శాలువా అంటే నాకు చాలా ఇష్టం

గాజుల భారతితో తరుణి ప్రతినిధి యశోదా ముఖాముకి

కోట్లాది జీవులలో ఒకరిగా ఈ భూమి మీద జీవిస్తున్న మనిషి తనకు ప్రత్యేక గుర్తింపు కావాలని కోరుకుంటూ తన పరిధిలో తాను కృషిచేస్తుంటారు. అయితే కష్టపడిన వారందరికీ గుర్తింపు వస్తుందా అంటే వస్తుంది అని చెప్పలేం. గట్టిగా అనుకుంటే మాత్రం కోరిక తీరుతుంది అని మన పెద్దలు అంటారు. కొన్నిసార్లు చిన్న ఆశ పెద్ద ఫలితాన్ని ఇవ్వవచ్చు. అలాగే జరిగింది ప్రముఖ రచయిత గాజుల భారతి గారి విషయంలో… ప్రముఖుల చేత శాలువ కప్పించుకోవాలన్న ఆమె కోరిక ఆమెను ప్రముఖ రచయతను చేసింది. మరి ఆ సంగతులు ఎంటో ఆమె మాటల్లోనే తెలుసుకుందాం…ఈ వారం తరుణి ముఖాముఖిలో

గాజుల భారతి

తరుణి : మీ గురించి చెప్పండి. 

గాజుల భారతి : మాది ఖమ్మం. నా పేరు గాజుల భారతి శ్రీనివాస్. ఎం.ఏ, బిఎడ్ పూర్తి చేసి ప్రభుత్వ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నాను. మా వారు JVNJ జిమ్మి శ్రీనివాస్. మాకు ఇద్దరు పిల్లలు అమ్మాయి, అబ్బాయి. నేను సమాజంలో అట్టడుగు సామాజిక వర్గానికి చెందిన దళిత మహిళను. చదువే కష్టమైన కుటుంబం మాది. నేను 5వ తరగతి చదువుతున్నపుడే అమ్మ మరణించారు. నాన్న సింగరేణి కాలరీస్ ఇల్లెందులో జాబ్ చేశారు. అమ్మా, నాన్న ఇద్దరూ నిరక్షరాస్యులు. అమ్మ లేని లోటు తెలియకుండా నాన్న మమ్మల్ని కష్టపడి పెంచారు.  నాకు ఇద్దరు అన్నయ్య లు, అక్క ఉన్నారు. పదో తరగతి వరకు ఇల్లందులో చదివాను. ఇంటర్ నుండి డిగ్రీ, కొత్తగూడెంలోని  సింగరేణి ఉమెన్స్  డిగ్రీ కాలేజి లో  చదివాను. బి.ఎడ్. హైదరాబాద్లో ,  యం.ఏ. శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతిలో పూర్తి చేశాను. ఆ తర్వాత 1997లో టీచర్ ఉద్యోగం వచ్చింది. అదృష్టం ఏమిటంటే నేను చదువుకున్న ప్రభుత్వ పాఠశాలలోనే నాకు  ఉద్యోగం రావడం.  నేను ఉద్యోగంలో చేరేవరకు మాకు చదువు చెప్పిన గురువులు ముగ్గురు ఇంకా అక్కడే ఉన్నారు. చదివిన స్కూలు లోనే టీచర్ గా రావడం చాలా గర్వంగా భావించారు.  ఘనంగా అభినందన సభ పెట్టి నన్ను, మా నాన్నను సన్మానించారు. అంతేకాదు అక్కడి విద్యార్థులకు నన్ను ఉదాహరణ చెప్పారు.  బాగా కష్టపడి చదివి భారతి మేడమ్ లా ఆదర్శంగా నిలవాలని చెప్పడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. వారి మాటలు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నేను ఇచ్చిన బహుమతిగా భావించాను.

తరుణి : మీకు సాహిత్యంపై ఆసక్తి ఎలా కలిగింది. 

గాజుల భారతి:  ఇది చాలా చిత్రంగా ఉంటుంది.  నేను కవిత్వం ఎందుకు రాయడం మొదలు పెట్టానో తెలిస్తే మీరు నవ్వుతారేమో! శాలువా అంటే నాకు చాలా ఇష్టం. ఎలా శాలువా పై మక్కువ కలిగిందో తెలియదు. నేను చదువుకునే రోజులలో 1994లో  శాలువా కావాలనే కోరిక బాగా కలిగింది. కానీ మాది మధ్య తరగతి కుటుంబం కావడంతో శాలువా కొనడం అంటే అప్పుడు అనవసరమైన ఖర్చు అనేలా ఉండేది. నా ఈ కోరిక నాతో పాటు పెరిగి పెద్దదైంది. ఒకరోజు కవి సమ్మేళనంలో పాల్గొన్న వారిని ‘శాలువా’తో సన్మానించడం గమనించాను.  అప్పుడు నాలో తెలియని ఆనందం. ఆ క్షణమే నిర్ణయం తీసుకున్నాను. నేను కవిత్వం రాయాలి.  ఒకటంటే ఒకటే రాసి ఒక శాలువా అందుకోవాలి.  ఆ రోజు  అదే నా జీవిత లక్ష్యం.  అంతే  జూన్ 2, 2017 నుండి కవితలు రాయడం మొదలు పెట్టాను. అలా రాస్తూ రాస్తూ  తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు  శాలువాతో సన్మానం అందుకున్నాను.  భుజాలపై శాలువా…. కళ్ళల్లో సుడులు తిరుగుతున్న ఆనందభాష్పాలు.  ఆ క్షణం నా ఆనందం వర్ణనాతీతం.

తరుణి :  శాలువా కోసం కవిత్వం రాయడం ప్రారంభించారు. మరి ఇప్పుడు…?

గాజుల భారతి : నేను కవిత్వం రాయడం మొదలు పెట్టింది ఐదేండ్లు అవుతుంది. శాలువా కోసం మొదలు పెట్టిన కవిత్వం ఆ తర్వాత ఎన్నో శాలువలను, బహుమతులను, అవార్డులను అందుకునేలా చేసింది.  2017లో మొదలైన నా కవితా దాహం తీరలేదు. ఒక్క శాలువా చాలు అనుకున్నా కానీ, ఇప్పుడు లెక్కలేనన్ని శాలువాలు. ఈ రోజు నేనే చాలా మంది వృద్ధులకు, పెద్దలకు, కావాలని అడిగిన వారందరికీ ప్రేమగా  శాలువాలు ఇస్తున్నాను. వారి కళ్ళలో ఆనందం చూస్తూ నేను ఆనందపడుతున్నాను. సంకల్పం గట్టిది అయితే సాధ్యం కానిది ఏదీ లేదు అన్నది నా విషయంలో నిజమైంది.  ఇప్పుడు కవిత్వం రాస్తున్నాను.  అనేక సాహిత్య గ్రూపులలో సభ్యురాలిగా ఉన్నాను.  అనేక రకాల పోటీలలో కవితలు రాసి అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర, జిల్లా స్థాయి, మండల స్థాయిలో నగదు పారితోషకాలు గెలుపొందడం చాలా సంతోషం కలిగించింది. ప్రపంచస్థాయిలో ” తానా ”  నిర్వహించిన పోటీలలో పాల్గొన్ని రెండు సార్లు విజయం సాధించాను.  “75 సంవత్సరాల ” భారతదేశ స్వాతంత్ర వజ్రోత్సవాలలో ప్రపంచ స్థాయి వివిధ రంగాలలో ఉన్నటువంటి 75 మంది ప్రముఖులతో ” తానా ” వారు నిర్వహించిన ఆన్లైన్ కవిసమ్మేళనంలో నేను పాల్గొన్నడం చాలా సంతోషంగా, గర్వంగా ఉంది. 

తరుణి :మీరు ఇప్పటి వరకు రాసిన ప్రక్రియలు?

గాజుల భారతి :  కవితలు రాయడంతో ప్రారంభమైన నా సాహిత్యప్రయాణంలో ఆ తర్వాత రుబాయిలు, గజళ్ళు, మధురిమలు, హరివిల్లులు..ఇలా చాలా ప్రక్రియలు రాస్తున్నాను.

తరుణి : మీరు ఇప్పటివరకు ఎన్ని కవితలు రాశారు. ఏయే పత్రికల్లో వచ్చాయి?   

గాజుల భారతి : నేను ఇప్పటి వరకు 150 నుండి 200 కవితలు రాసాను. నేను రాసిన చాలా కవితలు ఈనాడు, సాక్షి, వార్త, నవ తెలంగాణ, నమస్తే తెలంగాణ ఇలా అనేక దినపత్రికల్లో వచ్చాయి. తెలంగాణ జాగృతి, అక్షరయాన్ ఐనంపూడి శ్రీ లక్ష్మిగారి ఆధ్వర్యంలో వచ్చిన సింగిడి బతుకమ్మ పుస్తకంలో, రైతుల గురించి రాసిన బీజాక్షరాలు పుస్తకంలో  రైతులకు సంబంధించిన కవిత. హితై షి లో షీ టీమ్స్ గురించి, జ్వలిత గారి బహుళ లో చాలా కవితలు రాశాను. అనేక కవిత సంకలనాల్లో నా కవితలు వచ్చాయి.  ఇప్పటి వరకు నాలుగు పుస్తకాలు వచ్చాయి. మరో రెండు పుస్తకాలు విజేత,  కవిత లహరి ముద్రణకు సిద్ధంగా ఉన్నాయి.

తరుణి :  ఇపుడు చేస్తున్న కార్యక్రమాలు?

గాజుల భారతి :ఇపుడు మా పాఠశాల బాలలతో చిన్న చిన్న కవితలు రాయడానికి, ప్రోత్సహిస్తూ, తర్ఫీదు ఇస్తున్నాను. నేటి ఆధునిక కాలంలో ఫోన్లు అందుబాటులోకి వచ్చాక కనుమరుగు అయిపోయిన ” ఉత్తరాలు ” రాయించడం అలవాటు చేస్తున్నానుమనస్సులో ఉన్న మాటలను అక్షరాలలో ఎలా రాయాలో నేర్పిస్తున్నాను.. పాఠశాల విద్యార్థుల చేత వివిధ సంపుటాలకు సమీక్షలు రాయిస్తున్నాను

తరుణి : భవిష్యత్తు రచనలు, కార్యక్రమాలు ?

గాజుల భారతి :  నేను కలలు కని,” ఒక్క శాలువా ” కోసం చాలా చాలా ఇష్టంగా రాసిన నా కవితలను సంపుటిగా తీసుకురావాలి. పుస్తకావిష్కరణ  చాలా గొప్పగా ఒక పండుగ లాగా  చేయాలన్న ఆలోచన ఉంది. అంతే కాదు యువతకు, చిన్నారులకు స్ఫూర్తినిచ్చే కవితలను, కథలను రాస్తున్నాను.  ఒకప్పుడు నేను పడ్డ కష్టాలు, కన్నీళ్లు ఇంకెవ్వరికీ ఉండకూడదు అన్న ఆలోచనతో  పేద విద్యార్థులకు నా వంతుగా ఆర్ధికంగా, హార్దికంగా అండగా నిలుస్తున్నాను. అందరి మోముపై…చిరునవ్వు ఉండేలా ప్రయత్నం చేస్తాను.

తరుణి :   మీకు వచ్చిన పురస్కారాలు,  అందుకున్న అవార్జులు ?

గాజుల భారతి :   ఒక శాలువా కోసం ప్రారంభించిన కవిత రచన ఆ తర్వాత అనేక పురస్కారాలు, అవార్డులు అందుకునేలా చేసింది. 

2017లో…..-  తెలంగాణ రాష్ట్ర అవతరణోత్సవాలలో కవి సమ్మేళనం ఖమ్మం జిల్లా కలెక్టర్ గారిచే పురస్కారం.

* తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ ఆత్మ నా కవిత ద్వారా ఆవిష్కరించిన శ్రీమతి కల్వకుంట్ల కవిత అధ్యక్షురాలు, తెలంగాణ జాగృతి గారిచే పొందిన పురస్కారం- హైదరాబాద్లో జరిగిన ప్రపంచ తెలుగు మహాసభలలో  పురస్కారం,

* అస్థిత్వం తెలుగు ఒక వెలుగు కార్యక్రమంలో హైదరాబాద్ రవీంధ్రభారతిలో సన్మానం, మెమొంటో ప్రధానం. 

–  సుమారు 1000 మందితో కవి సమ్మేళనం కరీంనగర్ (ప్రపంచ రికార్డ్ కవి సమ్మేళనం)లో సన్మానం, సత్కారం (2018)

–  2018 నేను రాసిన “నేను సైతం” కవితకు రాష్ట్రస్థాయి పోటీలో గెలుపొందినందుకుగాను  సన్మానం, మెమొంటో ప్రధానం చేశారు.  

   

*  2019లో అమ్మనాన్న ఓ కవిత పుస్తక సంకలనంలో నా కవితకు గాను సన్మానం

* 2019 తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పూల సిగండి 316 మంది కవయిత్రుల కవితా సంకలనంలో నేను రాసిన కవితకుగాను  రవీంద్రభారతిలో సన్మానం, సర్టిఫికెట్, పుస్తకం అందజేశారు.

 * తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో విత్తన సదస్సుకి హాజరై కవిత రాసినందుకుగాను బీజాక్షరాలు అనే సంకలనంలో నా కవితకుగాను ప్రశంసాపత్రం లభించింది.

* ప్రపంచ తెలుగు సాహితీ చరిత్రలో మహిళ భద్రత మీద తొలి కవితా సంపుటి పుస్తక ప్రచురణ కమిషనర్, షీ టీమ్స్, హైదరాబాద్ నగర పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో నేను రాసిన కవిత హితైషి అనే కవితా సంకలనంలో ప్రచురించడమైనది, 2020 

.-  2020 లాల్దర్వాజ బోనాలు హైదరాబాద్ వారి కవితా సంకలనంలో నేను రాసిన కవిత “లాల్ దర్వాజ బోనాలు” అనే కవితకు ప్రశంసా పత్రం. –  హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 02-02-2020  జాతీయ పురస్కారాన్ని ప్రపంచ ఆంగ్ల రచయితల సంఘం వారి అవార్డును ప్రముఖ సినీ గేయ రచయిత వడ్డేపల్లి కృష్ణ, మల్లి మస్తాన్ గార్ల చేతుల మీదుగా అందుకున్నాను.

–  తెలుగు-వెలుగు సాహిత్య సామాజిక సేవా సంస్థ, అనంతపురం కరోనాపై కవితల పోటీలలో నేను రాసిన కవిత “వలసదేహం” జాతీయ స్థాయి నగదు ప్రోత్సాహక బహుమతి వచ్చింది. ఈ పోటీలో అమెరికా, సింగపూర్, ముంబాయ్ నుండే కాక ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుండి వచ్చిన 173 కవితలలో  నా కవిత ఉండటం గర్వంగా అనిపించింది. – అంబేద్కర్ కవితల పోటీలో “అవతార పురుషుడు” అనే కవితకు జాతీయ స్థాయిలో ద్వితీయ బహుమతి  వచ్చింది. 

–  “ఘనుడు నాన్న త్యాగధనుడు నాన్న” అనే అంశంపై  ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన పోటీలో 750 కవితలు రాగా నా కవితకు అంతార్జతీయ స్థాయిలో విశిష్ట బహుమతి వచ్చింది.

–  జానుడి-సెంటర్ ఫర్ లిటరేచర్ అండ్ ఆర్ట్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన కవితల పోటీలో ద్వితీయ బహుమతి.

              

తరుణి: మీకు  సంతోషాన్ని ఇచ్చిన సందర్భం ?                     

గాజుల భారతి :  శాలువా కోసం కవితలు రాయడం ప్రారంభించాను. సాహిత్యాభిలాష రోజురోజుకు పెరగడంతో అనేక కవితలు రాస్తున్నే ఉన్నాను. ఎన్నో వేదికలపై సన్మానాలు, సత్కారాలు అందుకున్నాయి.  రాష్ట్ర గవర్నర్ గారి ఆహ్వానం మేరకు రాజ్ భవన్ వెళ్లి గవర్నర్ గారు శ్రీమతి తమిళిసై సౌందరరాజన్ గారిని కలవడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. చదువు విలువ చెప్పిన నాన్న, గురువులు, కవితలు రాయడం, సభలకు వెళ్లడాన్ని ప్రోత్సహించిన నా భర్త , పిల్లలు ఈ రోజు నేను ఈ స్థాయికి రావడానికి కారణం

యస్. యశోదా

Written by S. Yashoda Devi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రంగులు ఒలికాయి…

హరిదాసు