇంత కష్ఠపడ్డారా?” నీళ్ళు నిండిన కళ్ళతో, రుద్దకంఠంతో దగ్గరగా వచ్చి తన చీర కొంగుతో ఆ గాటును సుతారంగా తుడుస్తూ అందిరాధ .

“ఈ రాధమ్మ చూసావా Theodore Roosevelt అంతలోనే ప్రేమ, అంతలోనే గారాబం, అంతలోనే అనుమానం, అంతలోనే విరహం. భలే అమ్మాయే.” అన్నాడు George Washington.

“పాపం ఆ మాధవుడు ఎట్లా వేగుతున్నాడో ఈ పిల్లతో” జాలి పడ్డాడు Thomas Jefferson,  Abraham Lincoln వైపు చూస్తూ. Abraham Lincoln  గంభీరంగా తలపంకించాడు.”

“మీరే కాదు నేనూ చూస్తున్నాను వీళ్ళను” అన్నాడు ఆకాశంలో మేఘాల చాటున, తారలతో దోబూచులాడుతున్న చందమామ.

“ఏయ్ పెద్దాయనల్లారా చాల్లే చూసింది. ఇక అటు తిరగండి” రాధను ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ వాళ్ళను గదమాయించాడు మాధవ్.

“రాధకు నీవేరా ప్రాణం,

రాధా హృదయం మాధవనిలయం”

 మాధవ్ ను ప్రేమగా అల్లుకుంది రాధ.

ఇలాంటి ప్రేమకథలెన్నో చూసిన ఆ కొండ, ఆ కోన ముసిముసిగా నవ్వుకున్నాయి.

Written by Mala kumar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఔషధ మొక్కలు

ఆడపిల్లని నేను