” సుష్మా? ఏంటి నువ్వు చెప్పేది? పెళ్లి చేసుకోకపోవడం ఏమిటి ?విచిత్రం కాకపోతే ,ఎక్కడా వినలేదు, చూడలేదు, ఏంటీ విపరీత బుద్ధులు? “అంది సుగుణ కూతురు సుష్మాని విసుక్కుంటూ .
“అవునమ్మా ,పెళ్లి చేసుకుని ఏం సుఖపడ్డావు నువ్వు? ఆ మాత్రం దానికి నన్ను ఎందుకు పెళ్లి చేసుకోమంటున్నావ్? హాయిగా చదువుకున్నాను ,ఉద్యోగం చేసుకుంటున్నాను నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను ,ఇంకెందుకు పెళ్లి, వాడు చెప్పినట్టు అలా బుర్ర ఊపుతూ తలాడించడానికి నేనేం బొమ్మను కాదు, “అంది సుష్మ తీవ్రంగా .
“అందరూ అలా అనుకుంటే పెళ్లిళ్లు కావు ,పిల్లలు ఉండరు, అప్పుడు ప్రపంచం ఎలా నడుస్తుంది ?”అంది కోపంగా .
“పెళ్లిళ్లు చేసుకోనంతమాత్రాన సృష్టి ఆగిపోదు, టెస్ట్ ట్యూబ్ బేబీలు వచ్చాయి, క్లోనింగ్ పద్ధతులు ఇంకా అభివృద్ధి చెందుతాయి, అందుచేత నేనొక దాన్ని పెళ్లి చేసుకోకపోతే ప్రపంచమేమి ఆగిపోదు ,”అంది.
” ప్రపంచం మాట దేవుడు ఎరుగు, నీ జీవితం ఏమవుతుంది? మేమున్నన్నాళ్ళు ఉంటామా, మా తర్వాత నీకు ఎలా ?”అంది సుగుణ బాధగా .
“అనాధ బిడ్డను తెచ్చి పెంచుకుంటా, ఒకరికి జీవితం ఇచ్చిందానిని అవుతాను, వాళ్ళు చూస్తారు, అంతగా చూడలేదు అనుకో, అనాధాశ్రమంలో ఉంటాను, అన్నిటికీ భయపడకు ,”అంది ధైర్యంగా సుష్మ. అని మగవారి ఆలోచన విధానంలో మార్పు రావాలి ,ఆడవారికి గౌరవం ఇవ్వాలి ,అప్పుడే ఆడపిల్లలు ధైర్యంగా పెళ్లి చేసుకుంటారు ,నా ఫ్రెండ్స్ లో చాలామంది పెళ్లి చేసుకోమని నిర్ణయించుకున్నాము”.అంది.
“ఇంత పెద్ద ఛాలెంజ్ తీసుకున్నారా? మీరందరూ,” అంది ఆశ్చర్యపోతూ సుగుణ .
“అవును మరి ఏం చేస్తాం ?పూర్వం సతీ సహగమనం ఉండేది ,అది మారి వితంతు వివాహం వచ్చింది, కన్యాశుల్కం మారి వరకట్నం అయింది ,ఇవన్నీ మారాయి, అలాగే ఆడవారిని గౌరవించడం రావాలి, అప్పుడే నేటి అమ్మాయిలు ధైర్యంగా పెళ్లి చేసుకుంటాము ఆ రోజు వచ్చేవరకు ఇంతే ,”అంది దృఢంగా సుష్మ.
ఆ మంచి రోజు కోసం ఆశగా ఎదురు చూస్తోంది, సుగుణ.
………..