కృషాణుడి గృహసీమలో అడుగిడిన సహస్రాంశుడు
తండ్రీతనయుల సమాగమనపు సంరంభహేల
తదనంతరం లోకచక్షుడి
ఉత్తర దిశా పయనం
పుష్యమాస హేమంతపు శీతల గాలులతో
పద మంజీర నాదనర్తనంతో పౌష్యలక్ష్మీప్రవేశం
కృషీవలుర శ్రమైకజీవన
సౌందర్య శోభల నడుమ పచ్చందనాలతో పరిఢవిల్లే పల్లెసీమలు
సంస్కృతీసాంప్రదాయపు
కలబోతల లోగిళ్ళు
కాంతల కళాకౌశల దర్పణాలుగా ముంగిట తీర్చిన రంగవల్లులు ధనుర్మాస శ్రీవ్రత దీక్షలతో శోభిల్లే ఇందీవరాక్షులు
తిరుప్పావై అమృతాలాపనల హోరులో దేవళాలు
భోగిమంటల వెచ్చదనపు అనుభూతులు
పిండి వంటల రసాస్వాదనల నడుమ
అలరించే గంగిరెద్దుల నాట్య విన్యాసాలు
వీనుల విందొసగే హరిదాసుల సంకీర్తనా ఝరులు
వెరసి హరితాహ్లాద భరితం సంక్రాంతి శోభ