దొరసాని

ధారావాహికం -13 వ భాగం

లక్ష్మి మదన్

అక్కడ ఏర్పాటు చేసిన హుండీ గురించి నీలాంబరి ప్రశ్నించగా ఆ హోటల్కు సంబంధించిన ఓనర్ వచ్చి చెప్పాడు..

” మేడం మేము హుండీ ఏర్పాటు చేయడానికి గొప్ప కారణం ఉంది.. అది ఏమిటంటే ఇక్కడ భోజనం చేసిన వారు లేదా పలహారం చేసిన వారు వారికి ఇక్కడి ఆహారం నచ్చినట్లైతే వారు వారి ఇష్టపూర్వకంగా ఈహుండీలో పది రూపాయల నుండి ఎంతైనా వేయవచ్చు దీనిని మేము ఒక దివ్యాంగుల సంస్థకి చేరుస్తాము, ఏదో ఉడతా భక్తిగా కొంతైనా ఉపయోగం ఉంటుందని మా ఆశ మొదట్లో రోజుకి 100లేదా 200 వచ్చేవి.. కానీ ఇప్పుడు ఆదాయం పెరిగింది అందులో ఈ హోటల్ రోడ్డు సైడ్ ఉండడం వల్ల చాలామందికి సదుపాయంగా కూడా ఉంది.. ముఖ్యంగా మేము ఇచ్చే నాణ్యమైన ఆహారాన్ని మెచ్చుకొని చాలామంది ఎంత దూరమైనా ఇక్కడికే వస్తారు నేను ఇది గొప్పగా చెప్పుకోవడం లేదు కానీ చాలా సంతోషంగా ఉంది అందులో మేము ధరలు కూడా చాలా తక్కువనే మార్జిన్ చేసుకున్నాము ..ఇంకా ఇందులో కొంతమందికి మేము ఉచితంగానే ఆహారం ఇస్తున్నాము ఇలా కొన్ని సేవలు అయినా మా హోటల్ నుండి జరుగుతున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ ఆలోచనలకు కారణం కూడా మా అమ్మగారు వసుంధర దేవి గారు… ఆవిడ సంకల్పంతో మేము ఇలా చిన్నగా సేవ చేసుకుంటున్నాము”అని చెప్పాడు..

భూపతికి నీలాంబరికి ఈ విషయం విన్న తర్వాత చాలా సంతోషం కలిగింది ఎంతో మందికి ఇలాంటి ఆలోచనలు ఉండబట్టే కొంతమందికైనా ఉపాధి కలుగుతుంది మావంతుగా మేము చేయాలనుకున్నది చాలా చిన్నది ఇప్పుడు మాసంకల్పానికి వైశాల్యం పెరిగింది కాబట్టి దీనిని ఎలా చేయాలి అనేది ఇంటికి వెళ్ళాక ప్రణాళిక చేసుకోవాలి” అని అనుకున్నారు..

ఆ హోటల్ వారి ఫోన్ నెంబర్ తీసుకొని గోపాలపురం ప్రయాణమయ్యారు..

కారుఊళ్లోకి చేరగానే మనసుకు రెక్కలు వచ్చినట్లు అయింది నీలాంబరికి… చిన్నపిల్లలా సంబరపడిపోతూ కిటికీలో నుండి బయటకు చూస్తూ కూర్చుంది.

వారి దివాణం ముందుకు వచ్చి ఆగింది కారు.. ఇంట్లో ఉన్న నౌకరులందరూ ఇంటిని చక్కగా అలంకరించి పెట్టారు బంతిపూల తోరణాలు కట్టి ఇంటి ముందు రంగుల ముగ్గులు వేసి వీరి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు..

అందర్నీ వాకిట్లోనే చూసి పలకరించింది నీలాంబరి…

” అమ్మగారు మీరు లేకుంటే ఇంట్లో కళాకాంతులే లేవు” అని ఒకరు..

“అమ్మగారు ఏపని చేయాలన్నా మాకు ఏంతోచలేదు మీరు చెప్తేనే చేసే అలవాటు మాకు” అని మరొకరు… ఇలా అందరూ నీలాంబరి వెళ్ళినందుకు కళ్ళ నీళ్లు పెట్టుకున్నారు ..కొంతమంది ఊళ్లో ఉన్న జనాలు కూడా వచ్చి పలకరించారు..

మహేశ్వరి వచ్చి ఎర్ర నీళ్ళతో దిష్టి తీసింది… కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా..

” అమ్మ నేను ఉండలేకపోయాను ఈ ఇంట్లో… మీరు వచ్చారు ఇంటికే వెలుగు వచ్చింది” అని అన్నది..

అప్పుడే ఆలయం పూజారి కూడా గేటు నుండి లోపలికి వస్తూ కనిపించారు…

” నమస్కారం పూజారి గారు రండి అంటూ లోపలికి వెళ్లారు”

” అమ్మా!ఇప్పుడే వచ్చినట్లున్నారు మిమ్మల్ని నేను ఎక్కువసేపు విసిగించను చిన్నమాట విన్నవించాలని వచ్చాను… శివరాత్రి వస్తుంది కదా! మన ఆలయంలో పూజలు అభిషేకాలు ఉత్సవాలు ఏర్పాటు కోసం మిమ్మల్ని సంప్రదించాలని వచ్చాను ఈమాట మీచెవిలో వేసి వెళతాను తీరికగా మరొకసారి వస్తాను” అని చెప్పి వెళ్ళిపోయారు.

నీలాంబరి స్నానానికి నీళ్ళ గదిలోకి వెళ్ళేసరికి చక్కగా గంగాళంలో వేడి నీళ్లు కుంకుడుకాయ పులుసు సిద్ధం చేసి పెట్టింది మహేశ్వరి….

చక్కగా తల స్నానం చేసుకొని బయటకు వచ్చి ఎప్పుడు కట్టుకునే తన నూలు వస్త్రాలను కట్టుకుంది… చిన్నజరీ అంచుతో ఉన్న ఎరుపు రంగు చీరకి ఆకుపచ్చ జాకెట్ ధరించి ఎప్పుడు తను ధరించే నల్లపూసల గొలుసు మరియు చంద్రహారం వేసుకుంది తాను ఎప్పటి నీలాంబరిలా మళ్లీ మారిపోయింది.

రూపంలో దొరసానిగా మారిపోయినప్పటికీ… మనసు అప్పటిలా లేదు.. పరి పరి విధాల ఆలోచిస్తుంది… సింధూరం ధరించి పూజ గదిలోకి వెళ్ళింది అప్పటికే పూలతో అలంకరించబడి ఉన్న గదిని చూసి సంతోషంతో రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకొని కాసేపు ధ్యానం చేసుకుని బయటకు వచ్చింది..

మహీ! దొరవారు స్నానం చేశారా? నేను వెళ్లి కాసేపు పడుకుంటాను మధ్యాహ్నం తర్వాత నన్ను లేపుతావా” అని అడిగింది…

దొరవారు ఏదో పని ఉందని బయటకు వెళ్లారమ్మా అలాగే మిమ్మల్ని నేను భోజనం సమయం కు లేపుతాను అని చెప్పింది.

తన గదిలోకి వెళ్లి పడుకున్న నీలాంబరి కి గాఢంగా నిద్ర పట్టింది… కిటికీలో నుండి చల్లని గాలి వీస్తుంది రాధా మాధవ పరిమళాలు గదంతా వ్యాపించాయి ఎన్నాళ్లైంది ఇలాంటి వాతావరణంలో నిద్రించి అని అనుకుంది నీలాంబరి…

ఇంతలో గందరగోళం వినిపించింది

Written by Laxmi madan

రచయిత్రి పేరు : లక్ష్మి
వృత్తి గృహిణి
కలం పేరు లక్ష్మి మదన్
భర్త : శ్రీ మదన్ మోహన్ రావు గారు (రిటైర్డ్ jd), ఇద్దరు పిల్లలు .

రచనలు:
350 పద్యాలు రచించారు.
కృష్ణ మైత్రి 108 పద్యాలు
750 కవితలు,100 కథలు,30 పాటలు,30 బాల గేయాలు రాశారు.
108 అష్టావధానాలలో ప్రుచ్చకురాలుగా పాల్గొన్నారు.
మిమిక్రీ చేస్తుంటారు.
సీరియల్ "దొరసాని"
సీరియల్ "జీవన మాధుర్యం"

కవితలు, కథలు పత్రికలలో ప్రచురించ బడ్డాయి..

కథలు చాలావరకు అత్యుత్తమ స్థానంలో నిలిచాయి...

ఇప్పుడు తరుణి అంతర్జాల స్త్రీ ల వారు పత్రికలో కవితలు "దొరసాని"సీరియల్, కథలు,
‘మయూఖ‘అంతర్జాల ద్వైమాసిక పత్రిక కోసం "జీవన మాధుర్యం"అనే సీరియల్ ప్రచురింపబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ఈ తరం కోడళ్ళు

సాయంత్రం