వీరిది సంచార జాతి .బలమైన కొన్ని గిత్తలతో కొన్ని కుటుంబాలు అన్ని ప్రాంతాలు తిరుగుతూ జీవనయానం చేస్తాయి. వీరిది యాదవ సంతతిలో ఒక భాగం. వీరిని రెండు తెగలుగా చూడొచ్చు. ఒకరు గంగిరెద్దుల వాళ్ళు కాగా రెండవ తెగ యక్షగాన కళాకారులు. తెలంగాణ ,ఆంధ్రప్రదేశ్ ,కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో వీరు ఎక్కువగా కనిపిస్తారు. ప్రధాన భాష తెలుగు .పూర్వం వీరిని పోషకులు ఆదరించేవారు, ఎద్దులను కానుకగా ఇచ్చేవారు. సంక్రాంతి ముందు నుండి సంచారం మొదలుపెట్టి, శివరాత్రి వరకు తిరిగి స్వగ్రామం చేరుకుంటారు.
గంగిరెద్దులాట ప్రాచీన జానపద కళారూపం .దైవ స్వరూపమైన బసవేశ్వరునిగా భావిస్తారు. పురాణ కథనం ప్రకారం, గజాసురుని తపస్సుకు సంతుష్టుడైన శివుడు వరం కోరుకోమనగా తన ఉదర మందు వసించాలని అసురుడు కోరిన కారణంగా శివుడు గజాసురుని పొట్టలో ప్రవేశించగా, కనబడని తన భర్త కోసం పార్వతీదేవి కలత చెంది శ్రీహరికి తెలుపగా, అతడు నందిని గంగిరెద్దు రూపంలో అలంకరించి ,దేవ సమూహాన్ని వెంటబెట్టుకొని గజాసురుని మందిర ప్రాంగణంలో నాట్యం చేయించగా ,అద్భుత నాట్య విన్యాసానికి తృప్తి చెందిన గజాసురుడు నాట్యమాడించే సూత్రధారిని (విష్ణుమూర్తిని) వరం కోరుకొమ్మనగా శివుడు కనిపించని కారణంతో నంది తన ప్రభువుకై చింతిస్తున్నాడంటూ ,అతన్ని ఇచ్చివేయమని అడగగా అతడు దైవపక్షపాతియైన విష్ణుమూర్తి గా తలచి, తనకు మరణం తథ్యమని యెంచి తన గర్భంలో ఉన్న భోలాశంకరున్ని తీసుకోమనగా, నంది తన శృంగములతో అసురుని ఉదరం చీల్చి ప్రభువును బయటకు తేగా, గజాసురునికి ఇచ్చిన వరంతో అతని తలను లోకపూజ్యం చేస్తానని శివుడు వరమిస్తాడు. అలాగే ధర్మస్వరూపమైన ఎద్దును ‘నందీశ్వరునిగా’ భావించే సాంప్రదాయం మనది. పంటలు పండి ధాన్యరాశులుగా ఏర్పడే పరిణామక్రమంలో ఎద్దుల (నంది) శ్రమ వెలకట్టలేనిది .ఆ క్రమంలో రైతుల ముంగిళ్ళలో సంక్రాంతి పర్వదినాలో కృతజ్ఞతా పూర్వకపు ఆరాధనగా ఎద్దు పూజలకుంటుంది.
సంక్రాంతి సంబరాలలో గంగిరెద్దుల విన్యాసం
ఓ ప్రత్యేక ఆకర్షణ. ఎద్దులను అద్దాలు ,పూసలు, చమ్కీలతో తయారైన రంగురంగుల వస్త్రాలతో అలంకరించి, బసవన్నలకు తేలికపాటి శిక్షణనిచ్చి వాటితో తల ఊపిస్తూ, కాళ్లతో విన్యాసాలు చేయిస్తూ అలరిస్తారు. సూత్రధారుల వేషం కూడా వింతగా ఉంటుంది తలపై పాగాతో, పాతకోటు ధరించి ,కాళ్ళు, చేతులకు కడియాలు, ముక్కు పోగుతో, చేతిలో సన్నాయి పట్టుకొని ఊదుతూ డూ డూ బసవన్నా అంటూ, అమ్మగారికి దండం పెట్టు, అయ్యగారికి దండం పెట్టు అంటూ ఎద్దులను ఉత్తేజపరుస్తూ, వాటి విన్యాసాలతో జనానికి ఆహ్లాదం కలిగిస్తారు.
సంచార జాతి కావడంతో చదువుకునే భాగ్యానికి వీరు చేరవ కాలేక నిరక్షరాస్యులుగానే ఉండిపోతున్నారు. సంబరాలప్పుడు లభించిన ఆదాయంతో సంతృప్తి చెంది మిగతా సమయాల్లో యాచక వృత్తితో జీవనం కొనసాగిస్తున్నారు. సిక్కోలు (శ్రీకాకుళం జిల్లా) బైరిసారంగాపురం లో ఎక్కువగా కనిపిస్తారు. సింహాచలం దేవస్థానంలో గంగిరెద్దులను వేలం పాటలో కొనుక్కోవడం మనం చూస్తాము. రూ. 1000 రూపాయల నుండి 2000 రూ. వరకు వెచ్చించి కొనుగోలు చేస్తారు.’ యక్షగాన’ కళకు ఆదరణ తగ్గి ,వారి జీవితాల్లో నైరాశ్యం పెరిగి దీనస్థితిలో ఉన్నారు. ఇలా ఈ రెండు సంచార జీవన జాతులు స్థిరమైన చిరునామా లేక ప్రభుత్వ పథకాలు వీరికి అందుబాటులో లేని కారణంతో పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకమై వారి కుటుంబాలు కష్టనష్టాలతో దయనీయంగా, నిస్తేజ స్థితిలో ఉన్నాయి. .వెనుకబడిన తరగతులు ‘గ్రూప్ ఏ ‘జాబితాలో ఉన్న వీరికి, సంచార జాతుల కోసం కొన్ని పథకాల్ని సవరించి భావితరాలకు భవిష్యత్తు ఇచ్చే దిశగా ప్రభుత్వాలు చొరవ తీసుకొని వారికి భరోసా ఇవ్వాలని మనం ఆకాంక్షించాలి.