దివాకరుని మకర సంక్రమణంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణం పౌష్యలక్ష్మిని వెంటబెట్టుకొచ్చే మూడు రోజుల ముచ్చటైన పండుగ.
పాడిపంటలు, భోగి మంటలు, రంగుల లోగిల్లు , గొబ్బిళ్ళు , గాలిపటాలు, పిండి వంటలు వంటి సరదాలతో గడిచే సంక్రాంతి పండుగలో మనందరినీ ఆశీర్వదించడానికి వైకుంఠం నుండి ఏతెంచిన శ్రీమన్నారాయణని ప్రతినిధి అయిన హరిదాసు ప్రత్యేక ఆకర్షణ.
భక్తి ఉద్యమం వల్ల దక్షిణ భారతదేశంలో ఆళ్వార్లు , నాయనార్లు పునాది వేసిన ‘హరిదాసగానం ‘ అనే ఈ సాంస్కృతిక కళాసంపద విజయనగర క్షత్రియ రాజుల కాలం నుంచి ప్రచారాన్ని పొందుతూ నేటికీ కొనసాగుతూ ఉంది.
తెలిమంచును చీల్చుకొచ్చే ఉదయభానుడి నునులేత కిరణాల వెలుగుల్లో , ఆదిత్యుడు ప్రసాదించిన అక్షయపాత్రను తలపై, నుదుటన తిరునామాలను మెడలో పొడవైన పుష్పమాలికను ధరించి ఒక చేత్తో తంబుర మీటుతూ , మరో చేత్తో చిడతలు వాయిస్తూ , పాటకు అనుగుణంగా లయబద్ధంగా అడుగులు కదుపుతూ ‘ శ్రీమద్రమారమణ గోవిందా ‘ అంటూ హరినామ సంకీర్తనతో పల్లెల్లో ప్రభాత గీతం ఆలపించే హరిదాసు సాక్షాత్తు శ్రీమన్నారాయణ స్వరూపం .
హరిదాసు అంటే హరికి (విష్ణుమూర్తికి) దాసుడు అని అర్థం. వీరు ధనుర్మాసంలో వేకువజామున నిద్రలేచి , తిరుప్పావై పాశురాలను పఠించి,అక్షయపాత్రను తలపై ధరించి ‘ హరిలో రంగ హరి ‘ అంటూ ప్రతి ఇంటికి భిక్ష కోసం వచ్చి, ఇంటి ముంగిట్లో పరిచిన రంగవల్లి చుట్టూ ఒకసారి తిరుగుతారు. ముగ్గులో పెట్టిన గొబ్బిళ్లను రేపల్లెలోని గోపికలకు ప్రతిరూపంగా , మధ్యలో పెట్టిన గొబ్బెమ్మను గోదాదేవికి ప్రతిరూపంగా భావించి, వాటి చుట్టూ తిరుగుతూ పాటలు పాడే స్త్రీలను, బాలికలను చూసి , ముచ్చటపడి సర్వ సౌభాగ్యాలతో వర్ధిల్లాలని ,ఆ కుటుంబమంతా సుభిక్షంగా ఉండాలని ఆశీర్వదిస్తారు .
వీరు తలపై ధరించే ఈ అక్షయపాత్ర గుమ్మడి పండు ఆకారంలో ఉంటుంది. అక్షయపాత్రను భూమికి ప్రతీకగా భావిస్తారు . (ఉత్ + ధరించడం = ఉద్ధరించడం ) అంటే తలపై ధరించడం. సమస్త భూమండలాన్ని ఉద్ధరించే విష్ణుమూర్తికి ప్రతినిధి అని లోతైన భావం ఇమిడి ఉంటుంది.
వీరు ఈ పాత్రను తలపై ధరించి, హరికథలు గానం చేస్తూ ఇంటింటికి తిరుగడం తప్ప వేరే ఏ విధమైన మాటలు కూడా మాట్లాడారు. ఈ పాత్రను తమ ఇంటికి వెళ్లే వరకు తలపై నుండి కిందికి దింపరు. ఇంటికి వెళ్ళాక ఆ ఇంటి ఇల్లాలు వీరి పాదాలు కడిగి ఇంట్లోకి ఆహ్వానించిన తదనంతరం ఆ పాత్రను తలపై నుండి కిందికి దింపడం సాంప్రదాయం.
పురాణాలు మొట్టమొదటి హరిదాసుగా నారదుడిని పేర్కొంటాయి .సాధారణంగా వీరు భక్త రామదాసు కీర్తనలను పాడుతూ భిక్ష కోసం ప్రతి ఇంటికి వస్తారు. వీరు వచ్చే సమయానికి ప్రతి ఇల్లాలు పాత్రలో ధాన్యంతో గడపలో సిద్ధంగా ఉంటుంది . ఏ ఇంటి నుండి కూడా హరిదాసు బిక్ష స్వీకరించకుండా వెళ్ళకూడదు అనే భావం మన సాంప్రదాయంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది.
అక్షయం అంటే క్షయము లేనిది అని అర్థం. ఇందులో భిక్ష వేస్తే అది శ్రీమన్నారాయణునికి సమర్పించే నైవేద్యంతో సమానమై , ఆ ఇల్లు క్షయం లేనిదై సుభిక్షంగా, సంపూర్ణాయురారోగ్యైశ్వర్యాలతో, అష్టసంపదలతో వర్ధిల్లుతుందని నమ్ముతారు .
మనిషి తన జీవిత ప్రయాణంలో తెలిసిగానీ, తెలియకగానీ చేసిన పాపాలు వీరికి బిక్ష సమర్పించడంతో పటాపంచలవుతాయని విశ్వసిస్తారు .
తన ఆహార్యంతో పిన్నాపెద్దలకు కన్నుల పండుగను కలగజేసే హరిదాసు ఆధునికత మాటున ఇప్పుడు ద్విచక్ర వాహనాలపై , మైక్ సెట్ లతో సంచరిస్తూ ఉండటంతో మన ఆధ్యాత్మిక , సాంస్కృతిక సాంప్రదాయం అపహాస్యం పాలవుతోంది.
ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాల్సి ఉంటుంది. వీరు ఈ విధంగా సంచరించడానికి వార్ధక్యం కూడా పెనుశాపంగా మారుతోంది. శరీరంలో సత్తువలేక, అవయవాలు ఆధీనంలో లేకపోవడం కూడా ప్రధాన కారణంగా మనం గుర్తించాలి.
ఈ సమస్య ఎదురు కాకుండా ఉండాలంటే కుటుంబంలోని తర్వాతి తరం వారు చిన్ననాటి నుండే ఈ సాంప్రదాయాన్ని క్షుణ్ణంగా తెలుసుకొని , పరిస్థితులను బట్టి సాంప్రదాయాన్ని కొనసాగించడానికి సర్వసన్నద్ధులై ఉండాలి.
హరిదాసు భక్తి పారవశ్యంతో హరికథలు గానం చేస్తూ, చేతులతో చిడతలు , తంబురా వాయిస్తేనే అందం.లయబద్ధంగా అడుగులు కదిపితేనే ఆనందం.
హరిదాసులంతా తమ ఆహార్యంతో సలక్షణంగా బిక్షాటన చేయాలి .
గృహస్థాశ్రమ ధర్మాన్నను సరించి మనమంతా మన ఇంటికి వచ్చిన హరిదాసును సగౌరవంగా ఆహ్వానించాలి.ప్రత్యేక వేషధారణలో ఉన్న మన ధనుర్మాస అతిథిని ఏమీ అర్థం గాకుండా విచిత్రంగా చూసే మన పిల్లలకి అర్థమయ్యే భాషలో మనము హరిదాసు యొక్క గొప్పతనాన్ని వివరించాలి.
ఎన్నో పౌరణిక , ఆరోగ్య రహస్యాలను ఇముడ్చుకుని ఉన్న మన మహోన్నతమైన ఆధ్యాత్మిక సంపదను పదిలంగా కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిదీ.