ఎడారి కొలను నవలను రచయిత్రి పద్మావతినీలంరాజు అద్భుతమైన ధారావాహిక నవలగా అందిస్తున్నారు. సమాజంలో మహిళ లకు అన్యాయం చేస్తున్నసామాజిక కట్టుబాట్లను ఎంతో సమర్థవంతంగా ఈ నవలలో ఎత్తి చూపారు. చదివి ఆస్వాదించండి.
సంపాదకులు: డా. కొండపల్లి నీహారిణి
ముందు మాట:
ఎన్నో చట్టాలు స్త్రీ రక్షణను ఉద్దేశించి చేయబడ్డాయి.సంఘ సంస్కర్తలు పోరాడారు. శతాబ్దాలు మారుతు యుగాలుగా ఉన్న ఆదర్శాల విలువలు కూడా మార్పులు చేర్పులకు గురవుతున్నాయి.కానీ, మారనిది ఒక్కటే స్త్రీ- ఆమె చుట్టూ గీసిన పరిధి చట్రాలు. అప్పుడు ఇప్పుడు ఒక్కలాగే చిన్న మార్పులతో. ఎప్పుడు ఆశ నిరాశల మధ్య పోరాటమే. ఒక వ్యక్తిగ ఒక స్త్రీ కి సమాజానికి జరిగే ఘర్షణకు ప్రతిరూపం మైత్రేయి. ఒక్క హింసాత్మక చర్యను కూడా సహించకూడదన్న దృక్పధంతో, న్యాయం కోసం, ఈ సమాజం గీసిన గీతను దాటి, తన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవటం కోసం ఒక స్త్రీ చేస్తున్న పోరాటమే ఎడారి కొలను. విభిన్న పాత్రలలో స్త్రీ మూర్తులు ఎడారిలాంటి ఈ ప్రపంచంలో తమ హక్కుల కోసం, రక్షణ కోసం నిరంతరం కొనసా
గిస్తున్న అన్వేషణే ఎడారి కొలను. వారి పోరాటం లాంటి ఈ అన్వేషణ ఫలిస్తుందా? ఆ స్వేచ్ఛ ఛాయను పరిచి సేద తీర్చే కొలను దొరుకుతుందా ఈ ఎడారిలో?
ఈ అన్వేషణలో- పోరాటం లో మా మైత్రేయికి మీ అందరి తోడు ని ఆశిస్తూ…
రచయిత
పద్మావతి నీలంరాజు
“ప్రేమ“ ఒక అధ్యాయం . “ప్ప్రేమ దైవస్వరూపం” అని అంటాము. అలాగే “ప్రేమ గుడ్డిదని కూడా అంటాము”, ఏ ప్రేమని నమ్మాలి. దైవస్వరూపమయిన ప్రేమ లేక గుడ్డి ప్రేమనా? ఏది సత్యం? ఏది ఏమయినా ప్రేమ ఒక ఆకర్షణ. కవుల కాల్పనిక ప్రపంచంలో హరివిల్లు, యువ హృదయాలలో ఒక అందమైన అనుభూతి, మరి కొందరికీ మధురమైన అనుభవం అయితే మరి కొందరి జీవితాలు ప్రేమకె అంకితమై బలైపోయిన ఉదంతాలు మరెన్నో. అంతే కాదు ప్రేమ ముసుగులో ముగిసిపోయిన జీవితాలు కూడా. ప్రేమ పదార్ధమయితే దాని మూలకం ఏమిటీ? ఒక అనుభవమయితే అది ఎక్కడ మొదలవుతుంది? ప్రేమ పిచ్చి అయితే ఆ పిచ్చికి ప్రేరకమేంటి ? ఇలా ఆలోచిస్తూ పోతే ? ఏది ఏమయినా ప్రేమ అనే అల్పాక్షరం లో అనంతమైన అర్ధం దాగి ఉన్నదని మాత్రం అనిపిస్తుంది.” తల విదిలించింది మైత్రేయి.
ఆ రోజు కాలేజీ సెమినార్ హాల్ లో “షేక్స్పియర్ నాటక ఇతివృత్తంలో ప్రేమ పాత్ర” అనే టాపిక్ మీద జరిగిన ఉపన్యాసాలు విన్నప్పటి నుండి ఆమె మనస్సు ప్రేమ మీద తర్కంతో నిండిపోయింది. మైత్రేయి తెనాలి ప్రభుత్వ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నది. తరచు విద్యార్థు ల కోసం ఇలాటి కార్యక్రమాలను చేయిస్తూ, తాను కూడా పాల్గొంటూ, విద్యార్థులతోనే తన లోకం అన్నట్లు ఉంటుంది ఆమె జీవితం.
కొందరికి వివాహం జీవితాన్నే మార్చేస్తుంది. కొందరికి జీవితం అక్కడితోనే ఆగిపోతుంది. కొందరికి అన్నిఉన్నట్లుగానే ఉన్న ఏమి లేనట్లుగానే జీవితం గడిచిపోతుంది. ఈ ప్రపంచమనే నాటకాలయంలో ఎవరు ఎన్ని పాత్రలు పోషించాలో అన్నది వారి జీవన గమ్యం నిర్దేశిస్తుంది. మైత్రేయి,ఒక సాధారణమయిన అమ్మయి, తన వివాహ జీవితమే ఒకప్రశ్నగ మిగిలిపోతుందని ఆమె అనుకోలేదు.
ఆమెకు ఎవరు లేరా అంటే – అందరు ఉన్నారు , కన్న తల్లి, తండ్రి , అన్న , అత్త మామ , భర్త…
కానీ ఒంటరిది. కన్నీటి కారు మబ్బుల్లో చిక్కుబడితే దారిచూపే వాళ్ళు కానీ, చివుక్కుమన్న మనసు కార్చే కన్నీటి బిందువులను తుడిచే ఆత్మీయులు కానీ లేరు. ఆ రోజు సెమినార్ అయినప్పటి నుండి ఆమె మనసు ఆలోచనల సుడిగుండం లో చిక్కుకు పోయింది. వడ గాలులకు అలిసి ,వడలి , బీటలు వారిన పుడమి లాంటి జీవితం తనది.
ఉన్నతంగా ఆత్మగౌరవంతో బతుకుతున్న తనకీ శిక్ష ఎందుకు? దీనికి మూలం ఏమిటీ? ప్రేమ/ నమ్మకమా / స్వార్ధమా ? లేక తన కున్న విద్య , తద్వారా తాను మలచుకున్న వ్యక్తిత్వమా? తనలోని వ్యక్తి కి- ఈ సమాజం గీసిన గీత దాటిన ఒక స్త్రీ గ పడుతున్న ఘర్షణ? ఏది కారణం ఈనాటి తన ఈ స్థితికి? తనకి ఎప్పటి కైనా ఈ ప్రశ్నలకు జవాబు దొరుకుతుందా? మైత్రేయి మగతగా గతం లోకి జారుకుంది.
******************
ఆంధ్ర యూనివర్సిటీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ విద్యార్థిని, విద్యార్థులు డిపార్ట్మెంట్ బిల్డింగ్ కి ఎదురుగ ఉన్న పచ్చ గన్నేరు చెట్టు క్రింద కూర్చొని ఉన్నారు. కొందరు అమ్మాయిలు. అప్పుడే అటువైపుగా వెళుతున్న మైత్రేయి ని చూసి “” అదిగో మన బ్లాక్ బ్యూటీ”అన్నారెవరో. ఆమె నడకలో హుందాతనం మొఖంలో కనిపించే ఒక వింత కళ , ఎప్పుడు చిరునవ్వుతో ఉండే ముఖము, మాటలో సౌమ్యత, రూపంలో ఉండే పొందిక ఆమె నలుపుని కప్పేస్తుంది. ఆమెనందరు బ్లాక్ బ్యూటీ అని అంటారు. ఎప్పుడు నేత చీరలోనే కనిపించే మైత్రేయి లో ఒక అందమయిన అందం కనిపిస్తుంది. ఆమె కున్నఅంకిత భావం ఆమెను డిపార్ట్మెంట్ లో చాల మంది అధ్యాపకులకు -విద్యార్థులకు అభిమానపాత్రురాలిని చేసింది . పీ జీ పూర్తి చేస్తూనే ఎం ఫీల్ కూడా చేసింది. ఆ మరుసటి ఏడాదిలోనే ఆమె కాలేజీ సర్వీస్ కమిషన్ క్లియర్ చేసి చీరాల ప్రభుత్వ కళాశాలలో పోస్టింగ్ తెచ్చుకున్నది అప్పటివరకు ఏ ఒడిదుడుకులు లేని జీవితం తనది.
మైత్రేయి నాన్న గారు పరంధామయ్య గారు గుంటూరు లో ఉంటారు. ఒక కొడుకు ఒక కూతురు ఉన్నపరంధామయ్య గారు , ముందుగా కూతురికే వివాహం చేయాలనీ ప్రయత్నాలు మొదలెట్టారు. మైత్రేయి అన్న కూడా ఉన్న ఊరిలోనే కాలేజీ లో సూపరింటెండెంట్ గ పని చేస్తూ న్నాడు. అతనికి వాళ్ళ మేనత్త కూతురి తోనే సంబంధం ఖాయం చేసుకొని మైత్రేయి కి పెళ్లి చేసిన తరువాతే అబ్బాయి కి పెళ్లి చేయాలనీ పరంధామయ్య గారు నిశ్చయించుకొన్నారు.
విజయవాడ స్టేట్ బ్యాంకు లో క్యాషియర్ గ ఉద్యోగం సంపాదించిన సుబ్బారావు అన్ని విధాలా తమ కూతురికి తగిన సంబంధం అని, తెలిసిన కుటుంబం, సాంప్రదాయం కలిగిన కుటుంబం అని కోరి మరి సుబ్బారావు ని పెళ్లి చూపులకి ఆహ్వానించాడు ఆయన. ఆ సమయంలో వాళ్ళకి మైత్రేయి కొచ్చే జీతం , పరంధామయ్య గారు ఇచ్చే కట్నం తప్ప ఇంకేమి కనిపించలేదు. ఆమెకు వచ్చే జీతమే ఆమెకున్న ఆకర్షణ. అందుకని సంబంధం ఖాయం చేసుకుందామని అడిగారు. “పిల్ల నలుపు, కాస్త ఎక్కువే చదివింది . భారీగా కట్నం ఇవ్వకుంటే సంబంధం ఎలా కుదురుతుంది “, చెప్పు అంటూ పోరి పోరి ఆయన చేత లకారం దాక కట్నం పలికించారు పెళ్లి పెద్దలు.
సుబ్బారావు బాగా ఎర్రగా , పొడవుగా ఆరోగ్యంగ కనిపిస్తాడు. పైగా బ్యాంకు ఉద్యోగం. ఇంకేం వరుడు లక్ష పలుకుతాడు అని పరంధామయ్య గారు కూడా తృప్తిగా తలాడించేసాడు. ఆ ఏడాది మైత్రేయి మెడలో సుబ్బారావు చేత మూడు ముళ్ళ పసుపు తాడు వేయించారు అందరు. మైత్రేయికి తెనాలి కాలేజీకి ట్రాన్స్ఫర్ పెట్టించారు.సుబ్బారావు విజయవాడ నుండి రోజు తెనాలి తిరిగే ఏర్పాటు చేసారు. వారి వివాహ జీవితం మొదలయింది. మిగిలిన వాళ్ళందరూ ఊపిరి పీల్చుకున్నారు.
(ఇంకా ఉన్నది)